టాగోర్ గీతాంజలి: ప్రార్థనకు అల్లిన గీతమాలలు
కొత్త పుస్తకం
గీతాంజలి- అనువాదం: డా.భార్గవి; వెల: రూ.300 ప్రతులకు: 08674-253210, 253366
రవీంద్రనాథ్ టాగోర్ రాసిన గీతాంజలి గురించి కొత్త పరిచయాలు అక్కర్లేదు. దీని మూలాలు భారతీయ తాత్త్విక చింతనలో ఉన్నాయని దేశీయ విమర్శకులు భావిస్తే పాశ్చాత్యులు బైబిల్ ‘సాంగ్ ఆఫ్ సాంగ్స్’తో సామ్యాన్ని తరచి చూశారు. దైవాన్ని ప్రభువుగా సఖుడుగా మనుష్యుడిగా భావించుకుని మాటలతో పాటలతో ఆత్మను అర్పించుకునే ప్రయత్నం అందరూ చేశారు. జయదేవుని గీత గోవిందం 12వ శతాబ్దంలో ఈ పరంపరను బలమైన సాహిత్య ధోరణిగా స్థిరపరిచింది. బెంగాల్ ఆధ్యాత్మిక సాంస్కృతిక పరంపరను శతాబ్దాలుగా ప్రభావితం చేసిన వైష్ణవ భక్తి అక్కడే జన్మించిన రవీంద్రుని చేత ‘గీతాంజలి’ రాయించడంలో ఒక అదృశ్య రంగభూమిని సిద్ధం చేసి ఉండవచ్చని భావించేవారు ఉన్నారు. అయితే రవీంద్రుని జీవితంలో ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో చూసిన విషాదం, చోటు చేసుకున్న ఆప్తుల మరణాలు దైవంతో లేదా ప్రకృతితో లేదా తనలోని ఒక ఔన్నత్యమైన ఆత్మతో లేదా సృష్టిలో అణువణువూ నిండి ఉన్న తేజోశక్తితో లేదా ఒక ఊహామాత్రపు సఖుడితో లేదా ప్రియురాలితో సంభాషణకు పురిగొలిపి ఉండవచ్చు. నివేదించుకునే క్షణాలు, కనుకొలకుల్లోంచి అశ్రువులను దిగవిడిచే క్షణాలు, వేదన లేని ఉఛ్వాశ నిశ్వాసలను ఆశించే క్షణాలు, స్వచ్ఛమైన సుమం వలే తటస్థ కొలనులోని లేశమాత్రపు అల వలే మారి స్థిమిత పడే క్షణాలు, ప్రభూ... కురవని జల్లుల భారంతో వొంగిన మేఘంలాగా నా మనసు నీ ద్వారం వద్ద నమ్రతతో ప్రమాణం చేయనీ అని మొరపెట్టుకునే క్షణాలు, మృత్యువు కొరకు పరమాద్భుత రుచి కలిగిన తేనెతో ఎదురు చూసే క్షణాలు... ఇవన్నీ కవిత్వంగానే మారి తీరుతాయి. టాగోర్ అల్లిన ఆ గీతమాలలు అందుచేతనే ప్రపంచంలోని ప్రతి మేలిమి పాఠకుడి కంఠాన్నీ అలంకరించాయి. అంతేకాదు అనువాదమై పరివ్యాప్తమయ్యాయి.
టాగోర్‌ను తెలుగులో అనువదించడానికి ఉత్సాహపడిన వారు ఎందరో ఉన్నారు. మెచ్చుకోలు పొందినవారు కొందరే ఉన్నారు. అయితే ఇక్కడ చూస్తున్న అనువాదం కొంచెం చిత్రమైన కథ కలిగినది. డాక్టర్ భార్గవి తన 20 ఏళ్ల వయసులో టాగోర్ కవిత్వానికి సమ్మోహితులైన కేవలం ఏడెనిమిది రోజుల్లో గీతాంజలిని అనువాదం చేసి ఆ కావ్యానికి తన వంతు పూమాలను అర్పించేశాను అని తృప్తిపడి ఆ అనువాదాన్ని దాచేశారు. కాని ఇన్నేళ్ల తర్వాత అంటే ఒక ముప్పై ఏళ్ల తర్వాత వారూ వీరూ చూసి బావుందని మెచ్చుకొని పుస్తకం తెమ్మని బలవంతం చేస్తే తీసుకువచ్చారు. ఇరవై ఏళ్ల ఒక ఔత్సాహికురాలి అనువాదంలో ఇంత గాఢత ఉంటుందా? సరళత ఉంటుందా? బరువు ఉండాల్సిన చోట త్రాసు ఒంగి తేలిక పడాల్సిన చోట ఉల్లిపొర కాగితంలా తెమ్మరకు ఎగిరి... టాగోర్ హృదయంతో తన హృదయాన్ని తాడనం చేయాలని పెనుగులాడినప్పుడే ఇటువంటి అనువాదం సాధ్యం. మొత్తం 103 టాగోర్ గీతాలకు భార్గవి చేసిన అనువాదం పాఠకులను ఆకట్టుకుంటుంది. తోడుగా గిరిధర్ గౌడ్ వేసిన చిత్రాలు వర్ణతాండవం చేస్తాయి. ఆమె కవితను ఈయన బొమ్మను కలిపి గొప్పగా ముద్రించిన నరేంద్ర, శశికళలకు అభినందనలు.