మనకు గుర్తులేని...మన అంబేడ్కర్
జ్వరం... 104 డిగ్రీల జ్వరం.ఓపిక చేసుకుని వెళ్దామనుకుంటే శరీరం సహకరించడం లేదు. అక్కడ పిల్లలంతా తన కోసం ఎదురు చూస్తుంటారు.డాక్టర్ పద్మావతికి ఒకటే బెంగ. నాయుడుపేటలో వైద్యురాలు ఆమె. ఆదివారం వస్తే చాలు... నెల్లూరు జిల్లాలోని ఏదో ఒక పల్లెటూరు వెళ్లాల్సిందే. అక్కడి ప్రజలను చైతన్యం కలిగిస్తుంటే ఆమెకదో తృప్తి. ముఖ్యంగా పిల్లలకు అంబేడ్కర్ గురించి చెబుతూ ప్రేరణనిస్తారామె.జ్వరం వల్ల ఈ రోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్. దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించాలి. జ్వరంలోనే డాక్టర్ పద్మావతి మనసు పరిపరి విధాల ఆలోచిస్తోంది.
ఉన్నట్టుండి చిన్న ఆలోచన... ‘అంబేద్కర్’ గురించి సినిమా తీస్తే?ఎస్... నిరక్షరాస్యులకు కూడా అంబేడ్కర్ గురించి తెలియాలంటే సినిమానే కరెక్ట్.జ్వరం తగ్గడం ఆలస్యం... హైదరాబాద్‌లో వాలిపోయారు డాక్టర్ పద్మావతి.ఓ ప్రభుత్వశాఖలో డెరైక్టర్... ఆవిడకు బంధువు అవుతారు.పద్మావతి చెప్పింది విని ఆయన ‘నీకేమన్నా పిచ్చా?’ అన్నట్టుగా చూశారు. కానీ పద్మావతి ఏ మాత్రం తగ్గేలా లేరు. అంబేడ్కర్ హిస్టరీ ఆమెకు చేతివేళ్ళ మీద ఉంటుంది. ఓ రకంగా అంబేడ్కర్ టాపిక్‌లో వికీపీడియా ఆమె.
కానీ, సినిమా తీయడానికి డబ్బుల్లేవు. ఎలా తీయాలో కూడా తెలీదు. కానీ, మనిషి సంకల్పించుకుంటే జరగనిదేముంటుంది? డాక్టర్ పద్మావతి విషయంలో అదే జరిగింది.సినిమా తీయడానికి రాష్ట్ర ఫిలిమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ హెల్ప్... నిర్మాత కేఎస్ రామారావు గెడైన్స్... గుండె నిండా ఆత్మవిశ్వాసం...
ఇంకేం... సినిమా పని మొదలైంది.
అంబేడ్కర్ సినిమా తీస్తున్నారని తెలసి ఓ పెద్ద దర్శకుడు ‘‘నేను చేస్తా’’ అంటూ ముందుకొచ్చాడు. కానీ ఈమెకేమో భయం. చరిత్రను చరిత్రలా కాకుండా, సినిమాటిక్ లిబర్టీస్‌తో కంగాళీ చేసేస్తారేమోనని. అందుకే కొత్త దర్శకుడైతే బెటర్. కేఎస్ రామారావు అప్పుడే ఓ కొత్త డెరైక్టర్‌తో ‘బాయ్‌ఫ్రెండ్’ సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. దాసరి శిష్యుడతను. పేరు... భరత్ పారేపల్లి. అతని పని తీరు, శ్రద్ధ చూసి ‘అంబేద్కర్’కు కరెక్ట్ అనిపించింది. భరత్‌కేమో ఎటూ తేల్చుకోలేని అయోమయం.
‘‘ఏం ఫర్లేదు... ఈ సినిమాతో చరిత్రలో నిలిచిపోతావ్. ఇదయ్యాకే ‘బాయ్‌ఫ్రెండ్ మొదలుపెడదాం’’ అంటూ కేఎస్ రామారావు భరోసా. దాంతో భరత్ ఉత్సాహంగా రంగంలోకి దిగాడు.ఎంవీయస్ హరనాథరావు లాంటి సీనియర్ రైటర్ స్క్రిప్టు చేస్తున్నారు. ఈలోగా భరత్ ‘అంబేద్కర్’ గురించి ఆపోశన పట్టేశారు. పుస్తకాలు, డాక్యుమెంట్లు, పత్రికలూ చదివితే ఎన్ని విషయాలు తెలిశాయో..! కథ రెడీ! చక్రవర్తి-సినారె కాంబినేషన్‌లో పాటలు రెడీ! కెమేరామ్యాన్‌గా ఛోటా కె. నాయుడు రెడీ! అంతా ఓకే గానీ... అసలు చిక్కు టైటిల్ రోల్ దగ్గరొచ్చింది. ‘అంబేద్కర్’ పోలికలతో ఏ ఆర్టిస్టూ దొరకడం లేదు.
ఇంతలో... రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో ‘రాత్రి’ సినిమా చేయడానికొచ్చిన ఓ హిందీ ఆర్టిస్టు గురించి, భరత్‌కు చెప్పారెవరో! కట్ చేస్తే - ఆయన దగ్గర వాలిపోయాడు భరత్. చూసీ చూడగానే - ‘‘మీరే నా అంబేద్కర్’’ అనేశాడు భరత్. అలా అంబేడ్కర్ పాత్ర ఆకాశ్ ఖురానాను వరించింది. మంచి స్టేజ్ ఆర్టిస్టు ఆయన. సరోజినీ నాయుడు పాత్రకు రోహిణీ హట్టంగడిని తీసుకున్నారు. అంబేడ్కర్ భార్య రమాబాయిగా నీనా గుప్తా ఓకే. కేఎస్ రామారావు సోదరుడు బెనర్జీతో నెహ్రూ పాత్ర చేయించారు. మహాత్మాగాంధీగా ప్రొఫెసర్ రోళ్ల శేషగిరిరావు చేశారు. జేవీ సోమయాజులు, శ్రీహరిమూర్తి, చాట్ల శ్రీరాములు, రామచంద్రరావు లాంటి లబ్ధప్రతిష్ఠులంతా ఉన్నారు.
మొత్తం 28 రోజులు షూటింగ్. రాష్ట్ర ఎఫ్‌డీసీ వాళ్లు 27 లక్షలిచ్చారు. మిగతాదంతా డాక్టర్ పద్మావతిది. అవుట్‌పుట్ బ్రహ్మాండంగా వచ్చింది. హైదరాబాద్... చిన్న మద్దాలి... పెద్ద మద్దాలి... ఇవే లొకేషన్లు. 1992 సెప్టెంబర్ 25న సురేశ్ మూవీస్ ద్వారా సినిమా రిలీజ్ చేశారు.సినిమా బాగుంది... డెరైక్టర్ బాగా తీశాడు... ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి... ఇలాంటి ప్రశంసలే తప్ప, గల్లాపెట్టె నిండలేదు. ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా నంది పురస్కారం మాత్రం దక్కింది. ఆకాశ్ ఖురానాకేమో స్పెషల్ జ్యూరీ.అంబేడ్కర్ అందరివాడు. దేశమంతా తెలిసినవాడు. బడుగు వర్గాల గుండెల్లో వెలిసిన భగవంతుడు. ఇంతటివాడి గురించి అలా 1990ల తొలిరోజుల్లోనే బలంగా సినిమా తీసింది మనమే!
మన కన్నా ముందు... మన తర్వాత చాలామంది అంబేడ్కర్ సినిమాలు చేశారు. కానీ వాటిల్లో ది బెస్ట్ అంటే మాత్రం మనదే. 1989లో మరాఠీలో ‘యుగపురుష్ బాబా సాహెబ్ అంబేద్కర్’, కన్నడంలో 1991లో ‘బాలన్ అంబేద్కర్’ సినిమాలొచ్చాయి. మలయాళ నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్రధారిగా దర్శకుడు జబ్బార్ పటేల్ ఇంగ్లీషులో ‘డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్’ చేశారు. 1998లో సెన్సారైన ఈ సినిమా 2000లో విడుదలైంది. ఇంగ్లీషులో ఉత్తమ చలన చిత్రం, ఉత్తమ కళా దర్శకత్వం - ఈ రెండు విభాగాల్లో జాతీయ అవార్డులు అందుకున్న ఈ చిత్రాన్ని మలయాళం, తెలుగుతో సహా అనేక భాషల్లో అనువదించారు.
హిట్టూ, ఫ్లాపూ పక్కనపెడితే... మన ‘అంబేద్కర్’ సినిమా ఓ మంచి ప్రయత్నం. నిజాయతీతో చేసిన ప్రయత్నం. చరిత్రలో మిగిలిపోయే ప్రయత్నం. కానీ, ఇలా ‘అంబేద్కర్’పై తెలుగులో సినిమా వచ్చిందని చాలామందికి గుర్తులేకపోవడం, తెలియకపోవడం దురదృష్టకరం.