కరెంటుకు లైనేది? | power shortage in telangana | Sakshi
Sakshi News home page

కరెంటుకు లైనేది?

Published Wed, Sep 24 2014 1:38 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM

కరెంటుకు లైనేది? - Sakshi

కరెంటుకు లైనేది?

విద్యుత్ కొరతతో తెలంగాణ సతమతం
 
 (కె.జి.రాఘవేంద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి)
 ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ నుంచి కోతల్లేని కరెంటు.. అటు ఛత్తీస్‌గఢ్‌లో మిగులు కరెంటు ఎవరికి అమ్మాలో కూడా తెలియనంత అధికోత్పత్తి.. గ్రిడ్‌పై గుత్తాధిపత్యం సాధించిన తమిళనాడుకు దేశవ్యాప్తంగా ఎక్కడినుంచైనా ఎంత కరెంటు నైనా కొనే వెసులుబాటు.. ఇక కేరళ, కర్ణాటకల్లోనూ డిమాండ్‌కు సరిపడా లభ్యత... ఇరుగూ పొరుగూ ఇలాగుంటే మరి తెలంగాణలో పరిస్థితేంటి? పల్లెల్లో పగటిపూట కరెంటు కట్! సాగుకు రెండు మూడు గంటల సరఫరానే కనాకష్టం. పరిశ్రమలకూ హాలిడేలు!! మూడేళ్లు ఆగాల్సిందేనని రాష్ర్ట ప్రభుత్వమే చెబుతోంది. ఆ తర్వాత రెప్పపాటైనా కరెంటు పోనివ్వమని హామీ ఇస్తోంది. ఆ దిశగా సర్కారు వేస్తున్న ప్రణాళికలు, వాటి అమలుకు సాధ్యాసాధ్యాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
 
 ఛత్తీస్‌గఢ్‌లో భారీగా మిగులు
 
 రాష్ట్రాల్లో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా పరిస్థితులపై కేంద్ర విద్యుత్ శాఖ ఇటీవల సమీక్ష నిర్వహించింది. ఛత్తీస్‌గఢ్‌లో వ్యవసాయానికి 20-22 గంటలపాటు కరెంటు ఇస్తున్నారన్న విషయం తెలిసి కేంద్ర మంత్రే ఆశ ్చర్యపోయారు. వెనుకబడిన రాష్ట్రానికి అంత కరెంటు ఎలా వస్తోందన్న చర్చ జరిగింది. ఆ రాష్ట్రంలోని అపార బొగ్గు నిల్వలపై ఆధారపడుతూ వాణిజ్య విద్యుత్ విధానాన్ని అవలంబిస్తోంది. అదనపు కరెంటును అమ్ముకునేందుకు సొంతంగా ప్రభుత్వరంగంలోనే ఒక ట్రేడింగ్ కంపెనీని ఏర్పాటు చేసింది. అయితే ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయడానికి తగిన లైన్లు లేకపోవడంతో.. ఆ కరెంటును ఏం చేయాలో తెలియక వ్యవసాయానికి కూడా 20 గంటలపాటు సరఫరా చేస్తున్నారు.
 
 ఆ కరెంటును తెచ్చుకోలేమా?
 
 కరెంటు కటకటతో అల్లాడుతున్న తెలంగాణ ప్రభుత్వం.. ఛత్తీస్‌గఢ్ కరెంట్‌పై దృష్టి పెట్టినప్పటికీ దాన్ని ఇప్పటికిప్పుడు తెచ్చుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే మహారాష్ట్రలోని వాద్రా నుంచి డిచ్‌పల్లి మీదుగా మహేశ్వరం వరకు 765 కేవీ సామర్థ్యం కలిగిన విద్యుత్ లైన్ల ఏర్పాటు జరుగుతోంది. ఇది పూర్తయ్యేందుకు కనీసం రెండు నుంచి మూడేళ్లు పడుతుందని అంచనా. అప్పటివరకు ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌ను కొనుగోలు చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వమే సొంతంగా ప్రత్యేక విద్యుత్ సరఫరా లైనును ఏర్పాటు చేసుకునే ప్రత్యామ్నాయం ఉంది. అయితే, దీనిపై ఇప్పటివరకు ఎటువంటి కదలిక లేదు. సొంత లైను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. దీంతో టీ-ట్రాన్స్‌కో ఇందుకోసం కసరత్తు చేస్తోంది. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించినప్పటికీ అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా లైనును పవర్ గ్రిడ్‌కు అప్పగించడమో.. ప్రైవేటు సంస్థల ద్వారా ఏర్పాటు చేయడమో తప్ప ట్రాన్స్‌కో ఏర్పాటు చేయడం సాంకేతికంగా సాధ్యం కాదనే వాదన ఉంది. అందువల్ల ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఇప్పట్లో లేదని విద్యుత్‌రంగ నిపుణులు అంటున్నారు.
 
 లైన్లు లేక కొనుగోళ్లకు కష్టం!
 
 అవసరాల మేరకు మార్కెట్లో విద్యుత్‌ను కొనుగోలు చేయడం మరో మార్గం. అయితే, ఇందుకు కూడా అవకాశాలు స్వల్పమే. రాయచూర్-షోలాపూర్ విద్యుత్ సరఫరా లైను పూర్తయినప్పటికీ ముందుగా కారిడార్‌ను బుక్ చేసుకోవడంలో అప్పటి ఉమ్మడి రాష్ర్ట ప్రభుత్వం విఫలమైంది. ఈ అవకాశాన్ని తమిళనాడు తన్నుకుపోయింది. 4,500 మెగావాట్ల మొత్తం కారిడార్‌లో మెజారిటీ వాటాను ఆ రాష్ట్రమే దక్కించుకుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడి.. ఆ రాష్ట్రంలోని  ప్రైవేటు ప్లాంట్ల ద్వారా విద్యుత్‌ను తీసుకునేందుకు ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తన మిగులు కరెంటును తప్పనిసరిగా తెలంగాణకే అమ్మాలని విభజన చట్టం చెబుతున్నా.. తెలంగాణ అవసరాలకు సరిపడా కరెంటు ఏపీలో లభించకపోవచ్చునని అంచనా. పైగా నిరంతర కరెంటు దశలోకి వెళ్తే ఆ రాష్ట్ర అవసరాలే మరింత పెరగనున్నాయి. కేరళ, కర్ణాటకలు కూడా తమ అవసరాలకు మించి విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునే స్థితిలో లేవు.
 
 సొంత ప్లాంట్లే కొంత మేలు!
 
 సొంతంగా విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తులో తెలంగాణకు ప్రయోజనం ఉంటుంది. రానున్న మూడేళ్లల్లో 6 వేల మెగావాట్ల థర్మల్ ప్లాంట్లను నెలకొల్పాలని టీ జెన్‌కోను సీఎం ఆదేశించారు. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం వద్ద 800 మెగావాట్ల ప్లాంటుకు భూ సేకరణ ప్రక్రియ ముగిసింది. త్వరలో టెండర్లను కూడా ఆహ్వానించనున్నారు. ఇదే జిల్లాలో ఇల్లెందు సమీపంలో 4 వేల మెగావాట్ల భారీ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని జెన్‌కో కోరింది. ఇక రామగుండం వద్ద 1,600 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఎన్‌టీపీసీ కూడా 4 వేల మెగావాట్ల కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. మరో 500 మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలుకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఏడాదిలో ఇది అందుబాటులోకి వస్తుంది. ఇక వరంగల్ జిల్లాలోని 600 మెగావాట్ల కాకతీయ థర్మల్ పవర్ ప్లాంటు(కేటీపీపీ), సింగరేణి అదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్‌లో నిర్మిస్తున్న 1,200 మెగావాట్ల ప్లాంట్లు 2016 చివరినాటికి సిద్ధంకానున్నాయి. మొత్తమ్మీద ఈ ప్లాంట్లు ఏర్పాటై విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కావడానికి కనీసం 4-5 ఏళ్లు పడుతుందని అంచనా. మూడేళ్లలోనే అందుబాటులోకి తేవాలని సీఎం ఆదేశిస్తున్నప్పటికీ, ఆచరణలో అసాధ్యమని విద్యుత్‌రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
 ఇదీ ఛత్తీస్‌గఢ్ పరిస్థితి!
 
 ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వ రంగంలో మొత్తం 2,952 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. ఇందులో 2,780 మెగావాట్ల థర్మల్, 120 మెగావాట్ల హైడల్‌తోపాటు 52 మెగావాట్ల సంప్రదాయేతర ఇంధన వనరులు(ఎన్‌సీఈ) ఉన్నాయి. ప్రైవేటు రంగంలో 6,085 మెగావాట్ల ప్లాంట్లు ఉండగా, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల నుంచి 1,538 మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది. మొత్తం 10,575 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లు ఉన్నాయి. ఆ రాష్ర్ట డిమాండ్ మాత్రం 5-6 వేల మెగావాట్లకు మించి లేదు. ఇంకా అనేక ప్రైవేటు సంస్థలు అక్కడ ప్లాంట్లను నెలకొల్పుతున్నాయి. అపారమైన బొగ్గు నిల్వలు రాష్ట్రానికి వరంగా మారాయి. రాష్ర్ట విద్యుత్ పంపిణీ సంస్థ వద్ద ఇప్పటికే 500 మెగావాట్ల వరకు మిగులు విద్యుత్ ఉంది. దీన్ని విక్రయించుకునేందుకు సరఫరా లైన్లు(కారిడార్) లేక ఇబ్బందులు పడుతోంది. రానున్న 2-3 ఏళ్లలో డిస్కం పరిధిలో మిగులు విద్యుత్ ఏకంగా 3 వేల మెగావాట్లకు చేరుతుందని అంచనా. ఆ రాష్ట్రం అమలు చేస్తున్న ‘వాణిజ్య విద్యుత్ విధానం’మే ఇందుకు కారణం. దీని ప్రకారం ఏ ప్రైవేటు సంస్థ రాష్ట్రంలో ప్లాంటు ఏర్పాటు చేసినా.. డిస్కంకు 25 శాతం విద్యుత్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు అంగీకరిస్తేనే ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన భూమి, నీరు, మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది. దీంతో ఇప్పటికే ఉన్న ప్రైవేటు ప్లాంట్ల నుంచి 1521.25 మెగావాట్ల విద్యుత్ నేరుగా ప్రభుత్వ ఖాతాలోకి వస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement