విమానం గాలింపులో రోబోలు
ఏడురోజులైనా దొరకని ఆచూకీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఈనెల 22న గల్లంతైన భారత వైమానిక దళానికి చెందిన విమానం ఏఎన్-32 ఆచూకీపై కొనసాగుతున్న వివిధ శాఖల సమష్టి కృషికి ఆపరేషన్ తలాష్ అని నామకరణం చేశారు. జాతీయ సముద్ర సాంకేతిక పరిశోధనా సంస్థకు చెందిన చక్రనిధి అనే నౌక ద్వారా అత్యాధునిక రోబోలను గురువారం నుంచి గాలింపు పనుల్లో ప్రవేశపెట్టనున్నారు. అత్యాధునికమైన ఈ నౌకకు అమర్చే రోబోలు నడిసముద్రంలో ఎంతటి లోతులో ఉన్న వస్తువులనైనా గుర్తించగలవు.
మారిషస్ దీవుల్లో ఉన్న ఈ నౌకను చెన్నైకి రప్పిస్తున్నారు. ఈ నౌక కు అత్యాధునిక రోబోలను అమర్చి నడిసముద్రంలోని లోతుల్లో గాలింపు చర్యలు చేపడతామని చెబుతున్నారు. గజ ఈతగాళ్లు ఎంతటి మాస్క్‌లు, యంత్రాలు వినియోగించినా 120 అడుగుల కంటే లోతుకు వెళ్లడం ప్రాణాలకే ప్రమాదం. బంగాళాఖాతంపై ఎగురుతున్నప్పుడే విమానం ప్రమాదానికి లోనై ఉంటుంది, విమాన వేగానికి సుమారు 13 వేల అడుగుల లోతుల్లోని ఇసుకలో కూరుకు పోయి ఉండవచ్చని భావిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విమానాన్ని కనుగొనడం అంత సులువు కాదని అభిప్రాయపడుతున్నారు.
అందుకే చక్రనిధి నౌకకు అడుగుభాగంలో అత్యాధునికమైన రోబోలను అమర్చి గాలింపు చేపడుతున్నట్లు చెప్పారు. ఈరోబోలకు పొడవైన కేబుల్ ద్వారా అత్యధిక వెలుతురు నిచ్చే లైటు, కెమెరా అమర్చి ఉంటుందని తెలిపారు. ఈ రోబోలను సముద్రపు అడుగుభాగం వరకు పంపి విమానం కోసం వెతుకుతామని చెప్పారు. రోబోల ప్రవేశం వల్ల కూలిపోయిన విమానం ఆచూకీ లభిస్తుందని నమ్ముతున్నామన్నారు. గత ఏడాది కూలిపోయిన కోస్ట్‌గార్డ్ విమానం శకలాలను సైతం ఈ రోబోల ద్వారానే గుర్తించినట్లు తెలిపారు. ఈ రోబో సేవలు గురువారం నుంచి వినియోగించే అవకాశం ఉందని వివరించారు.
ఆపరేషన్ తలాష్
Published Thu, Jul 28 2016 2:17 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
Advertisement