ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
అమలాపురం: ఇన్నాళ్లూ ఉత్తరాదికే పరిమితం పరిమితం అయిందనుకున్న ఆవు వివాదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వెలుగుచూసింది. ఆవును దొంగతం చేసి, చర్మం వొలుస్తున్నారనే నెపంతో ఇద్దరు చర్మకారులపై పాశవికదాడి జరింది. అమలాపురం పట్టణంలో జరిగిన ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రధాని మోదీ దళితులపై దాడులను ఖండించిన కొద్ది గంటలకే చోటుచేసుకున్న ఈ దాడి వార్త జాతీయ మీడియా పతాక శీర్షికలకెక్కడం గమనార్హం.
అమలాపురం పట్టణంలోని జానకిపేటకు మోకాటి ఎలీషా, అతని సోదరుడు మోకాటి వెంకటేశ్వరరావు చర్మకారులు. వీరిద్దరూ ఓ మినీవ్యాన్ డ్రైవర్ తో కలిసి సోమవారం రాత్రి ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి శివారు సూదాపాలెం శ్మశానంలో చనిపోయిన ఆవు చర్మాన్ని వొలిచేపనిలో ఉండగా.. కామనగరువు గ్రామానికి చెందిన ఎనిమిది మంది అక్కడికి వచ్చి, 'మా ఆవును దొంగిలించి, చింపి, తోలు వొలుస్తా' అంటూ ఆగ్రహంతో ఎలీషా, వెంకటేశ్వర్ రావు, డ్రైవర్ లక్ష్మణకుమార్ లను బంధించి, తాళ్లతో చెట్లకు కట్టేసి కొట్టడం మొదలుపెట్టారు. ఇది గమనించిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి పోలీసులకు సమచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేలోపే దుండగులు పారిపోయారు. రక్తపు మడుగులో పడిఉన్న ముగ్గురినీ పోలీసులు అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఇంతకీ ఆ ఆవు ఎవరిది?
కామనగరువు గ్రామస్తులకు చెందిన మూడు ఆవులు ఆది, సోమవారాల్లో తప్పిపోయాయి. వాటిని వెదుక్కుంటూ ఆవుల యజమానులైన రైతులు వివిధ ప్రాంతాలు గాలించారు. మరోవైపు అమలాపురానికి చెందిన బూరగాలయ అరవింద్ అనే రైతుకు చెందిన ఆవు సోమవారం విద్యుదాఘాతానికి గురై మరణించింది. అతని అభ్యర్థనమేరకు ఎలీషా, లాజర్ లు ఆ ఆవును తీసుకెళ్లి, దూరంగా స్మశానంలో చర్మం వలిచేందుకుప్రయత్నించారు. సరిగ్గా అదేసమయానికి అక్కడికి చేరుకున్న కామనగరువు రైతులు.. ఆ ఆవు తమదేనని భావించి దళితులపై దాడిచేశారు. కనీసం వివరణ కూడా వినకుండా పాశవికంగా కొట్టారు. దీంతో కామనగరువుకు చెందిన పలువురిపై ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు, ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
భగ్గుమన్న దళిత సంఘాలు: సెక్షన్ 30 అమలు
దళితులపై దాడి విషయం తెలియగానే జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దాడిని నిరసిస్తూ అమలాపురంలో దళిత సంఘాల నాయకులు రాస్తారోకోకు దిగారు. వైఎస్సార్ సీపీ నాయుకడు ఇజ్రాయెల్ దాడి ఘటనను ఖండించారు. దీనిపై తనకు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అధికారులను ఆదేశించారు. నిందితులను 48 గంటల్లో అరెస్టు చేయాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా దళితులు రోడ్డెక్కి ఆవు, ఎద్దు మాంసాలతోనే వంటావార్పులకు దిగుతారని హెచ్చరించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సెక్షన్ 30 అమలులోకి తెచ్చినట్లు తూర్పుగోదావరి ఎస్పీ ఎం.రవిప్రకాష్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అమలాపురం, కాకినాడ, రామచంద్రపురం, పెద్దాపురం, రంపచోడవరం, చింతూరు పోలీసు సబ్ డివిజన్లలో ఆగస్టు 31 వరకు సెక్షన్ 30 అమలవుతుందని చెప్పారు.