చుక్కలు చూపించాడు..
• బాణాపురం లక్ష్మణ్‌రావు ఇంట్లో చిల్లి గవ్వ కూడా దొరకలేదు
• అప్పులకు సంబంధించిన పత్రాలు మాత్రం కుప్పలుతెప్పలు
• రెండు రోజుల పాటు లక్ష్మణ్‌రావు ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు
హైదరాబాద్: తన వద్ద రూ.10 వేల కోట్ల నల్లధనం ఉందంటూ ఆదాయ వెల్లడి పథకం(ఐడీఎస్)లో ప్రకటించిన బాణాపురం లక్ష్మణ్‌రావు.. చివరికి ఆదాయ పన్ను శాఖ అధికారులకు చుక్కలు చూపించారు. లక్ష్మణ్‌రావు ఇంట్లో సోదాల సందర్భంగా చిల్లిగవ్వ దొరకకపోగా.. అప్పులకు సంబంధించిన పత్రాలు మాత్రం కుప్పలు తెప్పలుగా వెలుగు చూసినట్లు తెలిసింది. రెండు రోజులుగా జూబ్లీహిల్స్ సమీపంలోని ఫిలింనగర్ సైట్–2 రోడ్ నం.2లో ఉన్న లక్ష్మణ్‌రావు నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అధికారులు ఎన్నిమార్లు ప్రశ్నించినా తనకు నల్లడబ్బు ముంబై నుంచి రావాల్సి ఉందని చెప్పడమే తప్పితే.. డబ్బు ఎక్కడ ఉందన్న విషయం మాత్రం చెప్పలేదు. ఓ బాబాను గుడ్డిగా నమ్మి మోసపోయినట్లు చెప్పి అతను చేతులు దులుపుకోవడంతో.. ఐటీ అధికారులు షాక్ తిన్నారు.
చిల్లిగవ్వ కూడా దొరకలేదు..
ఐడీఎస్‌లో వెల్లడించిన ఆదాయానికి తొలి విడత పన్నుగా రూ.1,125 కోట్లను గత నెల 30న చెల్లించాల్సి ఉంది. అధికారులు లక్ష్మణ్‌రావును ఈ నెల 1న పిలిపించి అడగగా పన్ను చెల్లిస్తానని హామీ ఇచ్చారు. దీంతో రాముపై ఒత్తిడి పెంచగా మూడు కంటైనర్లలో ముంబై నుంచి నగదు బయల్దేరిందని మాయ చేశాడు. గడువు ముగిసినా డబ్బు చెల్లించకపోవడంతో మంగళవారం ఐటీ అధికారులు లక్ష్మణ్‌రావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంట్లో చిల్లిగవ్వ కూడా దొరక్కపోవడంతో అవాక్కయ్యారు. లక్ష్మణ్ రావును ఎంత ప్రశ్నించినా ఇప్పటికీ డబ్బు వస్తుందని సమాధానం చెప్పాడని తెలిసింది. ఆ డబ్బు వస్తుందన్న ఆశతో కోట్లలో అప్పులు చేసినట్లు అప్పు పత్రాలు చూసి అధికారులు ముక్కున వేలేసుకున్నారు. తాను స్థాపించిన బోగస్ సంస్థల పత్రాలు పెట్టి బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయల అప్పు తీసుకున్నట్లు కూడా వెల్లడైంది.
లక్ష్మణ్‌రావు ఇంటి వద్ద హైడ్రామా..
కాగా, లక్ష్మణ్‌రావు ఇంట్లో బాలకార్మికులు పని చేస్తున్నారన్న సమాచారం మేరకు కార్మిక శాఖ అధికారులు, చైల్డ్‌లైన్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు గురువారం ఆయన నివాసానికి వచ్చారు. లోనికి వెళ్లేందుకు వారు ప్రయత్నించగా లక్ష్మణ్‌రావు ఎంతకూ డోర్ తీయలేదు. దీంతో నాలుగు గంటల పాటు హైడ్రామా నడిచింది. లక్ష్మణ్‌రావు గేటు తీయకపోవడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఉన్న పొలాలూ పాయే..
లక్ష్మణ్‌రావు ఫిలింనగర్‌లో కిరాయికి ఉంటూనే అదే ఇంటిని ఇటీవల కొనుగోలు చేశారు. రూ.5 కోట్లతో ప్లాట్ కొని రూ.10 కోట్లు వెచ్చించి ఇల్లు నిర్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు. వీరంతా ఓ సంస్థను ఏర్పాటు చేసుకుని డైరెక్టర్లుగా చెలామణి అవుతున్నారు. అయితే క్షుద్ర, గుప్త నిధుల కోసం పూజలు చేస్తూ రెండేళ్ల నుంచి అత్యాశతో డబ్బుల కోసం వెంపర్లాడే వాడని తేలింది. లక్ష్మణ్‌రావుకు ఏడాది క్రితం రైస్‌పుల్లింగ్ బాబా కూడా తగిలాడు. ఇంట్లోనే పూజలు నిర్వహించి రెండింతల డబ్బు అవుతుందంటే రూ. 30 లక్షలు సమర్పించుకున్నట్టు తెలిసింది. సోదాల సందర్భంగా ఐటీ అధికారులకు రైస్‌పుల్లింగ్ కాయిన్ లభించిందని తెలిసింది. ఇంట్లో క్షుద్రపూజలకు సంబంధించిన సామగ్రి కనిపించినట్లు సమాచారం.
ఓ బాబాను గుడ్డిగా నమ్మి
ఈసీఐఎల్‌లో డీజీఎం స్థాయిలో పదవీ విరమణ చేసిన లక్ష్మణ్‌రావుకు మూడేళ్ల క్రితం రాము అనే వ్యక్తి పరిచయమయ్యాడు. బార్కాస్‌లో ఓ బాబా తెలుసని అతని వద్ద అద్భుత యంత్రం ఉందని దానికి నగదును రెట్టింపు చేసే శక్తి ఉందని నమ్మించాడు. ఇందుకోసం లక్ష్మణ్‌రావు తన ఆస్తులు అమ్ముకుని సుమారు రూ.60 లక్షలు ఖర్చు పెట్టాడు. బాబా ఎవరో చూడకుండా రాము ద్వారా లక్షలు కుమ్మరించి డబ్బు యంత్రాన్ని కొన్నాడు. ముంబైలో విక్రయిస్తే దానికి రూ.10 వేల కోట్లు వస్తాయని రాము లక్ష్మణ్‌రావుకు ఆశ పెట్టాడు. ఈలోగా కేంద్రం ఐడీఎస్‌ను ప్రకటించింది. ముంబై నుంచి వచ్చే డబ్బును చట్టబద్ధం చేసుకోవచ్చన్న ఉద్దేశంతో తన వద్ద రూ.10 వేల కోట్ల నల్లధనం ఉందని లక్ష్మణ్‌రావు స్వచ్ఛందంగా వెల్లడించారు.