అఖిలేష్ భవితవ్యం ఏమిటి?
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ నుంచి అనూహ్యంగా బహిష్కరణకు గురైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భవితవ్యం ఏమిటి? ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. ముఖ్యమంత్రి పదవికి అఖిలేష్ రాజీనామా చేయనున్నట్టు సమాచారం. అలాగే కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. జనవరి 1న అఖిలేష్ తన అనుచరులు, మద్దతుదారులతో సమావేశంకానున్నారు. అదే రోజు కొత్త పార్టీని ప్రకటించే అవకాశముందని భావిస్తున్నారు.
శుక్రవారం ఎస్పీ నుంచి అఖిలేష్‌ను ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్టు ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ ప్రకటించారు. కొత్త సీఎం ఎవరన్నది త్వరలో నిర్ణయిస్తామని చెప్పారు. దీంతో ఎస్పీలో చీలిక అనివార్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. తండ్రి ములాయం, బాబాయ్, యూపీ ఎస్పీ చీఫ్ శివపాల్ యాదవ్‌లతో విభేదిస్తున్న అఖిలేష్ వేరు కుంపటి పెడతారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అఖిలేష్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో మంతనాలు సాగించారు. ఆ పార్టీతో పొత్తుపెట్టుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇందుకు సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి.
( చదవండి : అఖిలేశ్ ఇంటికి క్యూకట్టిన ఎమ్మెల్యేలు)
ములాయం ప్రకటన వెలువడగానే అఖిలేష్ ఇంటి వద్ద ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. లక్నోలో అఖిలేష్ నివాసం వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకుని ఆయనకు మద్దతు తెలిపారు. ములాయం, శివపాల్ యాదవ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అఖిలేష్‌ను పార్టీ నుంచి బహిష్కరించడం దారుణమని మద్దతుదారులు ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు అఖిలేష్ సూచించిన వారికి టికెట్లు ఇచ్చేందుకు నిరాకరించిన ములాయం తన సోదరుడు శివపాల్‌తో కలసి అభ్యర్థుల జాబితా ప్రకటించగా.. అఖిలేష్ పోటీగా రెబెల్స్ జాబితాను ప్రకటించారు. దీంతో అఖిలేష్‌తో పాటు ఆయనకు మద్దతుగా నిలిచిన సమీప బంధువు రాంగోపాల్ యాదవ్‌ను ములాయం పార్టీ నుంచి బహిష్కరించారు.
(చదవండి : 1న అఖిలేశ్ వర్గం భారీ సభ..)