Jayalalithaa Birth Anniversary: నటి నుంచి సీఎం వరకూ..

Jayalalithaa Birth Anniversary Story - Sakshi

పలువురు మహిళలు దేశ రాజకీయాల్లో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. చరిత్రను పరిశీలిస్తే.. సరోజినీ నాయుడు, ఇందిరా గాంధీ, సుచేతా కృపలానీ, సుష్మా స్వరాజ్, ప్రతిభా పాటిల్, మమతా బెనర్జీ, మాయావతి, ప్రియాంక గాంధీ సహా ఎందరో మహిళల పేర్లు దేశ ప్రజల నోళ్లలో మెదులుతాయి. 

దేశ రాజకీయాల్లో సత్తా చాటుతున్న నటీమణుల విషయానికొస్తే స్మృతి ఇరానీ, నుస్రత్ జహాన్, జయప్రద హేమమాలిని తదితరుల పేర్లు వినవస్తాయి. అయితే అమోఘమైన ప్రజాదరణ పొందిన మహిళా నేతల జాబితాను పరిశీలిస్తే ఒక నాటి నటీమణి, ఆ తరువాత తమిళనాట సీఎంగా సత్తా చాటిన జయలలిత తప్పుకుండా గుర్తుకువస్తారు. తమిళనాడు ప్రజలు జయలలితను ‘అమ్మా’ అని పిలిచేంతటి ఆదరణ ఆమె సొంతం చేసుకున్నారు. ఈరోజు(ఫిబ్రవరి 24) దివంగత సీఎం జయలలిత జన్మదినం. 1948 ఫిబ్రవరి 24న జన్మించిన జయలలిత జీవితానికి సంబంధించిన ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

కుటుంబ నేపధ్యం
జయలలిత.. ప్రస్తుతం కర్ణాటకలో భాగంగా ఉన్న మైసూర్‌లోని మాండ్య జిల్లాలోని పాండవపురా తాలూకాలోని మేలుర్‌కోట్ గ్రామంలో అయ్యర్ కుటుంబంలో జన్మించారు. జయలలిత అసలు పేరు ‘కోమలవల్లి’. ఆమె తండ్రి పేరు జయరామ్. ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. ఆమె తల్లి పేరు వేదవల్లి. జయలలిత తల్లి వేదవల్లి  ప్రముఖ నటిగా పేరు సంపాదించారు. బాల్యంలో జయలలితకు సినిమాలపై అంతగా ఆసక్తి లేదు. ఆమె ఎప్పుడూ నటి కావాలని కోరుకోలేదు. బలవంతంగా ఆమె సినీ రంగంలోకి వచ్చారని చెబుతుంటారు. 

సినీ జీవితం
చదువులో జయలలిత ఎంతో ప్రతిభ కనబరిచారు. జయలలిత తండ్రి ఆమెను లాయర్‌గా చూడాలనుకున్నారు. అయితే ఆమె తల్లి.. జయలలితను చిన్నతనంలోనే సినీ రంగంలోకి తీసుకువచ్చారు. జయలలిత కేవలం తన 15 ఏళ్ల వయసులోనే అడల్ట్ సినిమాలో నటించారు. ఆమె సినీ జీవితం అక్కడి నుంచే మొదలైంది. ఆమె సినిమాల్లో తన అద్భుత ప్రతిభను ప్రదర్శించారు. జయలలిత తన కెరీర్‌లో మొత్తం 85 సినిమాలు చేయగా, అందులో 80 సినిమాలు అమోఘ విజయం సాధించాయి. సినిమాల్లో స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించిన తొలి నటిగా ఆమె గుర్తింపు పొందారు. 

రాజకీయ ప్రయాణం
నాటి రాజకీయ నేత ఎంజీ రామచంద్రన్ నటి జయలలితను సినిమాల నుంచి రాజకీయాల్లోకి  తీసుకువచ్చారు. ఎంజీఆర్‌, జయలలిత  ప్రేమించుకున్నారని కానీ పెళ్లి చేసుకోలేదని, పైగా వారు తమ బంధాన్ని ఏనాడూ బహిరంగపరచలేదని చెబుతుంటారు. జయలలిత 1982లో ఎంజీ రామచంద్రన్‌తో పాటు అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నా డీఎంకే)లో సభ్యురాలయ్యారు. నాటి నుంచే ఆమె రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1984 నుండి 1989 వరకు జయలలిత తమిళనాడు నుండి రాజ్యసభ సభ్యురాలిగా వ్యవహరించారు. ఎంజీఆర్ మరణానంతరం అన్నాడీఎంకే పార్టీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆమె తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు.

సాధించిన విజయాలు
తమిళనాడులో జయలలిత ప్రజాదరణ పొందిన నటిగా మాత్రమే కాకుండా మహిళా నేతగా, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందారు. ఆరు సార్లు తమిళనాడు ముఖ్యమంత్రి కావడం ఆమె రాజకీయాల్లో సాధించిన అమోఘ విజయంగా చెబుతుంటారు. భ్రూణహత్యల నివారణకు ఆమె ‘క్రెడిల్ టు బేబీ స్కీమ్’ను ప్రారంభించారు. ‘అమ్మ’ బ్రాండ్ ప్రారంభించి, ఈ పేరుతో దాదాపు 18 ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేశారు. అమ్మ పేరుతో అమలయిన ఈ పథకాలు పూర్తిగా ఉచితం. లేదా భారీగా రాయితీలు అందించేవి. పట్టణ పేదలకు ఒక్క రూపాయికే ఆహారం అందించేందుకు ఆమె ‘అమ్మ క్యాంటీన్‌’ను ప్రారంభించారు. జయలలిత తన 68వ ఏట 2016 డిసెంబర్ 5న కన్నుమూశారు.

whatsapp channel

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top