మద్దతు కాదు కృతజ్ఞతే!
పెరంబూర్: ఇప్పటి వరకూ నృత్యదర్శకుడిగా, నటుడిగా, దర్శకుడిగా వార్తల్లో కనిపించిన రాఘవ లారెన్స్ తాజాగా రాజకీయాల్లో నానుతున్నారు. ఈ మధ్య తన వాళ్లకు ఇబ్బందులు ఏర్పడితే, అవసరం అయితే రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని సంచలన వ్యాఖ్యలు చేసిన కలకలానికి ఆస్కారం కల్పించిన లారెన్స్ ఇటీవల ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంను కలవడంతో మరోసారి టాక్ ఆఫ్‌ది పాలిటిక్స్‌గా మారారు. తమిళనాట రాజకీయాలు గరం గరంగా సాగుతున్న సమయంలో పలువురు రాజకీయవాదులు, సినీ ప్రముఖులు పన్నీర్‌సెల్వంను కలిసి తమ మద్దతు తెలుపుతున్నారు.
నటుడు లారెన్స్ కూడా ఆయన్ని కలవడంతో మద్దతు తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే లారెన్స్ ఈ ప్రచారాన్ని ఖండించారు. తాను ఏ రాజకీయ పార్టీకి మద్దతు తెలపలేదని, అసలు ఒక పార్టీకి మద్దతిచ్చే స్థాయి స్టార్ నటుడిని కానన్నారు. ఇంకా చెప్పాలంటే తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు లేవని అన్నారు. తాను జల్లికట్టు క్రీడ నిర్వహించే విషయం గురించి అడగ్గా ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వెంటనే అందుకు అనుమతించారని, అందుకు కృతజ్ఞతలు చెప్పడానికే ఆయన్ని కలిశానని తన ట్విట్టర్‌లో స్పష్టం చేశారు.