ఎలాన్‌ మస్క్‌ ఔదార్యం

Elon Musk support to paediatrician Kulvinder Kaur Gill - Sakshi

కెనడాలో భారత సంతతి వైద్యురాలికి సాయం 

ఆమె చెల్లించాల్సిన 3 లక్షల డాలర్ల జరిమానా చెల్లించేందుకు సంసిద్ధత   

టొరంటో:  కెనడాలో న్యాయపరమైన చిక్కుల్లో ఇరుకున్న భారత సంతతి వైద్యురాలికి సహాయం అందించేందుకు ఎక్స్‌(ట్విట్టర్‌) వ్యవస్థాపకుడు, టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థల సీఈఓ, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ముందుకొచ్చారు. ఆమె చెల్లించాల్సిన 3 లక్షల డాలర్లు(రూ.2.50 కోట్లు) జరిమానా చెల్లించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. భారత సంతతి వైద్యురాలు కుల్విందర్‌ కౌర్‌ గిల్‌ కెనడానలోని గ్రేటర్‌ టోరంటోలో గత పదేళ్లుగా చిన్నపిల్లల వైద్యురాలిగా పని చేస్తున్నారు.

పిడియాట్రిక్స్, అలర్జీ, ఇమ్యూనాలజీలో పోస్ట్రుగాడ్యుయేట్‌ ట్రైనింగ్‌ పూర్తిచేశారు. స్పెషలిస్టు డాక్టర్‌గా గుర్తింపు పొందారు. పేద ప్రజలకు, వలసదారులకు తన సేవలు అందిస్తుంటారు. 2020లో కెనడాలో కోవిడ్‌–19 మహమ్మారి ఉధృతంగా వ్యాప్తి చెందుతుండడంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. ఈ లాక్‌డౌన్‌ను కుల్విందర్‌ కౌర్‌ గిల్‌ వ్యతిరేకించారు. ప్రజలంతా తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవాలన్న నిబంధనను కూడా తప్పుపట్టారు.

లాక్‌డౌన్, వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ట్విట్టర్‌(ఇప్పుడు ఎక్స్‌) ధైర్యంగా పోస్టులు పెట్టారు. దీనిపై కెనడా మీడియా అభ్యంతరం వ్యక్తం చేసింది. చివరకు ఆమెపై కాలేజ్‌ ఆఫ్‌ ఫిజిషియన్స్, సర్జన్స్‌ ఆఫ్‌ అంటారియో విచారణ ప్రారంభించింది. క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు చేసింది. దీనిపై కుల్విందర్‌ కౌర్‌ గిల్‌ న్యాయ పోరాటానికి దిగారు. కానీ, దురదృష్టం వెక్కిరించింది. 1.2 మిలియన్‌ డాలర్ల జరిమానా చెల్లించాలని 2022 అక్టోబర్‌లో కోర్డు ఆమెను ఆదేశించింది.

పలు విన్నపాల తర్వాత జరిమానాను 3 లక్షల డాలర్లుగా ఖరారు చేస్తూ గత నెలలో తీర్పు వెలువరించింది. జరిమానా చెల్లించడానికి గడువు కూడా ఎక్కువగా లేదు. తన వద్ద అంత సొమ్ము లేకపోవడంతో కుల్విందర్‌ కౌర్‌ ప్రజల నుంచి విరాళాలు సేకరించడం మొదలుపెట్టింది. దాదాపు సగం నిధులు సేకరించింది. జరిమానా చెల్లించడానికి మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంది. ఇంతలో ఈ విషయంలో తెలిసిన ఎలాన్‌ మస్క్‌ వెంటనే స్పందించారు. మొత్తం 3 లక్షల డాలర్ల జరిమానా తానే చెల్లిస్తానని ప్రకటించారు. ఆయనకు కుల్విందర్‌ కౌర్‌ గిల్‌ ‘ఎక్స్‌’లో కృతజ్ఞతలు తెలియజేశారు.   
కుల్విందర్‌ కౌర్‌ గిల్‌
ఎలాన్‌ మస్క్‌

Election 2024

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top