నలుగుర్ని మింగిన మ్యాన్‌హోల్
► డ్రైనేజీ పనులు చేస్తూ ముగ్గురు,
► కాపాడబోయి మరొకరు మృతి
► జలమండలి, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో బలి
► మృతుల కుటుంబాలకు రూ.2.5 లక్షల చొప్పున నష్టపరిహారం
సాక్షి, హైదరాబాద్: మృత్యు కుహరాల్లా మారిన మ్యాన్‌హోల్‌లు నలుగురిని మింగేశాయి. జలమండలి అధికారులు, పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. రెక్కాడితేగాని డొక్కాడని ముగ్గురు కార్మికులతోపాటు వారిని కాపాడబోయిన మరో వ్యక్తి మృత్యువాత పడ్డారు. మాదాపూర్‌లో ఈ దుర్ఘటన జరిగింది.
ఒకరి వెనుక ఒకరు..
జీఎస్‌కే-విశ్వ ఇన్‌ఫ్రా కంపెనీకి చెందిన కాంట్రాక్టర్ శనివారం మాదాపూర్ ప్రాంతంలో డ్రైనేజీ పనులు చేసేందుకు మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన ఆరుగురు కార్మికులను తీసుకువచ్చాడు. ఉదయం నుంచి పలు చోట్ల డ్రైనేజీ పూడికతీశారు. సాయంత్రం పనులు ముగిసే సమయంలో అక్కడే ఉన్న ఓ మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసేందుకు.. అందులోకి దిగారు. తొలుత ఓ.నాగేశ్ (32), పి.సత్యనారాయణ (38) లోపలికి దిగారు. అయితే లోపలి నుంచి ఎలాంటి అలికిడి రాకపోవడంతో మేస్త్రీ పి.శ్రీనివాస్ (38) కూడా మ్యాన్‌హోల్‌లోకి వెళ్లాడు. ఆ ముగ్గురిలో ఎవరూ పైకి తిరిగి రాకపోవడంతో.. పైన ఉన్న మిగతా కార్మికులు అటువైపు వెళుతున్నవారికి విషయం చెప్పారు. వారిలో కొందరు 108కు సమాచారం ఇచ్చారు.
అయితే బైక్‌పై ఆ దారిలో వెళుతున్న గంగాధర్ (35) అనే వ్యక్తి విషయం తెలుసుకుని తాడు సహాయంతో మ్యాన్‌హోల్‌లోకి దిగాడు. కానీ ఆయన కూడా పైకి రాలేదు. కొద్దిసేపటికి 108 అంబులెన్స్ రాగా.. దాని డ్రైవర్ చంద్రశేఖరాచారి తాడు సహాయంతో లోపలికి దిగాడు. ఆయనా అందులోనే పడిపోయాడు. కొద్దిసేపటికే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. జేసీబీలతో మ్యాన్‌హోల్ పైభాగాన్ని పగలగొట్టి, మాస్కులతో లోపలికి దిగి.. అందరినీ పైకి తీశారు. అయితే అప్పటికే నాగేశ్, పి.సత్యనారాయణ, పి.శ్రీనివాస్, గంగాధర్ మరణించారు. అపస్మారక స్థితిలో ఉన్న 108 డ్రైవర్ చంద్రశేఖరాచారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
విష వాయువుల కారణంగానే..
వంద అడుగుల వెడల్పు రోడ్డుపై ఉన్న మ్యాన్‌హోల్ దాదాపు 20 అడుగుల లోతు ఉంది. ఉదయం నుంచి డ్రైనేజీ పనులు చేస్తున్న కార్మికులు... పైపులోని పూడికను తీసేందుకు వీలుగా మురుగునీటిని అడ్డుకునేందుకు అక్కడక్కడా బస్తాలు, సిమెంట్‌తో తాత్కాలికంగా గోడ కట్టారు. మాదాపూర్ ప్రధాన రహదారి నుంచి పనులు చేసుకుంటూ వచ్చారు. చివరగా మ్యాన్‌హోల్ వద్ద పనులు చేస్తున్నారు. ఆ సమయంలో పైపులో అడ్డుగా పెట్టిన బస్తాలు, సిమెంట్ గోడను తొలగించడంతో ఒక్కసారిగా మురుగు నీరు వచ్చింది. అప్పటికే పైప్‌లైన్‌లో నిండిపోయి ఉన్న విష వాయువులన్నీ మ్యాన్‌హోల్‌లోకి చేరి.. కార్మికులు ఊపిరాడక మృతి చెందారని భావిస్తున్నారు.
కాగా ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2.5 లక్షల వంతున నష్ట పరిహారం అందజేస్తామని జలమండలి ఎండీ దానకిశోర్ ప్రకటించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి నలుగురి మరణానికి కారణమైన జీఎస్‌కే సంస్థపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు జల మండలి వర్గాలు తెలిపాయి. దుర్ఘటనపై విచారణకు జలమండలి ఈడీ సత్యనారాయణ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నాయి.
పనిముగిశాక మళ్లీ రమ్మన్నారు
ఉదయం పది గంటల నుంచి డ్రైనేజీ పనులు చేస్తున్నామని కార్మికులు కె.శ్రీనివాస్, యాదయ్య, రాములు చెప్పారు. సాయంత్రం 5 గంటలకు పని ముగించుకుని వెళ్తుండగా కాంట్రాక్టర్ నుంచి ఫోన్ రావడంతో.. సూపర్‌వైజర్ మళ్లీ మ్యాన్‌హోల్ వద్దకు తీసుకెళ్లాడని తెలిపారు. అదొక్కటీ శుభ్రం చేసి రమ్మంటూ లోపలికి పంపించాడన్నారు. ఆ మ్యాన్‌హోల్‌కి దిగకపోతే అందరూ బతికేవారని వాపోయారు.
కాపాడబోయి..
ప్రమాదంలో మరణించిన గంగాధర్ స్వస్థలం కర్నూలు జిల్లా మద్దిగార మండలం పత్తికొండ గ్రామం. హైదరాబాద్‌లో అల్లాపూర్‌లోని వివేకానంద్‌నగర్‌లో నివాసం ఉంటూ.. ఓ ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆ దారిలో బైక్‌పై వెళుతూ ప్రమాదం విషయం తెలిసి, తాడుతో మ్యాన్‌హోల్‌లోకి దిగాడు. విష వాయువుల కారణంగా ఊపిరాడక మరణించాడు. గంగాధర్‌కు భార్య లక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
బ్లాక్‌లిస్టులో పెట్టాం.. అయినా
ఇటీవలే మాదాపూర్‌లోని ఓ మ్యాన్‌హోల్‌లో ఒక కార్మికుడు మృతిచెందడంతో అక్కడ పనులు చేపట్టిన జీఎస్‌కె-విశ్వ ఇన్‌ఫ్రా సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టాం. ఆ సంస్థ చేపట్టిన పనులన్నీ నిలిపివేయాలని ఉత్తర్వులిచ్చాం. అయినా ఆ కంపెనీ క్షేత్రస్థాయి అధికారులపై ఒత్తిడి తెచ్చి మిగిలిపోయిన పనులను చేపట్టినట్లు మా దృష్టికి వచ్చింది. ఇప్పడు జరిగిన దుర్ఘటనకు ఆ కంపెనీ నిర్లక్ష్యమే కారణమని భావిస్తున్నాం. నైపుణ్యం లేని కార్మికులను మ్యాన్‌హోల్‌లోకి దించినట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేస్తాం. కాంట్రాక్టు సంస్థ గుర్తింపును రద్దు చేస్తాం..’’ - దానకిశోర్, హైదరాబాద్ జల మండలి ఎండీ