జైలు నుంచి 8మంది ఉగ్రవాదుల ఎస్కేప్
భోపాల్: మధ్యప్రదేశ్లోని భోపాల్ సెంట్రల్ జైలు నుంచి 8మంది స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా(సిమీ) ఉగ్రవాదులు తప్పించుకున్నారు. స్టీల్ కంచం, గ్లాస్తో జైలు సెక్యురిటీ గార్డుగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమా శంకర్ గొంతు కోసి హత్య చేశారు. సిమీ ఉగ్రవాదులు బెడ్షీట్లతో తాడులా తయారు చేసి, దాని సహాయంతో ప్రహారి గోడను దూకి తప్పించుకున్నారని భోపాల్ ఎస్పీ అరవింద్ సక్సెనా తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు. యూపీ, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడులో జరిగిన పేలుళ్ల వెనుక వీరి హస్తం ఉంది. మరోపైపు ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు జైలు ఉన్నతాధికారులను సస్పెండ్ చేస్తున్నట్టు మధ్య ప్రదేశ్ హోం మంత్రి భూపేంద్రసింగ్ వెల్లడించారు. సిమీ ఉగ్రవాదుల పరారీకి సంబంధించి పూర్తిసమాచారాన్ని అందించవల్సిందిగా కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరారు.
ఇంతకుమందు కూడా ఇదే తరహాలో సిమీ ఉగ్రవాదులు జైలు నుంచి తప్పించుకున్నారు. 2013లో ఏడుగురు సిమీ ఉగ్రవాదులు ఖాంద్వా జైలు మరుగుదొడ్డి కిటికీ ఇనుప రాడ్డులను తొలిగించి పరారయ్యారు. ఇద్దరు జైలు సెక్యురిటీ సిబ్బందిపై దాడి చేసి రైఫిళ్లు, వైర్లెస్ సెట్లను తస్కరించారు. పరారైన వారిలో ఇద్దరు ఉగ్రవాదులు నల్లగొండ జిల్లా ఎన్కౌంటర్లో హతమయ్యారు.