‘అమ్మ’ సమాధిపై శశికళ శపథం
- ‘అమ్మ’ సమాధిని మూడుసార్లు అరచేత్తో గట్టిగా తట్టిన చిన్నమ్మ
- కుట్రల నుంచి పార్టీని కాపాడతానని శపథం చేశారంటున్న అన్నాడీఎంకే శ్రేణులు
- అది ‘కుట్ర, ద్రోహం, కష్టాల’కు సంకేతమని పార్టీ వెబ్‌సైట్‌లో వెల్లడి
- బెంగళూరు కోర్టులో లొంగిపోయిన శశికళ, ఇళవరసి, సుధాకరన్
- తనకు వీఐపీ వసతులు కల్పించాలని కోరుతూ శశికళ లేఖ
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష పడిన శశికళ బెంగ ళూరు కోర్టులో లొంగిపోవడానికి బయల్దేరే ముందు బుధవారం ఉదయం చెన్నై మెరీనా బీచ్‌లోని ‘అమ్మ’ జయలలిత సమాధి వద్ద నివాళులర్పించారు. మొదట అమ్మ సమాధి వద్దకు చేరుకుని పూలు చల్లారు. వంగి నమస్కారం చేసి, మరలా లేచి నిలబడి పెదాలు బిగబట్టి సమాధిపై అరచేత్తో గట్టిగా తట్టారు. ఆ తరువాత మళ్లీ లేచి నిలబడి పెదాలు కదిలిస్తూ మనస్సులోనే ఏమో గొణుక్కున్నారు. ఇలా మరో రెండుసార్లు సమాధిపై అరచేత్తో గట్టిగా తట్టారు. అనంతరం వేగంగా నడుచుకుంటూ వెళ్లి కారులో కూర్చున్నారు. అమ్మ సమాధిపై శశికళ చేసిన శపథం వెనుక ఆంతర్యంపై పలు ఊహాగానాలు వెలువడ్డాయి.
నా ప్రాణం ఉన్నంత వరకూ అన్నాడీఎంకేను ఏ శక్తీ నాశనం చేయలేదు, శత్రువుల కుట్రల నుంచి పార్టీని కాపాడుతాను అని శపథం చేసినట్లుగా శశికళ వెంట ఉన్న పార్టీ శ్రేణులు తెలిపాయి. అయితే, ‘కుట్ర, ద్రోహం, కష్టాల’కు బలయ్యానని సంకేతంగా శశికళ మూడుసార్లు అమ్మ సమాధిని చేత్తో తట్టారని అన్నాడీఎంకే అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. శశికళ మెరీనా బీచ్ నుంచి రామాపురంలోని ఎంజీ రామచంద్రన్ నివాసానికి వెళ్లి కొద్దిసేపు మౌనముద్రలో కూర్చున్నారు. ఆ తరువాత అదే ప్రాంగణంలోని ఎంజీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి నేరుగా శశికళ, ఇళవరసి బెంగళూరు వైపు పయనమయ్యారు. అంతకుముందు పోయెస్ గార్డెన్‌లో జయలలిత ఫొటో వద్ద శశికళ శ్రద్ధాంజలి ఘటించారు. ఇదే కేసులో శిక్ష పడిన సుధాకరన్ కూడా చెన్నై నుంచి వేరుగా బయల్దేరి బెంగళూరు కోర్టులో లొంగి పోయారు.
బంధువులకు పదవులు: అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్
- వ్యతిరేకిస్తూ పార్టీ నిర్వాహక కార్యదర్శి రాజీనామా
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ జైలుకు వెళ్తూ పార్టీ బాధ్యతల్ని తన కుటుంబసభ్యులకు కట్టపెట్టారు. వరుసకు కుమారుడైన దినకరన్‌కు బుధవారం పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి బాధ్యతల్ని అప్పగించారు. దినకరన్‌తో పాటు శశికళ అన్న సుందరవదనం కుమారుడు డాక్టర్ వెంకటేషన్ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఆమె ప్రకటన విడుదల చేశారు. ఆ ఇద్దరు గతంలో చేసిన తప్పుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారని, క్షమాపణ కూడా కోరడంతో పార్టీలోకి మళ్లీ తీసుకున్నట్టు ప్రకటించారు.
టీటీవీ దినకరన్ తన ప్రతినిధిగా, ఉప ప్రధాన కార్యదర్శిగా పార్టీ వ్యవహారాలను చూసుకుంటారని తన ప్రకటనలో కార్యకర్తలకు సందేశాన్ని పంపించారు. ప్రభుత్వం ఏర్పాటైన పక్షంలో దినకరన్‌కు డిప్యూటీ సీఎం పదవిని కూడా కట్టబెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్టు సమాచారం. ఉప ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించగానే, దినకరన్ ఆగమేఘాలపై కువత్తూరు క్యాంప్‌నకు చేరుకుని ఎమ్మెల్యేలతో సమావేశం కావడం ఈ ఊహాగానాలకు ఊతమిచ్చింది.
అయితే అమ్మ జయలలిత గతంలో పక్కన పెట్టినవారికి పదవులు కట్టబెట్టడంపై వ్యతిరేకత వ్యక్తమైంది. దినకరన్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ నిర్వాహక కార్యదర్శి కరుప్పసామి పాండియన్ తన పదవికి రాజీనామా చేశారు. జయలలిత 2011లో ఎంపీ పదవి నుంచి టీటీవీ దినకరన్, పార్టీ యువజన కార్యదర్శి పదవి నుంచి డాక్టర్ వెంకటేష్‌లను తొలగించిన విషయం తెలిసిందే. సింగపూర్ పౌరసత్వం కూడా కలిగి ఉన్న దినకరన్‌పై విదేశీమారక ద్రవ్యం కేసు, ఇంగ్లాండ్‌లో ఓ బ్యాంక్‌లో పెద్ద మొత్తం డిపాజిట్‌తో పాటు పలు కేసులు ఉండడం గమనార్హం.