పరాగ్‌ ప్రతాపం

Second win for Rajasthan Royals - Sakshi

రాజస్తాన్‌ రాయల్స్‌ బ్యాటర్‌ మెరుపు ఇన్నింగ్స్‌

45 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 84 నాటౌట్‌

రాయల్స్‌కు రెండో గెలుపు

12 పరుగులతో ఓడిన ఢిల్లీ 

జైపూర్‌: సొంతగడ్డపై రాజస్తాన్‌ రాయల్స్‌ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. టాపార్డర్‌ చేతులెత్తేసిన వేళ రియాన్‌ పరాగ్‌ (45 బంతుల్లో 84 నాటౌట్‌; 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లందరినీ చితగ్గొట్టాడు. దీంతో ఐపీఎల్‌ 17వ సీజన్‌లో మాజీ చాంపియన్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ 12 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచింది. టాస్‌ గెలిచిన ఢిల్లీ బౌలింగ్‌ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రియాన్‌ పరాగ్‌ ఒంటిచేత్తో స్కోరుబోర్డును హోరెత్తించాడు. ఖలీల్, ముకేశ్, నోర్జే, అక్షర్, కుల్దీప్‌ తలా ఒక వికెట్‌ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసి ఓడింది. డేవిడ్‌ వార్నర్‌ (34 బంతుల్లో 49; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (23 బంతుల్లో 44 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. బర్గర్, చహల్‌ చెరో 2 వికెట్లు తీశారు. 

పరాగ్‌ మెరుపులతో.... 
రాజస్తాన్‌ ఆదిలోనే కష్టాల్లో పడింది. 7.2 ఓవర్లలో జట్టు స్కోరు 36/3. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (5) రెండో ఓవర్లో, కెప్టెన్‌ సంజూ సామ్సన్‌ (15) ఆరో ఓవర్లో పెవిలియన్‌ చేరారు. పవర్‌ప్లేలో వీళ్లిద్దరి వికెట్లు కోల్పోయిన రాయల్స్‌ 31 పరుగులే చేసింది. కాసేపటికే బట్లర్‌ (11)కు కుల్దీప్‌ ముగింపు పలికాడు. ఈ దశలో రియాన్‌ పరాగ్‌ ఇన్నింగ్స్‌కు అంత తానై నడిపించాడు. చెత్తబంతుల్ని బౌండరీలతో శిక్షించాడు. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

బ్యాటింగ్‌ ప్రమోషన్‌లో వచ్చిన అశ్విన్‌ (19 బంతుల్లో 29; 3 సిక్స్‌లు) చూడచక్కని సిక్స్‌లతో అలరించాడు. నాలుగో వికెట్‌కు 54 పరుగులు జతచేసిన అశ్విన్, పరాగ్‌ జోడీ ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. అశ్విన్‌ అవుటయ్యాక 15వ ఓవర్లో రాజస్తాన్‌ వంద పరుగుల మైలురాయిని చేరుకుంది. ఆ ఓవర్‌ ముగిసేసరికి రాజస్తాన్‌ జట్టు స్కోరు 108/4. ఇలాంటి స్థితి నుంచి 180 పైచిలుకు స్కోరు చేస్తుందని ఎవరూ ఊహించలేదు. 34 బంతుల్లో పరాగ్‌ అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు.

ఆ తర్వాత పరాగ్‌ బ్యాట్‌ విధ్వంసమే చేసింది. దీంతో ధ్రువ్‌ జురెల్‌ (12 బంతుల్లో 20; 3 ఫోర్లు)తో పరాగ్‌ ఐదో వికెట్‌కు 23 బంతుల్లోనే 52 పరుగులు చకచకా జోడించాడు. ఆ తర్వాత హెట్‌మైర్‌తో కలిసి ఆరో వికెట్‌కు 16 బంతుల్లోనే 43 పరుగులు జతచేశాడు. నోర్జే వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో పరాగ్‌ వరుసగా 4, 4, 6, 4, 6, 1లతో 25 పరుగులు దంచుకున్నాడు. దీంతో చివరి 5 ఓవర్లలో రాజస్తాన్‌ 77 పరుగుల్ని అవలీలగా సాధించింది. 

