వాషింగ్టన్:
జనవరి 20 - అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ పదవీ స్వీకార ప్రమాణం చేసే రోజు. ఆరోజే ఆయన అధికార భవనం వైట్ హౌస్ లో అడుగుపెడతారు. ఆ క్షణానికి వైట్ హౌస్ అంతా ఆయన అభీష్టం మేరకు సిద్ధంకావాలి. ఆయన సూట్ రడీగా ఉండాలి. ఆయన వ్యక్తిగత ఫోటోలన్నీ ప్రత్యేకమైన స్థానాల్లో ప్రత్యక్షం కావాలి. ఆయనకు నచ్చిన టూత్ బ్రష్, టూత్ పేస్ట్ ఆయన బాత్ రూమ్ లో సిద్ధంగా ఉండాలి. ఒకటేమిటి ట్రంప్ అడుగుపెట్టే నాటికి ఆయన టేస్టుకు అనుగుణంగా మొత్తం వైట్ హౌస్ ఎక్కడికక్కడ అంతా సిద్ధంగా ఉండాలి.
అదేం పెద్ద పని... అని అనుకోకండి. ఎందుకంటే ప్రస్తుత అధ్యక్షుడు ఆ భవనం ఖాళీ చేసేంతవరకు అక్కడ గుండుసూది కూడా కదపడానికి వీలుండదు. పైగా కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేసే సమయం వరకు పాత అధ్యక్షుడు ఆ భవనం ఖాళీ చేయరు. ప్రమాణ స్వీకారం చేయగానే ట్రంప్ నేరుగా వైట్ హౌస్ కు చేరుకుంటారు. ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరడంతో ఒబామాకు వైట్ హౌస్ తో అనుబంధం ముగుస్తుంది. ఒకరు వెళ్లడం మరొకరు రావడం... మధ్యలో ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం... ఆ తతంగం ముగిసే సమయంలోనే వైట్ హౌస్ లో మార్పుచేర్పులన్నీ జరిగిపోవాలి.
ఇదో పెద్ద సవాలే. ఇదో వింత పరిస్థితి. ఒకవైపు కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం కార్యక్రమం పూర్తయ్యేలోగా పాత అధ్యక్షుడి కుటుంబానికి సంబంధించిన మొత్తం వస్తువులన్నీ ఖాళీ చేయడమే కాకుండా కొత్త అధ్యక్షుడి అభీష్టానికి అనుగుణంగా మళ్లీ వైట్ హౌస్ రూపుదిద్దుకోవాలి. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు క్యాపిటల్ బిల్డింగ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆనవాయితీ ప్రకారం పాత అధ్యక్షుడు (పదవీ విరమణ చేసే అధ్యక్షుడు) కార్యక్రమం నిర్వహించే కాపిటల్ కు వైట్ హౌస్ నుంచే బయలుదేరడం ఆనవాయితీగా వస్తోంది. అంటే కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లే సమయం వచ్చే వరకు పాత అధ్యక్షుడు ఆ భవనం ఖాళీ చేయరన్న మాట.
2009లో బరాక్ ఒబామా అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జనవరిలో వైట్ హౌస్ లో అడుగుపెట్టాల్సిన సమయంలో కూడా ఇలాంటి సమస్య ఎదురైంది. ఒబామా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి అప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న బుష్ ఆయన కుటుంబం సంప్రదాయం ప్రకారం ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బయలుదేరింది. వాళ్లు అలా బయలుదేరి వైట్ హౌస్ లోని స్టేట్ ఫ్లోర్ దాటగానే... అంతే క్షణాల్లో ఖాళీ చేసే ప్రక్రియ మొదలైంది. అప్పట్లో వైట్ హౌస్ అధికారిగా పనిచేసిన స్టీఫెన్ రొచెన్ కేవలం ఐదు గంటల్లో మొత్తం వైట్ హౌస్ ను ఖాళీ చేయించడమే కాకుండా కొత్త అధ్యక్షుడిగా అవసరమైన మేరకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేయించారు.
అయితే, మామూలుగా ఒక ఇంట్లోంచి మరో ఇంట్లోకి లగేజీ మార్చినంత ఈజీగా అమెరికా అధ్యక్షుడి ఇళ్లు ఖాళీ చేయడం సులభం కాదు. ఆశామాషీ వ్యవహారం అంతకన్నా కాదు. పదవీ విరమణ చేసే అధ్యక్షుడి కుటుంబానికి సంబంధించిన ప్రతి వస్తువు ఎంతో జాగ్రత్తగా ప్యాక్ చేసి తరలించి మళ్లీ కొత్త నివాసంలో జాగ్రత్తగా ఎక్కడివక్కడ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దానికి తెరవెనుక ఎంతో పెద్ద ప్రణాళికే ఉంటుంది. అలాగే, కొత్తగా వైట్ హౌస్ లోకి అడుగుపెట్టబోయే అధ్యక్షుడు, ఆయన కుటుంబానికి ఎన్నో ఆలోచనలు, అబీష్టాలు ఉంటాయి. వాళ్ల ఆలోచనా సరళికి అనుగుణంగా సకల సౌకర్యాలు సమకూరాలి.
ఎంతో కాలంగా ఉన్న అధ్యక్షుడి కుటుంబం ఖాళీ చేసి భవనం విడిచి వెళ్లే క్షణాలు, కొత్త అధ్యక్షుడి ఆ భవనంలోకి అడుగుపెట్టడం... ఆ ఉత్కంఠభరితమైన క్షణాలలో వైట్ హౌస్ సిబ్బంది సైతం భావోద్వేగంతో నిండిపోతారు. అక్కడి వాతావరణమంతా ఒక్కసారిగా గంభీరంగా మారిపోతుంది.
"ఒబామా పదవీ స్వీకార ప్రమాణం చేసినప్పుడు తామంతా వైట్ హౌస్ లోని ఈస్ట్ రూమ్ లో సమావేశమయ్యాం. అప్పటికే ఎనిమిదేళ్లపాటు బుష్ కుటుంబానికి సేవలందించాం. నిజంగా అదొక కన్నీటి పర్యంతమయ్యే ఉత్కంఠ భరితమైన క్షణాలు. అదొక ఎంప్లాయీ ఎంప్లాయర్ కు మధ్యన ఉండే బంధమొక్కటే కాదు. ఒక మిత్రుడిని కోల్పోతున్న ఫీలింగ్..." అంటూ ఆ సమయంలో వైట్ హౌస్ అధికారి రొచొన్ ఎంతో ఉధ్విగ్నంగా చెప్పుకొచ్చారు. "అందులో పనిచేసే సిబ్బంది రాజకీయాలకు అతీతంగా ఉంటారు. అమెరికా ప్రథమ పౌరుడు, ఆయన కుటుంబానికి అవసరమైన సపర్యలు చేయడమెట్లో గతానుభవం నేర్పింది" అని అన్నారు.
వాల్ పేపర్స్, రగ్స్, పేయింటింగ్స్, శాండ్లియర్స్, ఫర్నీచర్, జిమ్ పరికరాలు, షవర్ హెడ్స్... ఒకటేమిటి కొన్ని సందర్బాల్లో అధ్యక్షుడి రెసిడెన్స్ లెవెల్ లో కొన్ని గోడలను తొలగించి కొత్త ఏర్పాట్లు సైతం చేయాల్సి ఉంటుంది. కొన్నింటిని తొలగించడం, మరికొన్నింటిని కొత్తగా ఏర్పాటు చేయడం తప్పకపోవచ్చు. అయితే నూతన అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న గడియల్లో అందరి దృష్టి అటువైపు ఉన్న కొద్ది గంటల్లోగా ఇవన్నీ జరిగిపోవాలి. వైట్ హౌస్ లోని రెసిడెన్షియల్ లెవల్ లో ఎలాంటి మార్పు అయినా చేయాల్సిందే. అమెరికా అధ్యక్షులుగా ఎన్నికైన వాళ్లు పిచ్చోళ్లేం కాదు. అంతగా రీమాడల్ చేయాల్సిన అవసరం రాదు. ఎందుకంటే వైట్ హౌస్ ను నచ్చనివాళ్లంటూ నేనింతవరకు చూడలేదు.. అని వైట్ హౌస్ చరిత్రకారుడు, రచయిత విలియమ్ సీల్ చెప్పుకొచ్చారు.
అయితే ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత ఈసారి ట్రంప్ తో పాటు వెంట ఆయన కుటుంబం వైట్ హౌస్ కు రావడం లేదు. ట్రంప్ పదేళ్ల కుమారుడు బారన్ విద్యా సంవత్సరం మధ్యలో ఉన్నందున వచ్చే జూన్ వరకు మెలినా ట్రంప్ న్యూయార్క్ లోని ట్రంప్ టవర్ లోనే నివాసం ఉండాలని నిర్ణయించుకున్నారు.
కాపిటల్ బిల్డింగ్ వద్దే...
ఆండ్రూ జాక్సన్ నుంచి జిమ్మీ కార్టర్ వరకు ప్రమాణ స్వీకార కార్యక్రమం క్యాపిటల్ బిల్డింగ్ (క్యాపిటల్) తూర్పు పోర్టికో ముందు నిర్వహించగా, రోనాల్డ్ రీగన్ కాలంలో క్యాపిటల్ పశ్చిమ పోర్టికో భాగంలో నిర్వహించారు. విపరీతమైన మంచు కురిసిన కాలంలో క్యాపిటల్ బిల్డింగ్ లోపల ఈ కార్యక్రమాలను నిర్వహించిన సందర్భాలూ ఉన్నాయి. 1817లో ఒకసారి, 1945 లో మరోసారి క్యాపిటల్ బిల్డింగ్ వద్ద కాకుండా వాషింగ్టన్ (డీసీ)లోని మరో ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆ ఐదు గంటలే...
ప్రమాణ స్వీకారం సందర్భంగా అనేక కార్యక్రమాలు దాదాపు నాలుగైదు గంటలపాటు కొనసాగుతాయి. పరేడ్లు... ప్రసంగాలు... ఇలా అనేక కార్యక్రమాలుంటాయి. అమెరికా ప్రజలతో పాటు ప్రపంచ ప్రజల దృష్టంతా ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమంపైనే ఉంటుంది. సరిగ్గా ఆ టైమ్ లో వైట్ హౌస్ లో జరగాల్సిన తతంగం అంతా జరిగిపోతుంది. ఒబామాకు చెందిన వస్తువులన్నీ అత్యంత జాగ్రత్తగా ప్యాక్ చేసి ఆయన కొత్తింటికి తరలిస్తారు. అలాగే ట్రంప్ అభీష్టానికి అనుగుణంగా వైట్ హౌస్ ను తీర్చిదిద్దుతారు. అంతే... అంతా ఆ కొన్ని గంటల్లోనే... ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగియగానే ఒబామా తన కుటుంబంతో కలిసి కొత్త ఇంటికి వెళుతారు. ట్రంప్ వైట్ హౌస్ లో అడుగుపెడతారు.
ఐదు గంటల్లో వైట్ హౌస్ ఖాళీ
Published Mon, Jan 16 2017 9:55 PM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM
Advertisement