డాలర్ డ్రీమ్స్పై ట్రంప్ వేటు! | Trump effect? H1B visas reintroduced in US Congress | Sakshi
Sakshi News home page

డాలర్ డ్రీమ్స్పై ట్రంప్ వేటు!

Published Fri, Jan 6 2017 1:32 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

డాలర్ డ్రీమ్స్పై ట్రంప్ వేటు! - Sakshi

డాలర్ డ్రీమ్స్పై ట్రంప్ వేటు!

భారతీయుల ‘డాలర్ డ్రీమ్స్’పై అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ నీళ్లు చల్లుతున్నారు.

హెచ్1బి వీసా నిబంధనలు కఠినతరం?
కాంగ్రెస్లో బిల్లును ప్రవేశపెట్టిన రిపబ్లికన్లు
వీసా వేతన పరిమితి లక్ష డాలర్లకు పెంపు
‘మాస్టర్స్ డిగ్రీ’ మినహాయింపూ రద్దు
‘అమెరికన్లకే ఉద్యోగాలు’లో భాగంగా చర్యలు
బిల్లు ఆమోదం పొందితే మనవాళ్లకు కష్టాలే
ఇప్పటికే ఐటీ సంస్థల ‘స్థానిక’ నియామకాలు
పడిపోతున్న హెచ్1బి నియామకాల సంఖ్య


భారతీయుల ‘డాలర్ డ్రీమ్స్’పై అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ నీళ్లు చల్లుతున్నారు. ట్రంప్ ఎన్నికల నినాదాల్లో ‘అమెరికన్లకే అమెరికా ఉద్యోగాలు’ అనేదీ కీలకమైనది. ఇందులో భాగంగా.. అమెరికాలో ఉద్యోగం కోసం భారతీయులు ఎక్కువగా ఉపయోగించుకుంటున్న హెచ్1బి వీసా నిబంధనలను కఠినతరం చేసే చర్యలను ముమ్మరం చేశారు. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ సమావేశమైన రెండో రోజు బుధవారం నాడే.. హెచ్1బి వీసాల్లో కీలక మార్పులు చేసేందుకు ఉద్దేశించిన ‘అమెరికా ఉద్యోగాల పరిరక్షణ, పెంపు చట్టం (ప్రొటెక్ట్ అండ్ గ్రో అమెరికన్ జాబ్స్ యాక్ట్)’ బిల్లును మళ్లీ ప్రవేశపెట్టారు.

హెచ్-1బి వీసా జారీ చేయడానికి కనీస వార్షిక వేతనాన్ని ప్రస్తుతమున్న 60,000 డాలర్ల నుంచి 1,00,000 డాలర్లకు పెంచటం, మాస్టర్స్ డిగ్రీ మినహాయింపును తొలగించడంతో పాటు పలు చర్యలను ఇందులో ప్రతిపాదించారు. వీసా దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ఈ చట్టం దోహదం చేస్తుందనేది.. దీనిని కాంగ్రెస్లో ప్రవేశపెట్టిన కాలిఫోర్నియాకు చెందిన రిపబ్లికన్ సభ్యులు డారెల్ ఇస్సా, స్కాట్ పీటర్స్ వాదన. ఈ చట్టం ఆమోదం పొందితే భారతీయ ఐటీ నిపుణులు, ఐటీ సంస్థలు నష్టపోతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
-(సాక్షి నాలెడ్జ్ సెంటర్)

