
ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో...
బోస్టన్ : మసాచుసెట్స్‌లోని న్యూటన్ హైవే. ఓ టెస్‌లా కారు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతోంది. అదే వేగంతో టెస్‌లా కారు పక్కగా చేరింది మరో కారు. ఆ కారు నడుపుతున్న డకోటా రాండల్ అనే వ్యక్తి టెస్‌లా కారులోకి చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. టెస్‌లా కారు నడుపుతున్న డ్రైవర్, అతడి పక్కనే ఉన్న మరోవ్యక్తి నిద్రపోయి ఉండటంతో కంగారుపడ్డాడు. వాళ్లను లేపటానికి రాండల్ తన కారు హారన్‌ను మోగించాడు. అయినా లాభంలేకపోయింది. దీంతో ఆ దృశ్యాలను వీడియో తీసిన రాండల్ దాన్ని తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘ఎంత అలసిపోతే మాత్రం.. డ్రైవింగ్ చేస్తున్నపుడు నిద్రపోతారా?. టెస్‌లా కారా మజాకా!’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
దీనిపై స్పందించిన టెస్‌లా కంపెనీ ప్రతినిధి.. తమ కారులో ఆటోపైలట్ ఫంక్షన్ ఉంటుందని, అయినప్పటికి డ్రైవర్ అప్రమత్తత ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. హైవేలో ప్రయాణం చేస్తున్నపుడు డ్రైవర్ చేతులు స్టీరింగ్‌పై లేకపోతే ప్రతి 30 సెకన్లకు ఒకసారి ప్రమాద సూచనలు చేస్తుంటుందని, అలాంటప్పుడుకూడా ఆటోపైలట్‌లో డ్రైవింగ్ చేయటం ప్రమాదకరమని తెలిపారు.
Some guy literally asleep at the wheel on the Mass Pike (great place for it).
— Dakota Randall (@DakRandall) September 8, 2019
Teslas are sick, I guess? pic.twitter.com/ARSpj1rbVn