రామయ్య పెళ్లికి భద్రాద్రి ముస్తాబు
- రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు
భద్రాచలం : ఖమ్మం జిల్లా భద్రాచలంలో 28న జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. కొత్తగా ఏర్పాడిన తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా భద్రాచలంలో జరిగే శ్రీసీతారాముల కల్యాణోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. సీఎం కే.చంద్రశేఖర్‌రావు, గవర్నర్ నరసింహన్ పర్యటనలు అధికారికంగా ఖరారు కాకున్నా.. ఇటీవల భద్రాచలంపై ఢిల్లీస్థారులో చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఎం తప్పనిసరిగా వస్తారని భావిస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగం ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది.
21 నుంచి బ్రహ్మోత్సవాలు: స్వామివారి వసంత పక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు శనివారం(21 నుంచి) నుంచి ప్రారంభం కానున్నాయి. 21న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో వేపపూత ప్రసాదం విని యోగం ఉంటుంది. ఈ సందర్భంగా మూలవరులకు అభిషేకం నిర్వహిస్తారు. 24న ఉత్సవ మూర్తులకు విశేష స్నపనం అదే రోజు సాయంత్రం అంకురారోపణ చేస్తారు.
25న ధ్వజపట భద్రక మండల లేఖనం, సాయంత్రం గరుడాధివాసం, 26న అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, దేవతాహ్వానం, 27న స్వామివారికి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు. 28న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంపై స్వామివారి కల్యాణాన్ని నిర్వహిస్తారు. 29న మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలోనే స్వామివారికి పట్టాభిషేకం చేస్తారు.