అంగారక గ్రహంలో మనిషి కట్టబోయే ఇళ్ల డిజైన్!
ఆ మధ్య ఎలన్ మస్క్ అనే ఓ టెకీ.. ఇంకొన్నేళ్లలో మనిషిని అంగారకుడిపైకి పంపించేస్తానని చెప్పేశాడు.
ఆ మధ్య ఎలన్ మస్క్ అనే ఓ టెకీ.. ఇంకొన్నేళ్లలో మనిషిని అంగారకుడిపైకి పంపించేస్తానని చెప్పేశాడు. నాసా కోసం నింగిలోకి రాకెట్లు పంపిస్తున్న ఈ వ్యక్తి అంత సమర్థుడే. సరే.. అరుణ గ్రహం పైకి.. అదేనండి మార్స్‌పైకి మనిషి పంపుతారు సరే..
వాళ్లక్కడ ఎలా ఉంటారు? ఏం తింటారు? ఎక్కడ పడుకుంటారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతికే ప్రయత్నం చేస్తోంది... అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా ఆధ్వర్యంలోని ‘మార్స్ సిటీ డిజైన్’ సంస్థ. రాకెట్ల తయారీ మొదలుకొని అననుకూల పరిస్థితుల్లో వ్యవసాయం వరకూ అన్ని రంగాల్లో కొత్త కొత్త ఆవిష్కరణలకు అవకాశం కల్పించేలా ఈ సంస్థ పోటీలు నిర్వహిస్తూంటుంది. అంతిమ లక్ష్యం మాత్రం ఒకటే... అంగారకుడిపై ఓ అద్భుతమైన నగరాన్ని కట్టేయాలి!
ఇప్పుడు ఫొటోల్లోని విషయానికి వద్దాం. ఇవన్నీ ఈ ఏడాది ‘మార్స్ సిటీ డిజైన్’ పెట్టిన పోటీకి వేర్వేరు సంస్థలు ప్రతిపాదించిన డిజైన్లు! పచ్చటి గోళాలు కనిపిస్తున్నాయే... గ్రీన్‌క్లౌడ్ సిటీ అనే పేరున్న ఆ పచ్చటి గోళాల డిజైన్ ఫస్ట్‌ప్రైజ్ సాధించింది. దీని ప్రకారం... అంగారకుడిపై పచ్చటి గోళాల్లాంటివి తేలియాడుతూ ఉంటాయి. వీటిల్లో పంటలు పండిస్తే.. అణువిద్యుత్తు సాయంతో ఆ గ్రహంపై జీవనం సాగుతుంది. ఇక గలాటిక్ ఫార్మ్స్ అనే సంస్థ అక్కడి వనరులను ఉపయోగించుకుని ఎరువులను ఎలా తయారు చేయవచ్చో చూపింది. ఇంకో సంస్థ కొన్ని రకాల పేలుళ్ల ద్వారా శక్తిని ఉత్పత్తి చేసి వాడుకోవచ్చునని ప్రతిపాదించింది. వీటన్నిటిలో ప్రాధాన్య స్థానాల్లో నిలిచిన డిజైన్లతో మొదట మొజావే ఎడారిలో (ఉత్తర అమెరికా) కొన్ని నమూనా భవనాలను కట్టి పరీక్షిస్తారు. అన్నీ సవ్యంగా ఉంటే... భవిష్యత్తులో ఇవే అంగారక గ్రహంలో మన ఇళ్లవుతాయేమో!
మనిషి అంగారకుడిపైకి చేరుకున్నాక నిర్మాణం అయ్యే ఇళ్ల తొలి టెక్నాలజీ ఇలా ఉండొచ్చు.
ప్రతికూల పరిస్థితుల్లోనూ మనిషి మనుగడ సాగించేలా అక్కడి నిర్మాణాలు ఉంటాయి.