తెలుగువాణి ‘మాణిక్యవీణ’ | Movement, literature, journalism muppeta learned as a stretch of the typical person in the universe | Sakshi
Sakshi News home page

తెలుగువాణి ‘మాణిక్యవీణ’

Published Mon, Oct 20 2014 11:51 PM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

తెలుగువాణి ‘మాణిక్యవీణ’ - Sakshi

తెలుగువాణి ‘మాణిక్యవీణ’

ప్రాచ్య విద్యలు చదివి సామ్యవాదం వైపు మొగ్గిన ప్రజ్ఞావంతులలో విద్వాన్ విశ్వం గొప్ప సమన్వయ వాది. మృదువుగా మాట్లాడుతూ విరుద్ధమైన అభిప్రాయం చెప్పడంలో తనది అందెవేసిన చేయి. ఆధునికతను ఆహ్వానిస్తూనే సంప్రదాయంలోని ఔచిత్యాన్ని వివరించడం తనకు చాలా సులువు.
 
ఉద్యమం, సాహిత్యం, జర్నలిజం ముప్పేటగా సాగిన విలక్షణ వ్యక్తి విద్వాన్ విశ్వం! ఛాందసమెరుగని సంప్రదాయ వాది, ఆవేశం లేని ఆధునికవాది! భారతీయ లోచ నాన్ని, వామపక్ష ఆలోచనలను కలిపి చూసిన సమ న్వయవాది! ప్రాకృతం, సంస్కృతం, తెలుగు, ఇం గ్లిష్ భాషలను ఆకళింపు చేసుకొని కృషి చేసిన సాహితీవేత్త!

అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో 1915 అక్టోబర్ 21న లక్షమ్మ, మునిరామాచార్యులకు జన్మించారు విశ్వరూపాచారి. తండ్రి జాతీయ భావా లతో మద్యపాన నిషేధం, రైతు మహాసభ వంటి కార్యక్రమాలను సన్మార్గ బోధిని సంఘం ద్వారా నిర్వహించిన వ్యక్తి. తండ్రి మూడవ ఏట గతించ డంతో విశ్వం తల్లి లాలనలో పెరిగాడు. తాత నుంచి సంస్కృత పాండిత్యం గడించాడు. తరిమెల నాగి రెడ్డి అనుంగు, ఆత్మీయ మిత్రుడు. కావ్యనాటకాల నూ, ఛందో అలంకారాలను, తర్కశాస్త్రాన్ని అధ్య యనం చేసి మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి విద్వాన్ పట్టా పొందాడు. సంస్కృత అధ్యయనానికి తోడు వామపక్ష భావజాలం అదనంగా అమిరింది. ఏదీ దేన్నీ కప్పివేయలేదు, లేదా అతిక్రమించలేదు. అందుకే వామపక్ష భావజాలాన్ని వివరించే వ్యాసం గొప్ప శ్లోక పాదంతో ముగుస్తుంది.

తెలుగు నాట దత్తమండలపు స్వాతంత్య్రోద్య మ రోజుల్లో కల్లూరి సుబ్బారావు, గాడిచర్ల హరిస ర్వోత్తమరావు, చిలుకూరి నారాయణరావు, పప్పూ రు రామాచార్యులు వంటి వారి మార్గదర్శకత్వంలో విశ్వం నడిచారు. ఉద్యమం, ఉపన్యాసం మాత్రమే కాకుండా రాజకీయాలు శాస్త్రీయ పద్ధతిలో వివరిం చాలని పాత్రికేయ జీవితాన్ని ఎన్నుకున్నాడు. జర్నలిజంలో చేరకముందు నవ్య సాహిత్యమాల ద్వారా పుస్తకాలు వెలువరించారు. రామాచార్యుల ‘శ్రీసాధన’ పత్రికతో పాటు ‘భారతి’ వంటి వాటిల్లో రచనలు చేశారు. 1945లో అడవి బాపిరాజుగారి ‘మీజాన్’ పత్రికలో చేరారు. తర్వాత ‘ప్రజాశక్తి’ పత్రికలో మూడేళ్లు పనిచేసి మదరాసుకెళ్లాడు. అక్క డ ‘కిన్నెర’ వంటి పత్రికలకూ, బాలభారత్ విద్యాల యానికి పని చేశారు. 1952లో ‘ఆంధ్రప్రభ’ సచిత్ర వారపత్రికలో చేరారు. తొలి నుంచి కార్యనిర్వా హక సంపాదకులుగా పనిచేసి తెలుగు వారపత్రికల తీరులో గొప్ప మలుపులు తెచ్చాడు. అప్పట్లో ఉన్న ఏకైక వారపత్రిక ‘ఆంధ్రపత్రిక’ పురుష పాఠకులు ప్రధానంగా సాగేదని నండూరి రామమోహనరావు పేర్కొంటూ ‘ఆంధ్రప్రభ’ వారపత్రిక సకుటుంబ వారపత్రికగా విజయవంతమైందంటారు.

విద్వాన్ విశ్వం అనగానే ఎక్కువ మందికి మాణిక్యవీణ గుర్తుకు వస్తుంది. తెలుగు పత్రికల్లో ఎక్కువ కాలం నడిచిన శీర్షికలలో మాణిక్యవీణ ఒకటి. అది ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికలోనే రెం డు దశాబ్దాల పాటు నడిచింది. అంతకుముందు కొంత కాలం దినపత్రికలో కొనసాగింది. మాణిక్య వీణకు ముందు ఆంధ్రప్రభ వారపత్రికలోనే సుమా రు ఏడు సంవత్సరాల పాటు ‘తెలుపు-నలుపు’ శీర్షిక ప్రధానంగా భాషాంశాలతో నడిచింది. మాణి క్యవీణ వ్యాసాల వస్తువుకు కాలదోషం ఉండవచ్చు కానీ, తెలుపు-నలుపునకు ఆ సమస్య లేదు. ఆంధ్ర పత్రిక దినపత్రికలో ‘అవీ.. ఇవీ’, ఆంధ్రజ్యోతి దిన పత్రికలో ‘ఇవ్వాళ’ శీర్షికలు కూడా విశ్వం రాశారు.
 కవిగా విద్వాన్ విశ్వం కీర్తిని గొప్పగా చాటింది పెన్నేటి పాట. ఒక ప్రాంతీయమైన సమాజాన్ని కవి తా వస్తువుగా తీసుకుని విశ్వం రాసిన ‘పెన్నేటి పాట’ అజరామరమైనది. విశ్వం పెన్నేటి పాటను దాశరథి తెలంగాణ రచయితల సంఘం ద్వారా ప్రచురింపచేశాడు. అయితే కేవలం గత వైభవాన్ని కీర్తిస్తూ విశ్వం ఆగిపోలేదు. వల్లంపాటి వెంకటసు బ్బయ్య అన్నట్టు గత కీర్తి పట్ల విశ్వంకు పలవరింత గానీ, వెర్రి వ్యామోహంగానీ లేవు.

బ్రిటిష్ జవాన్లతో పోరాడి అమరుడైన హం పన్న కథను ‘ఒకనాడు’ కావ్యంగా విశ్వం రాశాడు. విశ్వం అనువాద కృషిని ప్రత్యేకంగా చెప్పాలి. మేఘ సందేశం, కాదంబరి, కిరాతార్జునీయం, దశకుమార చరిత్ర గ్రంథాలు సంస్కృత సాహిత్యంలో ఒక్కోటి విలక్షణమైనవీ, గొప్పవీ! ఈ నాలుగు గొప్ప గ్రంథా లను గొప్పగా తెలుగు చేశాడు. కల్హణుని రాజ తరం గిణి, నీతి చంద్రికను చక్కగా అనువదించారు.
 ప్రాచ్య విద్యలు చదివి సామ్యవాదం వైపు మొగ్గిన ప్రజ్ఞావంతులలో విద్వాన్ విశ్వం ప్రముఖు లే కాదు, గొప్ప సమన్వయవాది కూడా. మృదు వుగా మాట్లాడుతూ విరుద్ధమైన అభిప్రాయం చెప్ప డంలో విశ్వం అందెవేసిన చేయి. ఆధునికతను ఆహ్వానిస్తూనే సంప్రదాయంలోని ఔచిత్యాన్ని విడ మరచి చెప్పడం అతనికి చాలా సులువు.

 అయితే విశ్వం వ్యక్తిగత జీవితం బాధాకరంగా పరిణమించింది. కూతురు అకాల మరణం,  కుమా రుడు ఇల్లు విడిచిపోవడం ఆయనను బాగా దెబ్బ తీశాయి. 1987 అక్టోబర్ 20వ తేదీన విశ్వం తిరు పతిలో కన్నుమూశారు. ఆయన పాండితీ సమన్వ య ధోరణి, విశాల దృక్పథం తెలుగు సమాజానికి చక్కని సందేశాన్ని ఇస్తున్నాయి.

 (వ్యాసకర్త ఆకాశవాణి ప్రయోక్త) డా॥నాగసూరి వేణుగోపాల్
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement