
ఓడిపోయేదానికి నేనెందుకు పోటీచేయాలి?
టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి ఆదివారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
* చంద్రబాబుపై జేసీ ఫైర్
కదిరి, న్యూస్‌లైన్: టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి ఆదివారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. తెలుగుదేశంతో బీజేపీ పొత్తు ఖరారైందని, జిల్లాలో అనంతపురం అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించారని తెలుసుకున్న జేసీ రగిలిపోయారు.
‘చంద్రబాబుకు ఫోను కలుపు..’ అని చెప్పగానే ఆయన పీఏ ఫోన్ కనెక్ట్ చేసి ఇచ్చారు. ఆ సమయంలో చంద్రబాబు బీజేపీ జాతీయ నేత జవదేకర్‌తో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఉన్నారని బాబు పీఏ సమాధానమిచ్చారు. అయితే జేసీ విన్పించుకోకుండా..‘ఏమయ్యా.. బీజేపీ వాళ్లకు మా జిల్లాలో.. కదిరి ఇమ్మని చెబితే అనంతపురం ఇస్తారా? పార్లమెంటుకు నేనెట్ల గెలవాలయ్యా.. ఓడిపోయే దానికి నేనెందుకు పోటీచేయాలి? పొద్దుపోకనా?..
రాయదుర్గంలో చూస్తే అట్లజేస్తిరి. నేను ఇంతవరకు ఓడిపోలేదయ్యా.. మీ పార్టీలోకొచ్చి ఓడిపోవాల్సి వస్తోంది. ఓడిపోవడానికి నేను సిద్ధంగా లేను. మీకు ఎవరికి బుద్ధిబుడితే వాళ్లకు టికెట్ ఇచ్చుకోండి. నేను పోటీచేయను. పొత్తుల్లో మార్పు జేస్తే అప్పుడు జూద్దాం. బాస్‌కు ఈ మాట చెప్పు..’ అంటూ ఫోన్ కట్ చేశారట. మధ్యలో ‘సార్.. మీరు సార్‌తో మాట్లాడండి. నాతో ఇలాంటివి చెబితే ప్రయోజనం లేదు..’ అని అంటున్నా జేసీ విన్పించుకోలేదని అక్కడే ఉన్న బీజేవైఎం రాష్ట్ర నేతతో బాబు పీఏ చెప్పినట్లు తెలిసింది.