ఆస్పత్రిలో అమ్మ
రాష్ట్ర ప్రజల చేత అమ్మా అంటూ ఆప్యాయంగా పిలిపించుకునే ముఖ్యమంత్రి జయలలిత అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరడం ఆమె అభిమానులను ఆందోళనకు గురి చేసింది. అన్నాడీఎంకే అధినేత్రికి ఏమైందోననే బెంగతో తమిళనాడు తల్లడిల్లిపోయింది. సీఎం ఆరోగ్యం నిలకడగా ఉందనే సమాచారంతో ఆమె అభిమాన గణం ఊపిరి పీల్చుకుంది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఈనెల 21వ తేదీన మెట్రోరైలు రెండో దశ సేవలు ప్రారంభం, కొత్తగా సీటీ బస్సులను ప్రవేశపెట్టడం వంటి అనేక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మరుసటి రోజు అంటే గురువారం నాడు ఎప్పటి వలే సచివాలయానికి ఆమె వస్తారని అందరూ ఆశించారు. అయితే గురువారం పూర్తిగా సచివాలయానికి ఆమె రాలేదు. అయితే అదే రోజు రాత్రి ఆమె జ్వరం బారినపడినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి జ్వరం తీవ్రస్థాయికి చేరడంతో శుక్రవారం తెల్లవారుజాము సుమారు 2 గంటల ప్రాంతంలో సీఎంను హడావిడిగా చెన్నై గ్రీమ్స్‌రోడ్డులో అపోలో ఆసుపత్రిలో చేర్పించారు.
ముఖ్యమంత్రి జ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారని అపోలో ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుబ్బయ్య విశ్వనాథన్ శుక్రవారం ఉదయం అధికారికంగాప్రకటన విడుదల చేసే వరకు అంతా గోప్యంగా ఉంచారు. సీఎం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని కొందరు మంత్రులకు మాత్రమే సమాచారం వెళ్లింది. దీంతో ఆర్థికమంత్రి పన్నీర్ సెల్వం సహా పలువురు మంత్రులు హడావుడిగా ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అయితే శుక్రవారం తెల్లవారుజాము నుంచే సీఎంకు వైద్య చికిత్సలు ప్రారంభం కావడంతో ఎవరినీ లోనికి అనుమతించలేదు. మంత్రులు తమ సహచరులైన ఎంపీలు, ఎమ్మెల్యేలకు, పార్టీ నేతలకు తెలపడంతో వారంతా ఆసుపత్రి వద్దకు వచ్చారు. లోనికి అనుమతించక పోవడంతో ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద రోడ్డుపైనే కూర్చుండిపోయారు.
పోలీసు దిగ్బంధనంలో అపోలో ఆసుపత్రి:అపోలో ఆసుపత్రిలో ముఖ్యమంత్రి జయలలిత అడ్మిట్ కావడంతో ఆసుపత్రి పరిసరాలను పోలీసులు దిగ్బంధనం చేశారు. మౌంట్‌రోడ్డు నుంచి దారితీసే గ్రీమ్స్‌రోడ్డు, ఎగ్మూరు, నుంగంబాక్కం రోడ్లను బ్యారికేడ్లతో మూసివేశారు. సుమారు రెండు కిలోమీటర్ల పరిసరాలన్నీ పోలీసులతో నిండిపోయాయి. రోడ్లనే కాక గ్రీమ్స్‌రోడ్డు నుంచి అపోలో ఆసుపత్రిలోకి దారితీసే చిన్నపాటి రోడ్డును కూడా పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు.
ఆసుపత్రిలో ఇన్‌పేషంట్లుగా చికిత్స పొందుతున్న సాధారణ రోగుల బంధువులు పోలీసులను దాటుకుని వెళ్లలేక అవస్థలు పడ్డారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స కోసం చేరే రోగుల్లో అధికశాతం తెలుగువారు కావడంతో పోలీసులతో తమిళం మాట్లాడలేక తంటాలు పడ్డారు. ఆసుపత్రిలోని రోగులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చి వెనుదిరిగి వెళ్లండని పోలీసులు సలహా ఇచ్చి పంపివేశారు. అమ్మ అభిమానులనే కాదు, ఆ పరిసరాల్లో పనిచేసే ప్రయివేటు ఆఫీసు ఉద్యోగులను కూడా బారికేడ్లను దాటి వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో కొద్ది మంది ఉద్యోగులు పోలీసులతో గొడవపడి దూసుకెళ్లారు.
అమ్మ అభిమానుల ఆవేదన:
సీఎం జయలలిత లోలోపల అనారోగ్యంతో బాధపడుతున్నట్లు గత ఏడాదిగా తరచూ వదంతులు వస్తున్నాయి. ఒకసారి తీవ్ర అనారోగ్యానికి గురైనపుడు కూడా ఆమె ఆసుపత్రిలో అడ్మిట్ కాలేదని, వైద్యులను ఇంటికే పిలిపించుకుని చికిత్స చేయించుకున్నారనే ప్రచారం ఉంది. సీఎంకు అనారోగ్యమని ప్రకటించిన ఒక ప్రతిపక్ష నేతపై ఆమె పరువునష్టం దావా కూడా వేశారు. అయితే ఆ తరువాత తనకు తానే అనారోగ్యమని ప్రకటించారు. ఇలాంటి పరిస్థితిలో సీఎం జయలలిత ఆసుపత్రిలో చేరారన్న సమాచారం శుక్రవారం తెల్లారేసరికి రాష్ట్రం నలుమూలలా వ్యాపించడంతో ప్రజలు తండోపతండాలుగా కదిలి వచ్చారు.
ఆసుపత్రిలో చేరేంత అనారోగ్యం ఏమిటా అనే ఆందోళనలతో తర్కించుకున్నారు. అపోలో ఆసుపత్రి పరిసరాలన్నీ జనం, అభిమాన గణంతో నిండిపోయాయి. ముఖ్యంగా మహిళా కార్యకర్తలు గ్రీమ్స్‌రోడ్డులోని ఆసుపత్రి ప్రవేశద్వారం వద్ద నిలబడి అమ్మను తలచుకుంటూ కన్నీరు మున్నీరయ్యారు. పేదల పెన్నిధి అమ్మ అంటూ ఆక్రోశించారు. పేదల కోసం అన్నాడీఎంకే ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే సీఎంకు శ్రీరామరక్ష అంటూ నినాదాలు చేశారు. అమ్మకు సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ప్రార్థిస్తూ పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు.
నిలకడగా అమ్మ ఆరోగ్యం: అపోలో
ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు శుక్రవారం సాయంత్రం మరో బులెటిన్ విడుదల చేశారు. జర్వం పూర్తిగా తగ్గింది, ఉదయం యధావిధిగా టిఫిన్ తిన్నారని బులెటిన్‌లో పేర్కొన్నారు. శని లేదా ఆదివారాల్లో అమె డిశ్చార్జ్ అవుతారని తెలుస్తోంది.
ప్రధాని ఆకాంక్ష:
సీఎం జయలలిత సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షిస్తూ సందేశం పంపారు. అలాగే తమిళనాడు గవర్నర్ కే విద్యాసాగర్‌రావు, డీఎంకే అధ్యక్షులు కరుణానిధి, కోశాధికారి స్టాలిన్, టీఎన్‌సీసీ అధ్యక్షులు తిరునావుక్కరసర్ తదితర పార్టీల నేతలంతా సందేశం పంపారు.