అమెరికాలోని హైటెక్ ఉద్యోగాలను భారత్ వంటి దేశాల నిపుణులతో భర్తీ చేసేందుకు హెచ్1బి వీసా జారీ చేస్తారు. ప్రస్తుతం హెచ్1బి వీసాలపై ఏటా 85,000 పరిమితి ఉంది. సాధారణ డిగ్రీ ఉన్న వారికి 65,000, ఉన్నతస్థాయి డిగ్రీ ఉన్న వారికి 20,000 చొప్పున కోటా ఉంది. భారతీయ ఐటీ కంపెనీలే కాకుండా, విదేశీ సంస్థలు కూడా భారత్ నుంచి ఈ వీసాల కింద నియామకాలు చేస్తున్నాయి. దీంతో భారతీయుల దరఖాస్తుల సంఖ్య పెరుగుతోంది. భారత్ నుంచి పెద్ద సంఖ్యలో నిపుణులు అమెరికా సంస్థల్లో పనిచేయడానికి వలస వెళ్తున్నారు. దీనివల్ల అమెరికన్లకు ఉద్యోగాలు దక్కకుండా పోతున్నాయన్నది ట్రంప్ అభ్యంతరం. హెచ్1బి వీసాల జారీని తగ్గించాలని.. తద్వారా అమెరికన్లకు ఎక్కువ ఉద్యోగాలు అందుబాటులో ఉండేలా చేయాలని ట్రంప్ శిబిరం ప్రయత్నం.

ఇటీవల డిస్నీ, సోకాల్ ఎడిసన్ తదితర పలు సంస్థలు అమెరికా కార్మికులను తొలగించి విదేశీ కార్మికులను నియమించటం ద్వారా హెచ్1బి వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగం చేశాయంటూ వివాదం రేగిన నేపథ్యంలో ఈ బిల్లును మళ్లీ కాంగ్రెస్లో ప్రవేశపెట్టటం గమనార్హం. హెచ్1బి వీసాలపై నియమించే ఉద్యోగాలకు వేతన స్థాయిని అమెరికా సగటు వేతన స్థాయికి పెంచడం వల్ల.. ఆ వీసా ఉద్యోగులను నియమించే సంస్థలకు లాభం ప్రయోజనం తగ్గిపోతుందని, తద్వారా ఆ వీసాల దుర్వినియోగం తగ్గుతుందని.. కాబట్టి ఆ ఉద్యోగాలు నిజంగా అవసరమైన సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఇస్సా పేర్కొన్నారు. అదేవిధంగా.. హెచ్1బి వీసా కొరకు అర్హత సాధించడం కోసం చాలా మంది విదేశీ కార్మికులు నాసిరకం మాస్టర్స్ డిగ్రీ సర్టిఫికెట్లు తీసుకుంటూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ఈ మాస్టర్స్ డిగ్రీ మినహాయింపును తొలగించడం ద్వారా దానిని అరికట్టవచ్చునని ఆయన చెప్తున్నారు.
(సంబంధిత వార్తల కోసం చదవండి : అమెరికాతో బంధం ఏనాటిదో..!)

మన ఐటీ కంపెనీలకు నష్టమే..?
అమెరికాతో పదిహేనేళ్లుగా మనకు గట్టి అనుబంధం ఉన్నది ఐన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోనే. కంప్యూటర్ సాఫ్ట్వేర్ నిపుణులకు పెద్ద సంఖ్యలో అక్కడ ఉద్యోగాలు లభిస్తున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి ఐటీ దిగ్గజాలు అమెరికా కంపెనీలకు సేవలందించడమేగాక, ఇక్కడి నుంచి ఐటీ నిపుణులను హెచ్1బి, ఎల్1 వీసాలపై అమెరికా పంపి అక్కడి కంపెనీలు, ప్రభుత్వ సంస్థలకు సేవలు సమకూర్చుతున్నాయి. హెచ్1బి వీసా నిబంధనలను కఠినతరం చేస్తే ఈ అగ్రశ్రేణి టెక్ కంపెనీల లాభాలు దెబ్బతినే అవకాశముందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
(సంబంధిత వార్తల కోసం చదవండి : ట్రంప్ నోట రోజుకో మాట)

ట్రంప్ ఎన్నికల హామీలు తమ వ్యాపారాలకు నష్టం కలిగించవచ్చని భావిస్తున్న భారత ఐటీ కంపెనీలు.. హెచ్1బి వీసాల మీద ఆధారపడటాన్ని తగ్గించేందుకు ముందుగానే అమెరికా యూనివర్సిటీల్లో నియామకాలు చేపట్టి, అక్కడి చిన్న చిన్న సాఫ్ట్వేర్ సర్వీస్ కంపెనీలను కొనుగోలు చేపే పనిలోపడ్డాయి. ‘‘నిపుణులు దొరికితే స్థానికులకు ఉద్యోగాలిస్తాం. వర్సిటీల్లో ఫ్రెషర్లను కూడా ఉద్యోగాల్లో నియమిస్తాం. అమెరికాలో దొరకని ఉన్నత స్థాయి నిపుణులను మాత్రమే హెచ్1బి వీసాలపై పంపిస్తున్నాం. దీన్ని వలసగా పొరబడితే మేం ఏంచేయాలి’’ అని ఇన్ఫోసిస్ సీఓఓ ప్రవీణ్రావు ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ కంపెనీలు స్థానికంగా నియామకాలు చేపడుతుండటంతో హెచ్1బి వీసా ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని ఎడిల్వీస్ సెక్యూరిటీస్ సంస్థ ఇటీవల వెల్లడించింది.
(సంబంధిత వార్తల కోసం చదవండి : 100 మందిలో ఒకరు భారతీయులే!)

నాడు ఒబామా ఇలాగే మాట్లాడినా...
అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన 100 రోజుల్లో ఏం చేసేదీ వెల్లడించిన సందర్భంలో కూడా విదేశీయులను దేశంలోకి అనుమతించే వీసా కార్యక్రమాల్లో జరిగిన అక్రమాలపై దర్యాప్తుకు కేంద్ర కార్మికశాఖను ఆదేశిస్తానని ట్రంప్ చెప్పారు. అమెరికా పౌరుల ఉపాధిని కొల్లగొడుతున్న వీసా విధానాలను నిలిపివేస్తానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

అమెరికా అటార్నీ జనరల్ పదవికి ట్రంప్ ప్రతిపాదిస్తున్న అలమాబా సెనెటర్ జెఫ్ సెషన్స్ కూడా ఎప్పటి నుంచో హెచ్1బీ వీసాను వ్యతిరేకిస్తున్నారు. అయితే.. 2008 అమెరికా అధ్యక్ష పదవికి డెమొక్రాటిక్ టికెట్ కోసం హిల్లరీతో ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా పోటీపడినప్పుడు ఐటీ ఔట్సోర్సింగ్, పన్నుల పెంపు విషయంలో భారత కంపెనీలకు నష్టం కలిగించే రీతిలో ఇప్పటి ట్రంప్ మాదిరిగానే మాట్లాడారు.

ఆయన చేసింది మాత్రం హెచ్1బీ, ఎల్1 వీసాల ఫీజులను పెంచడం ఒక్కటే. గత ఏడాదిలో హెచ్1బి వీసా నిబంధనలను కఠినతరం చేసేందుకు ఉద్దేశించిన బిల్లును కాంగ్రెస్లో ప్రవేశపెట్టినా ఆమోదం పొందలేదు. కానీ.. ట్రంప్ హయాంలో భారత ఐటీ పరిశ్రమకు కొన్ని సవాళ్లు తప్పవనే అభిప్రాయం అందరిలో ఉంది. అయితే.. అమెరికా కంపెనీలు ఎంపికచేసుకుని, నియమించే భారత ఐటీ నిపుణులకు అమెరికా పోవడానికి ఇబ్బందులేవీ ఉండకపోవచ్చని చెబుతున్నారు. అదే భారత ఐటీ కంపెనీలు భారత ఉద్యోగులను అక్కడికి తీసుకుపోవడం పూర్వంలా సాఫీగా సాగకపోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement