ఆమ్‌స్టర్‌డాంలో అద్భుతం
నవల పుట్టిన క్షణాలు... మధురాంతకం నరేంద్ర ఇటీవల ‘ఆమ్‌స్టర్‌డాంలో అద్భుతం’ అనే నవల వెలువరించారు. ఇద్దరు పరిచిత వ్యక్తులు ఆమ్‌స్టర్‌డాం విమానాశ్రయంలో చిక్కుబడి ఎదుర్కొనే అనుభవాల సంచయం ఇది. పైకి చూడ్డానికి ఇదో తిరుగు ప్రయాణపు ఎదురుచూపుగా కనబడినా పాత్రల అంతర్లీన ప్రయాణం కూడా జరుగుతుంటుంది. మతం ఆధారంగా మనిషి ఏర్పరచుకునే అంచనాలు, జాతి ఆధారంగా ఏర్పడే విశ్వాసాలు ఒకరిని మరొకరు బాధించడానికి, అవమానించడానికి, ద్వేషించడానికి కారణభూతం కావడాన్ని ఈ నవలలో రచయిత జాగ్రత్తగా విశ్లేషిస్తారు. తెలుగులో ఇటువంటి నవలలు తక్కువ. ఈ నవల వెనుక నేపథ్యం రచయిత మాటల్లో...
‘ఆమ్‌స్టర్‌డాంలో అద్భుతం’ అనే ఈ నవల ఆత్మకథగాని చరిత్రగాని కాదు. కేవలం కల్పనా సాహిత్య రచనే. అయితే ఈ నవలలో కొంత ఆత్మకథా, చాలా వరకూ చరిత్రా ఉన్నాయి. కల్పనా సాహిత్యం పైన ఉన్న గౌరవంతో చివరి దాకా చదివిన పాఠకులు ఈ రచనలో ఆత్మకథ, చరిత్ర యే నిష్పత్తిలో చోటు చేసుకున్నాయో తెలుసుకోవాలనుకోవడం సహజమే. ప్రతి రచనలోనూ రచయిత ఆత్మకథ యెంతో కొంత, యేదో వొక రూపంలో ఉండనే ఉంటుంది గనుక ఆ విషయాలేవో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఉండదు. రెండు మూడు దశాబ్దాలుగా ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను వార్తా పత్రికల్లోనూ టీవీల్లోనూ పరిశీలిస్తున్న వాళ్లకు ఈ నవల్లోని చారిత్రక నేపథ్యాన్ని వివరించాల్సిన అవసరమూ లేదు. అయితే అలా గమనించని పాఠకుల కోసం మాత్రమే ఈ చిన్న మాట రాస్తున్నాను.
2006 ఆగస్టు 22వ తేదీన కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్లు మెక్సికో దేశానికి పంపిన తొలి సాహిత్య ప్రతినిధి వర్గంలో సభ్యుడుగా నేనూ ఆ దేశానికి బయల్దేరాను. నాతోబాటూ లక్నో నుంచి అఖిలేశ్వర్ కుమార్ అనే హిందీ రచయిత కూడా వచ్చారు. తిరుగు ప్రయాణంలో నేనూ, అఖిలేశ్వర్ ఆగస్టు 28వ తేదీన ఆమ్‌స్టర్‌డాం విమానాశ్రయంలో 22 గంటలు వేచి ఉండవలసి వచ్చింది. మెక్సికోలోని భారత యెంబసీ వాళ్లు మాకు సహాయం చేయడానికి గట్టిగా ప్రయత్నం చేసినా మా ప్రయాణాయాసంలో మార్పు రాలేదు. ఆమ్‌స్టర్‌డాంలో 22 గంటల నిరీక్షణ తర్వాత విమానమెక్కాం. యేదో సాంకేతిక సమస్య వల్ల మరో ఆరుగంటల సేపు విమానం కదల్లేదు. అలా మేము దాదాపు 30 గంటలు ఆమ్‌స్టర్‌డాం విమానాశ్రయంలో కట్టుబడి పోయాం.
మేము మెక్సికోలో ఉన్న సమయంలో ఆగస్టు 23వ తేదీన ఆమ్‌స్టర్‌డాం విమాశ్రయంలో కొందరు భారతీయుల్ని నిర్బంధంలోకి తీసుకున్నారు. వాళ్లు అదే రోజున నార్త్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానంలో ముంబాయికి బయల్దేరినవాళ్లు. విమానం ఆకాశంలో ప్రయాణం చేస్తూండగా వాళ్లల్లో కొందరు సీటు బెల్టులు పెట్టుకోమని హెచ్చరించినా వినలేదట. పైగా సెల్‌ఫోన్లు మార్చుకోసాగారట. ఎయిర్ మార్షల్స్ వాళ్లను బలవంతంగా అదుపులోకి తీసుకుని విమానాన్ని అది బయల్దేరిన అరగంటలోనే తిరిగి ఆమ్‌స్టర్‌డాం విమానాశ్రయానికి తీసుకొచ్చేశారు. అప్పుడు ఆ విమానంలో 149 మంది ప్రయాణికులున్నారట. మరునాడు ఉదయం అనుమానితులుగా కనిపించిన 12 మందిని తప్ప మిగిలిన ప్రయాణికులందరినీ మరో విమానంలో ముంబైకి పంపేశారు.
నిర్బంధించిన 12 మంది ప్రయాణికుల్ని ఆ తరువాత విచారణ చేసి హింసాత్మకమైన విధ్వంసం సృష్టించబోతున్నారనడానికి కావాల్సిన సాక్ష్యమేమీ దొరకలేదని పోలీసులు తేల్చేశారు. ఈ విషయానికి స్పందించిన ఆసియన్ యేజ్ పత్రిక ఇలా భారతీయులను నిర్బంధించడానికి కారణం డచ్ వాళ్లకుండే జాత్యహంకారమేనని విమర్శించింది. అయితే ఇలా వొకరిద్దరు రక్షణాధికారులు చేసిన పనికి మొత్తం డచ్ ప్రజలనంతా నిందించడం భావ్యం గాదని డచ్ పత్రికలు సమాధానం చెప్పాయి. ఆ పన్నెండు మంది భారతీయులూ నిర్దోషులే అయినా తమ అమాయకత్వానికి తగిన మూల్యం చెల్లించారని తేల్చిపారేశాయి. విచారణ ముగిసే వరకూ అంటే వాళ్లు ప్రమాదకరమైన వ్యక్తులు కారని తెలిసే వరకూ అప్రమత్తతతో వాళ్లకు బేడీలు వేయక తప్పదని ప్రకటించాయి. ఇదే పని ముంబై విమానాశ్రయంలో జరిగితే అక్కడి పోలీసులు కూడా యే దేశపు ప్రయాణికులైనైనా ఇలాగే నిర్బంధిస్తారని డచ్ పత్రికలు వాదించాయి.
ఆమ్‌స్టర్‌డాంలో ఈ గొడవ జరిగినప్పుడు మేము మెక్సికోలోనే ఉన్నాం. తిరుగు ప్రయాణంలో ఆమ్‌స్టర్‌డాం విమానాశ్రయంలో జాగ్రత్తగా ఉండమని మమ్మల్ని హెచ్చరించినవాళ్లు ఈ ఉదంతాన్ని గురించి మాకు స్పష్టాస్పష్టంగానే చెప్పారు. మరింతగా తరచి అడిగితే యేం వినవలసి వస్తుందోనన్న భయంతో మేమూ యేమీ అడగలేదు. ఆమ్‌స్టర్‌డాం విమాశ్రయంలో 22 గంటలు మాకైతే ప్రశాంతంగానే గడచిందిగానీ లోలోపల అలజడులు చెలరేగుతూనే ఉన్నాయి. భారతదేశానికి తిరిగొచ్చిన తర్వాత ఇంటర్నెట్ సహాయంతో జరిగిన సంగతులన్నీ తెలుసుకున్నాను. విమానాశ్రయాల్లో జరుగుతున్న హింసాత్మక సంఘటనలన్నీ వొకదానివెంట వొకటిగా తెలిసి వచ్చాయి. రోజురోజుకూ పెరుగుతున్న మత తీవ్రవాదపు పరిణామాలేమిటో అర్థమయింది. ఈ ఆందోళనల్లో సామాన్యుడి జీవితమెంత అతలాకుతలంగా తయారవుతుందో చూపెట్టడంతో బాటూ దీనికంతా మూలకారణమైన మతం, దాని పుట్టుక, స్వభావం గురించిన అన్వేషణకు కూడా నేనీ నవలను రాయడానికి పూనుకున్నాను.
ఇందులో జరిగిన సంఘటనలన్నీ యేదో వొక రూపంలో యేదో వొక చోట యథార్థంగా జరిగినవే. వొక చారిత్రక నేపథ్యంలో జరిగిన కాల్పనిక రచనే ఈ నవల. అయితే ఈ కల్పనకు గూడా స్పష్టమైన చారిత్రక భూమిక ఉందన్న విషయాన్ని సహృదయ పాఠకులకు గుర్తు చేయడం యిప్పుడు నా బాధ్యత అని నేను భావిస్తున్నాను.
- మధురాంతకం నరేంద్ర