షూటింగ్లో ప్రముఖ దర్శకుడిపై దాడి
జైపూర్: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న చారిత్రక సినిమా పద్మావతి షూటింగ్ సెట్స్ను ఆందోళనకారులు ధ్వంసం చేసి, ఆయనపై దాడి చేశారు. రాజ్పుట్ల వంశానికి చెందిన రాణి పద్మినిని అగౌరవపరిచేలా ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ రాజ్పుట్ కర్ణి సేన సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఆందోళనకారులు భన్సాలీకి చెంపదెబ్బ కొట్టి, జుట్టు పట్టుకుని లాగారు. శుక్రవారం రాజస్థాన్ రాజధాని జైపూర్లోని ఓ కోటలో ఈ ఘటన జరిగింది.
పద్మావతి సినిమాలో టైటిల్ రోల్ను దీపికా పదుకోన్ పోషిస్తోంది. అలావుద్దీన్ ఖిల్జీగా రణవీర్ సింగ్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో రాణి పద్మిని, అలావుద్దీన్ మధ్య ప్రేమ సన్నివేశాలు చిత్రీకరించారని ఆందోళనకారులు ఆరోపించారు. పద్మిని ఆత్మాభిమానం గల రాణి అని, చిట్టోర్గఢ్ కోటపై దాడిచేసిన అలావుద్దీన్కు లొంగిపోకుండా ప్రాణత్యాగం చేసిందని చెప్పారు. కోటను ఆక్రమించి, పద్మిని రాణిని సొంతం చేసుకోవాలని ఖిల్జీ ఎదురుచూస్తున్న సమయంలో పద్మిని ఇతర మహిళలతో కలసి ప్రాణత్యాగం చేసిందని చెప్పారు. భన్సాలీ చరిత్రను వక్రీకరించి సినిమా తీస్తే సహించబోమని, ఈ సినిమాలో ఖిల్జీకి, పద్మినికి మధ్య ప్రేమ సన్నివేశాలు ఉంటే తొలగించాలని రాజ్పుట్ కర్ణి సేన డిమాండ్ చేసింది.