పక్కా స్కెచ్తో దాడి, ఆర్కే ఎస్కేప్.. | 24 Maoists killed in encounter at Andhra-Odisha border, Top leader RK escaped | Sakshi
Sakshi News home page

పక్కా స్కెచ్తో దాడి, ఆర్కే ఎస్కేప్..

Published Mon, Oct 24 2016 11:57 AM | Last Updated on Thu, Mar 28 2019 5:07 PM

పక్కా స్కెచ్తో దాడి, ఆర్కే ఎస్కేప్.. - Sakshi

పక్కా స్కెచ్తో దాడి, ఆర్కే ఎస్కేప్..

మల్కాన్గిరి:  మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఏఓబీలో మావోలపై కాపుకాసిన పోలీసులు అదును చూసి పంజా విసిరారు. మల్కాన్‌గిరి అటవీప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన హోరా హోరీ కాల్పుల్లో 24మంది మావోయిస్టులు మృతి చెందారు.

ఏవోబీలో మావోయిస్టుల ప్లీనరీ జరుగుతున్నట్లు ముందస్తు సమాచారంతో రంగంలోకి దిగిన గ్రే హౌండ్స్‌ ప్లీనరీపై పక్కా స్కెచ్‌తో దాడి చేసింది. మృతుల్లో ప్రముఖ మావోయిస్టులు ఉన్నట్లు కూడా తెలుస్తోంది.  గ్రేహౌండ్స్ బలగాలు అటవీప్రాంతంలోని తొమ్మిది కిలో మీటర్ల లోపలికి చొచ్చుకెళ్లి మరీ ఈ దాడి చేసినట్లు సమాచారం. మావోయిస్టుల నుంచి మూడు ఏకే-47గన్స్‌, ఏడు ఎస్‌ఎల్‌ఆర్‌లు, ఏడు ల్యాండ్‌మైన్లు, 303 రైఫిల్స్‌,  15 భారీ ఆయుధాలను  స్వాధీనం చేసుకున్నారు.

జంత్రి అటవీప్రాంతం ఘటనలో ఇటీవల లొంగిపోయిన మావోయిస్టుల ద్వారా పక్కా సమాచారం తెలుసుకున్న ఆంధ్ర-ఒడిశా పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టేందుకు రంగంలోకి దిగారు. బలిమెల రిజర్వాయర్‌లోని ఏవోబీ కటాఫ్ ఏరియా జల్లెడ పట్టారు. ఈ క్రమంలోనే ప్లీనరీ జరుగుతున్న సమావేశంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. మావోయిస్టులు ఆయుధాలతో తేరుకునేలోపే పోలీసుల ఎన్‌కౌంటర్‌లో 24 మంది మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్లకు గాయపడ్డారు.

ఇక చనిపోయిన మావోయిస్టులను గుర్తించేందుకు మాజీ మావోయిస్టులను పోలీసులు రంగంలోకి దించారు. వారిని ఘటనా స్థలానికి తీసుకువెళ్లి మృతుల వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మృతి చెందిన వారిలో మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. విశాఖ ఏరియా కార్యదర్శిగా వ్యవహరిస్తున్న గాజర్ల రవి అలియాస్ గణేష్, చలపతి, దయ, రాజన్న, బెంగాల్ సుధీర్, అశోక్,మల్లేష్ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా కాల్పుల సమయంలో మరో అగ్రనేత ఆర్కే తప్పించుకోగా, ఆయన మనవడు మున్నా ఎన్కౌంటర్ అయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. గత కొంత కాలంగా స్తబ్తుగా మావోయిస్టులు పట్టు కోల్పోయిన ఏవోబీలో మళ్లీ బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి చిత్రకొండ పనసపుట్టు వద్ద మావోయిస్టులు సమావేశమయ్యారు.

మరోవైపు విశాఖ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మాట్లాడుతూ ఎన్​కౌంటర్ లో 24మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాలను ఒడిశాకు తరలిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. మృతుల్లో 18మంది పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నట్లు తెలిపారు. మృతులను ఇంకా గుర్తించాల్సి ఉందని, అగ్రనేతలు ఉన్నారో...లేదో ఇంకా తెలియదన్నారు. ఇక గాయపడ్డ పోలీసులను చికిత్స నిమిత్తం విశాఖకు తరలించినట్లు చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement