రమ్యని తాగేశారు | After 9-day battle, Ramya gives up | Sakshi
Sakshi News home page

రమ్యని తాగేశారు ప్రాణం తీయడానికి పర్మిట్లా?

Published Tue, Jul 12 2016 12:14 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

రమ్యని  తాగేశారు - Sakshi

రమ్యని తాగేశారు

 ప్రాణం తీయడానికి పర్మిట్లా?
 
బాటిల్‌లో మందుంటే జబ్బులు నయం చేయాలి.
వీలైతే ప్రాణం పోయాలి.
ఈ వెధవ మందు ఈ దరిద్రపు బాటిల్‌తో ప్రాణాల్ని తాగేస్తోంది.
హ్యాపీ అవర్ అట.
ఒక పెగ్గు కొంటే ఇంకో పెగ్గు ఫ్రీ.
ఒక ప్రాణం తీస్తే..?
ఎక్కువ తాగితే కక్కుకుంటారు.
భరించలేని కంపు.
ధనమదం, యువమదం, మందు మదం, మదం మదం....
దరిద్రం.
పైగా డ్రైవింగ్ అట.
ఎంత కోపం వస్తోందంటే బాటిల్ పగలగొట్టి లంఘించాలనుంది.
కాని ఏం లాభం?
ఎంత ఎత్తుకు దూకినా... స్వర్గం నుంచి రమ్యను వెనక్కి తేగలమా?
పాతాళానికి ఇంకుతున్న విలువలను భూమ్మీదకు తేగలమా?
ఖజానా నింపాలని ప్రభుత్వాల ప్రయత్నం.
శవపేటికలు నిండుతున్నాయి.
కన్నీళ్లు పెట్రోల్ అయ్యే ముందు వ్యవస్థ మత్తు దిగితే మంచిది.
రమ్య తల్లి వాస్తవాన్ని అంగీకరించలేక మత్తు బిళ్లలు వేసుకుంటున్నారు.
ఇలాంటి భద్రకాళీలు మేల్కొనే ముందే ప్రభుత్వాలు మేల్కోవాలి.

 
 
నా ప్రిన్సెస్... ఏమైంది?!
 ‘అమ్మా! నా రమ్య.. రమ్యా.. నా తల్లీ... నన్ను వదిలిపెట్టి ఎక్కడికెళ్లావు తల్లీ’ అంటూ ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోతున్న నా బిడ్డను ఎలా ఓదార్చను, ఏమని ఓదార్చను...’ అంటూ ప్రశ్నించింది విజయలక్ష్మి. బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించిన రమ్య కుటుంబీకులను కలుసుకోవడానికి విద్యానగర్‌లోని వారింటికి వెళితే... రమ్య అమ్మమ్మ వేసిన ప్రశ్న ఇది. మంచ మ్మీద జీవశ్చవంలా పడున్న కూతురిని చూపిస్తూ.. ‘‘ఒళ్లంతా అయిన గాయాల బాధ ఓ వైపు, బిడ్డను కోల్పోయిన బాధ మరోవైపు.. ఇల్లంతా పడి ఉంది. కళ్లు తెరిస్తే బిడ్డ జ్ఞాపకాలతో తల్లడిల్లుతున్న నా కూతురిని నిద్రపుచ్చడం కోసం ఇంజక్షన్లు చేయాల్సి వస్తోంది’’ అంటూ వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ ‘‘ఇది ఎప్పటికి లేచి మామూలు మనిషి అవుతుందో!! ఆ రాక్షసులు బంగారంలాంటి నా మనవరాలిని పొట్టనపెట్టుకున్నారు’’... విజయలక్ష్మి, ఆమె భర్త సురేందర్‌నాథ్ కళ్లనీళ్లపర్యంతమయ్యారు. రోడ్డు ప్రమాదంలో తలకు గాయాలై, కాలికి ఫ్రాక్చర్ అయ్యి... మంచానికే పరిమితమైన కూతురి కోసం దుఃఖాన్ని దిగమింగుకుంటున్నారు.
 
నెమలి బొమ్మ వేస్తాను.. ఎప్పుడొస్తావు అక్కా!
‘అమ్మా, లేమ్మా!’ అంటూ తల్లిని లేపే ప్రయత్నం చేస్తున్న ఏడేళ్ల రష్మిని వారిస్తూ... ‘ఇలా రామ్మా అంటూ దగ్గరగా కూర్చోబెట్టుకుంది విజయలక్ష్మి. ‘ఇది రమ్య చెల్లెలు. అక్కా చెల్లెళ్లిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. సందడిగా ఇల్లంతా తిరిగేవారు. కలిసి ఆడుకునేవారు. కలిసి బొమ్మలు గీసుకునేవారు. మొన్నామధ్య పేపర్‌లో నెమ్మలి బొమ్మ చూశారంట. చాలా బాగుందని, అచ్చు అలాగే వేద్దాం అనుకున్నారట. ఇప్పుడు ఒక్కతే నెమలి బొమ్మ వేద్దాం అని కూచుంటుంది. దీనికి ఇంకా సరిగా రాదు. అక్క హాస్పిటల్‌లో ఉంది కదా! వచ్చేసరికి డిజైన్ గీసి, కలర్స్ వేసి రెడీ చే సి రాగానే ఇస్తా. అక్క హ్యాపీ అవుతుంది. నువ్వు హెల్ప్ చెయ్యి అమ్మమ్మా అనే ఈ చిన్నదానికి ఏమని చెప్పను’’ అంటూ మనవరాలిని గుండెలకు హత్తుకుంటూ ఎంత కష్టమొచ్చింది తల్లీ మీకు అంటూ ఏడుస్తూనే ఉంది.
 

పుట్టిన రోజు మహారాణి...

‘‘వచ్చే నెల ఎనిమిదిన రమ్య పుట్టిన రోజు. బర్త్‌డే అంటే ఎక్కడలేనంత సంబరం దానికి. నేను ప్రిన్సెస్‌ని. నన్ను ప్రిన్సె స్‌లా తయారుచేయి అంటూ పేచీ పెట్టేది. ఎక్కడా తగ్గేది కాదు. ఇల్లంతా డెకరేషన్ చేయాలని నన్ను హడావిడి పెట్టేది. ఇంకొద్ది రోజుల్లో బర్త్‌డే. ఏదీ నా ప్రిన్సెస్? ఎక్కడకెళ్లిపోయింది? ఎవరు ఎత్తుకెళ్లిపోయారు?’’ అంటూ కళ్లనీళ్లు పెటుకున్నారు రమ్య తాతయ్య సురేందర్‌నాథ్.

మాటల తోట వెళ్లిన చోటేది..?
‘‘రోజుల బిడ్డ నుంచి తొమ్మిదేళ్ల పాటు ఈ చేతుల్లోనే పెరిగింది నా చిట్టితల్లి’’ అంటూ మనవరాలి గురించే పలవరిస్తూ చెప్పుకొచ్చారు రమ్య అమ్మమ్మ విజయలక్ష్మి. ‘‘ఈ మధ్యే స్కూల్ చేంజ్ చేశారు. అందుకే సికింద్రాబాద్‌లో ఇల్లు తీసుకుంటున్నామన్నారు. అమెరికాలో ఉన్న మా అబ్బాయి కుటుంబాన్ని చూడటానికి వారం క్రితమే వెళ్లాం. రోజూ అక్కాచెల్లెళ్లిద్దరూ మాతో ఫోన్‌లో మాట్లాడ నిదే పడుకునేవారు కాదు. అంత చేరిక మాకు. ఆ రోజు కూడా స్కూల్‌కి వెళుతున్న విషయం చెప్పింది. స్కూల్ బాగుందని చెప్పింది. మేం తిరిగి వచ్చేటప్పుడు ఏమేం తీసుకురావాలో లిస్ట్ అంతా చె ప్పింది. ఆ మాటలే ఆఖరు. జరిగింది తెలిసి వెంటనే వచ్చేశాం. ముద్దులు మూటగట్టే నా మనవరాల్ని బ్యాండేజ్‌లో చుట్టి అందించారు. అప్పటి దాకా తల్లి ఒడిలోనే కూర్చున్నదట. ఐస్‌క్రీమ్ తింటూ అమ్మతో స్కూల్ మొదటి రోజు ముచ్చట్లు చెబుతోందట. కొత్తగా చేరిన స్కూలు ఎంత బాగుందో... ఆ క బుర్లన్నీ ఆపకుండా చెబుతూనే ఉందట. ఆ మాటలు వింటూ తండ్రి, చిన్నాన్నలు, తాతయ్య మురిసిపోతున్నా రంట. ఇంతలో పిడుగు పడినట్టు... ఏం జరిగిందో ఊహకు అందనట్టు జరిగిపోయిందట. నా తల్లి ఆసుపత్రిలో బతుకుతో పోరాడి పోరాడి అటు నుంచి అటే వెళ్లిపోయింది.’’
 
పెంపకం ఇదేనా!
‘‘డబ్బున్నవారి పిల్లలు చేసే విచ్చలవిడి పనులు ఇప్పుడు మా నాలుగు కుటుంబాల్లో చిచ్చు రేపాయి. రమ్య చిన్నాన్న చనిపోయాడు. ఇంకో చిన్నాన్న, తాతయ్య ఆసుపత్రిలోనే ఉన్నారు. వాళ్లకు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఇటు చూస్తే నా బిడ్డ ఇలా మంచం పట్టింది. ఇంత దారుణం చేసినవాళ్లు పిల్లలా? కాదు... రాక్షసులు. పట్టపగలు తాగి రోడ్ల మీద బండ్లు నడుపుతూ.. మా కుటుంబాల్లో చిచ్చు రేపారు. ఇలాంటివారు ఇంకెంతమంది సంతోషంగా ఉండే కుటుంబాల్లో చిచ్చు రేపుతారో. పట్టపగళ్లు బార్లు. లెసైన్సులు లేకుండానే చేతికి బండ్లు. పంతొమ్మిదేళ్లకు ఇలా పట్టపగలు తాగుతూ తిరుగుతున్నారంటే... వాళ్లు ఎలా పెరుగుతున్నారు? వాళ్ల తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? వాళ్ల సరదా ఇతరుల ప్రాణాల మీదకు వస్తుందని చెప్పకపోతే ఎలా?! ఇప్పుడు మాకు తీరని అన్యాయం చేశారు’’ అంటూ తమ కష్టాన్ని, కన్నబిడ్డ దుస్థితిని చెబుతూ తల్లడిల్లిపోయారు రమ్య అమ్మమ్మ విజయలక్ష్మి, తాతయ్య సురేందర్‌నాథ్.    -   సురేందర్‌నాథ్
 
 
మృత్యు  ఘంటికలు

ఉదయం 9 గంటలు...
 రాజేష్ సాప్ట్‌వేర్ ఇంజినీర్. మాదాపూర్‌లో నివాసముంటున్నాడు. బోరబండలో ఉండే అన్న కూతురు రమ్య అంటే అతనికి ప్రాణం. వారంలో రెండు మూడు సార్లయినా పాపను కలుసుకుని ముచ్చట్లు చెప్పందే రాజేష్‌కు ఏమీ తోచదు. జులై 1 శుక్రవారం... అన్నయ్య ఇంటికెళ్లాడు రాజేశ్. రమ్యను స్కూల్ నుంచి తీసుకొద్దాం అన్నాడు. పనిలో పని పాప స్కూలుకు దగ్గర్లో ఇల్లు కూడా చూడొచ్చని రాజేశ్‌ని, భార్య రాధిక, తండ్రి  మధుసూదన్, మరో తమ్ముడు రమేష్‌ని తీసుకుని బయలుదేరాడు రమ్య తండ్రి వెంకటరమణ.
 
ఉదయం 11.30 గంటలు...
 అందరూ కలిసి రాజేశ్ శాంత్రో కారులో హైదర్‌గూడలోని సెయింట్ పాల్స్ స్కూలుకు చేరుకున్నారంతా. రాజేశ్‌ని చూడగానే రమ్య సంబరపడిపోయింది. ముచ్చట్లలో మునిగిన బాబాయ్ కూతుళ్లను ఇక ఇంటికెళ్దాం రమ్మంటూ పిలిచింది రాధిక. స్కూలు నుంచి ఇంటికి బయలుదే రారు.
 
మధ్యాహ్నం 1 గంట...
 స్కూల్లో జరిగిన విషయాల్ని దారి పొడవునా చెబుతూనే ఉంది రమ్య. మధ్యమధ్యలో చుట్టుపక్కల కనిపిస్తున్న ఫ్లెక్సీల గురించి అడుగుతోంది. తల్లి చెబుతుంటే... నోట్‌బుక్‌లో ఆ బొమ్మలు వేసేందుకు ప్రయత్నిస్తోంది. నేను శాస్త్రవేత్తనవుతా బాబాయ్ అంది. రాజేశ్ మురిసిపోయాడు.
 
మధ్యాహ్నం 1.30 గంటలు...
డివైడర్‌కు మరోవైపు రోడ్డులో ముఫకంజా కాలేజ్ వైపు నుంచి ఐ 10 కారు ప్రమాదకరమైన స్పీడులో వస్తోంది. శ్రావెల్ అనే యువకుడు కారు నడుపుతున్నాడు. విష్ణు, సూర్య, అశ్వినీనాయుడు, అలెన్ జాక్సన్, శరణ్ అనే మరో ఐదుగురు మిత్రులున్నారు. ఆ ఆరుగురూ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు. పొద్దున్నే సినిమా చూసేందుకు సినీమ్సాక్స్‌కు వెళ్లారు. షో టైం దాటిపోవడంతో అక్కడి బార్‌లో తలో మూడు పెగ్గుల విస్కీ, ఒక్కో బీర్ తాగారు. తాగిన కిక్కులో స్పీడుగా కారు నడుపుకుంటూ హాస్టల్‌కి బయలుదేరారు. కారు పంజాగుట్ట శ్మశానవాటిక దగ్గరికి రాగానే అదుపుతప్పి డివైడర్ ఎక్కింది. పల్టీలు కొడుతూ గాలిలోకి లేచి, అప్పుడే పంజాగుట్ట ఫ్లై ఓవర్ దిగిన రాజేష్ కారు మీద పడింది. కారు ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో కారు నడుపుతున్న రాజేష్ అక్కడికక్కడే కన్నుమూశాడు. వెంకట రమణకు తప్ప అందరికీ తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద వార్త అందుకుని వచ్చిన పోలీసులు... క్రేన్స్ సహాయంతో రెండు కార్లను అతి కష్టమ్మీద విడదీశారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు.
 
మధ్యాహ్నం 2.30 గంటలు..

 రమ్యను నిమ్స్‌లో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కేర్ ఆస్పత్రికి మార్చారు. మిగతావారిని యశోద ఆస్పత్రికి తరలించారు. ఆ ఆరుగురు యువకులకు కూడా గాయాలయ్యాయి. వాళ్లని పోలీసులు ఆస్పత్రికి తరలించి, వాళ్లపై డ్రంక్ అండ్ రాష్ డ్రైవ్ కేసు నమోదు చేశారు.
 

ప్రమాదం జరిగిన రెండో రోజు... జూలై 2 ఉదయం...

 మిగతా వారంతా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు కానీ, వారం గడిచినా రమ్య పరిస్థితిలో మార్పు రాలేదు. నిజానికి ప్రమాదం జరిగినప్పుడే రమ్య బ్రెయిన్ డెడ్ అయ్యింది. చివరి ప్రయత్నంగా వెంటిలేటర్‌పై ఉంచి, మెదడు పనితీరును పునరుద్దించేందుకు వైద్యులు శ్రమించారు. కానీ వారం దాటినా రమ్య ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాలేదు. మెదడు స్పందించడం ఆగిపోయింది.
 
జూలై 9 శ నివారం సాయంత్రం
సాయంత్రం వైద్యులు రమ్య మరణించిన ట్లు ప్రకటించారు. ఆ విషయాన్ని భార్యతో ఎలా చెప్పాలో వెంకటర మణకు అర్థం కాలేదు. కానీ తప్పక... రమ్య మరణవార్త రాధికకు చెప్పారు. కేర్ ఆస్పత్రికి ఆంబులెన్స్‌లో తీసుకొచ్చి రమ్యను చూపించారు. ఘొల్లుమంది రాధిక. కన్నీళ్లతో కడసారి బిడ్డను ముద్దాడింది. దుఃఖాన్ని తట్టుకోలేక స్పృహ కోల్పోయింది.
 
జూలై 10 ఆదివారం ఉదయం
 ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం చేసి... బాగ్ అంబర్‌పేట డీడీ కాలనీలోని అమ్మమ్మ ఇంటికి రమ్య మృతదేహాన్ని చేర్చారు. మా కంటి దీపం కళ్ల ముందే  ఆరిపోయిందంటూ తండ్రి రోదించాడు. రమ్య చెల్లెలు రష్మి.. ‘అక్కా లే అక్కా పార్కులో ఆడుకుందాం’ అంటూ అచేతనంగా ఉన్న రమ్యను పిలవడం అక్కడున్న అందరికీ కన్నీళ్లు తెప్పించింది.
 
జూలై 10 ఆదివారం సాయంత్రం 4 గంటలు..
 అంబర్‌పేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. బంగారు భవిష్యత్ ఉన్న ఓ నిండు ప్రాణాన్ని మద్య మహమ్మారి మింగేసింది. అందుకు కారకులైన వారిని శిక్షించేందుకు అవసరమైన సాక్ష్యాలన్నీ పోలీసులు సేకరించారు. కారు నడిపిన వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని అంటున్నారు.
 
రమ్య ప్రాణాలను ఎవరిస్తారు?  ఇది రమ్య అమ్మమ్మ ప్రశ్న.
మా కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఎవరు పూడుస్తారు?  ఇది రమ్య పిన్ని ఆవేదన.
దోషులను తెర ముందుకు ఎందుకు తీసుకురావడం లేదింతవరకు? ఇది సామాన్యుల ఆవేశం.
ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? ఇది విద్యావంతుల ఉద్వేగం.
 
   
 
తప్పు ఒక్కరిది కాదు... అందరిదీ! పట్టపగలే మద్యం అమ్మిన షాపు వాళ్లది లెసైన్సు లేని పిల్లలకు కారిచ్చి పంపిన తల్లిదండ్రులది ఓవర్ స్పీడుతో మూడు సిగ్నల్స్ దాటినా ఆపని పోలీసులది  ... ఇది ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కన్నీటి భాష్యం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement