బుచ్చయ్యా.. ఇదేం పనయ్యా? | gorantla buchaiah chowdary thrown woman at rajahmundry | Sakshi
Sakshi News home page

బుచ్చయ్యా.. ఇదేం పనయ్యా?

Published Fri, Jan 3 2014 2:14 PM | Last Updated on Fri, Jul 12 2019 5:45 PM

బుచ్చయ్యా.. ఇదేం పనయ్యా? - Sakshi

బుచ్చయ్యా.. ఇదేం పనయ్యా?

చదివేస్తే ఉన్న మతి పోయిందన్న చందంగా తయారయింది మన రాజకీయ నాయకుల తీరు. ప్రజలకు మంచి చేయకపోయినా చెడు మాత్రం చేయకూడన్న ప్రాథమిక సూత్రాన్ని మన నేతాశ్రీలు ఎప్పుడో మర్చిపోయారు. ఎన్నికల జాతరలో ఖర్చు చేసిన సొమ్ములను నొల్లుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్న నేతాగణం వైఖరి విస్మయపరుస్తోంది. స్వప్రయోజనాల కోసం పేదల కడుపు కొట్టేందుకు కూడా వెనుకాడకపోవడం చూస్తుంటే రాజకీయ నాయకులు ఎంతగా దిగజారిపోతున్నారో అర్థమవుతోంది. ఆధిప్య పోరుతో అమాయకుల జీవితాలతో చెలగాటం ఆడేందుకు కూడా సందేహించడం లేదు.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తాజాగా జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. పేదలకు ఇళ్లు కేటాయించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి వీరంగం ఆడడంతో స్థానికులు అవాక్కయ్యారు. ఆధిపత్యం కోసం పేదల చిరకాల స్వప్నాన్ని భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. తమ పార్టీ ఎమ్మెల్యేను ఆహ్వానించలేదన్న అక్కసుతో తన అనుచురులతో కలిసి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కుట్ర చేశారు. అటు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు కూడా తానేం తక్కువ తినలేదన్నట్టుగా వ్యవహరించారు.

తమ సొంతింటి కలను భగ్నం చేయడానికి వచ్చిన బుచ్చయ్య చౌదరిపై బడుగులు భగ్గుమన్నారు. తమ పాలిట సైంధవుడిలా మారిన గోరంట్ల, ఆయన అనుచరులపై విరుచుకుపడ్డారు. రాళ్లతో తరిమి కొట్టారు. మహిళలు చెప్పులు చూపిస్తూ శాపనార్థాలు పెట్టారు. రోడ్డు మీది దుమ్మెత్తి పోశారు. ఈ పరిణామాన్ని ఊహించని గోరంట్ల మ్లానవదనంతో, అవమానభారంతో అక్కడి నుంచి ఉడాయించాల్సి వచ్చింది. అయితే తనకడ్డొచ్చిన మహిళలను తోసుకుంటూ గోరంట్ల పలాయనం చిత్తగించారు. మహిళలు అని కూడా చూడకుండా పక్కకు గెంటేసి పారిపోయారు.

పిల్లిని కూడా గదిలో బంధించి కొడితే పులిలా తిరగబడుతుందంటారు. పేదవాడు కన్నెర్ర చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో రాజమండ్రి ఘటన కళ్లకు కట్టింది. తమ కష్టార్జితాన్ని తక్కువ చేసి చూస్తే సహించబోమని చాటారు. తమకు మంచి చేయకపోయిన ఫర్వాలేదు గాని, చెడు చేసేందుకు ప్రయత్నిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని చెప్పకనే చెప్పారు. గతంలో ఎన్నడూ చోటు చేసుకోని ఈ పరిణామం నేతలకు వణుకు పుట్టించగా, జనంలో వచ్చిన కొత్త చైతన్యాన్ని చాటి చెప్పింది. ప్రజాగ్రహం ముందు ఎంతటి నాయకుడైనా తలవంచాల్సిందేనని నిరూపిస్తోందీ ఘటన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement