పాత నోట్లుంటే జైలే! | New Rule: Soon, Punishment For Holding More Than 10 Old Notes | Sakshi
Sakshi News home page

పాత నోట్లుంటే జైలే!

Published Thu, Dec 29 2016 2:31 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

పాత నోట్లుంటే జైలే! - Sakshi

పాత నోట్లుంటే జైలే!

‘ఆర్డినెన్స్‌’కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

పెద్ద మొత్తంలో పాత నోట్లు కలిగి ఉంటే నాలుగేళ్ల జైలు?
పదికి మించి పాత నోట్లు ఉంటే రూ.పది వేలు లేదా దొరికిన మొత్తానికి ఐదింతలు.. ఏది ఎక్కువైతే అది జరిమానా
జనవరి 1–మార్చి 31 తేదీల మధ్య తప్పుడుసమాచారంతో నగదు డిపాజిట్‌ చేస్తే రూ.5 వేలు లేదా ఆ డిపాజిట్‌ మొత్తానికి ఐదింతల జరిమానా
రాష్ట్రపతి ఆమోదముద్ర తర్వాత అమలులోకి..

ఆ నోట్లుంటే నేరం..
మార్చి 31 తర్వాత రద్దయిన పాత నోట్లు కలిగి ఉండడం క్రిమినల్‌ నేరం
రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లు రూ.పది వేలు అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నా.. వాటిని బదిలీ చేసినా.. స్వీకరించినా శిక్షార్హం.
ఒక వ్యక్తి వద్ద గరిష్టంగా పది రద్దయిన నోట్లకే అనుమతి

జరిమానా..
ఈ నేరానికి పాల్పడిన వారికి రూ.10 వేలు లేదా దొరికిన మొత్తానికి ఐదింతలు ఏది ఎక్కువైతే అది జరిమానాగా విధిస్తారు.

జైలు శిక్ష కూడా..
మార్చి 31 తర్వాత రద్దయిన పెద్ద నోట్లను పెద్ద మొత్తంలో కలిగి ఉన్న వారికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం?
జనవరి 1 – మార్చి 31 వరకు పాత నోట్లను డిపాజిట్‌ చేసే సమయంలో తప్పుడు సమాచారాన్ని సమర్పించిన వారికి రూ.5 వేలు లేదా సదరు మొత్తానికి ఐదు రెట్లు జరిమానా

నోట్ల డిపాజిట్ల లెక్క
రూ.15.4 లక్షల కోట్ల రద్దు చేసిన నోట్లలో ఇప్పటి వరకు బ్యాంకులు, పోస్టాఫీసులకు చేరింది..
రూ. 14 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: పాత రూ.500, రూ.1,000 నోట్లను డిపాజిట్‌ చేసేందుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. మార్చి 31 తర్వాత రద్దయిన నోట్లు కలిగి ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రూపొందించిన ఈ ఆర్డినెన్స్‌ కు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.  బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ సమావేశమైంది. రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లు రూ.పది వేలు అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నా.. వాటిని బదిలీ చేసినా.. స్వీకరించినా శిక్ష విధించదగ్గ నేరంగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి వద్ద గరిష్టంగా పది రద్దయిన నోట్లను మాత్రమే అనుమతిస్తారు.

పెద్ద నోట్లు ఉంటే భారీగా జరిమానా..
మార్చి 31 తర్వాత రద్దయిన పాత రూ.500, రూ.1,000 నోట్లు పెద్ద మొత్తంలో కలిగి ఉండటాన్ని క్రిమినల్‌ నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి పాల్పడిన వారికి రూ.10 వేలు లేదా దొరికిన మొత్తానికి ఐదింతలు ఏది ఎక్కువైతే అది జరిమానాగా విధిస్తారు. అలాగే జనవరి 1 నుంచి మార్చి 31 మధ్య పాత నోట్లను డిపాజిట్‌ చేసే సమయంలో తప్పుడు సమాచారాన్ని సమర్పించిన వారికి రూ.5 వేలు లేదా సంబంధిత మొత్తానికి ఐదు రెట్లు జరిమానా విధిస్తారు. అయితే పెద్ద నోట్లను కలిగి ఉండటం నేరంగా పరిగణించడం డిసెంబర్‌ 30 తర్వాతా లేదా మార్చి 31 తర్వాతా అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. పెద్దనోట్లను డిపాజిట్‌ చేసేందుకు డిసెంబర్‌ 30 వరకు గడువు విధించిన సంగతి తెలిసిందే. అలాగే కొన్ని నిర్దిష్ట రిజర్వ్‌బ్యాంకు కార్యాలయాల్లో నిర్దేశిత పత్రాలను సమర్పిం చి మార్చి 31 వరకు నగదు డిపాజిట్‌ చేసేం దుకు అవకాశం ఇచ్చిన విషయం విదితమే. విదేశాల్లో ఉన్న వారికి.. మారు మూల ప్రాంతాల్లో పనిచేసే భద్రతా బలగాల్లో పని చేసే వారికి.. సరైన కారణం చూపించే ఇతరు లకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తోంది.

నాలుగేళ్ల జైలు శిక్ష!: మార్చి 31 తర్వాత పెద్ద మొత్తంలో రద్దయిన పెద్ద నోట్లను కలిగి ఉన్న వారికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించే ప్రతిపాదన కేబినెట్‌ ముందుకొచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే దీనికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసిందా? లేదా? అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. బ్యాంకులకు తిరిగి చేరని రద్దయిన నోట్లను రప్పించడానికి చట్టబద్ధమైన మద్దతును అందించేందుకు ఆర్‌బీఐ చట్టానికి సవరణలు చేయడానికి తాజా ఆర్డినెన్స్‌ ఉపకరించనుంది. అలాగే నోట్ల రద్దుకు సంబంధించి నవంబర్‌ 8న జారీ చేసిన నోటిఫికేషన్‌ సరిపోదని, ఆర్‌బీఐకి జవాబుదారీతనం కల్పించేందుకు.. భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు ఈ ఆర్డినెన్స్‌ సహకరించనుంది. ఈ ఆర్డినెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపనుంది. ఆయన ఆమోదం లభించిన తర్వాత ఇది అమలులోకి వస్తుంది. ఆర్డినెన్స్‌కు ఆమోదం లభించిన తర్వాత ఆరు నెలల కాలంలో పార్లమెంట్‌ దీనిని చట్టంగా ఆమోదించాల్సి ఉంటుంది. 1978లో అప్పటి మొరార్జీ దేశాయ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం రూ.1,000, రూ.5,000/10,000 నోట్లను రద్దు చేసినప్పు డు కూడా ఇలాంటి ఆర్డినెన్స్‌నే తెచ్చారు.  

తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో ‘ప్రధాన మంత్రి గ్రామీణ రోడ్ల పథకం’కింద రూ.11,724.53 కోట్ల వ్యయంతో 5,400 కి.మీ రోడ్లు, 126 చిన్న వంతెనల నిర్మాణానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.7034.72 కోట్లను గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు ఆర్థిక శాఖ కేటాయిస్తుంది.

రుణాల చెల్లింపునకు మరో 30 రోజుల గడువు  
ముంబై: పెద్ద నోట్ల ఉపసంహరణ నేపథ్యంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారికి రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) మరికొంత వెసులుబాటు ఇచ్చింది. రుణాలు తిరిగి చెల్లించేం దుకు ఇప్పటికే 60 రోజుల అదనపు గడువు ఇచ్చిన ఆర్‌బీఐ తాజాగా దానిని మరో 30 రోజులు పొడిగించి 90 రోజులు చేసింది. రూ.కోటి లోపు విలువైన, నవంబరు 1 నుంచి డిసెంబరు 31 మధ్యన తిరిగి చెల్లించాల్సి ఉన్న పంట, గృహ, వాహన తదితర రుణాలకు ఇది వర్తిస్తుంది. నోట్ల రద్దు వల్ల అనేక మంది వ్యాపారులు, ప్రజలు తమకు రావాల్సిన నగదును పొందలేకపోయారు. బ్యాంకు ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగిపోవడంతో చెక్కులు, డిమాండ్‌ డ్రాఫ్ట్‌ల వంటి లావాదేవీలు కూడా పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో అదనపు గడువిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement