నాయకుడంటే ప్రజల గుండె చప్పుడు: వైఎస్‌ విజయమ్మ | ys vijayamma speech in ysrcp plenary, slams chandrababu government | Sakshi
Sakshi News home page

భావోద్వేగంతో ప్రసంగించిన వైఎస్‌ విజయమ్మ

Published Sun, Jul 9 2017 12:22 PM | Last Updated on Wed, Jul 25 2018 4:45 PM

ys vijayamma speech in ysrcp plenary, slams chandrababu government

గుంటూరు : నాయకుడు అనేవాడు ప్రజల మనసులు చదవాలని, వారి గుండె చప్పుడులో ఉండాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ అన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి లేని లోటు తమ కుటుంబంతో పాటు, ప్రజల్లోనూ నెలకొందన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలకు వైఎస్‌ విజయమ్మ ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. 

తన బిడ్డ వైఎస్ జగన్‌కు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, టీడీపీలు కలిసి తన బిడ్డపై అక్రమ కేసులు బనాయించి  జైలు పాలు చేశాయని ఆరోపించారు. అసెంబ్లీలో వైఎస్ జగన్‌ పట్ల అధికార పక్షం తీరును చూసి ఎన్నోసార్లు బాధపడ్డానని చెప్పారు. వైఎస్‌ఆర్‌  కష్టార్జితంతో  వచ్చిన  ప్రభుత్వం కూలిపోకూడదనే 150 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నా కూడా రోశయ్య ప్రభుత్వం నిలిచేలా అనాడు  వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు.

వైఎస్‌ విజయమ్మ మాట్లాడుతూ..‘ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్‌ఆర్‌ మంచివారు.. వైఎస్‌ జగన్‌ మంచి వారు. కానీ వైఎస్‌ఆర్‌ మరణంతో పరిణామాలు మారిపోయాయి.  సందర్భం వచ్చింది కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు మీతో పంచుకుంటున్నా. ఇచ్చిన మాట కోసం జగన్‌ యాత్ర చేస్తానంటే కాంగ్రెస్‌ అధిష్టానం అంగీకరించలేదు. టీడీపీ కాంగ్రెస్‌ కలిసి అబద్ధపు కేసులు పెట్టారు.

కేసుల విచారణ అంటూ తీసుకెళ్లి 16 నెలలు జైలులో పెట్టారు నా బిడ్డను. తొలి ప్లీనరీలో మీకు చెప్పాను  నా బిడ్డను మీకు అప్పగిస్తున్నానని. ఈరోజు కూడా ప్రభుత్వం ఏ సమస్యను పట్టించుకోకపోయినా అసెంబ్లీలో, బయటా కూడా వైఎస్‌ జగన్‌ మీ అందరి కోసం పోరాడుతున్నారు. తండ్రిని, తనని తిడుతున్నా పట్టించుకోకుండా సమస్యలపై పోరాడుతున్నారు. ఒక్కోసారి నా బిడ్డ ఎందుకు ఇలా రాజకీయాల్లోకి వచ్చాడా అని బాధ వచ్చినా  ప్రజలు గుర్తుకొచ్చి మీకు అండగా ఉండాలని దుఖాన్ని దిగమింగుకున్నాను.

ఇప్పుడున్న ప్రభుత్వం ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తుంది. ఏ పనీ చేయడం లేదు. ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. నాయకుడనేవాడు ప్రజల గుండె చప్పుడు వినాలి. అప్పుడే ఆ నాయకుడు ప్రజల హృదయాల్లో ఉంటాడు. వైఎస్‌ఆర్‌ అధికారంలోకి వచ్చినప్పుడు సంక్షేమాన్ని నెత్తికెత్తుకొని అభివద్ధి బాట పట్టించారు. ఉచిత విద్యుత్‌ అమలు చేశారు. కరెంటు బకాయిలు మాఫీ చేశారు. రైతులను పేదలను అమితంగా ప్రేమించారు. వారికి ఆదాయం పెరగాలని ఆవాసం, ఆరోగ్యం, ఆహారం, పిల్లలకు చదువు ఇవ్వాలని, సబ్సీడీ, బీమా, కేంద్రం నుంచి రుణమాఫీ, విత్తన ధరల అందుబాటులో, గిట్టు బాటు ధరలు, పావలా వడ్డీ తీసుకొచ్చారు.

ఆ పథకాల అమలు చూసి అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్‌.. కూడా ఆశ్చర్యపోయారు. మరి ఇప్పటి ప్రభుత్వం ఏ చేస్తోంది. రైతులకు, డ్వాక్రా మహిళలకు ఏం చేస్తోంది. 108ను తీసేశారు. అప్పుడు ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్‌ వస్తే ఇప్పుడు ఎప్పుడొస్తుందో తెలియదు. నాడు పిల్లలు ఏం చదవాలనుకున్నా ప్రభుత్వం ఓ భరోసా ఇచ్చింది ఇప్పుడు పరిస్థితి దారుణం. మైనార్టీలకు నాలుగుశాతం రిజర్వేషన్‌, అభయ హస్తం, ఏమైంది. 86  ప్రాజెక్టులు ఏమయ్యాయి.

వైఎస్‌ఆర్‌ 25లక్షల ఎకరాలకు పైగా సాగునీరు ఇచ్చారు. హంద్రీనీవా చూస్తే గాలినగేరు చూసినా, దేవాదుల, కల్వకుర్తి భీమా ప్రాజెక్టులన్నీ కూడా ఆయన వల్లే పూర్తయ్యయాయి. పోలవరం కాలువలు చూస్తే ఆయన గుర్తొస్తారు. ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రభుత్వాలు ఏం చేశాయి. రిలయన్స్‌ వాళ్లు మన రాష్ట్రం నుంచి గ్యాస్‌ తీసుకెళితే మాకు ఇవ్వకుండా ఎలా తీసుకెళతారని ప్రశ్నించిన వ్యక్తి రాజశేఖర్‌ రెడ్డి. చంద్రబాబు ప్రైవేట్‌ వ్యక్తులకు పవర్‌ ప్రాజెక్టులు ఇచ్చారు. విజయవాడ, రాయలసీమ, కొత్తగూడెం, జెన్‌ కో ఇలా ఎన్నో థర్మల్‌ ప్రాజెక్టులతో కరెంట్‌ ఇచ్చారు. మేనిఫెస్టోలో లేనివి చేశారు. మానవతావాది రాజశేఖర్‌ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం అయినా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమైనా ఏం చేస్తున్నాయి.

సర్వత్రా సంక్షేమ పథకాలు వైఎస్‌వి ఉన్నాయి. చంద్రబాబు ఇప్పుడు ఏం చేశారు. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసిన ప్రజల గుండెల్లో చోటు సంపాదించలేరు. మీరంతా ప్రజల్లోకి వెళ్లాలి. రాజశేఖర్‌రెడ్డి పథకాలు తీసుకెళ్లాలి. పార్టీకోసం అంతా కష్టపడండి. వైఎస్‌ జగన్‌ను గెలిపించాలి. పార్టీ ఏ ఒక్కరని జగన్‌ బాబు పోగొట్టుకోరు. మాట ఇస్తే తప్పుకునే కుటుంబం కాదు. రాబోయే యుద్ధం కోసం ఇప్పుడే ఎన్నికలు వచ్చినట్లు భావించి ప్రతి ఒక్కరు పనిచేసి రాజన్న స్వర్ణయుగం తీసుకు రావాలి’ అని పిలుపునిచ్చారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement