Dharmapuri Arvind
-
క్లైమాక్స్‌కు బీజేపీ అధ్యక్ష పదవి కసరత్తు.. రేసులో ఈటల, అరవింద్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడెవరన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేందుకు ఎవరికి వారు తమ తమ పద్ధతుల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. సరిగ్గా ఏడాది కిందట అకస్మాత్తుగా బండి సంజయ్ స్థానంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని అధిష్టానం నియమించింది. అప్పటి నుంచి కిషన్‌రెడ్డి తాత్కలికంగా బీజేపీ సారథ్య బాధ్యతలు నెట్టుకొస్తున్నారు. అయితే ఫుల్ టైం అధ్యక్షుడిగా రాష్ట్రమంతగా తిరిగి పార్టీని పటిష్టం చేసే నాయకుడికోసం తెలంగాణ బీజేపీ నేతలు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. అయితే సంస్థాగత ఎన్నికలు, సభ్యత్వం పేరుతో అధిష్టానం బీజేపీ అధ్యక్షుడి ఎంపిక పెండింగ్‌లో పెట్టింది.అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై అధిష్టానం వివిధ మార్గాల్లో సమాచారాన్ని సేకరిస్తోంది. కానీ ఇప్పటి వరకు అధ్యక్షుడి నియామకం హైకమాండ్ ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేకపోతోంది. దానికి ప్రధాన కారణం అధ్యక్ష పదవి కోసం పోటీ ఎక్కువకావడంతో పాటు, ఒకరిపై ఒకరు పోటాపోటీగా అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. దాంతో అధ్యక్షుడి ఎంపిక బీజేపీ పెద్దలకు తలనొప్పిగా మారింది. ఒకరికి పదవి ఇస్తే మరొకరు పనిచేయకుండా, సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఈ ఎంపిక ప్రక్రియను సాగదీస్తోంది. అయితే, అధ్యక్ష పదవి కోసం ప్రధానంగా ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ మధ్య పోటీ నెలకొంది. ఈ ఇద్దరు అధిష్టానం పెద్దలను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని తమతమ బలాలు చెప్పుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఈటలకు బలం కాగా, ఆయనకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేదని ఆయన వ్యతిరేకులు అంటున్నారు. మరో వైపు ధర్మపురి అరవింద్ రెండు సార్లు నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించి తన సత్తాను చాటారు. తొలి ప్రయత్నంలోనే కేసీఆర్ కూతరు కవితను ఓడించి అధిష్టానం దృష్టిలో పడ్డ అరవింద్ రెండో సారి కూడా గెలిచి తాను బలమైన నేతనని నిరూపించుకున్నారు.అయితే ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తారని, అందరినీ కలుపుకుపోలేరని ఆయన వ్యతిరేకవర్గం ఫిర్యాదులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతల బలాలను, బలహీనతలను అధిష్టానం బేరీజు వేసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ బీసీని తెలంగాణ అధ్యక్షుడిగా నియమించిన నేపథ్యంలో బీజేపీ కూడా ఈసారి బీసీకే సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఫ్లోర్ లీడర్‌గా మహేశ్వర్ రెడ్డిని నియమించిన అధిష్టానం, అధ్యక్ష పదవి బీసీకే అప్పగిస్తామనే సంకేతం పంపింది. ఈ కోణంలో కసరత్తు చివరి దశకు చేరుకుంది. ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్‌లో ఎవరో ఒకరికి సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఈ దిశగా ఏకాభిప్రాయం కుదరకపోతే కిషన్‌రెడ్డిని యథావిధిగా మరికొంత కాలం కొనసాగించే అవకాశముంది. -
ఎంఐఎం కేన్సర్లాంటిది
నిజామాబాద్ సిటీ: ఎంఐఎం పార్టీ దేశానికి కేన్సర్ వ్యాధి వంటిద ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. ఆదివా రం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా దానితో అంటకాగడం ఎంఐఎంకు అలవాటుగా మారిందని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎంఐఎంకు భయపడుతోందని ఎద్దేవా చేశారు. హైడ్రా పాతబస్తీలో అక్రమ కట్టడా లను ఎందుకు కూల్చటం లేదని ప్రశ్నించారు.వక్ఫ్‌బోర్డు చట్టంలో అనేక లొసుగులున్నా యని, వాటిని సవరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేని మాజీ మంత్రి కేటీఆర్.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర చేయాలనుకుంటున్నారో ప్రజ లకు చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తే ప్రజలు ఆయనకు చీపుర్లు, చెప్పులతో స్వాగతం పలికి నిలదీయాలని పిలుపునిచ్చారు. -
కేసీఆర్ ఒకప్పుడు పులి: ఎంపీ అర్వింద్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై నిజామాబాద్ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సోమవారం(సెప్టెంబర్30)ఇందిరాపార్క్ వద్ద బీజేపీ చేపట్టిన రైతు దీక్షలో అరవింద్ మాట్లాడారు.‘రేవంత్‌రెడ్డి.. విదేశీ పర్యటనలు అవసరం లేదు. గజ్వేల్‌లో కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఎకరాకు కోటి రూపాయలు సంపాదించారట. ఇది అధ్యయనం చేయడానికి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు రైతులను పంపించాలని రేవంత్‌కు సలహా ఇస్తున్నా. కేసీఆర్ ఉద్యమం నడిపినన్ని రోజులు పులి.కేసీఆర్ స్పీచ్ మిస్ అవుతున్నాం. పిల్లల మాటలు విని కేసీఆర్ పిల్లి అయ్యారు. కేసీఆర్ ఎక్స్పైర్ అయిన మెడిసిన్. జాతిపిత కావాల్సిన కేసీఆర్ పిల్లల అవినీతికి పితగా మారారు’అని అరవింద్ ఎద్దేవా చేశారు.ఇదీ చదవండి: ఢిల్లీ నుంచి వచ్చి క్షమాపణలు చెప్తారా..?: కేటీఆర్ -
తెలంగాణ బీజేపీ చీఫ్ నియామకంపై సస్పెన్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ చీఫ్ నియామకంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీసీ నేతకే బీజేపీ పగ్గాలు అంటూ ప్రచారం జరుగుతోంది. బీసీ కోటాల్లో ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ మధ్య పోటీ నెలకొంది. సామాజిక వర్గాల ప్రకారం మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్‌కి కేంద్రమంత్రి పదవి ఇవ్వడంతో అదే సామాజికవర్గానికి చెందిన అర్వింద్‌కు పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం లేదంటున్నాయి పార్టీ వర్గాలు.మరోవైపు, ఈసారి సంఘ్ పరివార్ క్షేత్రాల ప్రతినిధికి ఇవ్వాలనే వాదన ఉంది. మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావుకు కేటాయించాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. లోకల్‌బాడీ ఎన్నికల నేపథ్యంలో అధ్యక్ష నియామకంపై ఢిల్లీ జాతీయ నాయకత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.ఇప్పటికే కేంద్ర మంత్రిగా, పార్టీ రాష్ట్రఅధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు. దీంతో టికెట్ ఆశిస్తున్న రెడ్డి సామాజికవర్గానికి చెందిన డీకే అరుణకు ఇస్తారా? లేదా? అన్నది కూడా ఉత్కంఠగా మారింది. ఇదిలా ఉండగా ఇద్దరు సీఎంలను ఢీకొట్టి గెలిచిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి సైతం అధ్యక్షుడి రేసులో ఉన్నట్లు సమాచారం. కాగా, ఇప్పటికే బీజేఎల్పీ బాధ్యతలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహేశ్వర్ రెడ్డికి ఇవ్వడంతో పార్టీ పగ్గాలు బీసీ నేతలకే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త అధ్యక్షుడి నియామకం శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నెలాఖరులోగా ఈ టెన్షన్‌కు తెరపడే చాన్స్ ఉంది. -
తెలంగాణ BJP కొత్త సారథి ఎవరు.. అధ్యక్ష పదవి రేసులో ఉన్నదెవరు?
సాక్షి, తెలంగాణ : తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని ఎప్పుడు నియమిస్తారు? కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు పూర్తయింది. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డి మరోసారి కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఎన్నికలన్నీ పూర్తయినందున ఇక పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించాల్సి ఉంది. జాతీయ అధ్యక్షుడిని కూడా మోదీ క్యాబినెట్లోకి తీసుకున్నారు. అందువల్ల ముందుగా ఆలిండియా పార్టీ అధ్యక్షుడిని నియమించి..ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిని నియమిస్తారని అంటున్నారు. ఇంతకీ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి పోటీపడుతున్నదెవరో చూద్దాం.ఎన్నికలన్నీ పూర్తయ్యాయి. మంత్రి పదవుల పంపకమూ అయిపోయింది. ఇక పార్టీ పదవుల్లో నియామకాలే మిగిలాయి. కిషన్‌రెడ్డి ఇప్పటివరకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవితో పాటుగా..కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. మోదీ మూడో మంత్రివర్గంలో కూడా కిషన్‌రెడ్డికి బెర్త్ ఇచ్చారు. ఇక ఆయన పూర్తిగా మంత్రి బాధ్యతలు నిర్వహించాల్సి ఉన్నందున.. ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొత్తనేతను నియమించాల్సి ఉంది. మరి తెలంగాణ కమల దళపతిగా ఎవరిని నియమిస్తారనేదానిపై బీజేపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ పదవి కోసం చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు.మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు తెలంగాణ బీజేపీ పగ్గాలు దక్కడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటల రాజేందర్‌ను పార్టీ ఫోకస్ చేసింది. గజ్వేల్, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఈటల పరాజయం పాలైనా... మల్కాజ్గిరి ఎంపీగా ఈటలకు పార్టీ మరో అవకాశం ఇచ్చింది. అక్కడ భారీ మెజారిటీతో ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు రాష్ట్ర పార్టీ పగ్గాలు ఈటలకు అప్పగించి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తే ఈటలకే పార్టీ పగ్గాలు అప్పగించవచ్చు. ఇప్పటికే ఆ దిశగా పార్టీ అధిష్ఠానం సంకేతాలు ఇచ్చినట్లు ఈటల వర్గీయులు చెబుతున్నారు.అయితే తెరవెనక మరికొంత మంది నేతలు కూడా తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు రాష్ట్ర పార్టీ పగ్గాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందిరా గాంధీ గతంలో ప్రాతినిథ్యం వహించిన పార్లమెంట్ నియోజకవర్గంలో గెలవడం, మాజీ సిఎం కెసిఅర్ సొంత ఇలాకాలో విజయం సాధించడం రఘునందన్‌కు కలిసి వచ్చే అంశాలుగా చెబుతున్నారు. మంచి వాగ్ధాటి కల్గిన నేతగా..ప్రత్యర్థి పార్టీల నేతల విమర్శలను సమర్థవంతంగా తిప్పకొట్టగల నేతగా రఘునందన్ ముందు వరుసలో ఉంటారు. ఇటువంటి అంశాలు కమలనాథులు పరిగణనలోకి తీసుకుంటే రఘునందన్ పేరును పరిశీలించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి వర్గంలో స్థానం ఆశించిన పాలమూరు ఎంపీ డీకే అరుణకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే దానిపై అధిష్ఠానం పెద్దలు సమాలోచనలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తర తెలంగాణ నుంచి బండి సంజయ్ కు, రాజధాని నగరం నుంచి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి వర్గంలో ఛాన్స్ ఇచ్చారు. దక్షిణ తెలంగాణా నుంచి డికె అరుణకి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే... సిఎం రేవంత్ కు ధీటుగా రాష్ట్రంలో బీజేపీని ముందుకు తీసుకువెళ్లవచ్చని పలువురు రాష్ట్ర నేతలు అధిష్ఠానం ముందు పెట్టినట్లు సమాచారం. కేంద్ర మంత్రివర్గంలో మహిళల సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి వర్గంలో డికె అరుణకు ఛాన్స్ ఇస్తారని కూడా మరో ప్రచారం జరుగుతోంది.నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా మంత్రి వర్గంలో స్థానం దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు రాష్ట్ర పార్టీ పగ్గాలు అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరమణ రెడ్డి సైతం అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. అయితే ఇప్పటికే బీజేఎల్పీ బాధ్యతలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర పార్టీ పగ్గాలు బిసి నేతకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ కు మంత్రి వర్గంలో ఛాన్స్ దక్కిన నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన అరవింద్ కు కొత్త బాధ్యతలు ఇస్తారా ? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.పార్టీలో చాలాకాలంగా పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, పేరాల చంద్ర శేఖర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జాతీయ పార్టీ అధ్యక్ష బాధ్యతలు కొత్త వారికి కేటాయించిన తర్వాతే తెలంగాణ పగ్గాలు ఎవరికిస్తారో తేలుతుంది. ఇదిలాఉంటే.. ఆషాడ మాసం ముగిసే వరకు కిషన్ రెడ్డి అటు కేంద్ర మంత్రిగా.. ఇటు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్ని కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఆషాడం ముగిసాకే కొత్త నేతకు రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. -
17 మందిలో 14 మందిపై కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి లోక్‌సభకు ఎన్నికైన 17 మంది ఎంపీల్లో 14 మందికి నేరచరిత్ర ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై అత్యధికంగా 54 కేసులు ఉన్నాయని వెల్లడించింది. ఎంపీలు తమ ఎన్నికల అఫిడవిట్లలో పొందుపరిచిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు వెల్లడించినట్టు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి వివరించారు.కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై 42 కేసులు, మెదక్ ఎంపీ రఘునందన్‌రావుపై 29 కేసులు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై 22 కేసులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఐదు కేసులు ఉన్నట్టు పద్మనాభరెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, వరంగల్ ఎంపీ కడియం కావ్యలపై మాత్రం ఎలాంటి కేసులు నమోదై లేవని వెల్లడించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియెజకవర్గంలో అత్యధికంగా 13,366 ఓట్లు ‘నోటా’కు పడినట్లు తెలిపారు. -
ఇందూరు నిర్ణేతలు వీరే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వ్యవసాయపరంగా అభివృద్ధిపథంలో దూసుకెళుతూ...రైతు ఉద్యమాల కేంద్రంగా ఉన్న ఇందూరులో గత కొన్నేళ్లుగా ఎన్నికల్లో ప్రజలు విలక్షణ తీర్పు ఇస్తూ వస్తున్నారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో తీర్పును ప్రభావితం చేసే అంశాలు ప్రధాన పార్టీలకు గుబులు పుట్టిస్తున్నాయి. బీజేపీ నుంచి నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్, కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత తాటిపర్తి జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో ఉన్నారు.త్రిముఖ పోటీగా భావిస్తున్నప్పటికీ రెండు జాతీయ పార్టీల మధ్యే హోరాహోరీ పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 1952 నుంచి 2019 వరకు నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి 17 సార్లు ఎన్నికలు జరగగా 11 సార్లు కాంగ్రెస్, 3 సార్లు టీడీపీ, ఒకసారి స్వతంత్ర, ఒకసారి బీఆర్ఎస్, ఒకసారి బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక నిజామాబాద్ నుంచి ఇప్పటివరకు ఎవరినీ కేంద్ర మంత్రి పదవి వరించలేదు.గల్ఫ్ సంక్షేమ బోర్డు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో గల్ఫ్ వలస కార్మిక కుటుంబాల ఓట్లు 22% ఉన్నట్టు అంచనా. దీంతో ఆయా కార్మికుల కుటుంబాల ఓట్ల కోసం రెండు జాతీయ పార్టీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. గల్ఫ్ సంక్షేమ బోర్డు డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కాగా గల్ఫ్ కార్మిక సంఘాలు 60 ఉన్నాయి.ఈ సంఘాల జేఏసీకి జీవన్‌రెడ్డి గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో తనను తమ ప్రతినిధిగా పార్లమెంట్‌కు పంపాలని జీవన్‌రెడ్డి కోరుతున్నారు. గల్ఫ్ బోర్డు ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇవ్వడంతో పాటు తగిన కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నారు. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికులకు గౌరవం దక్కుతోందంటే బీజేపీ, మోదీ మాత్రమే కారణమని అర్వింద్ పేర్కొంటున్నారు. ♦ ఉత్తర, దక్షిణ భారతానికి మధ్యలో హబ్ మాదిరిగా ఉన్న నిజామాబాద్ ప్రాంతంలో కంటెయినర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో డ్రైపోర్ట్ ఏర్పాటు చేయాలని చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కోరుతున్నారు. డ్రైపోర్ట్ ఏర్పాటయితే ఇక్కడి నుంచే నేరుగా వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి ఎగుమతులు చేయవచ్చని అంటున్నారు. ♦ జక్రాన్‌పల్లి వద్ద విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే డిమాండ్, బీడీ కార్మికుల అంశం సైతం ఈ ఎన్నికల్లో ప్రభావం చూపనుంది. 185 నామినేషన్లలో 178 పసుపు రైతులవే.. 2019 ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి ఏకంగా 185 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో పసుపు బోర్డు డిమాండ్‌తో రైతులు దాఖలు చేసిన నామినేషన్లే 178 ఉండడం గమనార్హం. ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. దీంతో ఇక్కడ పోలింగ్ నిర్వహణకు బెంగళూరు నుంచి ప్రత్యేకంగా ఈవీఎంలు తీసుకొచ్చి ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.పసుపు బోర్డు పసుపు బోర్డు మంజూరు చేస్తున్నట్టు గత శాసనసభ ఎన్నికల ముందు ప్రధాని మోదీ ప్రకటన చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రం గెజిట్ విడుదల చేసిందని, పసుపు ధర సైతం రూ. 20 వేలకు తీసుకొచ్చినట్టు అర్వింద్ చెబుతున్నారు. ఈ ప్రాంతానికి పసుపు శుద్ధి కర్మాగారాలు, ప్రాసెసింగ్, ప్యాకింగ్ యూనిట్లు వస్తాయని ఆయన అంటున్నారు.రీసెర్చ్ సెంటర్‌తో రైతులకు కొత్త వంగడాలు, మరిన్ని సబ్సిడీలు అందుతాయని పేర్కొంటున్నారు. అయితే పసుపు బోర్డు కాగితాలకే పరిమితమైందని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి విమర్శలు సంధిస్తున్నారు. మొత్తానికి పసుపు బోర్డు గెజిట్ విడుదలైనా, ఈ ఎన్నికల్లోనూ ఈ అంశంపై రెండు జాతీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కులాల వారీగా చూస్తే... నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మున్నూరుకాపు, ముస్లిం, పద్మశాలి ఓట్లు గణనీయంగా ఉన్నాయి. తర్వాత ముదిరాజ్, రెడ్డి, యాదవ్, గౌడ్ల ఓట్లు చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నాయి. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు కులసంఘాలతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మహిళల ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. మొత్తం ఓట్లు 16,89,957 ఉండగా, పురుషుల ఓట్లు 7,99,458, మహిళల ఓట్లు 8,90,411 ఉన్నాయి. నిజాం షుగర్స్ కీలక అంశం నిజాం షుగర్ ఫ్యాక్టరీలను అర్వింద్ తెరిపించలేకపోయారని జీవన్‌రెడ్డి విమర్శలు చేస్తున్నారు. తాము మాత్రం 2025లో నిజాం షుగర్స్‌ను తెరిపిస్తామని జీవన్‌రెడ్డి గట్టిగా చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రక్రియ ప్రారంభించిందన్నారు. అయితే ఎంపీ అర్వింద్ సైతం ఈసారి నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని చెబుతున్నారు. చెరకుతో పాటు వరి, మొక్కజొన్నల నుంచి ఇథనాల్ ఉత్పత్తి సైతం చేసే యూనిట్లు ఏర్పాటు చేస్తామంటున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయా అభ్యర్థులకు వచ్చిన ఓట్లు.. బీజేపీ – ధర్మపురి అర్వింద్ 4,80,584 (45 శాతం) టీఆర్ఎస్ – కల్వకుంట్ల కవిత 4,09,709 (39 శాతం) కాంగ్రెస్ – మధుయాష్కీ69,240 (7 శాతం) -
ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి సీటుకే గ్యారంటీ లేదు: ఎంపీ అరవింద్
-
రేవంత్ కాంగ్రెస్‌లో ఉండటమే పెద్ద తప్పు: ఎంపీ అర్వింద్
సాక్షి, నిజామాబాద్: వందరోజుల్లో అమలు కాని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు.. ఆగస్టు తర్వాత ఎలా సాధ్యమవుతాయని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ అర్వింద్. లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారనున్నాయన్నారు. హస్తం పార్టీకి ఇవే చివరి ఎన్నికలని అన్నారు. ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి సీటుకే గ్యారంటీ లేదని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ రోజురోజుకీ ఎదుగుతుందన్నారు. ఇతర పార్టీలతో లాలూచీ పడే అవసరం బీజేపీకి లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి 12 సీట్లు వస్తాయని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారన్నారు. వారు చెప్పినట్లు బీజేపీ 12 సీట్లు వస్తే సీఎం రేవంత్‌ను దేవుడే కాపాడాలని పెటైర్లు వేశారు. నిజామాబాద్ నగరంలో ఇంటింటి ప్రచారం ప్రారంభించిన బీజేపీ అభ్యర్థి, ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్ధుడే కానీ.. ఆయన కాంగ్రెస్‌లో ఉండటమే పెద్ద తప్పని అన్నారు. కాంగ్రెస్ నేతలు రేవంత్‌ను పనిచేయకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌లో ఉంటే ఎవరికైనా రాజకీయ భవిష్యత్తు ఉండదని అన్నారు. ఎంపీ అర్వింద్ కామెంట్స్ కాంగ్రెస్ 100 రోజుల్లో ఏ గ్యారెంటీ నెరవేర్చలేదు. ఇప్పుడు ఆగస్టులో రుణమాఫీ అని మరోసారి మోసానికి తెరలేపింది. అవినీతి చేసిన వారికి శిక్ష తప్పదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇప్పట్లో బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీలు నెల రోజుల్లో పనిచేసే ప్రక్రియను ప్రారంభిస్తాం. నిజామాబాదు పార్లమెంటు పరిధిలో ఆధ్యాత్మిక, టూరిజం కారిడార్‌ను ఏర్పాటు చేస్తాం మా ఏకైక గ్యారెంటీ మోదీనే. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని మోడీ ప్రభుత్వం నెరవేర్చుతుంది. మోదీ మూడో టర్మ్‌లో కామన్ సివిల్ కోడ్ అమలు చేస్తాం. రైల్వే విభాగంలో కొత్త విప్లవం రాబోతుంది. రానున్న రోజుల్లో 25 వేల కి.మీ.ల కొత్త రైల్వే లైన్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ హిందు వ్యతిరేక పార్టీ. -
రేవంత్ కాంగ్రెస్‌లో ఉంటే నష్టపోతారు
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ కొన్ని కార్యక్రమాలు చురుగ్గా చేశారని, ఆయనకు మరో 15 ఏళ్ల వరకు రాజకీయాల్లో మంచి అవకాశాలున్నాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అభిప్రాయపడ్డారు. ఆయన ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉంటే ఆయన మరింత నష్టపో తారని స్పష్టం చేశారు. ఆయన బీజేపీ లోకి వస్తానంటే ఆహ్వానిస్తానన్నారు. రేవంత్ అసమర్థుడు కారని, కాంగ్రెస్‌లో ఉంటే మాత్రం అసమ ర్థునిగా మిగిలిపోతా రన్నా రు. మోదీ ప్రభుత్వంలో పసుపు రైతులకు మార్కె ట్ పెరిగిందని, ప్రధాని మోదీ పై ప్రేమతోనే పసుపు రైతులు ఈసారి బీజేపీకి ఓటు వేస్తారని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే వ్యవహరిస్తోందన్నారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వం ప్రకటన చేయలేదని, ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే పేర్కొన్నారని విమర్శించారు. సరైన సమయంలో ధాన్యం కొనుగోలు జరగడం లేదని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తప్పు చేస్తే జైల్లో వేయాలని, రోజూ అదే అంశంపై మాట్లాడటం అనవసరమన్నారు. -
ప్రతిఒక్కరూ రజాకార్ సినిమా చూడండి : ఎంపీ బండి సంజయ్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలో నిజామాబాద్–ఖమ్మం వరకు ఎన్‌హెచ్–563, ఆర్ఎఫ్సీఎల్ పునరుద్ధరణ, రైలు మార్గాల నిర్మాణం, టర్మరిక్ బోర్డు, నిజాం షుగర్ ఫ్యాక్టరీకి నిధులు.. ఇలా ఎన్నో ఇచ్చాం.. వచ్చే పదేళ్లలో తెలంగాణ ప్రగతిపై ఫోకస్ చేసి, మరెన్నో ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రంలో రోడ్లు, రైలు, గోదాంలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. సోమవారం జగిత్యాల పట్టణంలోని గీతా విద్యాలయం మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రసంగించారు. రాష్ట్రంతోపాటు ఉమ్మడి జిల్లాలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. వికసిత్ భారత్, వికసిత్ తెలంగాణ కోసం బీజేపీని గెలిపించాలని, అబ్ కీ బార్ 400 పార్ అని పిలుపునిచ్చారు. పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరతో రైతులను, సంక్షేమ పథకాలతో మహిళలను, రుణాలిచ్చి యువతను ఆదుకున్నామని తెలిపారు. పసుపు మద్దతు ధర, టర్మరిక్ బోర్డు ఏర్పాటు, నిజాం షుగర్ ఫ్యాక్టరీకి, ఆర్ఎఫ్సీఎల్ పునరుద్ధరణకు రూ.6,400 కోట్లు వెచ్చించామన్నారు. కాళేశ్వరం అవినీతి విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల తీరును ఎండగట్టారు. ఆ పార్టీలు తెరచాటు మిత్రులని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ అగ్రనాయకులు లక్ష్మణ్, సత్యనారాయణరావు, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి, నిర్మల్ ఎమ్మెల్యే పరమేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. రజాకార్ సినిమా చూడండి వీరులను కన్న గడ్డ జగిత్యాలలో పీఎఫ్ఐ లుచ్చాగాళ్లు అడ్డా పెట్టి, పాకిస్తాన్ జిందాబాద్ అంటుంటే వాళ్లకు ఆర్థికసాయం చేస్తున్న వాళ్లను వదిలేద్దామా? నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులు జగిత్యాల సొంతం. రాముని పేరు చెబితే కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్లు గజగజ వణుకుతున్నరు. దేశ ప్రజల భాగస్వామ్యంతో అయోధ్యలో రాముని గుడిని కట్టింది బీజేపీయే. మా పార్టీ బరాబర్ శ్రీరాముని పేరుతో ఎన్నికల్లోకి వెళ్తుంది. మీకు దమ్ముంటే బాబర్ పేరుతో ఓట్లడగండి. తెలంగాణ ప్రజాలారా... ప్రతిఒక్కరూ రజాకార్ సినిమా చూడండి. నిజాం సమాధి వద్ద మోకరిల్లిన కేసీఆర్, ఒవైసీ సోదరులను కట్టేసి, ఈ సినిమా చూపించండి. – ఎంపీ బండి సంజయ్ ఐదో ఆర్థిక శక్తిగా మన దేశం ప్రధాని మోదీ వల్లే మన దేశం ప్రపంచ దేశాల్లో బలమైన ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగింది. మయన్మార్, పాకిస్తాన్ లాంటి దేశాలను దారికి తెచ్చిన ఘనత ఆయనదే. మోదీ వల్లే దేశంలో సుస్థిరత, సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతాయి. ఇటీవల సీఏఏ అమలు చేశారు. త్వరలో ఎన్ఆర్సీ, యూసీసీ కోడ్‌ను కూడా అమలు చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి. – ఎంపీ ధర్మపురి అర్వింద్ దేశ ప్రజలందరూ ప్రధాని కుటుంబమే ప్రధాని నరేంద్ర మోదీకి కుటుంబం లేదంటున్న విపక్షాలకు సిగ్గులేదు. దేశ ప్రజలందరూ ఆయన కుటుంబమే. వేములవాడ రాజన్న ఆశీర్వాదంతో తెలంగాణ నుంచి బీజేపీ తరఫున అత్యధిక ఎంపీ స్థానాలు గెలిచి, ప్రధానికి కానుకగా ఇద్దాం. పదేళ్ల యూపీఏ హయాంలో జరగని స్కాం లేదు. బీఆర్ఎస్ కాళేశ్వరం నుంచి కరెంటు వరకు అవినీతిమయం చేసింది. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేయలేక చేతులెత్తేసింది. – ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత -
Telangana: ఎంపీ, ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్నా కూడా అసెంబ్లీకే జై
సాక్షి, కరీంనగర్: ఎంపీలుగా గెలిచినా, రాజ్యసభకు వెళ్లినా..ఎమ్మెల్సీలుగా ఎన్నికైనా ప్రస్తుత రాజకీయాల్లో అందరికీ శాసనసభలో అడుగుపెట్టి అధ్యక్షా అనాలనే ఉత్సుకత..ఆసక్తే ఎక్కువగా కనిపిస్తోంది. ఎంపీ, ఎమ్మెల్సీ కంటే ఎమ్మెల్యే గారూ అంటేనే వచ్చే కిక్కు వేరే లెవెల్ అన్నదే ఇప్పుడు రాజకీయనేతల మనసుల్లో నాటుకు పోయింది. ఆ క్రమంలో జిల్లాలో ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎవరెవరు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే బరిలో దిగారని ఒక్కసారి చూస్తే.. ఇద్దరు ఎమ్మెల్సీలు..! ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో ఎమ్మెల్సీ పాడికౌశిక్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ఈయన 2021లో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే.. తన స్థానానికి రాజీనామా చేయాల్సి వస్తుంది. దీంతో ఆ స్థానానిక ఉప ఎన్నిక జరుగుతుంది. ఇక ఈటల రాజేందర్ హుజురాబాద్‌తోపాటు గజ్వేల్‌లోనూ పోటీ చేస్తున్నారు. ఒకవేళ రెండుచోట్ల రాజేందర్ విజయం సాధిస్తే.. ఏదో ఒక అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక తథ్యం.) మరో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి కూడా జగిత్యాల అసెంబ్లీ బరిలో ఉన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత అయిన జీవన్‌రెడ్డి 2019లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఒకవేళ అసెంబ్లీపోరులో ఈయన గెలిస్తే.. 2025 వరకు అంటే దాదాపు ఏడాదిన్నర సమయం ఉంది. దీంతో ఈయన స్థానానికి ఉపఎన్నిక అనివార్యమవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చదవండి: కంటతడి పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. నెల రోజులు ఇదే పరిస్థితి.. కిలో ఎంతంటే! ఇద్దరు ఎంపీలు సైతం! ఇద్దరు ఎంపీలు అసెంబ్లీకి పోటీ పడుతున్నారు. కోరుట్ల నుంచి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్ అసెంబ్లీ బరిలో ఉన్నారు. వీరిద్దరూ విజయం సాధించినా.. ఆరునెలలు మాత్రమే వీరి పదవీకాలం మిగిలి ఉండటంతో ఉపఎన్నిక రాకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ గెలవకపోయినా.. వీరి పదవులకు వచ్చిన ఢోకా ఏమీ ఉండదు. -
దళిత ముఖ్యమంత్రి హామీ ఏమైంది?
సాక్షి, న్యూఢిల్లీ: బీసీలను రాజకీయంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలన్నది బీజేపీకి తెలుసునని.. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ తమకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలు కలిపి 50 శాతానికిపైగా మంత్రులు ఉన్నారని తెలిపారు. శనివారం ఆయన ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామన్న హామీ ఏమైందో తన తండ్రి కేసీఆర్‌ను అడగాలని కేటీఆర్‌ను డిమాండ్ చేశారు. వచ్చే రోజుల్లో అయినా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తారా? లేక కేసీఆర్.. తర్వాత కేటీఆర్, ఆ తర్వాత ఆయన కొడుకుని ముఖ్యమంత్రి చేయడమే తమ రాజకీయమా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఇలాంటి వ్యక్తులు బీజేపీ గురించి మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంటుందని అర్వింద్ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవితను ఒక రాజకీయ నాయకురాలిగా తాను ఏమాత్రం భావించటంలేదని అన్నారు. కవిత ఒక కాలం చెల్లిన, ప్రజలు తిరస్కరించిన నాయకురాలని విమర్శించారు. కాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా పార్టీ సీనియర్లను హైకమాండ్ కోరినప్పటికీ కొందరు వివిధ కారణాలతో పోటీ వద్దనుకున్నారని చెప్పారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ ఒక అర్హత అన్నది తన అభిప్రాయమన్నారు. -
రేవంత్, కవిత బిజినెస్ పార్ట్నర్స్
సుభాష్‌నగర్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బిజినెస్ పార్ట్నర్స్ అని, వారు ఒకే కంపెనీ లో డైరెక్టర్లుగా ఉన్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యా ఖ్యలు చేశారు. మంగళవారం నిజామాబాద్ జిల్లాకేంద్రంలో బీజేపీ అర్బన్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మా ట్లాడారు. కవిత రేవంత్‌రెడ్డితో మాట్లాడి ఆకుల లలితను కాంగ్రెస్‌లోకి పంపించి అర్బన్ టికెట్ ఇప్పిస్తున్నారని, అందుకే కవితను నిజామాబాద్ అర్బన్, బోధన్ ఇన్‌చార్జీగా బీఆర్ఎస్ నియమించిందని ఆరోపించారు. బతికుండగా ఆరోగ్యబీమా ఇవ్వలేని సీఎం కేసీఆర్.. చనిపో యాక రూ.5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తానని బీఆర్ఎస్ మేనిఫెస్టోలో చేర్చారని, కానీ మంత్రి కేటీఆర్‌కు రూ.10 లక్షలు, ఎమ్మెల్సీ కవిత కు రూ.20 లక్షలు బీమా ఇస్తానని ఎద్దేవా చేశా రు. మైనార్టీబంధు రూ.10 లక్షలకు పెంచాలని ఎంఐఎం నేత ఒవైసీ ఎందుకు డిమాండ్ చేయడం లేదో చెప్పాలన్నారు. ప్రజలకు నవంబర్ 30న మంచి అవకాశం వచ్చినందున బీజేపీకి మద్దతుగా నిలవాలని అన్నారు. -
