IPL 2024, MI VS DC: స్టబ్స్‌ పోరాటం పృధా.. ముంబై ఖాతాలో తొలి విజయం | Sakshi
Sakshi News home page

IPL 2024, MI VS DC: స్టబ్స్‌ పోరాటం పృధా.. ముంబై ఖాతాలో తొలి విజయం

Published Sun, Apr 7 2024 3:10 PM

IPL 2024: Mumbai Indians Vs Delhi Capitals Match Updates And Highlights - Sakshi

స్టబ్స్‌ పోరాటం పృధా.. ముంబై ఖాతాలో తొలి విజయం
ఢిల్లీతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 235 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబైను ట్రిస్టన్‌ స్టబ్స్‌ భయపెట్టాడు. స్టబ్స్‌ కేవలం 19 బంతుల్లోనే అర్దసెంచరీ పూర్తి చేసి ముంబై శిబిరంలో గుబులు పుట్టించాడు. అయితే లక్ష్యం పెద్దది కావడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు.

ఆఖరి ఓవర్‌లో ఢిల్లీ గెలుపుకు 34 పరుగులు అవసరం కాగా.. కొయెట్జీ అద్భుతంగా బౌలింగ్‌ చేసి కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీని గెలిపించేందుకు స్టబ్స్‌ చివరి వరకు ప్రయత్నించి 25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. స్టబ్స్‌కు ముందు పృథ్వీ షా (40 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా రాణించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. కొయెట్జీ 4, బుమ్రా 2, షెపర్డ్‌ ఓ వికెట్‌ తీశారు. 

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై.. రోహిత్‌ శర్మ (27 బంతుల్లో 49; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్‌ కిషన్‌ (23 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా (33 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్‌), టిమ్‌ డేవిడ్‌ (21 బంతుల్లో 45 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రొమారియో షెపర్డ్‌ (10 బంతుల్లో 39 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. నోర్జే వేసిన ఆఖరి ఓవర్‌లో షెపర్డ్‌ విధ్వంసం సృష్టించాడు. 4 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేశాడు.

మరో ఓటమి దిశగా ఢిల్లీ.. పంత్‌ ఔట్‌
ప్రస్తుత సీజన్‌లో ఢిల్లీ మరో ఓటమి దిశగా పయనిస్తుంది. 16వ ఓవర్‌ చివరి బంతికి రిషబ్‌ పంత్‌ (1) ఔటయ్యాడు. ఢిల్లీ గెలుపుకు చాలా  దూరంలో ఉంది. 

మరో వికెట్‌ తీసిన బుమ్రా
15వ ఓవర్‌ ఆఖరి బంతికి అభిషేక్‌ పోరెల్‌ను (41) బుమ్రా పెవిలియన్‌కు పంపించాడు. దీంతో ఢిల్లీ కష్టాల్లో పడింది. 15 ఓవర్ల అనంతరం ఢిల్లీ స్కోర్‌ 144/3గా ఉంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలవాలంటే 30 బంతుల్లో 91 పరుగులు చేయాల్సి ఉంది. ట్రిస్టన్‌  స్టబ్స్‌ (26), రిషబ్‌ పంత్‌ క్రీజ్‌లో ఉన్నారు. 

బుమ్రా సూపర్‌ యార్కర్‌.. పృథ్వీ షా క్లీన్‌ బౌల్డ్‌
11.5 ఓవర్‌: 110 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్‌లో పృథ్వీ షా క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. బుమ్రా వేసిన అద్భుతమైన యార్కర్‌కు షా వద్ద సమాధానం లేకుండా పోయింది. 12 ఓవర్లలో ఢిల్లీ స్కోర్‌ 2 వికెట్ల నష్టానికి 111 పరుగులుగా ఉంది. 

ధీటుగా బదులిస్తున్న ఢిల్లీ.. 10 ఓవర్లలోనే 100 పరుగులు
భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ముంబైకు ధీటుగా బదులిస్తుంది. ఢిల్లీ 10 ఓవరల్లోనే 100 పరుగుల మార్కును దాటింది. పృథ్వీ షా (38 బంతుల్లో 65; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) రెచ్చిపోయి ఆడుతున్నాడు. అభిషేక్‌ పోరెల్‌ (31) కూడా అడపాదడపా షాట్లు ఆడుతున్నాడు.

చితక్కొడుతున్న పృథ్వీ షా
భారీ లక్ష్య ఛేదనలో ఆదిలోనే వార్నర్‌ వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ.. పృథ్వీ షా చెలరేగి ఆడుతుండటంతో కోలుకుంటుంది. షా 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 46 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. అభిషేక్‌ పోరెల్‌ (12) అతనికి జతగా ఉన్నాడు. 8 ఓవర్ల అనంతరం ఢిల్లీ స్కోర్‌ 69/1గా ఉంది. ఆ జట్టు గెలవాలంటే 72 బంతుల్లో 166 పరుగులు చేయాల్సి ఉంది.

తొలి వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ.. వార్నర్‌ ఔట్‌
235 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ తొలి వికెట్‌ కోల్పోయింది. 22 పరుగుల స్కోర్‌ వద్ద డేవిడ్‌ వార్నర్‌ (10) ఔటయ్యాడు. షెపర్డ్‌ బౌలింగ్‌లో హార్దిక్‌కు క్యాచ్‌ ఇచ్చి వార్నర్‌ పెవిలియన్‌ బాటపట్టాడు. 4 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్‌ 24/1గా ఉంది. పృథ్వీ షా (13), అభిషేక్‌ పోరెల్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు.

రొమారియో షెపర్డ్‌ ఊచకోత.. ముంబై ఇండియన్స్‌ భారీ స్కోర్‌
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై.. రోహిత్‌ శర్మ (27 బంతుల్లో 49; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్‌ కిషన్‌ (23 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా (33 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్‌), టిమ్‌ డేవిడ్‌ (21 బంతుల్లో 45 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రొమారియో షెపర్డ్‌ (10 బంతుల్లో 39 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. నోర్జే వేసిన ఆఖరి ఓవర్‌లో షెపర్డ్‌ విధ్వంసం సృష్టించాడు. 4 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేశాడు. 

ఐదో వికెట్‌ డౌన్‌.. హార్దిక్‌ ఔట్‌
17.5వ ఓవర్‌: 181 పరుగుల వద్ద ముంబై ఐదో వికెట్‌ కోల్పోయింది. నోర్జే బౌలింగ్‌లో ఫ్రేసర్‌ క్యాచ్‌ పట్టడంతో హార్దిక్‌ పాండ్యా (39) ఔటయ్యాడు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన ముంబై
12.4 ఓవర్‌: 121 పరుగుల వద్ద ముంబై నాలుగో వికెట్‌ కోల్పోయింది. ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో అక్షర్‌ పటేల్‌కు క్యాచ్‌ ఇచ్చి  తిలక్‌ వర్మ (6) ఔటయ్యాడు. 13 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 123/4గా ఉంది. హార్దిక్‌ (19), టిమ్‌ డేవిడ్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు.

అక్షర్‌ సూపర్‌ క్యాచ్‌.. ఇషాన్‌ ఔట్‌
10.2 ఓవర్: అక్షర్‌ పటేల్‌ అద్భుతమైన రిటర్న్‌ క్యాచ్‌ పట్టడంతో ఇషాన్‌ కిషన్‌ (23 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పెవిలియన్‌ బాటపట్డాడు. దీనికి ముందు బంతిని ఇషాన్‌ సిక్సర్‌గా మలిచాడు. 10.2 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 111/3గా ఉంది. హార్దిక్‌కు (14) తిలక్ జత కలిశాడు.

10 ఓవర్లలో సెంచరీ పూర్తి చేసిన ముంబై
ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (21 బంతుల్లో 36; 4 ఫోర్లు, సిక్స్‌), హార్దిక్‌ పాండ్యా (10 బంతుల్లో 14; 2 ఫోర్లు) ధాటిగా ఆడుతుండటంతో ముంబై 10వ ఓవర్‌లోనే 100 పరుగుల మార్కును తాకింది. 

సూర్యకుమార్‌ డకౌట్‌
చాలాకాలం తర్వాత క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ తానెదుర్కొన్న రెండో బంతికే ఖాతా తెరవకుండా ఔటయ్యాడు. నోర్జే బౌలింగ్‌లో ఫ్రేసర్‌కు క్యాచ్‌ ఇచ్చి స్కై పెవిలియన్‌కు చేరాడు. 7.3 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 81/2గా ఉంది. ఇషాన్‌ (26), హార్దిక్‌ క్రీజ్‌లో ఉన్నారు.

తృటిలో హాఫ్‌ సెంచరీ మిస్‌ చేసుకున్న హిట్‌మ్యాన్‌
49 పరుగుల (27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) వ్యక్తిగత స్కోర్‌ వద్ద హిట్‌మ్యాన్‌ ఔటయ్యాడు. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో రోహిత్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. ఔట్‌ కాకముందు అక్షర్‌ను ఎదుర్కొనేందుకు రోహిత్‌ చాలా ఇబ్బంది పడ్డాడు. మూడు బంతులను వేస్ట్‌ చేశాడు. నాలుగో బంతికి అక్షర్‌ చేతికి చిక్కాడు. 7 ఓవర్ల తర్వాత ముంబై ఇండియన్స్‌ స్కోర్‌ వికెట్‌  నష్టానికి 80 పరుగులు. ఇషాన్‌ కిషన్‌ (15 బంతుల్లో 25; 4 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నాడు.

ధాటిగా ఆడుతున్న ఇషాన్‌, రోహిత్‌
ముంబై ఇండియన్స్‌ ఓపెనర్లు రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించారు. వీరిద్దరు నాలుగు ఓవర్లలో 46 పరుగులు పిండుకున్నారు. ఖలీల్‌ అహ్మద్‌ వేసిన తొలి ఓవర్‌లో 7, ఇషాంత్‌ శర్మ వేసిన రెండో ఓవర్‌లో 14, ఖలీల్‌ వేసిన మూడో ఓవర్‌లో 12, జై రిచర్డ్‌సన్‌ వేసిన నాలుగో ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి. రోహిత్‌ 23 (14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్‌ 17 (10 బంతుల్లో 3 ఫోర్లు) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

ఐపీఎల్‌ 2024లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 7) ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ముంబై, ఢిల్లీ పేలవ ప్రదర్శన చేస్తూ పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాలను ఆక్రమించాయి. ముంబై 3 మ్యాచ్‌ల్లో మూడింట ఓడగా.. ఢిల్లీ నాలుగులో ఒకటి గెలిచింది. 

తుది జట్లు..
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), టిమ్ డేవిడ్, మొహమ్మద్ నబీ, రొమారియో షెపర్డ్, పీయూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా

ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్, రిషబ్ పంత్ (కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, జై రిచర్డ్‌సన్, అన్రిచ్ నోర్ట్జే, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్


 

Advertisement
Advertisement