దాణా స్కాంలో నేడు లాలూకు శిక్ష ఖరారు
రాంచీ : దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్కు నేడు శిక్ష ఖరారు కానుంది. రాంచీలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం గురువారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా లాలూ సహా 34 మందికి శిక్షలను ప్రకటించనుంది. 1994-95 మధ్య కాలంలో చైల్‌బాసా ట్రెజరీనుంచి అక్రమంగా 37.70 కోట్ల రూపాయలు విత్ డ్రా చేసినందుకు లాలూ, మరో 44 మందిని సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి పికె సింగ్ దోషులుగా ప్రకటించడం తెలిసిందే. శిక్షను ప్రకటించిన తర్వాత లాలూ పార్లమెంటు సభ్యత్వాన్ని సైతం కోల్పోయే అవకాశం ఉంది.
కాగా, కోర్టు గురువారం శిక్షలపై అన్ని పక్షాల వాదనలను వింటుందని లాలూ తరఫు సీనియర్ న్యాయవాది చిత్‌రంజన్ సిన్హా చెప్పారు. ఈ ప్రక్రియ ఉదయం జరుగుతుందని, మధ్యాహ్నం భోజన విరామం తర్వాత వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిందితులకు శిక్షలను కోర్టు తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు. లాలూ తరఫున జబల్పూర్ హైకోర్టుకు చెందిన సీనియర్ న్యాయవాది సురేందర్ సింగ్ వాదనలు వినిపించనున్నారు. కాగా మాజీ కేంద్ర మంత్రిగా లాలూ హోదాను, ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ శిక్ష విధించాలని కోరుతామని లాలూ తరఫు న్యాయవాది తెలిపారు.