బర్గర్‌ దెబ్బ... 
వార్నర్‌తో ఇన్నింగ్స్‌ ఓపెన్‌ చేసిన మిచెల్‌ మార్‌‡్ష (12 బంతుల్లో 23; 5 ఫోర్లు) బౌండరీలతో రెచ్చిపోయాడు. కానీ అంతలోనే  ఇంపాక్ట్‌ బౌలర్‌ నాండ్రె బర్గర్‌... మార్‌‡్షతో పాటు రికీ భుయ్‌ (0)ని మూడు బంతుల వ్యవధిలో అవుట్‌ చేసి ఢిల్లీని కష్టాల్లో పడేశాడు. ఈ దశలో వార్నర్‌ సిక్స్‌లు, ఫోర్లతో లక్ష్యానికి తగ్గ రన్‌రేట్‌తో క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌ను ధాటిగా నడిపించాడు. 11 ఓవర్లదాకా 93/2 స్కోరుతో ఢిల్లీ పటిష్టస్థితిలో ఉంది.

కానీ తర్వాతి ఓవర్లో ఫిఫ్టీకి పరుగు దూరంలో ఉన్న వార్నర్‌... సందీప్‌ శర్మ కళ్లు చెదిరే క్యాచ్‌కు నిష్క్రమించాడు. కాసేపటికే కెపె్టన్‌ రిషభ్‌ పంత్‌ (26 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్‌)ను స్పిన్నర్‌ చహల్‌ వెనక్కి పంపాడు. ఇంపాక్ట్‌గా వచ్చి న పొరెల్‌ (9) కూడా చహల్‌ బౌలింగ్‌లో బోల్తా పడ్డాడు. బౌల్ట్‌ క్యాచ్‌ వదిలేయడంతో 14 పరుగుల స్కోరువద్ద బతికిపోయిన స్టబ్స్‌ తర్వాత వరుస రెండు బంతుల్లో భారీ సిక్స్‌లు కొట్టాడు.

అక్షర్‌ (13 బంతుల్లో 15 నాటౌట్‌; 1 ఫోర్‌) పరిస్థితులకు తగ్గట్లు ఆడలేకపోయాడు. దీంతోపాటు  డెత్‌ ఓవర్లలో సందీప్, అవేశ్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఢిల్లీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఈ సీజన్‌లో జరిగిన 9 మ్యాచ్‌ ల్లోనూ  హోమ్‌ టీమ్‌ నెగ్గడం విశేషం. 

స్కోరు వివరాలు 
రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: యశస్వి (బి) ముకేశ్‌ 5; బట్లర్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్‌ 11; సామ్సన్‌ (సి) పంత్‌ (బి) ఖలీల్‌ 15; పరాగ్‌ (నాటౌట్‌) 84; అశ్విన్‌ (సి) స్టబ్స్‌ (బి) అక్షర్‌ 29; జురెల్‌ (బి) నోర్జే 20; హెట్‌మైర్‌ (నాటౌట్‌) 14; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 185. వికెట్ల పతనం: 1–9, 2–30, 3–36, 4–90, 5–142. 
బౌలింగ్‌: ఖలీల్‌ అహ్మద్‌ 4–0–24–1, ముకేశ్‌ 4–0–49–1, నోర్జే 4–0–48–1, అక్షర్‌ పటేల్‌ 4–0–21–1, కుల్దీప్‌ 4–0–41–1 
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) సందీప్‌ (బి) అవేశ్‌ ఖాన్‌ 49; మార్‌‡్ష (బి) బర్గర్‌ 23; రికీ భుయ్‌ (సి) సామ్సన్‌ (బి) బర్గర్‌ 0; పంత్‌ (సి) సామ్సన్‌ (బి) చహల్‌ 28; స్టబ్స్‌ (నాటౌట్‌) 44; అభిõÙక్‌ పొరెల్‌ (సి) బట్లర్‌ (బి) చహల్‌ 9; అక్షర్‌ పటేల్‌ (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–30, 2–30, 3–97, 4–105, 5–122. 
బౌలింగ్‌: ట్రెంట్‌ బౌల్ట్‌ 3–0–29–0, బర్గర్‌ 3–0–29–2, అశ్విన్‌ 3–0–30–0, అవేశ్‌ ఖాన్‌ 4–0–29–1, చహల్‌ 3–0–19–2, సందీప్‌ 4–0–36–0.  

Election 2024

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top