భాస్కరుడి లలితగీతం | Lyric writer Bhaskarabhatla Ravikumar, his wife Lalita Interview | Sakshi
Sakshi News home page

భాస్కరుడి లలితగీతం

Published Tue, Aug 20 2013 11:21 PM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

భాస్కరుడి లలితగీతం - Sakshi

భాస్కరుడి లలితగీతం

ఆమెని చూడగానే...
 ‘గాల్లో తేలినట్టుందే.. గుండె జారినట్టుందే!’ అని పాడుకుంది అబ్బాయి మనసు.
 ‘బొమ్మని గీస్తే నీలా ఉంది..?’ అని కూడా అనుకుంది.
 ‘రామసక్కని బంగారుబొమ్మ...’ అంటూ
 స్పీడ్ పెంచేసి
 ‘సారొస్తారొస్తారే.. వస్తారొస్తారొస్తారే...’ అని అమ్మాయిచేతా అనిపించింది.
 ఆ అబ్బాయి భాస్కరభట్ల రవికుమార్.
 ఆ అమ్మాయి అతని అర్ధాంగి లలిత.
 పాటల రచయితగా ఆయన శ్రీకారం చుట్టకముందే ప్రేమకు పల్లవి, చరణంలా వారు కలిసిపోయారు.
 కృతికి హంసపాదులా, గీతానికి శ్రుతితప్పడంలా కాపురంలో అప్పుడప్పుడూ వచ్చే అన్యోన్య కలహాల్లో...
 పరిస్థితిని చక్కదిద్దేలా సర్దుబాట్లూ అవసరమే!’’ అని చెప్పిన  ఈ జంట పాడిన యుగళగీతమే  ఈవారం మనసే జతగా...

 
 అబ్బాయి పుట్టింది శ్రీకాకుళంలో. ఐదుగురు తోబుట్టువుల మధ్య పెరిగింది రాజమండ్రిలో. సినిమా జర్నలిస్ట్‌గా హైదరాబాద్‌లో ఉద్యోగం. ఆ తర్వాత సినీ గీత రచయితగా ప్రయాణం. అమ్మాయి స్వస్థలం వరంగల్. ఇంటికి పెద్దకూతురు. ప్రాంతాలు వేరు. భావాలు వేరు. కులాలు వేరు. ఆర్థిక పరిస్థితులు వేరు. అనుకోకుండా కలుసుకున్నారు. మనసులు కలిశాయి. పెద్దలను ఒప్పించి (ఆగస్టు 13, 1998) పెళ్లి చేసుకున్నారు. వీరికి అమంత, సంహిత ఇద్దరు సంతానం. ఇద్దరివైపు మాటవరసకు పలకరింపులే తప్ప, సహాయ సహకారాలు లేవు. ‘అభిరుచుల నుంచి అభిప్రాయాల దాకా అన్నింటా భిన్నం’ అంటున్న వీరు పదిహేనేళ్లుగా కలిసుంటున్నారు.
 
 నీ కళ్లతోటి నా కళ్లలోకి చూస్తేనే చంద్రోదయం...

 ‘ఈ పాటలాగే నా మనసెరిగి నడుచుకుంటూ నా జీవితంలో వెన్నెలలు నింపిన వ్యక్తి భార్యగా లభించడం నా అదృష్టం. పదిహేనేళ్ల క్రితం లలిత నా జీవితంలోకి అడుగుపెట్టి ఉండకపోతే ఈ రోజు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ అక్కడే ఉండిపోయేవాడిని. పెళ్లయినకొత్తలోనే గీత రచయిత కావాలనే నా అభిలాషను అర్థం చేసుకొని, ఉద్యోగం వదులుకోమని సలహా ఇచ్చింది. ఆ సమయంలో లలిత ఇచ్చిన సహకారం ఎన్నటికీ మరవలేను. ఇల్లు గడవడానికి ఇతరత్రా ఆదాయవనరులేవీ లేవు. సెకండ్ హ్యాండ్ ఇంగ్లిష్ పుస్తకాలు, మాగజీన్లను మీద కొనుక్కొస్తే, వాటిని లలితే తెలుగు అనువాదం చేసి ఇచ్చేది. వాటికి నేను లీడ్ రాసి, ఫొటో జత చేసి అన్ని పత్రికాఫీసులకు తిరిగేవాడిని. అలా మంచి ఆదాయం సంపాదించాం. దాంతో ఇద్దరికీ ఆత్మవిశ్వాసం పెరిగింది. నాకున్న అభిరుచికి పదునుపెట్టే అవకాశం, సమయం దొరికింది. ఐదారు నెలలు ఇద్దరం కలిసి కష్టపడ్డాం. తర్వాత ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాతో నాకు ఓ ఆధారం దొరికింది. అప్పటినుంచి తను ఇంటిని చక్కదిద్దుకుంటుంటే... నేను పాటలు రాసుకుంటూ జాలీగా గడిపేస్తున్నా. ఆలుమగలు ఒకరికోసం ఒకరుగా ఉంటే, ఎంతటి కష్టమైనా దూదిపింజే అవుతుందని స్వానుభవంతో తెలుసుకున్నాను’’ అంటూ తమ సంసార ప్రయాణపు తొలి అడుగులో పంచుకున్న కష్టసుఖాలను వివరించారు.
 
 అడుగునవుతాను నీ వెంట నేను...

 ‘‘ఈ పదాల అల్లికలాగే ఇన్నేళ్లూ ఒకరికోసం ఒకరం అన్నట్టుగా ఉన్నాం. అప్పుడప్పుడు మా మధ్య చోటుచేసుకునే చిన్న చిన్న గ్యాపులను మా ఇద్దరిలో ఎవరో ఒకరం పూరించుకుంటూ ఆనందంగా, ఆహ్లాదంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటాం’’ అంటూ తమ సంసారంలోని సరాగాలను వినిపించారు లలిత.
 
 ఏకమయ్యే క్షణాలే కదా ఓ వరం...

 ‘పదహారేళ్ల క్రితం.. అచ్చు మా మనసు భాష ఇలాగే ఉంది. అప్పటికి నేను సినిమా జర్నలిస్ట్‌గా ఉద్యోగం చేస్తున్నాను. వరంగల్‌లో ఓ సినిమా హీరోయిన్ హాజరయ్యే ఫంక్షన్‌ని కవర్ చేయడానికి వెళ్లినప్పుడు అక్కడ లలితను చూశాను. అప్పటికే బి.ఎస్సీ పూర్తి చేసి ఉద్యోగం చేస్తోంది తను. ఫంక్షన్ మొత్తం తానే అయినట్టుగా తిరుగుతున్న లలిత నాకు బాగా నచ్చింది. హైదరాబాద్ వచ్చాక అడ్రస్ కనుక్కొని ఉత్తరం రాశాను’ అంటూ తమ ప్రేమ ప్రయాణాన్ని భాస్కరభట్ల చెబుతుంటే లలిత అందుకుని - ‘‘ఆఫీస్‌కు వెళ్లేసరికి వారానికి రెండు, మూడు ఉత్తరాలు నా కోసం రెడీగా ఉండేవి. ఉత్తరాలు రాస్తున్న వ్యక్తి ఎవరో తెలియదు కానీ ఆ అక్షరాలు, పదాలు నన్ను అమితంగా ఆకట్టుకునేవి. తిరుగు ఉత్తరాలు రాసేలా చేశాయి. ఫలితంగా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. నమ్మకం కలిగింది. ఓ రోజు పెళ్లి పట్ల తన అభిప్రాయం తెలపమని నేనే రాశాను. వచ్చి కలిశారు. అవి జీవితాంతం గుర్తుండిపోయే మధుర క్షణాలు. కులాలు, ఉద్యోగాలు, సర్దుబాట్లు... ఇద్దరం మాట్లాడుకొని, ఇంట్లోవారు ఒప్పుకోకపోతే స్నేహంగానైనా ఉండాలనుకుని వెళ్లిపోయాం. కాని మరుసటి రోజు ఉదయమే ఈయన వచ్చి, పెద్దవారిని ఒప్పించి పెళ్లి చేసుకుందామన్నారు. వారిని ఒప్పించడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది’’ అంటూ ఉద్వేగంతో చెప్పారు లలిత.
 
 తోడునీడల పందిరి...

 ఇల్లు ఆహ్లాదంగా కనిపించాలంటే ఇద్దరి మధ్య సఖ్యత ఉండాలి. ఒకరి బాధకు ఒకరి ఓదార్పు కావాలి. దీని గురించి ప్రస్తావిస్తూ- ‘‘ఎప్పుడైనా రికార్డింగ్‌లో నా పాట ఓకే కాకపోతే, మనసుకు చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు లలిత ఇచ్చే మనోధైర్యం మాటల్లో చెప్పలేనిది. ‘నీ పాట వినే అదృష్టం వారికి లేదు. వదిలేయ్ నాన్నా’ అంటుంది. ఆ మాట చాలా ఆనందాన్నిస్తుంది. మరో పెద్ద ఛాయిస్ వస్తుందన్న నమ్మకాన్నిస్తుంది. ఇలా చాలా విషయాల్లో లలిత మా అమ్మను తలపిస్తుంది’’ అన్నారు భాస్కరభట్ల.
 
 బాధ్యతల బంధం...

 ‘‘ఇన్నేళ్ల జీవితంలో అల్లకల్లోలమయిన పరిస్థితులను ఎప్పుడూ ఎదుర్కోలేదు. కారణం ఈయన ప్లానింగ్. మమ్మల్నెప్పుడూ సెక్యూర్డ్‌గా ఉంచాలనుకుంటారు. పనిలోనూ, డబ్బు విషయంలోనూ చాలా పక్కాగా ఉంటారు. ఇద్దరికిద్దరం కానుకలు ఇచ్చుకోవాలి, బాధ్యతలు వదిలించుకోవాలి... అనుకోం. ఇంటి సరుకులు తేవడం దగ్గర్నుంచి, అవసరమైన వస్తువుల వరకూ పిల్లలనూ వెంట తీసుకెళ్లి తెచ్చుకుంటాం. ఆ సమయంలో పిల్లలకు ఏ వస్తువు ఎంతవరకు అవసరం అనేది తెలిసి వస్తుందని మా ఇద్దరి నమ్మకం. అవసరం ఉందనుకుంటే రూపాయికి వచ్చే వస్తువు పదివేలైనా పెడతాం. అవసరం కానిదనుకుంటే పదివేల రూపాయల వస్తువు రూపాయికి వస్తుందన్నా కొనం. డబ్బు ఎంతవరకు, ఎలా ఖర్చుపెట్టాలనేది మా పద్ధతుల ద్వారా పిల్లలకు తెలియచేస్తుంటాం. వాళ్లూ చక్కగా అర్థం చేసుకుంటారు. గొప్పకోసం పెద్ద పెద్ద స్కూల్స్‌లో వేయాలనుకోం. బాగా చదవాలని అనుకుంటాం. మా నిర్ణయాలు, అలవాట్ల వల్ల పిల్లలు స్కూల్లో అన్నింటా ముందుంటారు. భార్యాభర్తల బంధం బాగుంటేనే పిల్లల ఎదుగుదల ఆశించిన విధంగా ఉంటుంది’’ అని వివరించారు లలిత.

 ‘‘భార్యాభర్తల మాటపట్టింపులను మూడోవ్యక్తికి చెప్పకూడదు. ఎందుకంటే అవి ఎక్కువసేపు నిలబడవు. నెమ్మదిగా సర్దుబాట్లు చేసుకొని, అన్యోన్యంగా ఉంటాం. మూడో వ్యక్తికి చెప్పడం వలన వారి దగ్గర చులకన అవుతాం. అలాగే కోపతాపాలు, భావోద్వేగాలు చోటుచేసుకోవడం సహజమే. మనసెరిగి సర్దుకుపోవడమే సమంజసం’’ అని తెలిపిన ఈ జంట.
 
 - నిర్మలారెడ్డి, సాక్షిఫీచర్స్ ప్రతినిధి
 
 ‘నా పాటలకు మొదటి శ్రోత లలితే! పదాల అల్లికలో నేను కుస్తీ పడుతుంటే తను అందించిన పలుకులెన్నో ఉన్నాయి.
 - భాస్కరభట్ల
 
 ఈయన మదిలో కొత్తపదం తట్టిందంటే ఎంత పనిలో ఉన్నా వదిలేసి రావలసిందే! పనికన్నా పదం ముఖ్యం కాబట్టి మొదటి ప్రాధాన్యత పదానికే ఇస్తుంటాను.
 - లలిత
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement