న్యూఢిల్లీ: జమ్మూ-కశ్మీర్ లో భద్రతా దళాలు శుక్రవారం హిజ్బుల్ ముజాహిద్దీన్(హెచ్ఎమ్) కమాండర్ బుర్హాన్ ముజఫర్(21)ను మట్టుపెట్టాయి. ఉగ్రవాదులు ఉన్నారనే ఇంటెలిజెన్స్ సమాచారంతో రంగంలోకి దిగిన రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూ-కశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించినట్లు జమ్మూ-కశ్మీర్ పోలీసు చీఫ్ కే రాజేంద్ర చెప్పారు. దాడిలో బుర్హాన్ తో పాటు మరో ఇద్దరు తీవ్రవాదులను భద్రతా దళాలు కాల్చిచంపినట్లు తెలిపారు.
15 ఏళ్ల వయసులో..
దక్షిణ కశ్మీర్ లో సంపన్న కుటుంబంలో బుర్హాన్ ముజఫర్ జన్మించాడు. అతడి తండ్రి ప్రభుత్వ పాఠశాలలో హెచ్ మాస్టర్ గా పనిచేశారు. తన సోదరుడు ఆర్మీ దాడులలో మరణించాడన్న కారణంతో బుర్హాన్ ముజఫర్ 2010లో పదో తరగతి పరీక్షలకు హాజరు కాకుండా ఇంటి నుంచి పారిపోయి హెచ్ఎమ్ లో చేరాడు. అనతి కాలంలోనే హిజ్బుల్ లో కమాండర్ స్థాయికి ఎదిగినా, ఒక్కరిని కూడా చంపలేదు.
బుర్హాన్ ముజఫర్ ద్వారా వందలాది మంది విద్యావేత్తలు, టాప్ ర్యాంక్ లు సాధించిన విద్యార్థులు హెచ్ఎమ్ లో చేరారు. అతడిని పట్టుకుంటే హెచ్ఎమ్ కు చెందిన సమాచారాన్ని మొత్తం బయటకు తీయోచ్చని భావించిన ప్రభుత్వం అతన్ని అరెస్టు చేసిన వారికి రూ.10 లక్షల క్యాష్ రివార్డును ప్రకటించింది.
జకీర్ కు మద్దతు
టెర్రరిస్టుల భావజాలాన్ని వ్యాప్తి చేసే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలను చేసిన జకీర్ నాయక్ ను బుర్హాన్ ముజఫర్ ఈ నెల 7 నుంచి తన అకౌంట్ ద్వారా ట్విట్టర్ లో ఫాలో కావడం మొదలుపెట్టాడు. కొంతమంది ప్రముఖ టెర్రరిస్టులను తన పోస్టుకు ట్యాగ్ చేస్తూ జకీర్ కు మద్దతు పలికాడు. బుర్హాన్ ముజఫర్ పోస్టు పెట్టిన కొద్ది నిమిషాల్లోనే భద్రతాదళాలు అతన్ని మట్టుపెట్టినట్లు వార్తలు వచ్చాయి. బుర్హాన్ కాల్చివేతపై జమ్మూ-కశ్మీర్ లో వేర్పాటువాదుల నాయకుడు సయ్యద్ అలీ గిలానీ శనివారం రాష్ట్రంలో బంద్ కు పిలుపునిచ్చారు. ప్రజలందరూ అతని అంత్యక్రియల్లో పాల్గొనాలని కోరారు.