లక్నోలో లంచ్ చేస్తోన్న ములాయం,బిల్ క్లింటన్, అమర్ సింగ్(2005నాటి ఫొటో)
'రాజకీయాల్లో రాసి కంటే వాసి ముఖ్యం' అనుకుంటే సమాజ్ వాదీ పార్టీలో అమర్ సింగ్ కంటే గొప్ప(!) వ్యూహకర్త లేరు. జైలు శిక్ష నుంచి ములాయం సింగ్ యాదవ్ ను కాపాడినా, నేతాజీకి ఢిల్లీ రాజకీయాల ఓనమాలు దిద్దించినా, బిల్ క్లింటన్ నుంచి బడా పారిశ్రామికవేత్తలను యూపీకి రప్పించినా, సినిమా స్టార్లతో సమాజ్ వాదీకి మరింత గ్లామర్ అద్దినా అది ఒక్క అమర్ సింగ్ ఘనతేనని నేతాజీ(ములాయం) బలంగా నమ్ముతారని పార్టీ ప్రముఖులు చెబుతారు. అందుకే కన్న కొడుకును సైతం కాదని ములాయం.. అమర్ సింగ్ పై అమర ప్రేమను ప్రకటిస్తారని అంటారు. అసలు వీళ్ల దోస్తీ ఎలా మొదలైంది?
అప్పటికే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న ముయాలం జనతాపార్టీ ప్రతిధిగా 1985లో యూపీ శాసన మండలి ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఆ సమయంలోనే ములాయంకు యూపీలో బలమైన రాజ్ పుత్ సామాజిక వర్గానికి చెందిన అమర్ సింగ్ పరిచయం అయ్యారు. 1989లో ములాయం మొదటిసారి (జనతాదళ్ నుంచి)ముఖ్యమంత్రి అయిన తర్వాత అమర్-ములాయంకు మరింత దగ్గరయ్యారు. పరివార్ నుంచి విడిపోయి ములాయం 1992లో సొంతగా సమాజ్ వాదీ పార్టీ స్థాపించినప్పుడూ అమర్ సింగ్ వెంటే ఉన్నారు. 96లో అధికారికంగా పార్టీలో చేరిన అమర్ సింగ్.. కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ (1996-98) ఏర్పాటయినప్పుడు సమాజ్ వాదీ పార్టీ తరఫున కీలక పాత్ర పోశించారని సీనియర్లు చెబుతారు.
ధారళమైన ఇంగ్లీష్, స్వచ్ఛమైన హిందీలో అనర్గళంగా మాట్లాడే అమర్ సింగ్.. రక్షణ శాఖ మంత్రిగా పనిచేస్తోన్న ములాయంకు అన్నీ తానై వ్యవహారాలన్నీ చక్కబెట్టేవారు. ఆ సమయంలో యూపీలో పార్టీ పగ్గాలన్నీ అమర్ సింగ్ చేతుల్లో ఉండేవి. 2003లో ములాయం మరోసారి యూపీ సీఎంగా గద్దెనెక్కినప్పుడు యూపీ డెవలప్ మెంట్ కౌన్సిల్ చైర్మన్ హోదాలో అమర్ సింగ్.. పారిశ్రామికవేత్తలకు యూపీ ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరిచారు. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, జయప్రద, రాజ్ బబ్బర్ సహా పలువురు బాలీవుడ్ స్టార్లను సమాజ్ వాదీలో చేర్పించింది కూడా అమర్ సింగే. ఎప్పటికైనా ప్రధానమంత్రి కావాలనే కోరిక అమర్ సింగ్ వ్యూహాలతో తప్పక నెరవేరుతుందని ములాయం బలంగా నమ్మేవారని, ఇప్పటికీ ఆ నమ్మకాన్ని వీడలేదని నేతాజీ కీలక అనుచరులు చెబుతారు.
అలా వర్థిల్లుతోన్న వారి స్నేహం 2009లో అఖిలేశ్ యాదవ్ సీఎంగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కుదుపులకుగురైంది. బయటి వ్యక్తిని తండ్రి(ములాయం) అతిగా నమ్ముతున్నారని అఖిలేశ్ పలుమార్లు బహిరంగంగా వ్యాఖ్యానించారు. అఖిలేశ్ సీఎం పగ్గాలు చేపట్టడంతో ఆయన ఖాళీ చేసిన ఫిరోజాబాద్ పార్లమెంట్ స్థానంలో భార్య డింపుల్ యాదవ్ పోటీకి దింపారు. అది రుచించని అమర్ సింగ్.. డింపుల్ కు వ్యతిరేకంగా ఎస్పీ తిరుగుబాటు అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. ఫలితం అఖిలేశ్ కు అనుకూలంగా రావడం, ఆ వెంటనే తండ్రిని ఒప్పించి అమర్ సింగ్ పై వేటువేయడం చకచకా జరిగిపోయాయి.
ఆరేళ్ల బహిష్కరణా కాలాన్ని పూర్తిచేసుకున్న అమర్ సింగ్ 2016లో సమాజ్ వాదీ పార్టీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. సరిగ్గా కొడకు చరిష్మా ముందు ములాయం స్టార్డమ్ వెలిసిపోతున్న తరుణంలోనే ములాయంకు అమర్ తోడయ్యారు.. తన ప్రియ స్నేహితుడికి పూర్వవైభవం కల్పించడంతోపాటు (ప్రధాని కావాలనే)పాతకలలను నిజం చసే బాధ్యతను అమర్ తలకెత్తుకున్నారు. ఈ క్రమంలో ఎన్ని ఒడుదుడుకులు, తీవ్రస్థాయి విమర్శలకు గురైనా అమర్ 'స్నేహం కోసం' ఎంతకైనా వెళతానని ములాయం తేల్చిచెప్పారు.