ఉరిమిన ‘యూనిఫాం’
సమస్య ఉన్నచోటల్లా ప్రత్యక్షమయ్యేవారికి కూడా సమస్యలుంటాయా? నోటికి పనిచెప్పి, లాఠీకి పని చెప్పి... అవసరమైతే తుపాకికైనా పనిచెప్పి కర్తవ్యాన్ని పరి పూర్తి చేసేవారిపైనా నిర్లక్ష్యం రాజ్యమేలుతుందా? ఈమధ్య సామాజిక మాధ్య మాల్లో వరస ఫిర్యాదులను వీక్షిస్తున్నవారికి వస్తున్న సందేహాలివి. ఈ ఫిర్యాదులు చేసేవారు యూనిఫాంలో ఉన్నవారు కావడంతో... సరిహద్దులు మొదలుకొని అరణ్యాల వరకూ ఎక్కడికైనా, ఎప్పుడైనా దూసుకుపోవడానికి సిద్ధంగా ఉండేవారు కావడంతో వాటికి అంత ప్రాధాన్యత ఏర్పడింది.
సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్)కు చెందిన తేజ్ బహదూర్ అనే ఒక జవాన్ సరాసరి భారత్–పాక్ సరి హద్దుల్లోని ప్రాంతంనుంచి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన వీడియో ఇప్పుడు సంచ లనం సృష్టిస్తోంది. ఈ వీడియోను చాలా తక్కువ వ్యవధిలోనే దాదాపు 60 లక్షల మంది వీక్షించారంటే అదెంత మెరుపు వేగంతో వ్యాపించిందో అంచనా వేయొచ్చు. ఆ తర్వాత ఆయన మరో మూడు వీడియోలు కూడా అప్‌లోడ్ చేశాడు. అది తేజ్‌బహదూర్‌తో ఆగలేదు. ఆ వెనక సీఆర్‌పీఎఫ్ జవాన్, అటుపై ఆర్మీ జవాన్ సామాజిక మాధ్యమాలనే తమ వేదిక చేసుకుని ఫిర్యాదులకు దిగారు. మంచు కొండల అంచుల్లో క్లిష్టమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న తమకు నాసిరకం తిండిపెడు తున్నారని ఒకరు... తాము సైతం ఆర్మీకి దీటుగా పనిచేస్తుంటే రెండు బలగాల మధ్యా వేతనాల్లో వివక్ష ఎందుకని మరొకరు... తమ బాధ్యతలకు బదులు వెట్టి చాకిరీ చేయాల్సివస్తున్నదని, అధికారుల బూట్లు పాలిష్ చేయిస్తున్నారని మరొకరు వాపోయారు.
ఇందులో మొదటివారు బీఎస్‌ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ కాగా, రెండో వ్యక్తి సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ జీత్‌సింగ్. మూడో వ్యక్తి సైన్యంలో లాన్స్ నాయక్ యజ్ఞప్రతాప్ సింగ్. ఈ ముగ్గురూ కాక బీఎస్‌ఎఫ్‌కే చెందిన మరో జవాన్ తమ పని పరిస్థితులను ఏకరువు పెడుతూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు నేరుగా లేఖ రాశాడు. ఈ వరసలో ఇమడని ఉదంతంగా కనబడొచ్చుగానీ బిహార్ లోని ఔరంగాబాద్‌లో పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్‌ఎఫ్)కు చెందిన బల్వీర్ సింగ్ అనే కానిస్టేబుల్ తనకు సెలవు లభించలేదన్న ఆగ్రహంతో గురువారం నలుగురు సీనియర్ అధికారులను కాల్చిచంపాడు. లక్షలమంది బలగాలు పనిచేసే చోట ఇలా నలుగురైదుగురు తమ సమస్యల గురించి బహిరంగంగా చెప్పడాన్ని, అసంతృప్తిని ఆగ్రహాన్ని వెళ్లగక్కడాన్ని... మరోచోట సహనం కోల్పోయి సహచరు లను చంపడాన్ని గమనించి మొత్తం బలగాల్లో అవ్యవస్థ నెలకొన్నదన్న నిర్ణయానికి రానక్కరలేదు. అలాగని వారిని కేవలం వ్యక్తులుగా లెక్కేసి లేదా ఆయా దళాల ఉన్నతస్థాయి అధికారులు ముద్రేసినట్టు మానసిక రుగ్మత ఉన్నవారిగా పరిగణించి ఊరుకోవడం కూడా సబబు కాదు. సమాజం సంక్షోభంతో కొట్టుమిట్టాడినప్పు డల్లా ముందుకురికే బలగాల్లో ఎంత చిన్న స్వరంతోనైనా కావొచ్చు... అసంతృప్తి, అసమ్మతి వ్యక్తమైనప్పుడు దాన్ని వెనువెంటనే సరిచేసుకోవాల్సిన బాధ్యత పాల కులకుంటుంది. అది తెలిసే కాబోలు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి రిజిజు మొదలుకొని ప్రధాని వరకూ అందరూ స్పందించారు. వారు లేవనెత్తిన సమస్య లపై దృష్టి పెడుతున్నట్టు ప్రకటించారు.
సాధారణ పౌరుడు మొదలుకొని అత్యున్నత స్థాయి అధినేత వరకూ క్రమ శిక్షణ అవసరమే. యూనిఫాంలో ఉండేవారికది మరింత ప్రాణప్రదం. కానీ కాలే కడుపు ముందూ, మండే గుండె ముందూ క్రమశిక్షణ కాదు... ఏదైనా బలాదూరే! సమస్య తలెత్తకుండా ఉండాలిగానీ దాన్ని అణిచిపెట్టడంద్వారా, నోరు నొక్కడం ద్వారా, క్రమశిక్షణ బూచిని చూపడం ద్వారా మాయం చేద్దామంటే కుదరదు. బీఎస్‌ఎఫ్ జవాన్ ఒకరు రాజ్‌నాథ్‌సింగ్‌కు రాసిన తొమ్మిది పేజీల లేఖ మితిమీరిన పనిగంటలు మొదలుకొని పెట్టే తిండి, ఇచ్చే బట్ట, సమకూర్చే గూడు వరకూ అన్ని అంశాలనూ కూలంకషంగా వివరించింది. అయితే ఇలాంటి లేఖే ప్రధానికి రాసినం దుకు తనను రాచి రంపాన పెట్టారని ఆర్మీ జవాన్ ఘోషించాడు. పెద్ద నోట్ల రద్దు అనంతరం మీడియాలో సామాన్యుల ఇక్కట్లు చూపినప్పుడు కొందరు ‘దేశభక్తులు’ నొచ్చుకున్నారు. మన వీర జవాన్లు పడుతున్న కష్టం ముందు ఇదెంత అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వారు సైతం ఈ ఫిర్యాదుల్లోని అంశాలు చూసి మూర్ఛ పోయి ఉండాలి. జవాన్లుగా వెళ్తున్నవారు అందులో ఇమిడి ఉండే కష్టాలు తెలిసిన వారే. అంతమాత్రం చేత కావాలని కష్టపెట్టడం, అనునిత్యం ఇబ్బందులపాలు చేయడం ఏం సబబు?
దేశ జనాభాతోపాటే సమస్యలు కూడా పెరుగుతున్నాయి. అవి అనేకానేక ఉద్యమాలకూ, పోరాటాలకూ జీవం పోస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వాలకు సవాళ్లు కూడా అధికమై బలగాలను పెంచుకోవాల్సివస్తోంది. బీఎస్‌ఎఫ్‌లో పది పన్నెండేళ్లక్రితం దాదాపు 2 లక్షలమంది ఉండేవారు. ఇప్పుడది రెండున్నర లక్షలు దాటిపోయింది. ఒకప్పుడు 2,30,000మంది ఉండే సీఆర్‌పీఎఫ్‌లో ఇప్పుడు మూడు లక్షలకు మించి పనిచేస్తున్నారు. వీరు జమ్మూ–కశ్మీర్ మొదలుకొని ఛత్తీస్‌గఢ్ అడవుల వరకూ ఎక్కడికైనా వెళ్లాల్సి ఉంటుంది. ఫిర్యాదిదారుల్లో సైనికుడు కూడా ఉన్నా... ఈ రెండు బలగాల్లో పనిచేసేవారితో పోలిస్తే వారికి వెసులుబాట్లు ఎక్కువ. ఏడాదికోసారి నిర్దిష్ట కాల పరిమితిలో కొత్త చోటుకు తరలింపు, సుదీర్ఘ సెలవు వంటివి ఆర్మీలో పనిచేసేవారికి ఉంటాయి. కుటుంబాలతో కొన్నాళ్లు కాలక్షేపం చేసే అవకాశం లభిస్తుంది. బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్‌లో ఈ మాదిరి వెసులుబాట్లు ఉండవు. బాధ్యతలకు అంతుండదు. పైవారి దయాదాక్షిణ్యాలే దిక్కు. ఉన్నతాధి కార గణంలోని అవినీతిని, అక్రమాలను అరికడితే జవాన్లు ఇలా బజారుకెక్కే స్థితి ఉండేదికాదు. వివిధ సామాజిక సమస్యలను నిర్లక్ష్యం చేసిన పర్యవసానంగానే అవి కొత్త కొత్త రూపాలు సంతరించుకుని కొరకరాని కొయ్యలవుతున్నాయి. అదే నిర్ల క్ష్యాన్ని భద్రతా బలగాల విషయంలోనూ పాటించడం అవాంఛనీయం. ఏదో పేరు బెట్టి నిరసన గళాలను అణిచేయడం కాక... వారు లేవనెత్తిన సమస్యలను సాను భూతితో పరిశీలించి సరిచేయడం అవసరమని పాలకులు గుర్తించాలి.