కమల్.. మళ్లీ వేసేశాడు!
తమిళ రాజకీయాలపై ఘాటుగా స్పందిస్తున్న కమల్ హాసన్.. మరోసారి అదే అంశంపై స్పందించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పరిణామాలపై ట్విట్టర్‌లో తనదైన శైలిలో పోస్ట్ చేశారు. ఇందుకు మహాత్మాగాంధీ చెప్పిన ఒక వాక్యాన్ని ఆయన తీసుకున్నారు. ''అధికారం రెండు రకాలు. ఒకటి శిక్ష పడుతుందన్న భయంతో పొందేది, మరొకటి ప్రేమపూర్వకమైన చర్యలతో పొందేది. ఈ మాటలు చెప్పింది గాంధీ (మై ఇమిటబుల్ హీరో)'' అని కమల్ అన్నారు. అన్నాడీఎంకే యుద్ధంలో పన్నీర్ సెల్వానికి తనవైపు నుంచి పూర్తి మద్దతు తెలియజేసిన సినీ ప్రముఖుల్లో కమల్ అందరికంటే ముందున్నారు. చాలామంది ఈ వివాదంపై మాట్లాడారు గానీ, సూపర్ స్టార్ రజనీ కాంత్ మాత్రం ఇంకా ఏమీ స్పందించలేదు.
రజనీ కూడా ఏమైనా అంటారేమోనని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఖుష్బూ, ఆర్య తదితరులు కూడా పన్నీర్ సెల్వానికి మద్దతు పలికిన విషయం తెలిసిందే. కమల్ అయితే మాధవన్ కూడా ఈ అంశంపై స్పందించాలంటూ ట్వీట్ చేశాడు. తాను చెప్పిన అభిప్రాయంతో విభేదించవచ్చని, కానీ ఏదో ఒకటి మాట్లాడాల్సిన సమయం వచ్చిందని, అందువల్ల తన అభిప్రాయాన్ని మాధవన్ కూడా గట్టిగా చెప్పాలని కమల్ అన్నారు. దానికి మాధవన్ కూడా స్పందించాడు. తమిళనాడు కేవలం దేశంలోనే కాక ప్రపంచంలోనే ఉత్తమ రాష్ట్రం కావాలని ఎప్పటినుంచో చర్చిస్తున్నామని, మనకున్న టాలెంట్, సామర్థ్యంతో ప్రపంచానికి ఉదాహరణగా నిలవాలని అన్నాడు. ఇది ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిన సమయమని, మీ గొంతు వినిపించాలని తన అభిమానులను కోరాడు.