
కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద మృతి
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఢిల్లీలోని లీలా హోటల్ లో సునంద మృతదేహం లభ్యమయింది. ఆమె మృతికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. సునంద మృతి విషయాన్ని శశిథరూర్కు పోలీసులు తెలిపారు.
2010లో వివాహం చేసుకున్న శశి థరూర్, సునంద మధ్య గతకొద్ది రోజులుగా విభేదాలు తలెత్తినట్టు ప్రచారం జరుగుతోంది. పాకిస్థాన్ మహిళా జర్నలిస్టు మెహర్ తరార్‌తో ట్విట్టర్‌లో నిన్న జరిగిన మాటల యుద్ధం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది జరిగిన ఒక్క రోజులోపే సునంద మృతి చెందడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
తన భర్తను వలలో వేసుకునేందుకు మెహర్ ప్రయత్నించిందని ట్విటర్లో సునంద పోస్ట్ చేశారు. ఈ వివాదంతో విసిగిపోయానని, థరూర్‌కు విడాకులు ఇవ్వాలనుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. దీంతో థరూర్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తమ ట్విట్టర్ ఖాతాలను ఎవరో హ్యాక్ చేశారంటూ థరూర్ దంపతులు గురువారం మీడియాకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.