విజయవాడ, న్యూస్‌లైన్ : సుప్రసిద్ధ రచయిత్రి మాలతీచందూర్ యావత్ మహిళాలోకానికి స్ఫూర్తిప్రదాత అని పలువురు వక్తలు కొనియాడారు. రచయిత్రి మాలతీచందూర్ ‘జీవితం-సాహిత్యం’పై విజయవాడ పుస్తక మహోత్సవ ప్రాంగణంలో గురువారం సాయంత్రం సదస్సు జరిగింది. ప్రధానవక్తగా హాజరైన సాహితీ వేత్త కేబీ లక్ష్మి మాట్లాడుతూ ప్రపంచ సాహిత్యాన్ని తెలుగువారికి చేరువ చేసిన సుప్రసిద్ధ రచయితల్లో మాలతీచందూర్ ఒకరన్నారు.
ఆమెను గొప్ప అనువాదకురాలిగా పేర్కొంటూ మాలతీచందూర్ అనువాద సాహిత్యాలను గురించి సభకు వివరించారు. సంప్రదాయ, అభ్యుదయ భావజాలాన్ని కలిపి నేటితరానికి రచనల ద్వారా మార్గనిర్దేశం చేశారని చెప్పారు. ఆరు దశాబ్దాల పాటు వివిధ పత్రికల్లో పాఠకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన ఘనత మాలతీచందూర్‌దేనన్నారు.
సభకు అధ్యక్షత వహించిన సాహితీవేత్త డాక్టర్ రెంటాల జయదేవ్ మాట్లాడుతూ మాలతీచందూర్‌ను సాహితీప్రియులందరూ తమ కుటుంబ సభ్యురాలిగా భావించేవారన్నారు. సాహిత్యంలోని వివిధ కోణాలను స్పృశించిన ఆమె అన్ని ప్రక్రియల్లోనూ తెలుగు సాహిత్యానికి వన్నె తెచ్చారన్నారు. ఆమె రచించిన పిండి వంటలు పుస్తకాలు సైతం ఎంతో జనాదరణ పొందిందని ఆయన గుర్తుచేశారు.
స్ఫూర్తి ప్రదాత మాలతీచందూర్
Published Fri, Jan 3 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM
Advertisement
Advertisement