అఖిలేష్ సంచలన నిర్ణయం
లక్నో: ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సంచలన నిర్ణయాలతో ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. సమాజ్ వారి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, వరుసకు బాబాయి అయిన శివపాల్ యాదవ్ ను అఖిలేష్ కేబినెట్ నుంచి తొలిగించారు. శివపాల్ తోపాటు మరో ముగ్గురు మంత్రులపైనా వేటు పడింది. అమర్ సింగ్ అనుకూలురుగా ముద్రపడ్డ మరో నగులురు మంత్రులు, ప్రభుత్వ పదవులు నిర్వహిస్తున్నవారిపైనా వేటు తప్పదని అఖిలేష్ వర్గం ఆదివారం ప్రకటించింది. ఆదివారం నాటి పరిణామాలతో యాదవ్ పరివారంలో కొద్దిరోజులుగా సాగుతోన్న అంతర్గత కలహాలు పతాకస్థాయికి చేరినట్లయింది.
వేగంగా మారుతోన్న రాజకీయ పరిణామాల నడుమ.. సమాజ్ వాది పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనాయకులతో ఆదివారం సీఎం అఖిలేష్ యాదవ్ అత్యవసరంగా భేటీ అయ్యారు. దాదాపు 200 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరైనట్లు సమాచారం. సమావేశం ఆద్యంతం ఆవేశపూరితంగా మాట్లాడిన అఖిలేష్.. తనకు వ్యతిరేకంగా లేదా అమర్ సింగ్ కు అనుకూలంగా వ్యవహరించే ఏఒక్కరినీ విడిచిపెట్టబోనని హెచ్చరించినట్లు మోయిన్ పురి ఎమ్మెల్యే రాజు యాదవ్ మీడియాకు చెప్పారు.
ములాయం సింగ్ కు ప్రియమైన తమ్ముడిగా, కేబినెట్ లో షాడో సీఎంగా కొనసాగుతున్న శివపాల్ యాదవ్ తోపాటు మంత్రులు షబాబ్ ఫాతిమా, ఓం ప్రకాశ్, నారద్ రాయ్ లు ఉద్వాసనకు గురైనవారిలో ఉన్నారు. వీరంతా మొదటి నుంచి అమర్ సింగ్, శివపాల్ లకు వీరవిధేయిలే కావడం గమనార్హం. సీఎం అఖిలేష్ సంచలన నిర్ణయంతో శివపాల్ వర్గం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. పార్టీ సుప్రిమో ములాయంను సంప్రదించకుండా అఖిలేష్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఊహించలేకపోయిన శివపాల్.. పరుగున అన్ని ఇంటికి బయలుదేరారు. మంత్రులను తొలగిస్తూ అఖిలేష్ తీసుకున్న నిర్ణయంపై ములాయం స్పందన వెలువడాల్సిఉంది.