మంచి ఐడియాతో తీస్తే... ‘ఐస్‌క్రీమ్’లా ఆర్థిక లాభాలు!
- దాసరి
‘‘ఇది నిజమైన విజయం సాధించిన చిత్రం. మంచి ఐడియాతో తీస్తే, ప్రతి సినిమా ‘ఐస్‌క్రీమ్’లా ఆర్థికంగా లాభాలు తెస్తుంది’’ అని సీనియర్ దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు అన్నారు. నవదీప్, తేజస్వి జంటగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ‘ఐస్‌క్రీమ్’ విజయోత్సవాన్ని బుధవారం జరిపారు. ఈ వేడుకలో దాసరి మాట్లాడుతూ- ‘‘ఫ్లోకామ్ టెక్నాలజీతో అతి తక్కువ ఖర్చుతో వర్మ ఈ సినిమా తీశాడు. పెట్టిన పెట్టుబడికి ఇరవై రెట్లు రాబడి తెచ్చిపెట్టిన చిత్రం ఇది’’ అని చెప్పారు.
రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ - ‘‘విడుదల తర్వాత వచ్చే లాభాలను బట్టి పారితోషికం తీసుకుందామని నటీనటులు, సాంకేతిక నిపుణులతో ముందే చెప్పాను. ఇప్పుడు ప్రతిఫలాన్ని ఆనందంగా అనుభవిస్తాం’’ అన్నారు. రెండు రోజులకు 82 లక్షలు వసూలు చేసిందనీ, తాను, డిస్ట్రిబ్యూటర్లందరూ ఆనందంగా ఉన్నామనీ, వర్మ దర్శకత్వంలోనే ‘ఐస్‌క్రీమ్ 2’ నిర్మిస్తున్నాననీ రామ సత్యనారాయణ తెలిపారు. దాసరి చేతుల మీదుగా చిత్రబృందానికి వారి వారి పారితోషికం చెక్కులను అందజేశారు.
ఆ వ్యాఖ్యలు ఒకరిని ఉద్దేశించినవే!
‘ఐస్‌క్రీమ్’ చిత్రంపై వచ్చిన సమీక్షల విషయంలో రామ్‌గోపాల్‌వర్మ మీడియావారి పట్ల తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే, ఓ వెబ్‌సైట్‌ను ఉద్దేశించి మాత్రమే ఆ మాటలు అన్నాననీ, ఇతరులు బాధపడి ఉంటే క్షమించమని కోరుతున్నానని వర్మ స్పష్టం చేశారు.