ఒకటి.. రెండు.. మూడు.. మెగాస్టార్ వచ్చేస్తున్నాడు?! | megastar chiru ready to act tamil movie kathi remake | Sakshi
Sakshi News home page

ఒకటి.. రెండు.. మూడు.. మెగాస్టార్ వచ్చేస్తున్నాడు?!

Published Thu, Oct 1 2015 11:58 PM | Last Updated on Sun, Sep 3 2017 10:18 AM

ఒకటి.. రెండు.. మూడు.. మెగాస్టార్ వచ్చేస్తున్నాడు?!

ఒకటి.. రెండు.. మూడు.. మెగాస్టార్ వచ్చేస్తున్నాడు?!

ఊరంతా అనుకుంటున్నది కన్‌ఫర్మ్ అయితే... తమిళ దర్శకుడు మురుగదాస్ కథతో చిరంజీవి తెరపైకి రావడం గత పన్నెండేళ్ళలో ఇది ముచ్చటగా మూడోసారి. గతంలో చిరంజీవి రాజకీయ తెరంగేట్రానికి మెట్లుగా  పనికొచ్చిన ‘ఠాగూర్’ (2003), ‘స్టాలిన్’ (2006) చిత్రాలు కూడా మురుగదాస్ అందించిన కథలే! ఇప్పుడీ ‘కత్తి’ ముచ్చటగా మూడోది. ఈ మూడు సినిమాల కథలూ సమకాలీన అంశాలను ప్రస్తావిస్తూ, సమాజంలోని లోపాలను ఎత్తిచూపేవే కావడం యాదృచ్ఛికం అనుకోలేం.
 
 అవినీతిపై పోరాడే ‘ఠాగూర్’
 కొత్త మిలీనియమ్ ఆరంభమయ్యాక రాజకీయ అంశాలున్న కథలతో చిరంజీవి సినిమాలు చేయడానికి ‘ఠాగూర్’ శ్రీకారం చుట్టింది. ‘యాంటీ కరప్షన్ ఫోర్స్’ (ఏ.సి.ఎఫ్)ను స్థాపించి, అవినీతిపై పోరాడే ప్రొఫెసర్‌గా అందులో చిరంజీవిది టైటిల్ రోల్. తమిళ స్టార్ విజయ్‌కాంత్‌కు కలిసొచ్చిన ‘రమణ’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ఈ స్క్రిప్ట్ రీమేక్ ప్రతిపాదన హీరో రాజశేఖర్ దగ్గరకు వెళ్ళినా, ఆఖరుకు అదృష్టం చిరంజీవి దగ్గరకు వచ్చి ఆగింది. ఆసుపత్రుల నుంచి ఆఫీసుల దాకా ప్రతిచోటా పెరిగిపోయిన అవినీతి, లంచగొండితనాలపై సంధించిన సెల్యులాయిడ్ అస్త్రం ఈ స్క్రిప్ట్. ‘తెలుగు భాషలో నాకు నచ్చిన ఒకే ఒక్క మాట- క్షమించడం’ అనే డైలాగ్ ఎవర్‌గ్రీన్. ఈ చిత్రం తర్వాత నుంచి చిరంజీవి ఫిల్మ్ కెరీర్ కొత్త దోవ పట్టింది. ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ధారపోశాను...’ అన్న శ్రీశ్రీ కవితా మకుటంతో ఆ సినిమాకు సుద్దాల అశోక్‌తేజతో ప్రత్యేకంగా పాట రాయించారు. ఉత్తేజం నింపే ఆ పాట, దాని బాణీయే ఆ తరువాత చిరంజీవి రాజకీయ అరంగేట్రానికి ప్రచార గీతం, సంగీతమయ్యాయి.
 
మెరుగైన సమాజం కోసం... ‘స్టాలిన్’
కదులుతున్న సినీ సింహాసనానికి మళ్ళీ స్థిరత్వం తెచ్చిన ‘ఇంద్ర’, బాక్సాఫీస్ రికార్డ్‌ల బాద్‌షా అని చాటడానికి మరోసారి ఉపయోగపడ్డ ‘ఠాగూర్’ ఇచ్చిన ఊపు తరువాత చిరంజీవి ఆలోచనలో పడ్డారు. అంతర్గత రాజకీయ ఆకాంక్షలకు తగ్గ కథ కోసం అన్వేషించసాగారు. అప్పుడు మళ్ళీ మురుగదాసే కనిపించారు. ఈ సారి మురుగదాస్‌కు కథతో పాటు మెగాఫోన్ బాధ్యతలూ ఆయన అప్పగించేశారు. అలా వచ్చిందే - ‘స్టాలిన్’. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మెరుగైన సమాజంగా మార్చడమే లక్ష్యంగా పనిచేసే మాజీ సైనికాధికారిగా, కార్గిల్ యుద్ధంలో పోరాడిన మేజర్ పాత్రను చిరంజీవి ధరించారు. ప్రతి మనిషీ ముగ్గురికి సాయం చేయాలనీ... సాయం అందుకున్న ఆ ముగ్గురూ - ఒక్కొక్కరూ మరో ముగ్గురికి సహాయ హస్తం అందించాలనీ... అలా అది తెగిపోని గొలుసులా సాగిపోవాలనే అంశం చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. అంతకు సరిగ్గా ఆరేళ్ళ ముందు 2000లో ‘పే ఇట్ ఫార్వర్డ్’ అనే ఇంగ్లీషు నవల ఆధారంగా అదే పేరుతో తయారైన అమెరికన్ సినిమా దీనికి స్ఫూర్తి.
 
‘కత్తి’ కథేమిటంటే..
.
 తమిళనాట కొత్త సినిమా రిలీజ్‌లకు పండగైన దీపావళికి గత అక్టోబర్ 22న విజయ్ ‘కత్తి’ విడుదలైంది. విజయ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో సమంత హీరోయిన్. ‘కత్తి’ కథను సమకాలీన సమాజంపై మురుగదాస్ వ్యాఖ్యానం అనుకోవచ్చు. కార్పొరేట్ సంస్థల దురాక్రమణలతో ఉపాధి కోల్పోయి, దిక్కుతోచని రైతులు ఆత్మహత్యలకు పాల్పడడమనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. చూడడానికి ఒకేలా కనిపించే కదిరేశన్, జీవానందం - అనే ఇద్దరు ప్రధాన పాత్రధారులు. రైతుల కోసం పోరాడే ప్రగతిశీలవాది జీవానందం. అల్లరి చిల్లరిగా ఉండే ఖైదీ కదిరేశన్ అలియాస్ ‘కత్తి’. రెండు పాత్రలూ విజయ్ పోషించారు. గూండాల బారినపడి, బుల్లెట్ గాయమైన జీవానందాన్ని అనుకోని పరిస్థితుల్లో ‘కత్తి’ చూస్తాడు. చూడడానికి తనలానే ఉన్న అతని కథ, పీడిత ప్రజానీకం పక్షాన అతను చేస్తున్న ఉద్యమం తెలుసుకొంటాడు. అతని స్థానంలోకి తాను వెళతాడు. రైతుల పక్షాన స్వయంగా పోరాటం చేస్తాడు. దుష్ట రాజకీయ నాయకుల మెడలు వంచుతాడు. పొలిటికల్ సెటైర్లు పుష్కలంగా ఉన్న ఈ సినిమా గత ఏడాది తమిళనాట హయ్యస్ట్ గ్రాసర్! ఈ కథనే ఇప్పుడు చిరంజీవి తనకు తగ్గట్లు మార్చుకొని, రీమేక్ చేస్తారట!

వెరసి, చిరంజీవి సినిమా కెరీర్‌ను గమనిస్తే - ఈ కొత్త సినిమా ‘కత్తి’ రీమేక్‌తో కలుపుకొని ఆయన హీరోగా నటించిన గత ఎనిమిది సినిమాల్లో మూడు మురుగదాస్ కథలే! రాజకీయాల్లోకి వస్తున్నప్పటి నుంచి చిరంజీవికి సామాజిక స్పృహ ఉన్న దర్శకుడు, ఆయన కథలు సరిగ్గా టైమ్‌కి కలిసొచ్చాయి. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన కథలంటే ఇవేనేమో!

వినయాన్ని విజయం వరించింది!
చిరంజీవి హీరోగా చేసే కొత్త సినిమా స్క్రిప్ట్ కోసం నిజానికి చాలా నెలలుగా, చాలా కసరత్తే జరిగింది. పరుచూరి బ్రదర్స్ లాంటి సీనియర్స్ ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ లాంటి శక్తిమంతమైన స్వాతంత్య్ర సమరయోధుడి పాత్రలతో స్టోరీలైన్స్ సిద్ధం చేశారు. దర్శకుడు పూరి జగన్నాథ్, రచయిత బి.వి.ఎస్. రవి ‘ఆటో జానీ’ లాంటి మాస్ ఎంటర్‌టైనర్ స్క్రిప్ట్స్ చిరంజీవికి వినిపించారు. ‘ఇంద్ర’ కథా రచయిత చిన్నికృష్ణ కూడా కలానికి పదునుపెట్టారు. పూరితో చిరు సినిమా దాదాపు ఖరారైనా, ఆఖరి క్షణంలో సెకండాఫ్ తృప్తికరంగా లేదంటూ బ్రేక్ పడింది. ‘ఆ మాట మీడియా ముందు కాకుండా, నాతో చెబితే మార్పులు చేసేవాణ్ణి’ అంటూ బర్త్‌డే ఇంటర్వ్యూలో పూరి అన్నారు. ఆ వెంటనే, ‘ఎన్ని స్క్రిప్ట్‌లైనా చేస్తాను. 150 కాకపోతే, 151వ సినిమా అయినా చేస్తాను. చిరంజీవితో సినిమా చేయడమే నా కోరిక’ అంటూ ప్రకటన కూడా ఇచ్చారు. తీరా ఆయన ఆ మాట అని ఇరవైనాలుగు గంటలైనా గడవక ముందే ఈ ‘కత్తి’ రీమేక్ వార్త ప్రచారంలోకి వచ్చింది. చిరంజీవి సినిమాకు దర్శకుడిగా వినయ్ (వి.వి. వినాయక్‌ను ముద్దుగా అందరూ అలా పిలుస్తుంటారు) అవకాశం దక్కిందహో అని కృష్ణానగర్ కోడై కూస్తోంది.
 
మెగాసిప్ హల్‌చల్!
సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెర పడనుందా? ఎప్పుడెప్పుడా అని సినీప్రియులు, ‘మెగా’ అభిమానులు ఎదురుచూస్తున్న క్షణాలు వచ్చేశాయా? చిరంజీవి పూర్తి స్థాయిలో కథానాయకుడిగా మళ్ళీ తెరపై చిందేసే కథ కన్‌ఫర్మ్ అయిందా? అవునండీ..! అవును!! అత్యంత విశ్వసనీయమైన కృష్ణానగర్ ఖబర్. సినిమా సందళ్ళేమీ లేకుండా స్తబ్ధుగా ఉన్న గురువారం నాడు మధ్యాహ్నం దాటాక ఈ బ్రేకింగ్ న్యూస్ ఫిల్మ్‌నగర్‌లో సంచలనం రేపింది. అందరి నోటా అదే చర్చ... కుమారుడు రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘బ్రూస్‌లీ... ది ఫైటర్’లో అతిథి పాత్రపోషణతో ఇప్పటికే వార్తల్లోకెక్కిన తెలుగుతెర ‘మెగాస్టార్’ ఇక హీరోగా రీ-ఎంట్రీ ఇవ్వనున్నారట! సరైన స్క్రిప్ట్ కోసం అనేక నెలలుగా అన్వేషణలో ఉన్న చిరంజీవి ఎట్టకేలకు కథపై ఒక క్లారిటీకి వచ్చారట! దర్శకుడెవరనేదీ ఒక స్పష్టత తెచ్చుకున్నారట!

అధికారిక ప్రకటన... ఇవాళే?
విశ్వసనీయ సమాచారం ప్రకారం సరిగ్గా ఏడాది క్రితం తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన ‘కత్తి’ (2014) సినిమా స్క్రిప్ట్‌తో తెలుగుతెరపై మెగా రీ-ఎంట్రీకి చిరంజీవి సిద్ధమవుతున్నారట. ఏ.ఆర్. మురుగదాస్ రచన, దర్శకత్వం వహించిన ఈ తమిళ స్క్రిప్ట్‌ను మెగాస్టార్ ఇమేజ్‌కు తగ్గట్లు తీర్చిదిద్దే పని ప్రస్తుతం ముమ్మరంగా సాగుతోంది. మాస్ పల్స్ తెలిసిన కమర్షియల్ చిత్రాల దర్శకుడు వి.వి. వినాయక్ ఈ రీమేక్‌కు సారథ్యం వహించనున్నట్లు బోగట్టా. ఈ చిత్రానికి రామ్‌చరణే నిర్మాతగా వ్యవహరిస్తారట. ఈ వివరాలను చిరంజీవే ప్రకటించే అవకాశం ఉందని మెగా కాంపౌండ్‌లోని ఆంతరంగిక వర్గాల కథనం. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే రామ్‌చరణ్ ‘బ్రూస్‌లీ’ పాటల విడుదల వేడుకలో చిరంజీవి పాల్గొంటున్నారు. ఆ సినిమాలో 3 నిమిషాల ఫైట్ సీక్వెన్స్‌లో అతిథిగా అలరిస్తున్న చిరంజీవి - ఈ ఆడియో ఆవిష్కరణోత్సవంలో ‘కత్తి’ రీమేక్ ఖబర్‌ను అభిమానుల సాక్షిగా అధికారికంగా వెల్లడించవచ్చు.
 
డబ్బింగ్... అయిపోయింది!
 విజయ్ ‘కత్తి’ సినిమాను అదే పేరుతో మొదట తెలుగులో డబ్బింగ్ చేయాలనుకున్నారు. ‘ఠాగూర్’ చిత్ర నిర్మాణంతో ‘ఠాగూర్’ మధుగా పేరు తెచ్చుకున్న నిర్మాత - డిస్ట్రిబ్యూటర్ బి. మధు తమిళ ‘కత్తి’ రైట్స్ కొన్నారు. డబ్బింగ్ కూడా పూర్తి చేసేశారు. మరికొద్ది రోజుల్లో రిలీజ్ అనుకుంటున్న టైమ్‌లో, తమిళంలో సూపర్‌హిట్టయిన ఈ సినిమాను రీమేక్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. పవన్‌కల్యాణ్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, ఎన్టీయార్ - ఇలా పలువురు హీరోల పేర్లూ ఆ రీమేక్‌కు వినిపించాయి. వారు తమిళ ఒరిజినల్ చూడడమూ జరిగింది. చిన్న ఎన్టీయార్‌తో రీమేక్ దాదాపు ఖాయమనే దాకా కథ వచ్చింది. కానీ, ఏదీ తేలలేదు. ఇంతలో ఇప్పుడు యాంటీ క్లైమాక్స్ లాగా కథలో ట్విస్ట్. సమకాలీన రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం మీద వ్యంగ్యబాణాలు విసిరే ఈ స్క్రిప్ట్ వైపు చిరంజీవి మొగ్గారట. సామాజిక స్పృహ ఉన్న ఈ కథ జోరు తగ్గిన ఆయన పొలిటికల్ ఇన్నింగ్స్‌కు మళ్ళీ ఊపు తెస్తుందనీ, సినిమాల్లో రీ-ఎంట్రీకి పర్‌ఫెక్ట్ స్క్రిప్ట్ అవుతుందనీ పరిశీలకుల అంచనా.
 
 నైన్ ఇయర్స్ ఇచ్!
 మురుగదాస్ దర్శకత్వంలోని ‘స్టాలిన్’ తరువాత చిరంజీవి హీరోగా నటించింది ఒకే ఒక్క సినిమా - ‘శంకర్‌దాదా జిందాబాద్’ (2007 జూలై 27)లోనే. ఆ తరువాత ఆయన తెరపై కనిపించిన రెండూ- ‘మగధీర’, రానున్న ‘బ్రూస్‌లీ’- తనయుడు రామ్‌చరణ్ సినిమాలే. పైగా, ఆ రెండిటిలోనూ చిరువి అతిథి పాత్రలే. ఇప్పుడు పూర్తిస్థాయి హీరోగా ఆయన నటించే ‘కత్తి’ రీమేక్ గనక షూటింగ్ మొదలెడితే, రిలీజవడానికి వచ్చే 2016 ఫస్టాఫ్ అవుతుంది. అంటే... హీరోగా రీ-ఎంట్రీకి ‘నైన్ ఇయర్స్ ఇచ్’ తీరి, సరిగ్గా తొమ్మిదేళ్ళ తరువాత మెగా సందడి చేస్తారన్న మాట!
 
 అరవైలోనూ... అదే ఊపు

 మొన్న ఆగస్టు 22నే చిరంజీవికి 60 ఏళ్ళు నిండాయి. అయినా, విదేశీ, స్వదేశీ చికిత్సలు, ఎక్సర్‌సైజ్‌లు, ఆహారపుటలవాట్లతో నాలుగు పదుల కుర్రాడిలా తయారయ్యారు. మొన్న సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘బ్రూస్‌లీ’లో ఆయన ఫైట్స్ చేసిన తీరు చూసి, సెట్స్‌లో యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోయారు. ‘ఇవాళ్టికీ మ్యూజిక్ ఆన్ చేస్తే చాలు... శరీరంలోని అణువణువూ డ్యాన్స్ చేస్తుం’దంటూ చాలా ఉత్సాహంగా చెప్పే చిరంజీవి ఇప్పుడీ ‘కత్తి’ రీమేక్‌లోనూ తన మునుపటి డ్యాన్సులు, ఫైట్లతో అలరించే అవకాశాలు పుష్కలం. అభిమానధనంజీవి చిరంజీవికి ఆల్ ది బెస్ట్!

- రెంటాల జయదేవ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement