Virat Kohli: తెలివి తక్కువ వాళ్ల జోక్యం వద్దు.. కోహ్లి విషయంలో పట్టుబట్టిన రోహిత్‌!

Rohit Sharma Said we need Virat Kohli at any cost for T20 WC: Kirti Azad - Sakshi

టీ20 ప్రపంచకప్‌-2024 భారత జట్టులో విరాట్‌ కోహ్లికి స్థానం ఉండబోదన్న వార్తలపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ కీర్తి ఆజాద్‌ ఘాటుగా స్పందించాడు. జట్టు ఎంపిక విషయంలో తెలివితక్కువ వాళ్లు జో​క్యం చేసుకోకపోతేనే బాగుంటుందని హితవు పలికాడు.

ఎవరేమనుకున్నా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాత్రం.. కోహ్లి వరల్డ్‌కప్‌ జట్టులో ఉండాల్సిందేనని పట్టుబట్టినట్లు కీర్తి ఆజాద్‌ వెల్లడించాడు. కాగా యువ ఆటగాళ్లకు పెద్ద పీట వేసే క్రమంలో విరాట్‌ కోహ్లిని పక్కనపెట్టాలని టీమిండియా సెలక్టర్లు నిర్ణయించుకున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.

బీసీసీఐ కార్యదర్శి జై షా ఆదేశాల మేరకు చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ మేరకు గత వారం టెలిగ్రాఫ్‌ కథనం ప్రచురించగా.. బీసీసీఐ తీరుపై టీమిండియా, కోహ్లి అభిమానులు మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు నిర్ణయాలతో ఐసీసీ ఈవెంట్లో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందంటూ విమర్శలు గుప్పించారు. 

ఈ నేపథ్యంలో 1983 వరల్డ్‌కప్‌ విజేత జట్టులోని సభ్యుడు కీర్తి ఆజాద్‌ ‘ఎక్స్‌’(ట్విటర్‌) వేదికగా తన కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘జై షా సెలక్టర్‌ కాదు కదా! కోహ్లికి టీ20 జట్టులో చోటు ఇవ్వకుండా అతడెందుకు అజిత్‌ అగార్కర్‌ను.. మిగతా సెలక్టర్లను కూడా ఇందుకు ఒప్పించమని అడుగుతాడు?

జట్టు ఎంపిక కోసం మార్చి 15 వరకు సమయం ఇచ్చారట. సోర్సెస్‌ చెప్పినవే నిజమనుకుంటే.. కోహ్లి విషయంలో అజిత్‌ అగార్కర్‌ మిగతా సెలక్టర్లతో పాటు తనను తాను కూడా కన్విన్స్‌ చేయలేకపోయాడు. 

జై షా రోహిత్‌ శర్మను ఈ విషయం గురించి అడుగగా.. ఎట్టిపరిస్థితుల్లోనూ కోహ్లి జట్టులో ఉండాల్సిందే అని రోహిత్‌ స్పష్టం చేశాడు. ఈసారి టీ20 వరల్డ్‌కప్‌లో విరాట్‌ కోహ్లి కచ్చితంగా ఆడతాడు. జట్టు ఎంపిక ప్రకటన కంటే ముందే అధికారికంగా ఈ ప్రకటన వెలువడుతుంది.

జట్టు ఎంపిక ప్రక్రియ విషయంలో తెలివితక్కువ వాళ్లు జోక్యం చేసుకోకూడదు’’ అని కీర్తి ఆజాద్‌ పేర్కొన్నాడు. కాగా జూన్‌లో వెస్టిండీస్‌-అమెరికా వేదికగా ఆరంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌-2024లో రోహిత్‌ శర్మనే టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే..  కుమారుడు అకాయ్‌ జననం(ఫిబ్రవరి 15) నేపథ్యంలో విరాట్‌ కోహ్లి లండన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు దూరమైన అతడు.. ఇటీవలే స్వదేశానికి తిరిగి వచ్చాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున కోహ్లి ఐపీఎల్‌-2024 బరిలో దిగనున్నాడు. గత సీజన్‌లో ఈ రన్‌మెషీన్‌ 14 మ్యాచ్‌లు ఆడి 639 పరుగులు చేశాడు.

చదవండి: T20 WC: టీ20 జట్టు నుంచి అవుట్‌! వరల్డ్‌కప్‌లో నో ఛాన్స్‌!

Election 2024

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top