లోక కల్యాణమే హితంగా...

Sakshi Guest Column On Ramakrishna Math Swami Smarananda

నివాళి 

రామకృష్ణ మిషన్‌ అధ్యక్షులు, అత్యంత సీనియర్‌ సాధువు అయిన స్వామి స్మరణానంద తన 94వ యేట మార్చ్‌ 26న పరమపదించడం చాలా మందిని విషాదంలోకి నెట్టింది. సంపూర్ణ జీవితం గడిపిన స్మరణానంద... రామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామి వివేకానంద ఆలోచనల వ్యాప్తికి తమ జీవితాన్ని అంకితం చేశారు. భారతదేశ ఆధ్యాత్మిక స్పృహను పెంచుతూనే... విద్యాభివృద్ధికీ, గ్రామీణాభివృద్ధికీ రామకృష్ణ మిషన్‌ చేస్తున్న కృషి మనందరికీ స్ఫూర్తిదాయకం. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో అనేక దశలలో, మన మాతృభూమిని ఎందరో సాధువులు ఆశీర్వదించారు. ‘ఆత్మనో మోక్షార్థం జగద్ధితాయ చ’ అనే సిద్ధాంతానికి స్వామి స్మరణానంద జీవితం చెరగని ఉదాహరణ. 

లోక్‌ సభ ఎన్నికల ఘన పండుగ హడావిడిలో ఓ వార్త మనసులో  కొన్ని క్షణాల పాటు అలజడిని సృష్టించింది. భారత దేశ ఆధ్యాత్మిక చింతనలో అగ్ర గణ్యులైన శ్రీమత్‌ స్వామి స్మరణానంద జీ మహారాజ్‌ గతించడం (మార్చ్‌ 26) వ్యక్తిగత నష్టం లాంటిది. కొన్ని సంవత్సరాల క్రితం, స్వామి ఆత్మస్థానంద జీ మరణం, ఇప్పుడు స్వామి స్మరణా నంద శాశ్వతంగా నిష్క్రమించడం చాలా మందిని విషాదంలోకి నెట్టింది. కోట్లాది మంది భక్తులు, సాధువులు, రామకృష్ణ మఠం, మిషన్‌ అనుచరుల మాదిరిగానే నా హృదయం కూడా బాధగా ఉంది.

ఈ నెల ప్రారంభంలో బెంగాల్‌ పర్యటనకు వెళ్లినప్పుడు స్వామి స్మరణానంద జీ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఆస్పత్రికి వెళ్లాను. స్వామి ఆత్మస్థానంద జీ మాదిరిగానే, స్వామి స్మరణానంద జీ... ఆచార్య రామకృష్ణ పరమహంస, మాతా శారద మరియు స్వామి వివేకానంద ఆలోచనల ప్రపంచవ్యాప్తికి తమ జీవితాన్ని అంకితం చేశారు. ఈ వ్యాసం రాస్తున్నప్పుడు ఆయనతో జరిపిన సమావేశాలు, ఆయనతో నా సంభాషణలు, ఆ జ్ఞాపకాలు నా మదిలో సజీవంగా కదలాడుతున్నాయి.

2020 జనవరిలో బేలూరు మఠంలో ఉన్న సమయంలో స్వామి వివేకానంద గదిలో కూర్చొని ధ్యానం చేశాను. ఆ పర్యటనలో నేను స్వామి స్మరణానందతో స్వామి ఆత్మస్థానంద గురించి చాలాసేపు మాట్లాడాను.

రామకృష్ణ మిషన్‌తో, బేలూరు మఠంతో నాకు ఎంత సన్నిహిత సంబంధం ఉందో మీకు  తెలుసు! ఒక ఆధ్యాత్మిక సాధకుడిగా, గత ఐదు దశాబ్దాలుగా నేను వివిధ సాధువులను, మహాత్ములను కలిశాను, అనేక ప్రదేశాలకు వెళ్ళాను. రామకృష్ణ మఠంలో కూడా  ఆధ్యాత్మికతకు తమ జీవితాలను అంకితం చేసిన సాధువులతో నాకు పరిచయం ఏర్పడింది.

వారిలో స్వామి ఆత్మస్థానంద, స్వామి స్మరణానంద వంటి ప్రముఖులు ఉన్నారు. వారి పవిత్రమైన ఆలోచనలు, జ్ఞానం నా మనస్సుకు నిరంతర సంతృప్తినిచ్చాయి. జీవితంలో అత్యంత ముఖ్యమైన కాలంలో, అటువంటి సాధువులు నాకు ‘ప్రజా సేవయే దేవుని సేవ’ అనే నిజమైన సూత్రాన్ని బోధించారు.

‘ఆత్మనో మోక్షార్థం జగద్ధితాయ చ’ (స్వీయ విముక్తి కోసం మరియు లోక కల్యాణం కోసం) అనే రామకృష్ణ మిషన్‌ సిద్ధాంతానికి స్వామి ఆత్మస్థానంద, స్వామి స్మరణానంద జీవితాలు చెరగని ఉదాహరణ.

విద్యాభివృద్ధికీ, గ్రామీణాభివృద్ధికీ రామకృష్ణ మిషన్‌ చేస్తున్న కృషి మనందరికీ స్ఫూర్తిదాయకం. భారతదేశ ఆధ్యాత్మిక స్పృహ, విద్యా సాధికారత, మానవతా సేవ సంకల్పానికి రామకృష్ణ మిషన్‌ పని చేస్తోంది. 1978లో బెంగాల్‌ను వరదలు ముంచెత్తినప్పుడు రామకృష్ణ మిషన్‌ తన నిస్వార్థ సేవతో అందరి çహృదయాలను గెలుచుకుంది.

2001లో కచ్‌ భూకంపం వచ్చినప్పుడు విపత్తు నిర్వహణకు రామకృష్ణ మిషన్‌ అన్ని విధాలుగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని నాకు ఫోన్‌ చేసి చెప్పిన మొదటి వ్యక్తుల్లో స్వామి ఆత్మస్థానంద ఒకరు. ఆయన సూచనల మేరకు రామకృష్ణ మిషన్‌ భూకంప విపత్కర సమయంలో ప్రజలకు ఎంతో సాయం చేసింది.

కొన్నేళ్లుగా స్వామి ఆత్మస్థానంద, స్వామి స్మరణానంద వివిధ పదవుల్లో ఉంటూ సామాజిక సాధికారతకు పెద్దపీట వేశారు. ఆధునిక విద్య, నైపుణ్యం, మహిళా సాధికారత పట్ల ఇలాంటి మహానుభావులు ఎంత గంభీరంగా ఉండేవారో వీరి జీవితాలు తెలిసిన వారికి తప్పకుండా గుర్తుండే ఉంటుంది.

స్వామి ఆత్మస్థానందజీ మహోన్నత వ్యక్తిత్వంలోని ప్రత్యేకత నన్ను బాగా ఆకట్టుకుంది. ప్రతి సంస్కృతి, ప్రతి సంప్రదాయం పట్ల ఆయనకున్న గౌరవం, ప్రేమ దీనికి కారణం. ఆయన భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో చాలాకాలం గడిపారు. నిరంతరం ప్రయాణించే వారు. గుజరాత్‌లో ఉంటూ గుజరాతీ మాట్లాడటం నేర్చుకున్నారు. నాతో కూడా ఆయన గుజరాతీలోనే మాట్లాడేవారు. ఆయన గుజరాతీ మాట్లాడుతుంటే వినడం నాకు బాగుండేది.

భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో అనేక దశలలో, మన మాతృభూమిని స్వామి ఆత్మస్థానంద, స్వామి స్మరణానంద వంటి ఎందరో సాధువులు ఆశీర్వదించారు. వారు సామాజిక మార్పు గురించి మనకు కొత్త చైతన్యాన్ని అందించారు. సమాజ శ్రేయస్సు కోసం కలసికట్టుగా పనిచేయాలని ఈ సాధువులు మనకు దీక్షను అందించారు. ఈ సూత్రాలు ఎప్పటికీ శాశ్వతమైనవి. రాబోయే కాలంలో ఈ ఆలోచనలు అభివృద్ధి చెందిన భారతదేశానికి, అమృత్‌ కాలానికి సంకల్పశక్తిగా మారతాయి.

అలాంటి మహనీయులకు యావత్‌ దేశం తరఫున మరోసారి నివాళులర్పిస్తున్నాను. రామకృష్ణ మిషన్‌తో సంబంధం ఉన్నవారంతా ఆయన చూపిన మార్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం ఉంది.
        ఓం శాంతి. 

నరేంద్ర మోదీ
భారత ప్రధాని

Election 2024

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top