మా మధ్య...గొడవలు పెట్టకండి బాబూ! | Trivikram Srinivas Exclusive Interview | Sakshi
Sakshi News home page

మా మధ్య...గొడవలు పెట్టకండి బాబూ!

Published Sun, Apr 12 2015 12:18 AM | Last Updated on Sun, Sep 3 2017 12:10 AM

మా మధ్య...గొడవలు పెట్టకండి బాబూ!

మా మధ్య...గొడవలు పెట్టకండి బాబూ!

 ‘మాటల మాంత్రికుడు’... మంచి మనిషి... మనవైన విలువలను తెరపై చూపెట్టే దర్శకుడు... సంక్లిష్టంగా కాకుండా సరళంగా జీవితాన్ని జీవించమనే సినీ తాత్త్వికుడు... త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఎవరి నిర్వచనం వారిది. ఆయన మాత్రం ఎవరేమన్నా... అవేవీ పట్టించుకోనట్లే ఫకాలున నవ్వేసి... చేయి కలిపి, పక్క నుంచి ముందుకెళ్ళిపోయే పాదరసం. ‘స్వయంవరం’తో స్వతంత్ర సినీ రచయితగా మొదలుపెట్టి, ‘నువ్వే - నువ్వే’తో దర్శకుడైన ఈ భీమవరం బుల్లోడు ఇప్పటికి అరడజను సినిమాలను దర్శకుడిగా అందించారు. మనుషుల మధ్య అనుబంధాలు, మనవైన విలువలను తెరపై ఆవిష్కరించి, మనల్ని మనకే గుర్తుచేసే ఈ దిట్ట అల్లు అర్జున్‌తో తన తాజా ఏడో చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’లోనూ ఆ పనే విజయవంతంగా చేశారు. ఏణ్ణర్ధం క్రితం పవన్‌కల్యాణ్‌తో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ ‘అత్తారింటికి దారేది’ అందించిన త్రివిక్రమ్ తాజా రిలీజ్‌పై సంధించిన ప్రశ్నల పరంపరకిచ్చిన జవాబులు...
 
  ‘సన్నాఫ్ సత్యమూర్తి’కి స్పందన అంచనాలకి తగ్గట్టే ఉందా?
 ప్రతి సినిమాకూ నేను కోరుకునేది ఒకటే - సినిమా కొను క్కున్న బయ్యర్లకు వాళ్ళ డబ్బులు వాళ్ళకు వచ్చేయాలని.  మాట్లాడకుండా చూసేసే మల్టీప్లెక్స్ జనం కన్నా, నవ్వుతూ, ఈలలేస్తూ, తెర మీది కథ నచ్చిందో నచ్చలేదో తమ స్పందన ద్వారా చెప్పేసే సింగిల్ థియేటర్‌లోనే నేనెప్పుడూ సినిమా చూస్తా. హైదరాబాద్ సుదర్శన్‌లో చూశా. సామాన్య ప్రేక్షకుల నుంచి స్పందన బాగుంది. పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తోంది. ప్రాథమికంగా ‘సన్నాఫ్...’ మాస్ సినిమా కాదు కాబట్టి, క్రమంగా కుటుంబ ప్రేక్షకుల్ని ఆకర్షిస్తుంది. మరి కొద్ది రోజులైతే కానీ వాణిజ్య పరంగా సినిమా స్థాయి ఏమిటో తెలియదు. ఇక, నా వరకు అంటారా? కథ రాసి, సినిమా తీయడమే తప్ప, ప్రత్యేకించి అంచనాలు పెట్టుకోను.

  గత చిత్రాలతో పోలిస్తే, ఇందులో వినోదం తగ్గిందని..
 (మధ్యలోనే అందుకుంటూ...) కేవలం వినోదాత్మక కథలే కాక, వేరే కథలు కూడా చెబుతూ ఉండాలి కదా. నేను రాసుకున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ కథను నిజాయతీగా తెర కెక్కించడానికి ప్రయత్నించా. ఆ క్రమంలో ఏ మేరకు కుది రితే అంతే వినోదం ఉంది. ఏవేవో ఐటమ్ ఇరికించలేదు.

  అంటే... హీరోలకు తగ్గట్లు కథలు రాయనంటారు...
 ఆ మాటంటే అబద్ధం. ఒక కథ అనుకున్నాక, ఆ కథలో చేసే హీరోకు తగ్గట్లు కొంత సర్దడం సహజం. కథను నిజాయతీగా తెరకెక్కిస్తూనే, వాణిజ్యపరంగా పెట్టుబడి తిరిగొచ్చేలా డిజైన్ చేస్తుంటాం. అదే సమయంలో నా మటుకు నేను చెప్పాలనుకున్న విలువల గీత దాటకుండా చూసుకుంటా.

  కానీ, హీరో పాత్రను 300 కోట్లొదులుకొనే మంచివాడిగా చూపడం...
 మంచివాళ్ళ కథలు బోరింగ్‌గా ఉంటాయని మనకు అపనమ్మకం. కానీ, ఈ భూమండలంపై అతి మంచివాడిగా కనిపించే రామాయణంలో రాముడి కథే చూడండి - అది ఇప్పటికి ఎన్నో భాషల్లో వచ్చింది. ఎన్నోసార్లు తెరకెక్కింది. ఒక మంచి వాణ్ణి హీరోగా పెట్టుకొని, అతనికి ఎదురయ్యే సవాళ్ళను అతనెదు ర్కొన్న తీరుతో, కథను ఆసక్తికరంగా, ఇష్టపడేలా చెప్పాలని ప్రయత్నించా.

  ఈ చిత్రకథకూ, మీ నిజజీవితానికీ సంబంధం ఉందా?
 నా వ్యక్తిగతం కాదు కానీ, చాలామంది జీవితాల్లో జరిగిన విషయాలు, నా స్నేహితులు, బంధువుల కుటుంబాల్లో జరిగిన కొన్ని ప్రధాన ఘటనల్ని సినిమాకు తగ్గట్లు నాటకీయంగా మలుచుకొని చేశా. ఎమ్మెస్ నారాయణ, రావు రమేశ్‌ల ఘట్టం పశ్చిమగోదావరి జిల్లాలోని వేగేశ్వరపురం అనే చిన్న ఊరులోని మా అమ్మ మేనమామల జీవితం నుంచి ప్రేరణ పొంది తీసుకున్నా. అన్న ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టిన తమ్ముడు, ఆస్తుల గురించి పట్టించుకోకుండా మూడు తరాలుగా కలిసుంటున్న ఆ కుటుంబాల స్ఫూర్తితో ఆ ఘట్టాన్ని సినిమాకు తగ్గట్లుగా మలిచా.

  తండ్రీ కొడుకులు ప్రకాశ్‌రాజ్, బన్నీల మధ్య ఇంకా సీన్లు పెట్టాల్సిందేమో?
 ఈ కథలో తండ్రి గొప్పతనం గురించి చెప్పాలనుకున్నా కానీ, ఆ పాత్రతోనే కథ నడపాలనుకోలేదు. కొడుకుకూ, తండ్రికీ మధ్య సీన్లతో ఆ గొప్పతనం చెప్పా లనుకోలేదు. తండ్రి, ఆస్తి ఉండగా కొడుకు గొప్పగా మాట్లాడే కన్నా, రెండూ పోయాక, తండ్రి గొప్పతనం కోసం కొడుకు పాటుపడడం గొప్పే కదా!

 కానీ, ‘మాటల మాంత్రికుడి’ పంచ్‌లు లేవనీ, బన్నీ ఎనర్జిటిక్‌గా లేరనీ...
 (నవ్వేస్తూ...) ‘మాటల మాంత్రికుడ’ని మీరంటారు కానీ, అదేమీ నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా... ఆ కథకు, ఆ సన్నివేశానికి అనిపించిన మాటలు రాయడమే. తండ్రి చనిపోయాక ఆ బాధలో ఉన్న హీరో వెంటనే పంచ్ డైలాగులు మాట్లాడితే బాగుండదు కదా! ఇక, ‘జులాయి’, ‘రేసుగుర్రం’ లాంటి చిత్రాల్లో ఉరికే జలపాతంలో ఉత్సాహంగా ఉండే బన్నీని చూశాం. మళ్ళీ అదే పద్ధతిలో కంఫర్‌‌ట జోన్‌లో వెళ్ళకుండా, హుందాగా, బాధ్యతతో కూడిన పాత్రలో ఆయనను చూపాలని కావాలనే నిర్ణయించుకున్నాం.

ఒక మెయిన్‌స్ట్రీమ్ సిన్మాలో సమంతను డయాబెటిక్‌గా చూపడం విచిత్రమేనే?
 హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలని మనం ఒక మూసలో పడ్డాం. ఏం? నల్లగా ఉన్నవాళ్ళు, ఆరోగ్య సమస్యలున్న అమ్మాయిలు కథలో హీరోయిన్ పాత్ర కాకూడదా? అయినా ఇవాళ ప్రపంచాన్నీ, అందులోనూ మన దేశాన్నీ పట్టిపీడిస్తున్న మహమ్మారి డయాబెటిస్. అది వచ్చినవాళ్ళను మనం జాలిగా చూస్తుంటాం. కానీ, కమలహాసన్, యాంకర్ గౌరవ్ కపూర్, క్రికెటర్ వసీం అక్రం లాంటి విజయసాధకులు డయాబెటిక్స్. అందుకే, అలాంటి ఆరోగ్య సమస్య ఉన్న వ్యక్తిని అందరూ ప్రేమించేలా, ఇష్టపడేలా చూపాలని హీరో యిన్‌ను అలా చూపించాం. మొదట మా యూనిట్‌లోనూ భిన్నాభిప్రాయా లొచ్చాయి. తీరా చూశాక, ముఖ్యంగా సూట్‌కేస్ ఫైట్, అక్కడి కామెడీ చూశాక, అంతా ఇష్టపడ్డారు. సినిమా టైటిల్‌పైనా అలాంటి చర్చే జరిగింది.

  ‘సన్నాఫ్...’లో భారత, రామాయణాల్ని ఎక్కువ ప్రస్తావించారు. కారణం?
 నా దృష్టిలో రామాయణ, భారతాలను మించిన అద్భుత సాహిత్యం ఎవరూ రాయలేదు. వాటిలో స్పృశించని అంశం లేదు. అందుకే, వాటిని సందర్భాను సారంగా ప్రస్తావించా. అందులో తప్పేం లేదు కదా.

 బలమైన విలన్ లేరనీ, హీరోతో అతణ్ణి చంపించలేదనీ కూడా ఒక విమర్శ?
 నిజానికి, ఈ కథలో నటుడు ఉపేంద్ర విలన్ కాదు. బయట ఏం చేసినా, భార్య ఎదుట మంచిగా ఉండాలనుకొనే వ్యక్తి. ప్రాథమికంగా ఈ కథలో ఉపేంద్రను చంపాలని చూసే సంపత్‌రాజ్ విలన్. కానీ, అతనికీ, హీరోకూ నేరుగా ఘర్షణ లేదు. పైగా, హీరోతో, విలన్‌ను చంపించడమనే కాన్సెప్ట్‌కు నేను కొంత వ్యతిరేకిని. ‘వాదనల ద్వారా అభిప్రాయాలు మారవు, వ్యక్తులను చంపడం ద్వారా వ్యవస్థ మారదు’ అని నా నమ్మకం. అందుకే, ‘అతడు’, ‘జల్సా’ - ఇలా దాదాపు నా ప్రతి సినిమాలో ఊహించని పరిస్థితులు, ఘటనల్లో విలన్ చనిపోతాడు తప్ప, హీరో చంపడు. ఇందులోనూ అంతే!

 ‘సన్నాఫ్...’పై సినీవర్గాల్లో కొంత మిశ్రమ స్పందన వినిపిస్తోంది...
 మనం ఏ ట్రేడ్‌లో ఉంటే అందులో తెలియకుండానే కొంత స్టిఫ్ అయిపోతుం టాం. సినీరంగంలోనూ అంతే. సామాన్య ప్రేక్షకుల్లాగా నవ్వొస్తే నవ్వి, ఏడు పొస్తే ఏడవం. బాగుందో, బాగాలేదో ఒక్క ముక్కలో చెప్పలేం. ఫస్టాఫ్ బాగున్నా సరే, సెకండాఫ్ ఎలా తీశాడో చూడాలంటూ ఇంటర్వెల్‌లో వ్యాఖ్యా  నిస్తాం. హాలులో కూర్చున్నా, చూస్తున్న సినిమాను ఆస్వాదించకుండా క్షణ క్షణానికీ అప్‌డేట్లు వాట్సప్‌లో, ట్విట్టర్‌లో ఇస్తాం. ఇది మనందరి బలహీనత. నా ఒక్క సినిమానే ఆడాలి, ఇతరులెవరివీ ఆడకూడదనుకుంటే తప్పు. అందరి సినిమాలూ పోతే, మనతో మళ్ళీ సినిమా తీయడానికి మిగిలేదెవరు?

 ఈ సినిమా నిర్మాణంలో మీరూ భాగస్వామి అని ఒక టాక్ నడుస్తోంది...
 (గట్టిగా నవ్వుతూ...) మా నిర్మాత రాధాకృష్ణ గారు, నేను బాగున్నాం. మా మధ్య గొడవలు పెట్టకండి బాబూ! ఇప్పటి దాకా ఏ సినిమాలోనూ నేను పైసా పెట్టుబడి పెట్టలేదు. భాగస్వామినీ కాలేదు. కాకపోతే, బడ్జెట్ నియంత్రణ లాంటి విషయాల్లో నిర్మాతకు మన వైపు నుంచి వీలైనంత సాయం చేస్తుంటాం. ఇవాళ సినిమాలపై పణంగా ఒడ్డుతున్న సొమ్ము పెద్దది కాబట్టి, నిర్మాత క్షేమం కోసం యూనిట్ తన వంతు పాత్ర పోషిస్తుంది. అంతే.

  మీరు తీసిన సినిమా మీరే చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంటుంది?
 ఏ క్రియేటర్‌కీ తన సృష్టి తనకు పూర్తిగా నచ్చదు. ఇంకా ఏదో, మెరుగ్గా చేయాలనిపిస్తూ ఉంటుంది. మనకున్న పరిమిత సమయం, బడ్జెట్‌లో ఉన్నంతలో బాగా తీస్తాం. తీరా అంతా అయ్యాక,  బయటివాళ్ళకు తెలియకపోయినా మన లోటుపాట్లు మనకు తెలుస్తుంటాయి. అందుకే తీయడమైపోయాక, నా సినిమా కూడా నేను చూడలేను. నేను తీసింది నాకే నచ్చదు. ఆ సృజనాత్మక తృష్ణతో ఎప్పటికప్పుడు ఇంకా నేర్చుకొని, మరింత మంచి సినిమా తీయాలనుకుంటా.

 పాటలకూ, భోజనం సీన్‌కూ పేరొచ్చింది!
 కథ, సందర్భాలు చెప్పగానే దేవిశ్రీ చాలా మంచి పాటలిచ్చాడు. ‘కమ్ టు ది పార్టీ’ పాటకైతే, సీతా రామశాస్త్రి గారు పల్లవి రాశాక ట్యూన్ కట్టాడు. ‘సూపర్ మచ్చీ’ పాట మొదటి ట్యూన్ నచ్చలేదంటే, మరునాటికల్లా తానే పాట పల్లవి రాసి మరీ అద్భుతమైన ట్యూన్‌తో వచ్చాడు. ఇలా ఎన్నో! ఇక, ఉపేంద్ర ఇంట్లో భోజనం సీన్‌లో ఒక పాత్రకు భయం, మరోపాత్రకు ఆశ్చర్యం, వేరొక పాత్రకు జరిగిందేమిటో తెలియని తనం - ఇలా రకరకాల ఎమో షన్‌‌స ఉంటూనే, ప్రేక్షకు డికి మాత్రం వినోదం  కలిగించాలి. అది రాయడం, తీయడం చాలా కష్టమైంది. అలాగే, అందరితో కటువుగా, భార్య వస్తుంటే మాత్రం మంచిగా ఉండే ఉపేంద్ర పాత్రలోని రెండు పార్శ్వాలను చూపే సీన్ కూడా! ఇలాంటివి బాగా రాశాక, దానితో కలిగే ఆనందం వేరు. అందుకే నేను తుది ఫలితం కన్నా, ఆ పని చేసే క్రమాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తా.

 మీ తదుపరి చిత్రం?
 ఇంకా ఏదీ ఖరారవలేదు.

 పవన్ కల్యాణ్, మీరు తీస్తామన్న ‘కోబలి’?
ఉంది. అది ఒక రకంగా ప్యారలల్ సినిమా. అందుకే, మేమే తీయాలను కున్నాం. సాంకేతికంగా క్లిష్ట మైన, ఉన్నత ప్రమా ణాలున్న ఆ చిత్రం కోసం విదేశీ నిపు ణుల్నీ సంప్రతిం చాం. అందుకే కొన్ని లక్షలు ఖర్చు చేశాం. త్వరలోనే చేస్తాం.

ఆడియో ఫంక్షన్‌లో అన్నట్లు పవన్ మీకు దేవుడా? అంతకు మించా?
 మంచి మిత్రుడు. అంతే.
 
  రాజమౌళి హీరోలతో మీరు, మీ హీరో లతో ఆయన చేయరని వెబ్‌సైట్ల కథనం...
 (నవ్వేస్తూ...) కథకు తగ్గట్లు కుది రిన హీరోలతో చేస్తాం తప్ప, ఫలానా వాళ్ళతో చేయకూడదని ఎవరూ అను కోరు. ఎన్టీఆర్, రామ్ చరణ్... ఇలా అందరితో చేయాలని ఉంది. కథ, డేట్లు కుదరాలిగా! ఏమైనా ఈ వార్త నాకు కొత్త. నేను వెబ్‌సైట్లు చదవను. టీవీ పెద్ద చూడను. దాని వల్ల జీవితం ఎంత సుఖంగా ఉందో చూడండి (నవ్వులు...).
 
  రాజమౌళిలా మీరూ మన సినిమాను ఇతర భాషల్లోకి తీసుకెళ్ళి, మార్కెట్ పెంచే కథలతో సినిమా తీయచ్చుగా?
 ‘ఈగ’, ‘బాహుబలి’ లాంటివి అలాంటి అద్భుత ప్రయ త్నాలు. నిజాయతీగా మన దగ్గరా అలాంటి కథ ఉంటే చేయాలి తప్ప, ఆయన చేస్తున్నారని మనమూ చేయాలనుకోవడం తప్పు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement