విలువైన పుస్తకం- టిబెట్‌లో 15 నెలలు
రాహుల్ సాంకృత్యాయన్ భారతీయ వాంగ్మయ పరిశోధనా రంగంలో ఒక ఆరని దీపం. హిందీ సాహిత్యంలో యాత్రా సాహిత్య పితామహుడిగా గుర్తింపు పొందాడు. జీవితంలో ప్రధానభాగం యాత్రల్లో గడిపిన నిత్యపథికుడు. ఆయన ప్రసిద్ధ పుస్తకం ‘ఓల్గా నుంచి గంగా వరకు’ తెలుగునాట విశేష ప్రాచుర్యం పొందింది. ఇతర ఆయన రచనలు కొన్ని, ఆయనపై రచనలు కొన్ని తారసపడుతున్నా ‘టిబెట్‌లో 15 నెలలు’ ఒక విలువైన పుస్తకంగా ఇప్పుడు తెలుగు పాఠకులకు అందింది.
రాహుల్ 1930లలో మొదటిసారి టిబెట్‌లో పర్యటించారు. బౌద్ధ వాంగ్మయ అన్వేషణలో భాగంగా మొదట సింహళానికి, అక్కడి నుంటి టిబెట్‌కు ప్రయాణం కట్టారు. కాని టిబెట్‌కు వెళ్లడం ఆ రోజుల్లో ఏ మాత్రం సులభం, క్షేమం కాదు. బ్రిటిష్ పాలకులు, నేపాల్ పాలకులు, టిబెట్ పెత్తందార్లు... వీళ్లందరి కళ్లూ గప్పాల్సి ఉంటుంది. రాహుల్ అవంతా సమర్థంగా చేయగలిగారు. అంతేకాదు కళ్లకు కట్టినట్టుగా రాసి 1934లో పుస్తకంగా వెలువరించారు. ‘తిబ్బత్ మే సవా బరస్’ పేరుతో వెలువడిన ఆ పుస్తకం ఇన్నాళ్లకు టిబెట్‌లో 15 నెలలుగా అనువాదమై వచ్చింది. ఒక కాలంనాటి భౌతిక, రాజకీయ, ఆధ్మాత్మిక దశను తెలుసుకోవాలంటే ఇదో విలువైన మార్గంగా అనిపిస్తుంది. పారనంది నిర్మల చేసిన అనువాదం సరళంగా ఉన్నా అక్కడక్కడా హిందీ స్వభావాన్ని వీడిపోలేదు. అయినప్పటికీ ఇది మంచి ప్రయత్నం. ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం.
టిబెట్‌లో 15 నెలలు- రాహుల్ సాంకృత్యాయన్ పుస్తకానికి అనువాదం.
తెలుగు: పారనంది నిర్మల. వెల: రూ.225 ప్రతులకు: 0891- 2504986