తమిళనాడుకు పళని 'స్వామి' | tamilnadu new chief minister Edappadi K. Palanisamy appointed | Sakshi
Sakshi News home page

తమిళనాడుకు పళని 'స్వామి'

Published Fri, Feb 17 2017 1:48 AM | Last Updated on Tue, Sep 5 2017 3:53 AM

తమిళనాడుకు పళని 'స్వామి'

తమిళనాడుకు పళని 'స్వామి'

రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణం
పళని కేబినెట్‌లోనూ జయలలిత టీం
ప్రమాణం అనంతరం జయ సమాధి వద్ద నివాళి
బెల్లం మండీ నుంచి సీఎంగా ఎదిగిన నేత
నాడు సెంగోట్టయన్‌ మద్దతుదారుడు
నేడు పళనిస్వామి కేబినెట్‌లో మంత్రిగా సెంగోట్టయన్‌


చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : తమిళనాడు రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా ఎడపాడి కె.పళనిస్వామి ప్రమాణస్వీకారం చేశారు. సేలం జిల్లా ఎడపాడిలో వ్యవసాయ కుటుంబానికి చెందిన పళనిస్వామితో రాష్ట్ర గవర్నర్‌  విద్యాసాగర్‌రావు రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాల్లో గురువారం సాయంత్రం 4.39 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయిం చారు. అనంతరం 30 మందిæ మంత్రులు ఒకేసారి మాతృభాష తమిళంలో ప్రమాణం చేశారు. గవర్నర్‌ కూడా ప్రజల మనోభావాలకు అనుగుణంగా తమిళంలోనే ప్రమాణం చేయించడం విశేషం.

నూతనంగా ప్రమాణం చేసిన మంత్రివర్గంలో సెంగోట్టయన్‌ మినహా మిగిలిన 29 మంది జయలలిత కేబినెట్‌లో పనిచేసినవారే. ఇన్నాళ్లూ ఆపద్ధర్మ సీఎంగా, ఆర్థిక మంత్రిగా పనిచేసిన పన్నీర్‌సెల్వం స్థానంలో సెంగోట్టయన్‌ని కేబినెట్‌లోకి తీసుకుని విద్యాశాఖ అప్పగించారు. మిగతా 29 మందికి జయ కేబినెట్‌లో ఏయే శాఖలు అప్పగించారో.. వాటినే కొనసాగించారు. ప్రమాణ స్వీకారోత్సవానంతరం జయలలిత, చిన్నమ్మకు మద్దతుగా అన్నాడీఏంకే నేతలు నినాదాలు చేశారు.

‘అమ్మ అమర్‌ రహే.. చిన్నమ్మకు జై’అంటూ నినదించారు. కొద్దిరోజులుగా గోల్డెన్‌బే రిసార్ట్స్‌లో ఉన్న ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం. కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి పళనిస్వామి, 30 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌ నుంచి నేరుగా మెరీనా బీచ్‌ వద్ద ఉన్న జయలలిత సమాధి వద్దకు చేరుకున్నారు. అక్కడ జయ సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. అదే విధంగా ఎంజీఆర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి నినాదాలు చేశారు. బలపరీక్షలో నెగ్గి అమ్మ పాలన సాగిస్తామని శపథం చేశారు.



బెల్లం మండీ నుంచి సీఎంగా..
సాక్షి, చెన్నై: బెల్లం మండీతో నాడు బతుకు జీవన పయనంలో అడుగుపెట్టిన ఓ రైతు, నేడు ఓ రాష్ట్రానికి  సీఎంగా అవతరించారు. ఆయనే తమిళనాడుకు 13వ సీఎంగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన ఎడపాడి కే పళనిస్వామి. ఒకప్పుడు అన్నాడీఎంకేలో సీనియర్‌ నేతగా చక్రం తిప్పిన సెంగోట్టయన్‌కు మద్దతుదారుడిగా రాజకీయల్లోకి అడుగు పెట్టిన పళనిస్వామి, ప్రస్తుతం ఆయన్నే మించిపోయారు. నేడు పళనిస్వామి కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా సెంగోట్టయన్‌ బాధ్యతలు స్వీకరించడం గమనార్హం. ఎడపాడి నియోజకవర్గం నుంచి గెలుస్తూ రావడంతో కే పళనిస్వామి కాస్తా ఎడపాడి కే పళనిస్వామి అయ్యారు. సేలం జిల్లా ఎడపాడి నెడుంకుళం గ్రామం శిలువం పాళయంకు చెందిన కరుప్ప గౌండర్, తవ సాయమ్మాల్‌ దంపతుల చిన్న కుమారుడు పళని స్వామి(63).

ఈరోడ్‌లోని శ్రీ వాసవీ కళాశాలలో బీఎస్సీ(పూర్తి కాలేదు) చేశారు. గౌండర్‌ సామాజిక వర్గానికి చెందిన పళనిస్వామి తండ్రి అడుగు జాడల్లో వ్యవసాయంతో పాటు బెల్లం మండీతో జీవన పయనాన్ని సాగించే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. భార్య రాధ, కుమారుడు మిథున్‌లతో కలిసి ఓ వైపు బెల్లం మండీని నడుపుతూ, మరో వైపు నాగలి పట్టి పొలం పనులు చేసుకుంటూనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పటి మంత్రి ఈరోడ్‌ ముత్తుస్వామి భూములు తన భూముల పక్కనే ఉండడం ఆయనకు కలిసి వచ్చింది. అన్నాడీఎంకేలో చేరగానే, శిలువం పాళయం గ్రామ పార్టీ కార్యదర్శి అయ్యారు. 1986లో జరిగిన స్థానిక ఎన్నికల్లో నెడుంకుప్పం పంచాయతీ యూనియన్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చవి చూశారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్‌ మరణంతో ఆ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు పళనిస్వామికి రాజకీయంగా బలాన్ని పెంచాయి.

ఈరోడ్, సేలం, నామక్కల్‌ జిల్లాల్లో అన్నాడీఎంకేకు కీలకనేతగా ఉన్న సెంగోట్టయన్‌ మద్దతుదారుడిగా జయలలిత శిబిరంలో చేరారు. సెంగోట్టయన్‌ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టడంతో ఆయన మద్దతుతో పళనిస్వామి సేలం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. అయితే, అమ్మ సెంగోట్టయన్‌ను దూరం పెట్టడంతో ఆ స్థానం పళనిస్వామికి దక్కింది. అప్పటినుంచి చిన్నమ్మకు విధేయుడిగా ఉంటూ వచ్చిన పళనిస్వామిని ప్రస్తుతం సీఎం పదవి వరించడం విశేషం. అప్పట్లో పళనిస్వామి రాజకీయంగా ఎదగడంలో కీలక పాత్ర పోషించిన సెంగోట్టయన్‌ ప్రస్తుతం ఆయన కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రి అయ్యారు. పార్టీ పరంగా ప్రస్తుతం సెంగోట్టయన్‌ ప్రిసీడియం చైర్మన్‌గా ఉన్నా, ప్రభుత్వ వ్యవహారాల్లో మంత్రుల వరసలో కూర్చోవాల్సిందే. ఇదే కేబినెట్‌లో విద్యుత్‌ శాఖ మంత్రిగా ఉన్న తంగమణి, పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న కరుప్పనన్‌ సీఎంకు దగ్గరి బంధువులు.

పళని స్వామి ఆస్తి రూ. 9.69 కోట్లు
తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కే పళనిస్వామి ఆస్తి రూ. 9.69 కోట్లు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ఈ మేరకు తన ఆస్తిని ప్రకటించారు. ఎలాంటి అప్పులు లేవని, తన కుటుంబీకులు ఎవరి పేరిట ఎలాంటి వాహనం కూడా లేదని అందులో పేర్కొని ఉండడం గమనార్హం.

రాజకీయ పయనం...
1989 కోడిపుంజు చిహ్నంతో ఎడపాడి నుంచి గెలిచి అసెంబ్లీ మెట్లు ఎక్కారు.
1991 అన్నాడీఎంకే రెండాకుల చిహ్నంతో అదే నియోజకవర్గం నుంచి మరోసారి గెలుపు.
1992–1996 వరకు ఆవిన్‌ సంస్థ అధ్యక్షుడు
1996 ఎన్నికల్లో ఎడపాడి నుంచి ఓటమి
1998 లోక్‌సభ ఎన్నికల్లో తిరుచ్చంగోడు నుంచి తొలిసారిగా పార్లమెంట్‌కు ఎన్నిక
1999 లోక్‌సభ ఎన్నికల్లో తిరుచ్చంగోడు నియోజకవర్గం నుంచి ఓటమి
1999–2004 వరకు తమిళనాడు సిమెంట్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు
  2006 అసెంబ్లీ ఎన్నికల్లో ఎడపాడి నుంచి ఓటమి
2011 అసెంబ్లీ ఎడపాడి నుంచి గెలుపు. తొలిసారిగా రాష్ట్ర రహదారుల శాఖ మంత్రి పదవి.
2016 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు. ప్రజా పనులు, రహదారులు, చిన్న హార్బర్ల శాఖ కేటాయింపు
2017 ఫిబ్రవరి 14 అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నిక
2017 ఫిబ్రవరి 16 తమిళనాడు 13వ సీఎంగా ప్రమాణ స్వీకారం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement