నడిరోడ్డుపైనే కీచకపర్వాలు | On New Year Eve, Nightmare For Women on Bengaluru Streets | Sakshi
Sakshi News home page

వెంటాడి.. దుస్తులను చించి వేధించారు..

Published Tue, Jan 3 2017 8:46 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

నడిరోడ్డుపైనే కీచకపర్వాలు - Sakshi

నడిరోడ్డుపైనే కీచకపర్వాలు

బెంగళూరు న్యూ ఇయర్‌ వేడుకల్లో రెచ్చిపోయిన ఆకతాయిలు
అమ్మాయిల వెంటపడి వేధింపులు... వేలాదిమంది మధ్యలో ఘటనలు
1,500 మంది పోలీసులున్నా అడ్డుకోలేకపోయిన వైనం


సాక్షి, బెంగళూరు: ఐటీ సిటీలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో అల్లరిమూకలు రెచ్చిపోయాయి. బెంగళూరులో పార్టీ హబ్‌గా పేరొందిన ఎంజీ రోడ్, బ్రిగేడ్‌ రోడ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో శనివారం రాత్రి న్యూ ఇయర్‌ సంబరాల్లో వేలాది మంది మధ్యలో యువతులు, మహిళలపై ఆకతాయి లు అసభ్య ప్రవర్తనకు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. కొందరైతే మహిళలపై భౌతికదాడులకూ దిగినట్లు తెలుస్తోంది. రాత్రి 11:45 గంటల నుంచి అర్ధరాత్రి 12:05 గంటల మధ్య యువతులపై అకృత్యాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.

మహిళల గురించి అసభ్యంగా మాట్లాడుతూ, ఎక్కడపడితే అక్కడ తాకుతూ వికృతా నందాన్ని పొందారు. మరో ఘటనలో 25 మంది యువకులు ఇద్దరు అమ్మాయిల చుట్టూ తిరుగుతూ వేధిస్తుండగా ఓ మహిళా ఎస్సై వచ్చి వారిని రక్షించారు. ఈ ఘటనలన్నిటికీ విపరీతంగా డ్రగ్స్‌ తీసుకున్న యువకులే కారణమని తెలుస్తోంది. 1,500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించినా వేధింపులను అడ్డుకోలేకపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సమాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

వెంటాడి.. దుస్తులను చించి వేధించారు
అక్కడే ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్‌ మాట్లాడుతూ...‘సరిగ్గా అర్ధరాత్రి 12:02 గంటలకు ఇద్దరు యువతులు తమను రక్షించాల్సిందిగా నా వైపునకు పరిగెత్తుకు వచ్చారు. వారి సింగల్‌పీస్‌ గౌన్లు చిరిగిపోయి ఉన్నాయి. వారి వెనుక నలుగురు యువకులు కూడా వెంబడిస్తూ వచ్చారు. ఆ అమ్మాయిల జోలికి రావద్దని వారికి వారించా. అయితే నాపై కూడా దాడికి యత్నించారు. ఇంతలో అక్కడే ఉన్న సాయుధ పోలీసు పరిగెత్తుకు రావడం చూసి కొంత స్పృహలో ఉన్నవారు మిగిలిన ఇద్దరిని ఈడ్చుకుంటూ దగ్గర్లోని గుంపులో కలసిపోయారు. వారు విపరీతంగా డ్రగ్స్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది’ అని వివరించారు.

సీసీ కెమెరాల చిత్రాల ద్వారా కేసులు?
అశోక్‌నగర్, కబ్బన్‌పార్క్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలోకి సదరు ఎంజీ రోడ్డు, బ్రిగేడ్‌ రోడ్డు తదితర ప్రాంతాలు వస్తాయి. ఘటన జరిగి రెండు రోజులు అవుతున్నా ఇప్పటి వరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయితే సదరు న్యూ ఇయర్‌ భయానక చిత్రాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుండటంతో పాటు నగర పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను గుర్తించి సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే ఆలోచన చేస్తోంది. కాగా పార్టీకొచ్చిన యువతులదే తప్పంటూ కొందరు పోకిరీలు సోషల్‌ మీడియాలో కామెంట్లు పెట్టడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement