3 నుంచి పింఛన్ల పంపిణీ.. బ్యాంకులకు వరుస సెలవులే కారణం

Distribution of pensions from 3rd April Due To Bank Holidays - Sakshi

ఆర్థిక సంవత్సరం ముగింపు, బ్యాంకులకు వరుస సెలవులే కారణం

అన్ని జిల్లాల అధికారులకు వెల్లడించిన సెర్ప్‌

ఎన్నికల కోడ్‌తో పింఛన్ల పంపిణీకి కొత్త మార్గదర్శకాలు జారీ

సాక్షి, అమరావతి: ప్రతి నెలా ఒకటినే మొదలవు­తున్న పింఛన్ల పంపిణీ ఈసారి ఏప్రిల్‌ 3 నుంచి కొనసాగనుంది. ఆర్థిక సంవత్సరం ముగింపుతో­పాటు బ్యాంకులకు వరుస సెలవులు రావడమే ఇందుకు కారణం. ఈ మేరకు ఇప్పటికే గ్రామీణ పేద­రిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) అధికారులు అన్ని జిల్లాల డీఆర్‌డీఏ పీడీలకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. మార్చి 31న ఆదివారం, ఏప్రిల్‌ 1న ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా దేశవ్యా­ప్తంగా బ్యాంకులకు సెల­వులు వచ్చాయి.

దీంతో పింఛను నగదును ఏప్రిల్‌ 2న డ్రా చేసుకోవడానికి సచివాలయాల సిబ్బందికి ప్రభుత్వం వెసులు­బాటు కల్పించింది. మూడో తేదీ నుంచి పంపిణీ చేయడానికి అన్ని ఏర్పా­ట్లు చేసుకోవాలని ఇప్పటికే అధికారులకు సమాచార­మిచ్చింది. గతేడాది కూడా ఏప్రిల్‌ 3 నుంచే పింఛన్ల పంపిణీ కొనసాగినట్టు అధికా­రులు గుర్తు చేశారు. కాగా, ఎన్నికల నేపథ్యంలో కోడ్‌ అమల్లో ఉన్న­ప్పటికీ యధావిధిగా వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్‌ అందిస్తామని తెలిపారు. 

ఎన్నికల కోడ్‌తో ప్రత్యేక మార్గదర్శకాలు..
ఎన్ని­­కల కోడ్‌ అమల్లో ఉండటంతో పింఛన్ల పంపిణీకి సెర్ప్‌ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం అన్ని జిల్లాల పీడీలు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లకు ఆదే­శాలు ఇచ్చింది. ఎన్నికల కోడ్‌తో నిర్దేశిత పరి­మితికి మించి వ్యక్తులు నగదు తీసుకు­వెళ్లకూ­డద­ని ఆంక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పింఛన్ల పంపిణీలో పాల్గొనే సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు బ్యాంకుల నుంచి డ్రా చేసిన నగదుకు సంబంధించిన రశీదులను తప్పనిసరిగా తమ వద్దే ఉంచుకోవాలని సెర్ప్‌ అధికారులు సూచించారు.

పంపిణీ కార్యక్రమంలో పాల్గొనే వారి వివరాలను ఎంపీడీవోలు/మున్సిపల్‌ కమిష­నర్లు సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికా­రులు (ఆర్వో)లకు ముందుగానే సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. సచివాలయాల పేర్లు, నగదు వివ­రా­లతో కూడిన ధ్రువీకరణ పత్రాలు కూడా సంబంధిత సిబ్బంది కలిగి ఉండాలన్నారు. ఈ మేర­కు ఆయా ధ్రువీకరణ పత్రాలను నిర్దేశిత ఫార్మాట్‌­లో ఎంపీడీవోలు/మున్సిపల్‌ కమిషనర్ల లాగిన్‌లో అందు­బాటులో ఉంచుతామన్నారు. పింఛన్లు పంపిణీ స­మ­యంలో ప్రచారం చేయడానికి, ఫొటో­లు, వీడియోలు తీయడానికి అనుమతి లేదన్నారు.  

Election 2024

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top