RTC strike
-
బస్సు డ్రైవర్ కొడుకును.. వారి సమస్యలు తెలుసు: హీరో
సాక్షి, బెంగళూరు: డిమాండ్లను సర్కారు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ ఉద్యోగులు తీర్మానించడంతో బస్సుల సంచారంలేక ప్రజలకు కష్టాలు తప్పడంలేదు. సమ్మెలో పాల్గొంటున్న రవాణా శాఖ ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఖాతరు చేయడం లేదు. గురువారం నాటికి సమ్మె 9వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి రవాణాశాఖ ఉద్యోగులు కొవ్వొత్తులతో ధర్నాకు దిగారు. 6వ వేతన కమిషన్ సిఫార్సుల ప్రకారం జీతాలను పెంచాలని స్పష్టం చేశారు. 2,237 మందికి తాఖీదులు.. ఎస్మా తప్పదన్న ప్రభుత్వం ఆ చట్టం ప్రయోగానికి వెనుకాడుతోంది. ప్రతిరోజు కొందరు ఉద్యోగులకు నోటీస్‌లు జారీ చేస్తోంది. బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా విధులకు రావాలని బీఎంటీసీ 2,237 మంది ఉద్యోగులకు ఆదేశాలు పంపింది. అయితే స్పందన లేదు. దీంతో వారందరూ సంజాయిషి ఇవ్వాలని మళ్లీ తాఖీదులు పంపారు. ఉద్యోగుల దాడుల్లో రాష్ట్రవ్యాప్తంగా 60 బస్సులు ధ్వంసం అయ్యాయి. రవాణాశాఖ ఉద్యోగుల తరపున పోరాటం చేస్తున్న కోడిహళ్లి చంద్రశేఖర్ ప్రభుత్వ బెదిరింపులకు భయపడేదిలేదని శుక్రవారం నుంచి వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తామని హెచ్చరించారు. బెంగళూరు బస్టాండ్లలో బుధవారంతో పోలిస్తే గురువారం ప్రయాణికుల సంఖ్య పెరిగింది. పండుగకు ఊరికివెళ్లి రైళ్లలో బెంగళూరుకు చేరుకున్న ప్రజలకు ఇళ్లకు వెళ్లేందుకు బీఎంటీసీ బస్సులు లేక ఉసూరన్నారు. ప్రైవేటు బస్సులే గమ్యం చేర్చాయి. అయితే నగరంలోని అనేక ప్రాంతాలకు బస్సులు నడవడం లేదు. మెజస్టిక్ రైల్వేస్టేషన్, మెట్రో స్టేషన్లలో రద్దీ కనిపించింది. రూ.170 కోట్ల నష్టం: డీసీఎం సమ్మె వల్ల ఇప్పటికి సుమారు రూ.170 కోట్లు నష్టం వచ్చిందని, వెంటనే విధులకు హాజరుకావాలని రవాణా మంత్రి, డిప్యూటీ సీఎం లక్ష్మణ సవది విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గురువారం 4,500 రవాణాబస్సులు సంచరించాయన్నారు. ఇప్పటివరకు సమ్మెతో రూ.170 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. బస్సులపై రాళ్ల దాడులు చేయడం సరికాదన్నారు. ప్రజల కోసం 24 వేల ప్రైవేటు బస్సులు సంచరిస్తున్నాయని తెలిపారు. ఆర్టీసీ సిబ్బందికి హీరో యశ్ మద్దతు బనశంకరి: ఒక బస్సు డ్రైవర్ కుమారునిగా తనకు ఆర్టీసీ కార్మికుల సమస్యలు తెలుసని ప్రముఖ నటుడు యశ్ అన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కొనసాగుతుండటంతో బుధవారం కన్నడ హీరో రాకింగ్‌స్టార్ యశ్ రవాణాశాఖ మంత్రి లక్ష్మణసవదికి లేఖ రాసి, గురువారం స్వయంగా కలిసి మాట్లాడారు. అంతకు ముందు ఆయన ట్విట్టర్లో ఆర్టీసీ కార్మికుల కష్టాలను పంచుకున్నారు. తన తండ్రి కూడా ఎన్నోసార్లు ఖాళీ కడుపుతో విధులకు వెళ్లిన సందర్భాలు తనకు గుర్తు ఉన్నాయని, ఇంతటి పని ఒత్తిడి ఉంటుందని వారి డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. రవాణాశాఖ మంత్రి లక్ష్మణసవది కూడా స్పందించినట్లు చెప్పారు. సీఎంతో మాట్లాడి డిమాండ్లు చర్చిస్తామని చెప్పినట్లు ఆయన పోస్టు చేశారు. చదవండి: పండుగ సెలవులకు బస్సుల కొరత.. అక్కడ డబుల్ చార్జీలు 🙏 pic.twitter.com/VXdZfdf1xx — Yash (@TheNameIsYash) April 15, 2021 -
పండుగ సెలవులకు బస్సుల కొరత.. అక్కడ డబుల్ చార్జీలు
సాక్షి, బెంగళూరు/బనశంకరి: అర్జంటుగా ఎన్నో పనులు. ఊరికి వెళ్దామంటే ఆర్టీసీ బస్సులు లేవు. ప్రైవేటు బస్సుల్లో డబుల్ చార్జీలు. అవి కూడా దూరప్రాంతాలకు వెళ్లడం లేదు. కార్లు, క్యాబ్‌లను భరించే స్థోమత లేదు.. రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె వల్ల సామాన్యులు పడుతున్న కష్టాలు ఎన్నో. రవాణా శాఖ ఉద్యోగులు చేపట్టిన సమ్మె శుక్రవారం మూడవ రోజుకు చేరుకుంది. 6వ వేతన కమిషన్ సిఫార్సుల్ని అమలుచేయాలని ఉద్యోగులు, చేయలేమని ప్రభుత్వం తేల్చిచెప్పాయి. ఇరు పక్షాలూ మెట్టు దిగకపోవడంతో పాతిక వేల బస్సులు బస్టాండ్లకే పరిమితం అయ్యాయి. యథా ప్రకారం లక్షలాది ప్రజలకు రవాణా సౌలభ్యం కనాకష్టమైంది. కండక్టర్ ఆత్మహత్య.. విధులకు రావాలని ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడంతో బెళగావి జిల్లా సవదత్తిలో శివకుమార్ నీలగార (40) అనే కండక్టర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రవాణా ఉద్యోగులు విధులకు హాజరుకాకపోతే ఉద్యోగాల నుంచి తీసేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రభుత్వ హెచ్చరికలు ఖాతరు చేయని ఉద్యోగులు శుక్రవారం సైతం సమ్మెను కొనసాగించారు. నోటీస్‌లను జారీచేయగా పట్టించుకోలేదు. కాగా, ఆర్టీసీ బస్సులపై రాళ్లు విసిరారని బళ్లారిలో ఇద్దరు రవాణా సిబ్బందిని పోలీసులు అరెస్ట్‌చేశారు. బెంగళూరు బస్టాండ్లు వెలవెల.. మూడోరోజు సమ్మె కొనసాగుతుండటంతో బెంగళూరు మరింతగా బోసిపోయింది. ఆర్టీసీ సమ్మెతో బస్టాండ్లు వెలవెలబోయాయి. మెజెస్టిక్‌లో బీఎంటీసీ, కేఎస్ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికులు ప్రైవేటు బస్సులు, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్, ఆటోలను ఆశ్రయించారు. ప్రభుత్వం సూచించిన రూట్‌మ్యాప్ ప్రకారం ప్రైవేటు బస్సులు సంచరిస్తున్నాయి. ప్రైవేటు బస్సులకు.. పండుగ.. మూడురోజుల్లో ఉగాది పండుగ వస్తుండడంతో బెంగళూరుతో పాటు ప్రధాన నగరాల నుంచి ఊళ్లకు వెళ్తున్నారు. ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికులు ప్రైవేటు బస్సులు ఎక్కుతున్నారు. శనివారం, ఆదివారాలు సెలవులు, సోమవారం ఒకరోజు సెలవు పెడితే మంగళవారం ఉగాది పండుగ కావడంతో నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఊళ్ల బాట పట్టారు. ప్రైవేటు బస్సుల్లో అడిగినంత డబ్బు ఇచ్చి సొంత ఊళ్లకు వెళ్లక తప్పడం లేదని పలువురు వాపోయారు. అయితే బెంగళూరు నుంచి బళ్లారి, హుబ్లీ, రాయచూరు, కలబురిగి, బీదర్, బాగల్కోటె, విజయపుర, బెళగావి తదితర ఉత్తర కర్ణాటక నగరాలకు ప్రైవేటు బస్సులు వెళ్లడం లేదు. రైళ్లలో వెళదామనుకున్నా టికెట్లు సులభంగా దొరకడం లేదు. దీంతో ఊళ్లకు చేరేదెలా అని టెన్షన్ నెలకొంది. సమ్మె కొనసాగిస్తాం: కోడిహళ్లి సాక్షి బెంగళూరు: తెలంగాణలో మాదిరిగా ఆర్టీసీ ఉద్యోగులను సస్పెండ్ చేస్తామంటే చేసుకోండి. అది కూడా చూస్తాం అని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల గౌరవాధ్యక్షుడు కోడిహళ్లి చంద్రశేఖర్ సవాలుచేశారు. ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మెను కొనసాగిస్తున్నట్లు, సామాన్య ప్రజలు మరికొన్ని రోజులు ఇబ్బందులు పడక తప్పదని చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. త్వరలో బెళగావిలో, కలబుర్గిలో రవాణా ఉద్యోగుల సమావేశాలను నిర్వహిస్తామన్నారు. విధులకు వస్తేనే చర్చలు: సీఎం బనశంకరి: ఆర్టీసీ ఉద్యోగులు పట్టువీడి విధులకు రావాలి, ఎవరి మాటలో విని బలిపశువులు కావద్దు అని ముఖ్యమంత్రి యడియూరప్ప సూచించారు. శుక్రవారం నగరంలో విలేకరులతో మాట్లాడుతూ సమ్మె విరమించి విధులకు హాజరయ్యే వరకూ ఆర్టీసీ సంఘాలతో ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా లేదన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రవాణా ఉద్యోగులు పట్టువీడకపోవడం సరికాదన్నారు. మూడురోజుల నుంచి బెంగళూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందుల్లో పడ్డారని, ప్రయాణాలకు తీవ్ర ఆటంకం ఏర్పడిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 6వ వేతన కమిషన్ సిఫార్సుల్ని అమలు చేయడం సాధ్యం కాదని మరోసారి స్పష్టంచేశారు. బంద్ వల్ల ఆర్టీసీ మరింత నష్టపోతోందన్నారు. చదవండి: ఆ సిఫారసులు అమలు చేస్తే రూ.4 వేల కోట్ల అదనపు భారం -
ఆ సిఫారసులు అమలు చేస్తే రూ.4 వేల కోట్ల అదనపు భారం
సాక్షి, బెంగళూరు/బనశంకరి: ప్రజల సంచారానికి జీవనాడిగా పేరుపొందిన ఆర్టీసీ బస్సుల సమ్మెతో ప్రజలకు రవాణా వసతి బంద్ అయ్యింది. అదే మాదిరి ప్రభుత్వ ఆదాయం కూడా. ఇటీవల కోవిడ్ లాక్డౌన్, డిసెంబరులో ఆర్టీసీ సమ్మె వల్ల రూ. 16 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. కేఎస్ ఆర్టీసీ ఇప్పటికే నష్టాల్లో ఉండగా, ప్రస్తుతం బుధవారం నుంచి ఉద్యోగులు చేస్తున్న సమ్మెతో మరింత సంక్షోభంలోకి కూరుకుపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఆర్టీసీ సిబ్బంది వేతనాలకు నెలకు రూ.400 కోట్లు చెల్లిస్తున్నారు. ఇక బస్సుల డీజిల్, నిర్వహణ కోసం రూ.300 నుంచి 400 కోట్లు ఖర్చుఅవుతుందని ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి రవికుమార్ తెలిపారు. కానీ నెలవారీ ఆదాయం అంతమొత్తంలో లేదని ప్రభుత్వ వర్గాల కథనం. ఉద్యోగులు కోరుతున్నట్లు 6 వేతన కమిషన్ సిఫార్సుల్ని అమలు చేస్తే ఏడాదికి రూ.4 వేల కోట్ల అదనపు భారం పడుతుంది. కోవిడ్ వల్ల రద్దీ తగ్గడం, సమ్మె మూలంగా రోజుకు సుమారు రూ. 20 కోట్లకు పైగా నష్టం వస్తోందని అంచనా. కొనసాగుతున్న సమ్మె వేతన కమిషన్ సిఫార్సుల ప్రకారం వేతనాలను పెంచాలనే డిమాండ్‌తో ఆర్టీసీ ఉద్యోగుల చేపట్టిన సమ్మె రెండవ రోజుకు చేరుకోగా ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. ప్రభుత్వం పట్టుదలతో శిక్షణలో ఉన్న డ్రైవర్లతో బస్సులు నడపడానికి గురువారం ప్రయత్నం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ప్రయాణ వసతి కరువై విలవిలలాడారు. బెంగళూరు సహా అనేక నగరాలు, పట్టణాల్లో ప్రైవేటు వాహనాలే రవాణా అవసరాలను తీర్చాయి. లగేజ్, చిన్నపిల్లలను ఎత్తుకుని ప్రజలు బస్సులకోసం పడిగాపులు పడుతున్న దృశ్యాలు కనిపించాయి. కేఎస్ ఆర్టీసీ, బీఎంటీసీ ఉద్యోగులు ఇళ్లకే పరిమితం అయ్యారు. బెంగళూరు మెజస్టిక్, శాటిలైట్, యశవంతపురతో పాటు ప్రముఖ బస్టాండ్లు ప్రయాణికులు లేక బోసిపోయాయి. చాలాచోట్ల ప్రైవేటు బస్సులు కూడా తక్కువగా సంచరించాయి. ప్రైవేటు బస్సుల దొరుకుతాయనే ఆశతో వచ్చిన ప్రయాణికులు, ప్రజలు బస్సులు సకాలంలో దొరక్కపోవడంతో నిరాశచెందారు. ఉత్తర కర్ణాటక నగరాల్లో ప్రైవేటు బస్సులు సైతం అరకొరగా సంచరిస్తున్నాయి. ట్రైనీలతో నడిపించే యత్నం.. సమ్మె నేపథ్యంలో శిక్షణలో ఉన్న డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు గురువారం తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని బీఎంటీసీ ఆదేశించింది. విధులకు హాజరయ్యే సిబ్బందికి అన్ని విధాలా భద్రత కల్పిస్తామని కేఎస్ఆర్టీసీ డైరెక్టర్ శివయోగి కళసద్ తెలిపారు. నేడు కూడా సమ్మె డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే శుక్రవారం కూడా సమ్మె కొనసాగిస్తామని రవాణాశాఖ ఉద్యోగుల ఒక్కూట గౌరవాధ్యక్షుడు కోడిహళ్లి చంద్రశేఖర్ గురువారం తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆర్టీసీ సిబ్బందికి అత్యంత తక్కువ వేతనం వస్తోందని అన్నారు. ఈ తారతమ్య ధోరణి సరికాదన్నారు. విధులకు హాజరుకాకపోతే కఠినచర్యలు తీసుకుంటామని రవాణాశాఖ సిబ్బంది ఇళ్లకు నోటీసులు అంటించడం సరైన పద్ధతి కాదన్నారు. 10 శాతం జీతం పెంచుతాం.. 6వ వేతన కమిషన్ సిఫార్సుల ప్రకారం వేతనాలను పెంచలేం, 8 శాతానికి బదులు 10 శాతం జీతం పెంచుతామని రవాణా శాఖ ప్రధాన కార్యదర్శి అంజుంపర్వేజ్ తెలిపారు. సమ్మె విరమించకపోతే ఎస్మా ప్రయోగిస్తామని చెప్పారు. సమ్మె వీడకపోతే రెండేళ్ల లోపు పదవీవిరమణ చేసిన ఆర్టీసీ సిబ్బందిని పిలిపించి బస్సులు నడిపిస్తామని పేర్కొన్నారు. విధులకు రాకుంటే చర్యలు: సీఎం రవాణాశాఖ ఉద్యోగులు డిమాండ్లను ప్రభుత్వం ఇప్పటికే నెరవేర్చింది. అయినా సమ్మె చేయడం సరికాదు. తక్షణం విధులకు హాజరుకావాలి, లేని పక్షంలో కఠినచర్యలు తీసుకుంటామని సీఎం యడియూరప్ప గురువారం హెచ్చరించారు. ఆయన బెళగావిలో మాట్లాడుతూ కోవిడ్ క్లిష్ట సమయంలోనూ 8 శాతం వేతనం పెంచాలని తీర్మానించామన్నారు. ఉద్యోగులు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని విధుల్లో చేరాలన్నారు. చదవండి: ఆర్టీసీ సమ్మె: టికెట్ ధరకు రెట్టింపు వసూళ్లు! -
చర్చలకు రండి.. లేదంటే తీవ్ర పరిణామాలు: సీఎం
సాక్షి, బెంగళూరు: ఆరవ వేతన కమిషన్ సిఫార్సుల్ని అమలు చేయడంతో పాటు పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ ఉద్యోగులు బుధవారం నుంచి సమ్మె ప్రారంభించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి బస్సులు అక్కడే డిపోల్లో నిలిచిపోయాయి. 24 వేల బస్సుల సంచారం బందై బస్టాండ్లు నిర్మానుష్యమయ్యాయి. ప్రజలు గమ్యస్థానం చేరడం ఎలా అని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రోగులు, వృద్ధులు, చంటిపిల్లల తల్లుల బాధలు వర్ణనాతీతం. విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలు గమ్యం చేరలేక నానా ఇబ్బందులు పడ్డారు. బుధవారం జరగాల్సిన బెంగళూరు, తుమకూరు, మంగళూరు, రాణిచెన్నమ్మ విశ్వవిద్యాలయ పరీక్షలను వాయిదా వేశారు. ఆర్టీసీ సమ్మెతో రాష్ట్రంలోని 31 జిల్లాల్లో రవాణా బస్సులు సంచారం పూర్తిగా స్తంభించిపోయింది. కాగా, ప్రయాణ అవసరాల కోసం ప్రభుత్వం ప్రైవేటు బస్సులు, టెంపోలకు అనుమతి ఇచ్చింది. బెంగళూరుతో పాటు వివిధ జిల్లాల్లో ప్రైవేటు వాహనాలే ప్రజలకు దిక్కయ్యాయి. బెంగళూరులోని మెజెస్టిక్ బస్టాండు, కెంపేగౌడ బస్టాండు, శాటిలైట్, యశవంతపుర బస్టాండ్లులో ప్రైవేటు మినీబస్సుల సంచారం అధికమైంది. ఆటో, ట్యాక్సీ, ప్రైవేటు బస్సుల్లో కిక్కిరిసిన ప్రయాణాలు తప్పలేదు. దీనివల్ల కరోనా రెండో దాడి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన ఏర్పడింది. ప్రైవేటు వాహనాల్లో అధిక టికెట్ ధరలను వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. బస్టాండ్లలోకి ప్రైవేటు బస్సులు.. బెంగళూరు నగరంలో ప్రైవేటు బస్సులు, మినీ బస్సులు బీఎంటీసీ రూట్లలో తిరిగాయి. అయితే టికెట్ ధరకు రెట్టింపు వసూళ్లు చేసినట్లు ప్రయాణికులు వాపోయారు. గత్యంతరం లేక ప్రైవేటు వాహనాలనే ఆశ్రయించారు. ఇక ట్యాక్సీ, ఆటోడ్రైవర్లు ఇదే అదనుగా విపరీతంగా చార్జీలు వసూలు చేశారు. మొత్తం మీద బెంగళూరుతో పాటు అనేక ప్రాంతాల్లో ప్రైవేటు బస్సులు సంచారం తీవ్రతరమైంది. సాధారణంగా మెజెస్టిక్, కెంపేగౌడబస్టాండులోకి ప్రైవేటు బస్సులకు అనుమతిలేదు. కానీ బుధవారం అన్ని బస్టాండ్లలోకి స్వేచ్ఛగా ప్రైవేటు బస్సులు ప్రవేశించాయి. బెంగళూరు నుంచి రాష్ట్రంలో ప్రధాన నగరాలకు బస్సులు కరువయ్యాయి. సమ్మె వల్ల ఐటీ సిటీలో మెట్రోరైలు సర్వీసులను పెంచారు. మెట్రో స్టేషన్లలో రద్దీ ఏర్పడింది. మెట్రో టోకెన్లు దొరక్క ప్రజలు ఇబ్బందిపడ్డారు. సమ్మె ముగిసే వరకు టోకెన్ వ్యవస్థను కల్పించాలని ప్రజలు డిమాండ్ చేశారు. ప్రయాణికులకు కటకట.. ప్రభుత్వం, రవాణా శాఖ ఉద్యోగులు పట్టువీడకపోవడంతో ప్రజలు నలిగిపోవాల్సి వచ్చింది. ఎంతో వెచ్చించి నెల పాస్ తీసుకుంటే ప్రైవేటు బస్సులు టెంపోలు, ఆటోల్లో డబ్బు పెట్టి ప్రయాణించాలా? అని పలువురు మండిపడ్డారు. మంగళవారం తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పోలింగ్‌కు వెళ్లి తిరిగివచ్చే కర్ణాటక ఉద్యోగులకు బస్సులు దొరకలేదు. మైసూరునగర, గ్రామీణ బస్టాండ్లు వెలవెలబోయాయి. కరోనా వైరస్ ఉండటంతో ధర్నా చేపట్టరాదని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సర్కారు హెచ్చరించింది. దీంతో ఉద్యోగులు ధర్నాలకు దిగలేదు. చర్చిద్దాం రండి: సీఎం సాక్షి, బళ్లారి: కేఎస్ఆర్టీసీ సిబ్బంది సమ్మె మానుకుని ప్రభుత్వంతో చర్చలకు రావాలని సీఎం యడియూరప్ప కోరారు. బుధవారం బెళగావిలో ఉప ఎన్నికల ప్రచారంలో విలేకరులతో మాట్లాడుతూ చర్చల్లో ఎవరితోనైనా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదన్నారు. ప్రభుత్వంతో చర్చలకు రాకుండా, సమ్మె మానకపోతే ఎస్మా ప్రయోగించేందుకు కూడా వెనుకాడేది లేదన్నారు. కరోనా కష్ట సమయంలోను, విద్యార్థులకు పరీక్షలు ఉన్నందున బంద్ పాటించడం తగదన్నారు. జీతాలకు కష్టమవుతుంది: డీసీఎం బనశంకరి: ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తే జీతాలివ్వడం కష్టమని డిప్యూటీ సీఎం లక్ష్మణసవది హెచ్చరించారు. బీదర్‌లో విలేకరులతో మాట్లాడుతూ రవాణాశాఖ నష్టాల్లో ఉందని ప్రతిరోజు రూ.4 కోట్లు నష్టం వస్తోందన్నారు. సమ్మె చేయడం వల్ల నష్టం మీకేనన్నారు. ప్రయాణికులను ఇబ్బందులు పెడుతూ సమ్మెకు దిగడం న్యాయమా అని ప్రశ్నించారు. రవాణాశాఖ ఉద్యోగులు పెట్టిన 9 డిమాండ్లలో 8 డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. సమ్మె వల్ల రోజూ 30 లక్షల మంది ప్రయాణికులు కష్టాల పాలవుతారన్నారు. చదవండి: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె.. ప్రభుత్వం కీలక నిర్ణయం -
ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె.. ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, బెంగళూరు: ఒకవైపు కరోనా వైరస్‌తో తీవ్ర అవస్థలు పడుతున్న ప్రజలమీద ఆర్టీసీ సమ్మె పిడుగు పడింది. డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ ఉద్యోగులు బుధవారం సమ్మె చేపట్టారు. దీంతో కర్ణాటకలో బస్సులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో పలు విశ్వవిద్యాలయాలు నేడు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశాయి. ఇక జీతాలు చెల్లించడంలేదంటూ బస్సు డ్రైవర్ల నిరవధిక సమ్మెకు దిగడంతో, ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించకుండా ఉండేందుకు, కేఎస్ఆర్టీసీ ప్రైవేటు బస్సులకు తాత్కాలికంగా అనుమతినిచ్చింది. కాగా ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల నేపథ్యంలో యడ్డీ సర్కారు రాజీకి వచ్చే ప్రసక్తే లేదని మంగళవారం తేల్చిచెప్పింది. రవాణా శాఖ ఉద్యోగులతో చర్చలు లేదా రాజీ ప్రశ్నేలేదని, సమ్మెను విరమించాలని, ప్రజలకు ఇబ్బంది కలిగించడం లేదా ప్రభుత్వ ఆస్తులకు ధ్వంసంచేస్తే అలాంటి వారిపై ఎస్మా చట్ట ప్రయోగం తప్పదని స్పష్టం చేసింది. ఈ మేరకు, ముఖ్యమంత్రి నివాస కార్యాలయం కృష్ణాలో సీఎం యడియూరప్ప, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవికుమార్, పోలీస్ కమిషనర్ కమల్‌పంత్, బీఎంటీసీ అధ్యక్షుడు నందీశ్‌రెడ్డి, డైరెక్టర్లు శిఖా, శివయోగికళసద్, రవాణాశాఖ కమిషనర్ శివకుమార్, వాయువ్య, ఈశాన్యతో సహా 4 ఆర్టీసీ మండళ్ల డైరెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో హెచ్చరికలు జారీ చేశారు. 6వ వేతన సిఫార్సులు అసాధ్యం: సీఎస్ ఇక మంగళవారం నాటి భేటీ అనంతరం సీఎస్ రవికుమార్ మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో రవాణాశాఖ ఉద్యోగులకు 6వ వేతన కమిషన్ సిఫార్సులను అమలుచేయడం సాధ్యం కాదు. ఉద్యోగులు తక్షణం ధర్నాను విరమించి విధులకు హాజరుకావాలి. గైర్హాజరైతే వారి వేతనంలో కోత విధిస్తాం. రవాణాశాఖ ఉద్యోగుల ఒక్కూట నేతలతో కానీ ఇతరులతో చర్చలు జరిపేది లేదు. రాజీచర్చలు ముగిసిన అధ్యాయం. విధ్వంసానికి దిగితే కఠిన చర్యలుంటాయి. రవాణా ఉద్యోగుల వేతనాన్ని 8 శాతం పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. ఇందుకు అనుమతి ఇవ్వాలని సోమవారం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశాం. అక్కడ నుంచి అనుమతి లభిస్తే వేతన అంశం పరిష్కారమవుతుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఎలాంటి హామీ ఇవ్వడం సాధ్యం కాదు’’ అని ఆయన తెలిపారు. ప్రతిరోజు 60 లక్షలమంది ప్రయాణికులు సంచరిస్తున్నారని, కరోనా నేపథ్యంలో ప్రస్తుతం 30 లక్షలకు తగ్గిందని తమకు ప్రతి రోజు రూ.4 కోట్లు నష్టం వస్తోందని సీఎస్ చెప్పారు. ఇది రవాణాశాఖ ఉద్యోగులకు అర్థం కాలేదా అని ప్రశ్నించారు. పదేపదే ధర్నాలకు దిగడం ఎంతవరకు సమంజసమన్నారు. ఆందోళనల వల్ల కోవిడ్ విస్తరిస్తుందని చెప్పారు. ధర్నా చేయొద్దు: డీసీఎం లక్ష్మణ్ రవాణాశాఖ ఉద్యోగుల వేతనం పెంపునకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, తక్షణం సమ్మెను విరమించి విధులకు హాజరుకావాలని డిప్యూటీ సీఎం లక్ష్మణసవది విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వేతనం పెంచాలని తీర్మానించామని తెలిపారు. ఎంతమేర అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. మొదట ఉద్యోగులు ధర్నా విరమించాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆర్టీసీ ఉద్యోగులు బుధవారం సమ్మెకు ఉపక్రమించారు. చదవండి: ఆర్టీసీ సమ్మె యోచనపై సీఎం సీరియస్ -
ఆర్టీసీ సమ్మె యోచనపై సీఎం సీరియస్
యశవంతపుర/కర్ణాటక: ఆర్టీసీ, బీఎంటీసీ సిబ్బంది సమ్మెకు పిలుపునివ్వటంతో కార్మికుల డిమాండ్లపై చర్చించటానికి సీఎం యడియూరప్ప, డీసీఎం లక్ష్మీణ సవది సోమవారం సమావేశమై చర్చించారు. ఆరవ వేతన కమిషన్ ప్రకారం జీతాలను పెంచాలని ఏప్రిల్ 7న ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. సమ్మెకు దిగితే తీసుకోవాల్సిన చర్యలపై సీఎం అధికారులతో సమీక్షించారు. వేతన సిఫార్సులను అమలు చేయటం సాధ్యంకాదని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. పట్టుబట్టి సమ్మెకు దిగితే ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆదేశించినట్లు సమాచారం. పునరాలోచన చేయండి -ఐఏఎస్ శరత్ బదిలీపై క్యాట్ తీర్పు మైసూరు: తన బదిలీపై ఐఏఎస్ అధికారి శరత్ వేసిన పిటిషన్‌పై క్యాట్ తీర్పు వెలువరించింది. శరత్ బదిలీపై ప్రభుత్వం మరోసారి నిర్ణయం తీసుకోవాలని క్యాట్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. 2020 సెప్టెంబర్‌లో మైసూరు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన శరత్‌ను రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల వ్యవధిలోనే బదిలీ చేసింది. దీంతో ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. క్యాట్ తీర్పు రిజర్వులో ఉంచడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం క్యాట్ తన తీర్పును వెలువరించింది. -
సాయంత్రం ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సాయంత్రం ఆర్టీసీపై సమీక్ష జరపనున్నారు. ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదన, హైకోర్టులో కేసు, ఇతర అంశాలపై ఆయన చర్చించనున్నారు. కాగా ఎలాంటి షరతులు విధించకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించేందుకు సిద్ధమని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నిన్న ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, పలు అంశాలపై అక్టోబర్ 4న ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. కాగా న్యాయస్థానంలో కూడా కార్మికులకు ఊరట లభించలేదు. దీంతో విలీన ప్రతిపాదనను పది రోజుల క్రితమే ఆర్టీసీ జేఏసీ పక్కన పెట్టింది. తాజాగా ఎలాంటి షరతులు లేకుండా తమ సూచనలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే సమ్మె విరమణకు సిద్ధమని, లేనిపక్షంలో సమ్మె కొనసాగిస్తామని జేఏసీ ప్రకటన నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆర్టీసీ జేఏసీ ప్రకటనతో పలుచోట్ల కార్మికుల్లో అయోమయం నెలకొంది. సమ్మె విరమణపై కార్మికులు తర్జనభర్జన పడుతున్నారు. చదవండి: ఆర్టీసీ సమ్మె విరమణ..! సమ్మెపై సాయంత్రానికి స్పష్టత తాజా పరిణామాల నేపథ్యంలో ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ... ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమిస్తే ఏం చేయాలనే అంశంపై చర్చించనున్నారు. కార్మికులను విధుల్లోకి తీసుకోవాల్సి వస్తే ఎలాంటి షరతులు ఉండాలి, భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై చర్చించి, అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లనున్నారు. ఇక సమ్మె విరమిస్తే విధుల్లోకి చేర్చుకోవడంపై ముఖ్యమంత్రి ఆదేశాల కోసం కార్మికులు ఎదురు చూపులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెపై సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
‘ఎప్పుడు సమ్మె విరమించినా విధుల్లోకి తీసుకోవాలి’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో బుధవారం అఖిలపక్షం నేతలు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ని కలిశారు. ఈ సందర్భంగా కోర్టు తీర్పు, ప్రభుత్వ అఫిడవిట్, సునీల్ శర్మ అఫిడవిట్, ఐఏఎస్ అధికారుల కోడ్ ఆఫ్ కండక్ట్ కాపీలను గవర్నర్‌కి సమర్పించారు. అనంతరం బీజేపీ నాయకుడు మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోవాలని కోరామని తెలిపారు. నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్ వైఖరిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ నాయకురాలు గీతారెడ్డి మాట్లాడుతూ.. విలీనంపై కార్మికులు వెనక్కితగ్గినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. తటస్థంగా ఉండాల్సిన ఆర్టీసీ ఎండీ ఇచ్చిన అఫిడవిట్‌పై గవర్నర్‌కి ఫిర్యాదు చేశామని వివరించారు. సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌కు కనికరం లేదని విమర్శించారు. గవర్నర్ అయినా అపాయింట్మెంట్ ఇచ్చారు కానీ, కేసీఆర్ మాత్రం ఇవ్వరని ఎద్దేవా చేశారు.ప్రయాణీకుల అవస్థలు దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని గవర్నర్‌ని కోరామని పేర్కొన్నారు. మరోవైపు అఖిలపక్షం ఆధ్వర్యంలో త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్ర రవాణా శాఖ మంత్రిని కలవాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. కోదండరాం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడంతో గవర్నర్‌తో మొరపెట్టుకున్నామని తెలిపారు. సమ్మెను చట్ట వ్యతిరేకంగా చూడకుండా కార్మికులు ఎప్పుడు సమ్మె విరమించినా విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ చేసిన రాజకీయ వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. -
ఆర్టీసీ సమ్మె: ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర..!
సాక్షి, హైదరాబాద్: నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆర్థిక సంక్షోభం ఊబిలోకి నెట్టి ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు యూనియన్ ప్రయత్నిస్తుందని, అందుకు విపక్షాలతో చేతులు కలిపి కుట్రకు పాల్పడుతోందని టీఎస్ ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ ఆరోపించారు. ఒక పక్క యాజమాన్యంతో చర్చలు జరుగుతుండగానే ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెలోకి వెళ్లాయని, తిరిగి విధుల్లో చేరేందుకు వారంతా ముందుకు వచ్చిన విధుల్లోకి చేర్చుకునేలా నిర్ణయం తీసుకోవడం కూడా కష్టమేనని హైకోర్టుకు తేల్చి చెప్పారు. ఈ మేరకు టీఎస్‌ఆరీ్టసీ ఇన్చార్జి ఎండీ హోదాలో శనివారం ఆయన హైకోర్టులో స్పెషల్ అడిషినల్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఆర్టీసీ సిబ్బంది కోసం కాకుండా ప్రతిపక్ష రాజకీయపారీ్టల కోసం ఆర్టీసీ యూనియన్ అడుగులు వేస్తోందన్నారు. ఆర్టీసీ ఉనికినే దెబ్బతీస్తుంటే యాజమాన్యం చేతులు కట్టుకుని కూర్చోబోదని చెప్పారు. యూనియన్‌లో కొందరి తప్పిదాల వల్ల ప్రజలు, ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ సంస్థ ఇబ్బందులు పడుతున్నా రని చెప్పారు. యూనియన్ మొండిగా వ్యవహరించిందని, బెదిరింపులకు దిగే క్రమంలోనే దసరాకు ముందు సమ్మెలోకి దిగారని చెప్పారు. ఆర్టీసీ కారి్మకులు చేపట్టిన సమ్మె చట్ట విరుద్ధమని చెప్పారు. పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 22 ప్రకారం ఆరు వారాలు లేదా 14 రోజులు ముందుగా నోటీసు ఇవ్వాలని, కన్సిలియేషన్ జరుగుతుంటే సమ్మెలోకి వెళ్లడం అదే చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం సమ్మె చట్ట వ్యతి రేకం అవుతుందన్నారు. చట్ట వ్యతిరేకంగా సమ్మెలోకి వెళితే నెల రోజులపాటు జైలు శిక్షతోపాటు జరిమానాలను విధించేందుకు వీలుందన్నారు. డిమాండ్లను పరిష్కరించే పరిస్థితి లేదు.. యూనియన్ డిమాండ్లను పరిష్కరించే పరిస్థితుల్లో ఆర్టీసీ కార్పొరేషన్ లేదన్నారు. అగ్గి రాజేసి చలి కాచుకునే ధిక్కార ధోరణి/ క్రమశిక్షణారాహిత్యాలను ఉపేక్షించబోమని గట్టిగా నొక్కి చెప్పారు. సమ్మె పాశుపతాస్త్రం లాంటిదని, అయినదానికీ కానిదానికీ దానిని ప్రయోగించకూడదని, సమ్మె హక్కు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుగా లేదన్నారు. ప్రజా సరీ్వసుల్లోని సిబ్బంది సమ్మె చేస్తామని నోటీసు ఇవ్వడమే చట్ట విరుద్ధమని, 40 రోజుల సమ్మె వల్ల ఆర్టీసీ పరిస్థితే కాకుండా వ్యాపార, ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌తో మొండిగా వ్యవహరించిన యూనియన్ ఆ డిమాం డ్‌ను ప్రస్తుతానికి పక్కకు పెట్టిందన్నారు. యూనియన్ మొండి వైఖరిని అనుసరించిందనడానికి ఇదే పెద్ద నిదర్శనమన్నారు. భవిష్యత్తులో ఎప్పుడైనా మళ్లీ విలీనం డిమాండ్‌ను తెరపైకి తెచ్చి ప్రభుత్వా న్ని అస్థిరపరిచే అవకాశాలు లేకపోలేదనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. యూనియన్ సమ్మె వల్ల ఉన్న నిల్వ నిధులు కాస్తా ఖర్చు అవుతున్నాయని, నష్టాల నుంచి భారీ నష్టాల ఊబిలోకి వెళ్లే పరిస్థితిని తీసుకొచ్చారని ఆరోపించారు. పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నష్టాల్లో ఉన్నప్పటికీ ఆర్టీసీ సిబ్బందికి 44% జీతాల పెంపు, 16% మధ్యంతర భృతి ఇచ్చామని చెప్పారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా హైకోర్టు సత్వరమే ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. బస్సు రూట్ల ప్రైవేటీకరణ ప్రక్రియ పూర్తి కాలేదు: సీఎస్ ఆర్టీసీ 5,100 బస్సు రూట్లను ప్రైవేటీకరించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం రహస్యమని, సెక్రటేరియట్ పరిధి దాటి ఆ వివరాలు ఇచ్చేందుకు వీల్లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీకే జోషి హైకోర్టుకు తెలియజేశారు. క్యాబినెట్ నిర్ణయ ప్రక్రియ పూర్తి కాలేదని, ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడేలోగా ఆ నిర్ణయంలో మార్పుచేర్పులకు ఆస్కారం ఉంటుందన్నారు. జీవో వచ్చాకే క్యాబినెట్ నిర్ణయానికి పూర్తి సార్థకత వస్తుందన్నారు. ఈలోగా క్యాబినెట్ నిర్ణయాన్ని ప్రశ్నించేందుకు వీల్లేదని రాజ్యాంగంలోని 166(1) అధికరణం స్పష్టం చేస్తోందన్నారు. రవాణా చట్టం కూడా అదే స్పష్టం చేస్తోందన్నారు. బస్సు రూట్లను ప్రైవేటీకరణ చేయాలని క్యాబినెట్ తీర్మానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. క్యాబినెట్ తీర్మానం నోట్‌ఫైల్స్‌లో భాగమని, సచివాలయం బయట ఉన్న వాళ్లకు ఆ వివరాలు ఇచ్చేందుకు వీల్లేదన్నారు. క్యాబినెట్ నిర్ణయం తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి గెజిట్ వెలువరించాలని, ఆ తర్వాత జీవో జారీ చేస్తేనే క్యాబినెట్ అమల్లోకి వస్తుందని, అప్పటి వరకూ ఆ నిర్ణయాన్ని సవాల్ చేయడం చెల్లదని, పిల్‌ను డిస్మిస్ చేయాలని ఆయన హైకోర్టును కోరారు. -
సకలం అస్తవ్యస్తం!
శంషాబాద్‌లోని ఓ జూనియర్ కాలేజీలో 550 మంది విద్యార్థులున్నారు. మండల పరిధిలోని గ్రామాలతో పాటు షాబాద్, మహేశ్వరం ప్రాంతాలకు చెందిన విద్యార్థులే వీరంతా. ఈ కాలేజీలో 90 శాతంపైగా ఉన్న హాజరు, ఆర్టీసీ సమ్మెతో 40 శాతానికి పడిపోయింది. రోజుకు సగటున 150 మందే హాజరవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో హాజరు శాతం భారీగా తగ్గింది. విద్యాసంస్థలకు కాలినడకన వచ్చే వారు మినహాయిస్తే గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు బస్సుల్లేక రోజుల తరబడి చదువులకు దూరం అవుతున్నారు. సగటు జీవి రోజువారీ జీవన విధానంలో ప్రగతి రథం ఒక భాగం. స్కూలు విద్యార్థి మొదలు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులతో పాటు వ్యవసాయ కూలీలు, రైతులు... ఇలా అన్ని వర్గాల ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చే ఆర్టీసీకి సమ్మె పోటు తగిలింది. చాలా రోజులుగా కార్మికులు సమ్మె చేస్తుండగా, యాజమాన్యం తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను రోడ్డెక్కిస్తోంది. కానీ అవి పరిమిత రూట్లలో, ప్రధాన రహదారుల్లో మాత్రమే సేవలందిస్తుండడంతో మెజార్టీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించి చేతి చమురు వదిలించుకుంటున్నారు. ఆర్టీసీలో నెలకు వెయ్యి రూపాయలయ్యే ప్రయాణం ప్రైవేట్ పుణ్యమా అని ఇప్పుడు నాలుగు వేలకు చేరిందని లబోదిబోమంటున్నారు. ఆర్టీసీలో 10 వేల బస్సుల ద్వా రా రోజుకు సగటున కోటి మందికి సేవలందుతున్నాయి. సమ్మె నేపథ్యంలో 60 శాతం బస్సులను తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో నడుపుతున్నా ప్రధాన రహదారులకే పరిమితమవుతున్నాయి. జిల్లా, తాలూకా కేంద్రాలు, హై దరాబాద్‌కు వచ్చే రూట్లలో ఇవి నడుస్తున్నా యి. గ్రామాలు, మారుమూల పల్లెలకు చాలా రోజులుగా బస్సు వెళ్లకపోవడం గమనార్హం. దీంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు వాహనదారులు ఇబ్బడిముబ్బడిగా వసూళ్లకు తెగబడుతున్నారు. మరో వైపు సరుకు రవాణా కు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్న రైతులు, ఆ ప్రభావాన్ని దిగుబడుల విక్రయాలపై చూపుతూ ధరలు పెంచేస్తున్నారు. నిత్యం ఆలస్యమే... ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారిలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులుంటారు. బస్సులు లేకపోవడంతో వ్యక్తిగత వాహనాల్లో వెళ్లడం లేదా ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. సకాలంలో దొరకకపోవడంతో సమయపాలన గాడితప్పుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు కనీసం అరగంట ఆలస్యంగా రావడంతో పాటు ముందుగా వెళ్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా పాఠశాలల్లో కూడా టీచర్లు ఆలస్యంగా వస్తున్నారనే ఫిర్యాదులు విద్యాశాఖాధికారులకు వస్తున్నాయి. కార్తీకమాసం శుభకార్యాలకు ప్రసిద్ధి కావడంతో ప్రయాణాలు సైతం అధికమే. ఈ సమయంలో దూరప్రయాణాలకు వెళ్లే వారు సమ్మె కారణంగా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దందా ఆగమైంది... సమ్మెతో గిరాకీ దెబ్బతిన్నది. బస్టాండ్‌కు వచ్చే వారంతా మా హోటల్లో ఏదో ఒకటి తినేవారు. సమ్మె ప్రభావంతో బస్సుల సంఖ్య తగ్గడం, గ్రామాలకు వెళ్లే వారంతా బస్టాండ్‌కు రాకపోవడంతో గిరాకీ డౌన్ అయ్యింది. సమ్మెకు ముందు రోజుకు సగటున 24వేల వరకు గిరాకీ అయ్యేది. ఇప్పుడు 8వేల నుంచి 9వేల వరకు మాత్రమే బేరమవుతుంది. – శ్రీకాంత్, హోటల్ నిర్వాహకుడు, సంగారెడ్డి కొత్త బస్టాండ్ కాంప్లెక్స్ గిట్టుబాటు అయితలేదు కూరగాయ దిగుబడులను బస్ ద్వారా రైతు బజార్‌కు తరలించేవాళ్లం. ఇప్పుడు బస్సులు రాకపోవడంతో ఆటో ట్రాలీని కట్టుకుని తీసుకెళ్తున్నాం. నలుగురైదుగురు రైతులం కలిసి ఆటోలో వెళ్లడంతో ఒక్కొక్కరికి కనీసం రూ.300 వరకు ఖర్చు వస్తున్నది. బస్సులో వెళ్తే గరిష్టంగా రూ.100 లోపు ఉండేది. దీంతో రైతుబజార్‌కు వెళ్లి పంట దిగుబడులు అమ్మితే ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. రోజుకు రూ.300 పెట్టాలంటే ఆచ్చే ఆదాయం ఏముంటుంది. – పి.నర్సింలు, రైతు, ఆలూరు, చేవెళ్ల ఆటో ఖర్చు నెలకు రూ.వెయ్యి మా ఊరి నుంచి స్కూల్ 8 కిలోమీటర్లు. సాధార ణ రోజుల్లో నెలకు రూ. 125 చెల్లించి బస్‌పాస్ ద్వారా ప్రయాణించేవాడిని. ఇప్పుడు బస్సులు బంద్ కావడంతో నిత్యం ఆటోలో వెళ్తున్నా. పదో తరగతి కావడంతో ఒక్క క్లాస్ కూడా మిస్ కావొద్దని అమ్మానాన్నలు రోజువారీ ఆటో చార్జీలు ఎంతో కష్టపడి ఇస్తున్నారు. ఆర్టీసీ సమ్మె వల్ల ఒక నెల రోజుల్లోనే ఆటోలో ప్రయాణానికి దాదాపు వెయ్యి రూపాయలు ఖర్చు చేశా. –ప్రవీణ్, పదో తరగతి, ఏట్ల ఎర్రవల్లి గ్రామం, షాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా -
ఎంపీ,ఎమ్మెల్యేను అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు
-
ఆర్ధిక ఇబ్బందుల్లో ఆర్టీసీ కార్మికులు
-
ఆర్టీసీ కార్మికులకు లండన్‌లో ఎన్ఆర్ఐల మద్దతు
లండన్ : ఆర్టీసీ కార్మికులకు యూకే (లండన్) తెలంగాణా ఐక్య వేదిక అఖిలపక్షం తమ సంపూర్ణ మద్దతు తెలిపింది. లండన్‌లోని కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, వైఎస్సార్సీపీ, తెలంగాణ జనసమితి, టీడీపీ, జనసేన అభిమానులు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ అధ్యక్షులు కోదండ రాం, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి వారి సందేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇచ్చారు. లండన్ తరహాలో అన్ని దేశాల్లోని ఎన్ఆర్ఐలు ఆర్టీసీకి మద్దతు తెలపాలని పిలుపు ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులకు లండన్ ఎన్ఆర్ఐల మద్దతు స్ఫూర్తితో మిగిలిన దేశాల్లో నివసిస్తున్నవారు మద్దతు ఇవ్వాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు. విదేశాల్లో తెలంగాణ ఉద్యమం చేసిన ఎన్ఆర్ఐలు తెలంగాణలో కష్ట కాలంలో మౌనం వహించడం తప్పన్నారు. సామాజిక బాధ్యతతో ఎన్ఆర్ఐలు తమ అభిప్రాయాలను చెప్పి ప్రభుత్వం పరిష్కారం తీసుకునేలా చొరవ తీసుకునే విధంగా ఒత్తిడి తేవాలని కోరారు. నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. లండన్ తరహాలో అమెరికాలో కూడా ఎన్ఆర్ఐలు ఆర్టీసీకి మద్దతు తెలపాలని కోరారు. ముఖ్యమంత్రి ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లిస్తే అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ముఖ్యమంత్రి అబద్దాలు చెప్పడం బాధాకరమన్నారు. మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ.. నిర్బంధాలు, హౌస్ అరెస్టులు, ఉద్యమ అణచివేతలు, మరో సమస్యకి దారితీస్తాయని తెలిపారు.హైకోర్టుని కూడా తప్పు దోవ పట్టించే అవసరం లేదని, ముఖ్యమంత్రి మొండి వైఖరి విడనాడాలని సూచించారు. ముఖ్యమంత్రి పెద్ద మనుసు చేసుకొని కార్మికుల సమస్య పరిష్కార దిశగా ఆలోచన చేయాలనీ టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కోరారు. పట్టు విడుపుల సమయం కాదని బలిదానాలు పెరగకుండా చర్యలు చేపట్టాలని, అణిచివేత ధోరణితో సమస్య పరిష్కారం కాదని అన్నారు. థేమ్స్ నది ఒడ్డున లండన్‌లో తెలంగాణ ఉద్యమం చేసిన ఎన్నారైలు, ఆర్టీసీ కార్మికుల పక్షాన మద్దతు తెలపడం ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని అశ్వత్థామ రెడ్డి అన్నారు. తమ సమస్యకి విదేశాల్లో స్థిరపడ్డ ఎన్నారైలు మద్దతు తెలపడం సంతోషంగా ఉందని తెలిపారు. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో పాల్గొన్న గంప వేణుగోపాల్, పసునూరి కిరణ్, రంగు వెంకటేశ్వర్లు, శ్రీధర్ నీలల ఆధ్వర్యంలో 6 ప్రధాన రాజకీయ పార్టీలు, మేధావులు ఐక్య వేదికగా ఏర్పడి ఈ సమావేశ ఏర్పాటుకు ముఖ్య భూమిక పోషించారు. కాంగ్రెస్ పార్టీ తరపున గంప వేణుగోపాల్, గంగసాని ప్రవీణ్ రెడ్డి, శ్రీధర్ నీలా, శ్రీనివాస్ దేవులపల్లి, నర్సింహా రెడ్డి తిరుపరి, మేరీ, జవహార్ రెడ్డి, జయంత్ వద్దిరాజులు, బీజేపీ పార్టీ తరపున పసునూరి కిరణ్, ప్రవీణ్ బిట్లలు, తెలంగాణ జన సమితి పార్టీ తరపున రంగు వెంకటేశ్వర్లు, స్వామి ఆకుల, రాజు గౌడ్లు, టీడీపీ పార్టీ తరపున కోటి, చైతన్యలు, జనసేన పార్టీ తరపున అయ్యప్ప, హనీఫ్, అబ్దుల్ లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు శివా రెడ్డి, గణేష్ రెడ్డిలు, యూకే తెలంగాణ మేధావి వర్గం నుండి ఓరుగంటి కమలాకర్ రావు, శ్రవణ్ గౌడ్, డాక్టర్ విశ్వనాథ్ కొక్కొండలు పాల్గొన్నారు. -
సర్కారీ స్కూళ్లపై సమ్మె ఎఫెక్ట్!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె ప్రభావం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు, టీచర్లపైనా పడుతోంది. దీంతో హాజరు తగ్గుతోంది. గత నెలలో నిర్వహించిన సమ్మేటివ్ అసేస్‌మెంట్–1 (ఎస్ఏ) పరీక్షల సమయంలో విద్యార్థులు, టీచర్ల హాజరు, ఈనెలలో ఇప్పటివరకు వారి హాజరు తీరుపై విద్యాశాఖ లెక్కలు తేలి్చంది. దీంతో 10 శాతం వరకు విద్యార్థుల హాజరులో, 8 శాతం వరకు టీచర్ల హాజరులో తేడా ఉన్నట్లుగా గుర్తించింది. ఆర్టీసీ సమ్మె కారణంగానే విద్యార్థులు, టీచర్ల హాజరు తగ్గినట్లు విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. విద్యాశాఖ ఇటీవల విద్యార్థులు, టీచర్ల హాజరును ఆన్లైన్లో సేకరించేందుకు టీ–హాజరు పేరుతో మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచి్చంది. దానికి విద్యార్థులు, టీచర్లకు సంబంధించి సమగ్ర సమాచారం కలిగిన యూ–డైస్ డాటాను అనుసంధానం చేసింది. పాఠశాలల హెడ్మాస్టర్లు/హాజరు బాధ్యత చూసేందుకు విద్యాశాఖ ఎంపిక చేసిన ఉపాధ్యాయులు యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని బయోమెట్రిక్ ఆధారితంగా టీచర్లు విద్యార్థుల హాజరును నమోదు చేస్తున్నారు. మొదట్లో చాలా పాఠశాలలు ఈ యాప్ ద్వారా హాజరును నమోదు చేయలేదు. ఆ తర్వాత విద్యాశాఖ స్పçష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్రంలోని 28,791 ప్రభుత్వ పాఠశాలు ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసు కొని హాజరు నమోదును ఆన్లైన్లో పంపిస్తున్నాయి. 20 లక్షలకు పైగా విద్యార్థులు, లక్షకు పైగా టీచర్ల హాజరు శాతా న్ని సేకరించి పోల్చి చూసింది. గత నెల 25 నుంచి ఈనెల 1వ తేదీ వరకు నిర్వహించిన ఎస్ఏ–1 పరీక్షల సమయంలో టీచర్లు విద్యార్థుల హాజరును పరిశీలించింది. ఈనెల 2 నుంచి గురువారం వరకు విద్యార్థులు, టీచర్ల హాజరును పరిశీలించింది. దీంతో పరీక్షల సమయంలో హాజరు బాగానే ఉన్నా.. ఆ తర్వాత తగ్గిపోయినట్లు పాఠశాల విద్యాశాఖ గుర్తిం చింది. సమ్మె ప్రభావంతో పరీక్షల సమయంలో హాజరైన విద్యార్థుల సంఖ్య కంటే ఆ తర్వాత హాజరైన వారి సంఖ్యలో 10% వరకు తగ్గుదలను అధికారులు గుర్తించారు. పరీక్షలకు హాజరు కావాలి కాబట్టి విద్యార్థులు, టీచర్లు ఏదో ఒక రవాణా సదుపాయాన్ని చూసుకొని పరీక్షలకు హాజరయ్యారని, ఆ తర్వాత మళ్లీ తగ్గారని అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో విద్యార్థుల హాజరు 87% నుంచి 77 శాతానికి తగ్గగా, టీచర్ల హాజరు 88 % నుంచి 80 శాతానికి తగ్గినట్లు తేలింది. -
సీపీ వ్యాఖ్యలు బాధించాయి: అశ్వత్థామరెడ్డి
సాక్షి, హైదరాబాద్ : నగర పోలీస్ కమిషనర్ వ్యాఖ్యలను ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఖండించారు. ఆర్టీసీ కార్మికులు నిషేధిత మావోయిస్టు సంఘాలతో చేతులు కలిపారంటూ చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. మావోయిస్టు సంఘాలతో సంబంధాలు ఉన్నందునే చలో ట్యాంక్‌బండ్‌కు అనుమతి ఇవ్వలేదని సీపీ అంజనీకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ...‘మావోయిస్టలు ఉన్నారంటూ అనవసర ఆరోపణలు చేసి సమ్మెపై ఉక్కుపాదం మోపాలని చూస్తున్నారు. మావోయిస్టులు ఉన్నారంటూ పోలీస్ కమిషనర్ వ్యాఖ్యానించడం దురదృష్టకరం. సీపీ వ్యాఖ్యలు మమ్మల్ని బాధించాయి. చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో పాల్గొన్నదంతా కార్మికులే. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా చలో ట్యాంక్‌బండ్ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సహకరించిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలకు కృతజ్ఞతలు. మహిళా కండక్టర్ల పాత్ర కీలకం. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు శిరసు వంచి వందనాలు చెబుతున్నాం. అలాగే చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో పోలీసుల దమనకాండను ఖండిస్తున్నాం. సమ్మె విజయవంతం అయ్యేవరకూ మహిళా సిబ్బంది ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి. పోలీసుల దమనకాండకు నిరసనగా నల్లబ్యాడ్జీలతో రేపు (ఆదివారం) బస్సు డిపోల ఎదుట నిరసన కార్యక్రమం చేపడతాం.’ అని తెలిపారు. కాగా మావోయిస్టు సంఘాలతో కలిసి ఆర్టీసీ కార్మికులు...పోలీసులపై రాళ్లు విసిరారని, ఈ దాడిలో ఏడుగురు పోలీసులు గాయపడ్డారని సీపీ అంజనీకుమార్ తెలిపారు. పోలీసులపై దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని ఆయన పేర్కొన్నారు. చదవండి: చాలామంది పోలీసులు గాయపడ్డారు.. -
ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఆర్టీసీ సమ్మెపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సోమవారం హైకోర్టులో విచారణ నేపథ్యంలో ప్రైవేటీకరణపై న్యాయస్థానం వ్యాఖ్యలు, కార్మికుల మిలియన్ మార్చ్ తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాగా రాష్ట్రంలో 5,100 రూట్లను ప్రైవేటీకరించాలన్న మంత్రిమండలి నిర్ణయాన్ని హైకోర్టు ఆక్షేపించిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 11న కోర్టులో వాదనలు ఉన్నందున అనసరించాల్సిన తీరుపై సీఎం మళ్లీ సమీక్ష జరుపుతున్నారు. తదుపరి విచారణలో వాటిపై వ్యవహరించాల్సిన తీరుపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 36వ రోజు కూడా కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. ఇక ఆర్టీసీ కార్మికుల మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో విధించిన ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు ఎత్తివేశారు. వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చి బారికేడ్లను తొలగించారు. చదవండి: పోలీసులపై ఆందోళనకారుల రాళ్లదాడి -
‘ఛలో ట్యాంక్‌బండ్’లో పాల్గొనండి: ఉత్తమ్ పిలుపు
సాక్షి, హైదరాబాద్ : న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కూమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆర్టీసీ కార్మికులు ఛలో ట్యాంక్‌బండ్ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తమ్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఆర్టీసీ జేఏసీ తమ మద్దతు కోరిందనీ, అందుకోసం శనివారం చేపట్టే కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఉన్నత న్యాయస్థానం సమస్యలను పరిష్కరించాలని ఆదేశిస్తున్నా, ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా, నియంతలాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నెల రోజులకు పైగా సమ్మె చేస్తున్నా కేసీఆర్ మనసు కరగకపోవడం దారుణమని మండిపడ్డారు. -
సాహస ప్రయాణం.. ప్రాణాలతో చెలగాటం
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో నగరంలో సిటీ బస్సుల సర్వీసుల కొరత ఎంత తీవ్రంగా ఉందో ఈ చిత్రాలు అద్దం పడుతున్నాయి. ఉదయం ఎన్నో ప్రయాసలకోర్చి కళాశాలలకు వెళ్లిన విద్యార్థులకు తిరిగి ఇళ్లకు చేరేందుకు సరైన రవాణా సదుపాయం అందుబాటులో ఉండడంలేదు.తిరుగుతున్న అరకొర బస్సుల్లో చోటు దొరక్క విద్యార్థినులు ఫుట్‌బోర్డ్‌పై వేలాడుతూ ప్రయాణం చేస్తుంటే.. విద్యార్థులు బస్సు వెనుక వేలాడుతూప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు.ఈ సంఘటన మంగళవారం సాయంత్రం దిల్సుఖ్నగర్ నుంచి ఎల్బీనగర్ వెళుతున్న బస్సులో కనిపించింది. -
ఆర్టీసీ సమ్మె : వెనకడుగు వేయం
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సీఎం కేసీఆర్ విధించిన గడువు మంగళవారం అర్ధరాత్రితో ముగిసింది. అయినప్పటికీ తిరిగి డ్యూటీలో చేరే విషయంలో కార్మికులు వెనకడుగు వేయడంలేదు. దాదాపు 300 మంది మినహా మిగిలినవారంతా సమ్మెలోనే కొనసాగాలని నిర్ణయించు కున్నట్టు తెలుస్తోంది. డిపోల్లోనే కాకుండా పోలీసు స్టేషన్లు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, ఆర్టీఓ, ఎస్పీ డీఎస్పీ తదితర కార్యాలయాల్లో కూడా తిరిగి చేరికకు సంబంధించిన లేఖలు ఇవ్వచ్చని అధికారులు స్పష్టం చేసిన నేపథ్యంలో కొన్ని చోట్ల కార్మికులు ఆయా కార్యాలయాల్లో అందజేశారు. ఆ వివరా లన్నీ పూర్తిగా క్రోడీకరించాల్సి ఉన్నందున, మంగళవారం అర్ధరాత్రి 12 వరకు ఎంతమంది కార్మికులు లేఖలు ఇచ్చారన్న విషయంలో స్పష్టత రాలేదు. దీంతో రాత్రి వరకు ఆర్టీసీ అధికారికంగా ఆ సంఖ్యను ప్రకటించలేదు. సాయంత్రం 6 గంటల వరకు 150 మంది, రాత్రి తొమ్మిది వరకు 240 మంది, 10 వరకు ఆ సంఖ్య 300కి కాస్త అటూ ఇటూగా చేరుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. బుధవారం ఉదయం కచ్చితమైన సమాచారం తెలుస్తుందని తెలిపారు. కనీసం వేయి మందికిపైగా చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేసినా.. అది సాధ్యం కాలేదు. కార్మిక నేతలు రంగంలోకి దిగి.. ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి వరకు విధుల్లో చేరిన కార్మికులనే ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణిస్తామని, మిగతావారికి సంస్థతో ఎలాంటి సంబంధం ఉండదని, ఇదే చివరి అవకాశమని సీఎం తేల్చి చెప్పటంతో తొలుత కార్మికుల్లో అయోమయం నెలకొంది. ఇప్పటికే రెండు నెలలుగా జీతాలు లేనందున రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది కార్మికులు విధుల్లో చేరే విష యంలో కుటుంబ సభ్యులు, సన్ని హితులతో చర్చించారు. ఎక్కువ మంది చేరేందుకే ఆసక్తి కనబరిచారు. విషయం తెలిసి కార్మిక సంఘాల నేతలు వెంటనే రంగం లోకి దిగారు. సంఘాలుగా విడివిడిగా జిల్లా స్థాయి నేతలను నగరానికి పిలిపించుకుని చర్చలు జరిపారు. న్యాయస్థానంలో అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, ఇన్ని వేల మంది ఉద్యోగాలు తొలగించే హక్కు ప్రభుత్వానికి లేనందున అది చెల్లుబాటు కాదని, బేషరతుగా చేరాలన్న మెలికపెట్టడంతో భవిష్యత్తులో జీతాలు పొందడం సహా అన్ని విషయాల్లో ఇబ్బందులు వస్తాయని, ఇన్ని రోజులు పోరాటం చేసి ఇప్పుడు చేతులెత్తేస్తే సంస్థను కాపాడు కోలేమని చెప్పారు. ఇదంతా కార్మికులందరికీ చేరేలా చర్యలు చేసుకున్నారు. దీంతో కార్మికుల్లో చాలామంది విధుల్లో చేర కుండా ఆగిపోయారు. జేఏసీలో భాగంగా ఉన్న సూపర్వైజరీ అసోసియేషన్ పరిధిలో ఉండే ఉద్యోగులు మాత్రం తిరిగి విధుల్లో చేరేందుకే ఆసక్తి కనపడింది. వారిలో కొందరు మంగళవారం రాత్రి వివిధ ప్రాంతాల్లో లేఖలు అందజేశారు. అఖిలపక్ష నేతలతో జేఏసీ భేటీ... ముఖ్యమంత్రి విధించిన గడువు చివరి రోజైన మంగళవారం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు అఖిలపక్ష నేతలతో భేటీ అయ్యారు. ప్రధానంగా ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశంపైనే ఎక్కువ సేపు చర్చించారు. న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపిన మీదట, అసలు ఆర్టీసీని ప్రైవేటీకరించే అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదనే అంశంపై స్పష్టత వచ్చిందని పేర్కొన్నారు. ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి 31 శాతం వాటా ఉన్నందున, దాన్ని మూసివేయాలంటే కచ్చితంగా కేంద్రం అనుమతించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఈ విషయాలను కార్మికులకు తెలియజేసి.. ఎవరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని స్పష్టంచేశారు. మరోవైపు మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు డిపోల ముందు కార్మికులు నిరసనలు వ్యక్తం చేశారు. విధుల్లో చేరేందుకు వచ్చే కార్మికులను అడ్డుకునేందుకు వారు కాపలా తరహాలో దీక్షలు నిర్వహించారు. అన్ని డిపోల వద్ద వంటావార్పు ఏర్పాటు చేసి భోజనాలు కూడా అక్కడే చేసేలా చూశారు. జిల్లాల్లో పనిచేస్తున్న దాదాపు వందమంది హైదరాబాద్బస్భవన్లో లేఖలివ్వటం విశేషం. కార్మికులు భయపడొద్దు: అశ్వత్థామరెడ్డి కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఆర్టీసీని ప్రైవేటీకరించడం సాధ్యం కాదని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టంచేశారు. మంగళవారం హైదరాబాద్‌లో రాజకీయ పక్షాలతో సమావేశమైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రకటనలు చూసి భయాందోళనకు గురికావద్దని కార్మికులకు సూచించారు. కోర్టులో సాగుతున్న న్యాయపోరాటాన్ని బలహీన పరచడానికి ముఖ్యమంత్రి వేస్తున్న ఎత్తుగడలనే సంగతి గ్రహించాలని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం భేషజాలకు పోకుండా జేఏసీతో చర్చలు జరిపి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. ఈనెల 7న నిర్వహించే సడక్‌బంద్‌లో భాగంగా ఉపాధ్యాయ, ఉద్యోగులు పెన్‌డౌన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. 9న నిర్వహించే ఛలో ట్యాంక్‌బండ్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు కె.రాజిరెడ్డి, థామస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, వివిధ పార్టీల నేతలు జూలకంటి రంగారెడ్డి, డాక్టర్ చెరుకు సుధాకర్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరోసారి సీఎం సమీక్ష? ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ఎంతమంది విధుల్లో చేరారన్న లెక్కలకు సంబంధించి అందుబాటులో ఉన్న వివరాలను మంగళవారం రాత్రి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు అధికారులు అందజేశారు. వాటిని ఆయన సీఎంకు తెలియజేశారు. దీనిపై మరోసారి ముఖ్యమంత్రి స్పందించే అవకాశం ఉందని తెలుస్తోంది. 7న హైకోర్టులో వాదనలు ఉన్నందున, మరోసారి ముఖ్యమంత్రి సమీక్షిస్తారని చెబుతున్నారు. కార్మికుల స్పందన తక్కువగా ఉన్న నేపథ్యంలో, ప్రైవేట్ బస్సులకు పర్మిట్లు మరిన్ని ఎక్కువగా ఇచ్చే విషయంలో కీలక ప్రకటన ఉండనుందని చెబుతున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 72.46 శాతం బస్సులు నడిచినట్లు ఆర్టీసీ వెల్లడించింది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు 1937 అద్దె బస్సులను కలుపుకొని మొత్తం 6,484 బస్సులు నడిచాయని తెలిపింది. -
కార్మికులు చేరకుంటే ఆర్టీసీ ఉండదు
-
గడువు దాటితే వేటే!
సాక్షి, హైదరాబాద్: గత నెల రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరేందుకు మరో అవకాశం కల్పిస్తూ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన గడువు మంగళవారం అర్ధరాత్రితో ముగియనుంది. గడువులోగా చేరని కార్మి కులను ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో చేర్చుకోవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. విధుల్లో చేరడానికి గడువు ఇవ్వడం ద్వారా మంచి అవకాశం ఇచ్చినట్ల యిందని, దాన్ని ఉపయోగించుకుని ఉద్యోగాలు కాపాడుకోవడమా? విని యోగించుకోకుండా ఉద్యోగాలు కోల్పోయి, కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేయడమా? అనేది కార్మికులే తేల్చుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గడువులోగా కార్మికులు చేరకుంటే, మిగిలిన 5 వేల రూట్లలో ప్రైవేటు వాహ నాలకు పర్మిట్లు ఇవ్వాలని, అప్పుడు తెలంగాణలో ఇక ఆర్టీసీ ఉండదని మరో సారి ప్రభుత్వం హెచ్చరించింది. ఈ విషయాన్ని సీఎం కార్యా లయం ఓ ప్రకటనలో వెల్లడిం చింది. ఆర్టీసీ సమ్మె, సమ్మెపై హైకోర్టు విచారణ నేపథ్యంలో ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఆది వారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో సమీక్షించారు. సమ్మె విష యంలో, కోర్టు విచారణ సంద ర్భంగా అనుసరించాల్సిన వైఖ రిపై చర్చించారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. కార్మిక చట్టాలను, కేంద్ర రవాణా చట్టాన్ని పరిశీలించారు. కార్మికులు ఎవరినీ బద్నాం చేయలేరు.. ‘ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు, వారి కుటుంబాల భవిష్యత్తు ఇప్పుడు ఎవరి చేతుల్లో లేదు. ఉద్యోగాలు కాపాడుకోవడం కార్మికుల చేతుల్లోనే ఉంది. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమైనదని కార్మిక శాఖ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. అయినా ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించింది. విధుల్లో చేరడానికి 3 రోజుల గడువు ఇచ్చింది. ఆ అవకాశం వినియోగించుకోకుంటే అర్థం లేదు. ఇచ్చిన గడువు ప్రకారం కార్మికులు చేరకపోతే అది కార్మికుల ఇష్టం. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏ ఒక్క కార్మికుడినీ విధుల్లో చేర్చుకునే ప్రసక్తి లేదు. ఈ విషయంలో ప్రభుత్వం తన నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. తన నిర్ణయాన్ని అమలు చేసే విషయంలో కఠినంగానే ఉంటుంది. గడువులోగా కార్మికులు విధుల్లో చేరకుంటే, మిగిలిన 5 వేల రూట్లలో కూడా ప్రైవేటు వాహనాలకు ప్రభుత్వం పర్మిట్లు ఇస్తుంది. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆర్టీసీ రహిత రాష్ట్రంగా మారుతుంది. ఈ పరిస్థితికి ముమ్మాటికీ కార్మికులే కారణమవుతారు’అని సీఎం, మంత్రులు, అధికారులు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు సీఎంఓ తెలిపింది. సుప్రీంకు వెళ్తే అంతే.. ‘హైకోర్టులో జరుగుతున్న విచారణను చూపి, యూనియన్ నేతలు కార్మికులను మభ్యపెడుతున్నారు. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం సమ్మె విషయంలో కోర్టు ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలిచ్చే అవకాశం లేదు. కోర్టు తేల్చగలిగింది కూడా ఏమీ లేదు. హైకోర్టు తీర్పు మరోలా ఉంటే, ఇంతదూరం వచ్చిన తర్వాత ఆర్టీసీ గానీ, ప్రభుత్వం గానీ సుప్రీం కోర్టుకు వెళ్తుంది. ఒకవేళ కేసు సుప్రీంకోర్టుకు వెళ్తే, విచారణ మరింత ఆలస్యమవుతుంది. అది అంతంలేని పోరాటం అవుతుంది. కార్మికులకు ఒరిగేదేమీ ఉండదు’అని అభిప్రాయం వ్యక్తమైంది. సమీక్షలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ ఎస్కే జోషి, సీనియర్ అధికారులు నర్సింగ్‌రావు, రామకృష్ణరావు, సునీల్ శర్మ, సందీప్ సుల్తానియా, అరవింద్ కుమార్, లోకేశ్ కుమార్, అడ్వకేట్ జనరల్ శివానంద ప్రసాద్, అడిషనల్ ఏజీ రాంచందర్‌రావు పాల్గొన్నారు. -
విధుల్లో చేరే ఆర్టీసీ కార్మికులకు పోలీసుల భరోసా..
గచ్చిబౌలి: ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు విధుల్లో చేరే ఆర్టీసీ కార్మికులకు పూర్తి రక్షణ కల్పిస్తామని సైబరాబాద్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉంటే తాము పూర్తి భద్రత కల్పిస్తామన్నారు. అందుకు సిద్ధంగా ఉన్న ఉద్యోగులు నిర్భయంగా విధుల్లో చేరవచ్చారు. విధుల్లో చేరే ఆర్టీసీ ఉద్యోగులపై బెదిరింపులు, భౌతిక దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధుల్లో చేరే వారిని ఎవరైనా ఉద్ధేశపూర్వకంగా అడ్డగించినా ఘెరావ్ చేసినా, బెదిరింపులకు పాల్పడినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు. డయల్ 100, వాట్సాప్ నెంబర్ 949061744లలో ఫిర్యాదు చేయవచ్చన్నారు.– కమిషనర్ వీ.సీ.సజ్జనార్ భయపెడితే క్రిమినల్ కేసులు నేరేడ్మెట్: విధుల్లో చేరాలనుకునే ఆర్టీసీ కార్మికులకు పోలీసు భద్రత కల్పిస్తామని రాచకొండ కమిషనర్ æమహేష్ భగవత్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ పిలుపు నేపథ్యంలో కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల్లో ఎవరైనా నిర్భయంగా విధుల్లో చేరవచ్చన్నారు. విధుల్లో చేరే కార్మికులను ఎవరైనా భయపెట్టినా, ఇబ్బందులకు గురి చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిచారు.ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల విధులకు ఆటంకం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం చట్టప్రకారం నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవని సీపీ పేర్కొన్నారు.–రాచకొండ సీపీ, మహేష్‌భగవత్ అన్ని డిపోల వద్ద బందోబస్తు.. ముఖ్యమంత్రి పిలుపు మేరకు విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్న ఆర్టీసీ సిబ్బందికి అవసరమైన పూర్తి భద్ర త కల్పిస్తాం. అది మా బాధ్యతగా భావిస్తూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ప్రతి డిపో వద్ద అవసరమైన బందోబస్తు ఉంటుంది. విధులను అడ్డుకోవడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలనుకునేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆస్తులకు నష్టం కలిగించినా, ఉద్యోగులను అడ్డుకున్నా అరెస్టు చేస్తాం. –అంజనీకుమార్,నగర పోలీసు కమిషనర్ -
మరో ఆర్టీసీ కార్మికుడు మృతి
-
మాది చట్టబద్ధమైన ఉద్యమం
-
విధుల్లో చేరం.. సమ్మె ఆపం
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆర్టీసీ కార్మికులను బెదిరించే ధోరణి మానేసి ఇప్పటికైనా చర్చలకు సిద్ధం కావాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పేర్కొంది. చర్చలకు ఆహ్వానిస్తే ఏయే డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరిస్తుందో, ఏయే డిమాండ్ల విషయంలో జేఏసీ పట్టువిడుపులను ప్రదర్శిస్తుందో స్పష్టమవుతుందని, అది ఆర్టీసీ సమ్మెకు పరిష్కారంగా మారుతుందని పేర్కొంది. ఈ నెల ఐదో తేదీ అర్ధరాత్రిలోపు కార్మికులు విధుల్లోకి రావాలని, రాని వారికి ఇక ఆర్టీసీతో సంబంధం ఉండదన్న ముఖ్య మంత్రి తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ డెడ్‌లైన్‌ను కార్మికులు పట్టించుకోరని తేల్చిచెప్పింది. తమ డిమాండ్లకు పరిష్కారం రానంతవరకు సమ్మెను ఆపబోమని స్పష్టం చేసింది. ఆర్టీసీలో 5,100 మార్గాలను ప్రైవేట్‌కు కేటాయిం చటం, ఐదో తేదీ నాటికి విధుల్లో చేరని కార్మికులను ఇక తీసుకోబోమంటూ డెడ్‌లైన్ విధింపు, ఐదు వేల బస్సులకే ఆర్టీసీ పరిమితం... తదితర విషయాలపై శనివారం కేసీఆర్ ప్రకటన చేసిన నేపథ్యంలో, ఆర్టీసీ జేఏసీ ఆదివారం ఉదయం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. అనంతరం జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో–కన్వీనర్ రాజి రెడ్డి, సుధ తదితరులు మీడియాతో మాట్లాడారు. తాము ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లపై చర్చలకు సిద్ధమై, వాటికి పరిష్కార మార్గాలు చూపనంతవరకు సమ్మెను ఆపబోమని నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు. ఆర్టీసీని ప్రైవేటీకరించాలన్న రహస్య ఎజెండాను మనసులో పెట్టుకుని ముఖ్యమంత్రి కార్మికులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం బెదిరింపులకు కార్మికులెవరూ భయపడొద్దని, 49 వేల మంది ఉద్యోగాలు తొలగించే హక్కు ఎవరికీ లేదని వారు పేర్కొన్నారు. ఇప్పటికే ఖరారు చేసిన సమ్మె కార్యాచరణ అలాగే కొనసాగుతుందన్నారు. ఆర్టీసీ కార్మికులను బిడ్డలుగా భావిస్తున్నానని అన్నందుకు సీఎంకు ధన్యవాదాలు చెబుతున్నామని, కానీ ఆయన ఒకవైపు బిడ్డలు అంటూనే మరోవైపు కార్మికులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఏదో ఓ కమిటీ వేసి తమ డిమాండ్లపై చర్చించాలని పేర్కొన్నారు. మేం అన్ని డిమాండ్లపై పట్టుపట్టి కూర్చోమని, చర్చల్లో పట్టువిడుపులకు అవకాశం ఉంటుందన్నారు. తమది సీఎం చెబుతున్నట్లుగా చట్ట విరుద్ధ సమ్మె కాదని, చట్టబద్ధమైందేనని పునరుద్ఘాటించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో లీగల్ లేదు ఇల్లీగల్ లేదు, సమ్మె సమ్మెనే అన్న కేసీఆర్, తెలంగాణ వచ్చాక సమ్మె విషయంలో మాటమార్చడం సబబు కాదన్నారు. ఆర్టీసీకి బకాయిలు లేవు అనటం కూడా సరికాదని, దానిపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తే నిజాలు వెలుగు చూస్తాయన్నారు. 23 వేల మందికి కూర్చోబెట్టి జీతాలిస్తారా?.. కేవలం 5 వేల బస్సులే ఆర్టీసీలో ఉంటాయన్న ముఖ్యమంత్రి లెక్కల ప్రకారం 28 వేల మంది కార్మికులు సరిపోతారని, మరి మిగిలిన 23 వేల మందికి పని ఉండదని, వారిని కూర్చోబెట్టి జీతాలిస్తారా అని ప్రశ్నించారు. 97 డిపోలకు గాను 48 డిపోలే సరిపోతాయని, మిగిలిన డిపోల డీఎంల పరిస్థితి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా డీఎంల నుంచి ఈడీల వరకు బయటకొచ్చి తమతో కలసి సమ్మె చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం రిజర్వేషన్ రోస్టర్ అమలు ఆర్టీసీలో పక్కాగా జరుగుతోందని, సగం రూట్లను ప్రైవేటీకరించాక వచ్చే ప్రైవేటు సంస్థలు వాటిని అమలు చేస్తాయా అని ప్రశ్నించారు. అప్పుడు రిజర్వేషన్ల పద్ధతికే విఘాతం కలుగుతుందన్నారు. యూనియన్ల నుంచి కార్మికులను దూరం చేసేలా ముఖ్యమంత్రి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, దాన్ని కార్మికులు గుర్తించాలని కోరారు. ఆర్టీసీలో రూ.650 కోట్ల డిప్రిసియేషన్ ఫండ్ ఉంటుందని, అది ఎక్కడుందో తేల్చి దానితో కొత్త బస్సులు కొనాలని సూచించారు. ఆర్టీసీ నష్టాలు కేంద్రం భరించే అవకాశం ఉండదన్నారు. జీతాలివ్వకుంటే పరిస్థితేంటి?... కార్మికులు బేషరతుగా విధుల్లో చేరాలంటున్నారని, రేపు జీతాలకు డబ్బులేదు ఇవ్వలేమంటే అప్పుడు వారు ఏం చేయాలని ప్రశ్నించారు. నష్టాలొచ్చే రూట్లను ప్రైవేట్ ఆపరేటర్లకు ఇస్తామని సీఎం అన్నారని, కానీ నష్టాలొచ్చే రూట్లు తీసుకునేందుకు వారు పిచ్చివాళ్లా అని ప్రశ్నించారు. అందుకే కార్మికులు వాస్తవాలు గుర్తించి సమస్య పరిష్కారమయ్యేవరకు సమ్మెలో ఉండాలని, ఆత్మద్రోహం చేసుకుని పిరికివారిలా పారిపోవద్దని సూచించారు. గతంలో ముఖ్యమంత్రి ఇలాగే డెడ్లైన్లు విధించారని, ఎవరూ చలించలేదని, ఇప్పుడు కూడా ఒకటి రెండు శాతం మంది విధుల్లో చేరినా మిగతావారు సమ్మెలోనే ఉంటారన్నారు. చాలా ప్రాంతాల నుంచి కార్మికులు తమకు ఫోన్ చేసి సమ్మెను కొనసాగించాలని పేర్కొంటున్నారని, ఆపితే ఖబడ్దార్ అంటూ హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. రోడ్డు దిగ్బంధం వాయిదా ఐదో తేదీన రోడ్డు దిగ్బంధం కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నామని, ఆ రోజు న్యాయస్థానాలకు సంబంధించిన పోస్టుల భర్తీ పరీక్ష ఉన్నందున, అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.