అసెంబ్లీ బరిలో ఎంపీ అర్వింద్.. బీఆర్ఎస్ సీనియర్ నేతతో ఢీ!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతారన్న ప్రచారం ఊపందుకుంది. ఎంపీలను ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పరిధిలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానంలో పోటీ చేయాల్సిందేనని బీజేపీ అధిష్ఠానం ఆదేశించడంతో తమకు అనుకూలమైన స్థానంలో బరిలో నిలిచేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలోనే ఎంపీ అర్వింద్ తన పార్లమెంట్ పరిధిలోని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో ఎంపీ సామాజిక వర్గ ఓట్లు అధికంగా ఉన్నాయి. దీనికితోడు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో నిజామాబాద్‌లో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అదే సమయంలో ఏళ్లక్రితమే మూతపడిన షుగర్ ఫ్యాక్టరీని ప్రధాని మోదీ, అమిత్‌షాల దృష్టికి తీసుకెళ్లానని, త్వరలోనే పునఃప్రారంభించేలా చూస్తానన్న హామీతో ఓట్లు అడిగేందుకు అర్వింద్ సమాయత్తమవుతున్నట్లు సమాచారం. కోరుట్ల నియోజకవర్గంలో పసుపు, చెరుకు పండించే రైతులు అధికంగా ఉండడం.. అటు పసుపుబోర్డు, ఇటు షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం అంశం ఎన్నికల్లో కలిసొస్తుందన్న ఆలోచనలో అర్వింద్ ఉన్నట్లు తెలిసింది. గతంలో మెట్పల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచిన చెన్నమనేని విద్యాసాగర్‌రావు ఈ ప్రాంత అభివృద్ధి కోసం శ్రమించారు. దీంతో ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో ఇప్పటికీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. ఇది కూడా తన గెలుపునకు దోహదపడుతుందని, ఆర్మూర్‌తో పోలిస్తే కోరుట్లలోనే విజయం సాధించడం సులువనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. -
బియ్యం అమ్మకం..రూ.4 వేల కోట్ల స్కామ్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నిధుల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం బియ్యం అమ్మకానికి పెట్టి.. కస్టమ్‌మిల్లర్ల నోట్లో మట్టికొట్టే పనిచేస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలకు కిలో నాలుగైదు రూపాయల తక్కువకు అమ్మాలని సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం.. ఒక్క ఆక్షన్‌కి రూ.1000 కోట్ల స్కామ్.. కోటిటన్నులు అమ్ముకునే ప్రణాళిక బీఆర్ఎస్ సర్కారుదని ఆరోపించారు. ఈ విధంగా వచ్చే రూ.4 వేల కోట్ల అవినీతి సొమ్ము 100 నియోజకవర్గాల్లో..ఒక్కో సెగ్మెంట్లో రూ.40 కోట్లు ఖర్చు చేసి వచ్చే ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపణలు సంధించారు. శనివారం అర్వింద్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సర్కార్ బియ్యం అమ్ముకుంటామని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని, దీనికి వెనుక అసలు ఉద్దేశం అదేనని ఆరోపించారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని వేలం వేసేందుకు వెయ్యికోట్ల టర్నోవర్, రూ.100 కోట్ల ప్రాఫిట్ ఉండాలనే నిబంధనలు పెట్టారని మండిపడ్డారు. మొదటిదశలో రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వేలం వేయాలని నిర్ణయించారని, టెండర్లో పాల్గొనేందుకు పౌరసరఫరాలశాఖ నిర్ణయించిన విధివిధానాలతో రైస్ మిల్లర్లకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎంఎస్పీకి బియ్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్రంలో మిల్లర్లు సిద్ధంగా ఉన్నా, టెండర్ల ద్వారా తమ మిల్లు సామర్థ్యం మేరకు ధాన్యం దక్కించుకుందామనుకున్న మధ్యతరగతి మిల్లర్లకు అసలు అందులో పాల్గొనే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలతో రైస్‌మిల్లర్లు బియ్యం ఆక్షన్‌లో కొనలేరన్నారు. రైస్‌మిల్లర్ల వ్యాపారం బంద్ అయితే రైతులు రోడ్డుమీదకు వచ్చే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ నుంచి ఎంపీగా కల్వకుంట్ల కవిత పోటీచేస్తే మూడో స్థానానికి పరిమితం అవుతుందని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. తాను ఎంపీగా పోటీలో ఉండడం ఖాయమని ప్రకటించారు. -
ఎంపీ అరవింద్‌తో విభేదాలు.. బీజేపీకి గుడ్‌బై
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఆర్మూరు నియోజక వర్గ బీజేపీ ఇంఛార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కొంతకాలంగా ఎంపీ అరవింద్‌తో వినయ్‌కి పడటం లేదు. చివరకు.. ఎంపీ అరవింద్ వ్యతరేకంగా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఇటీవల ఆందోళన సైతం చేపట్టారు వినయ్. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండడంతో.. ఆయన పార్టీ మారుతుండడం చర్చకు దారి తీసింది. వినయ్ 2018 లో ఆర్మూర్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు వినయ్. ఆ ఎన్నికల్లో దాదాపు 20 వేల ఓట్లు సాధించారు. ఈ దఫా ఆర్మూర్ టికెట్ ఆశావాహుల్లో ఈయన కూడా ఉన్నారు. బీజేపీని వీడిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వినయ్ బయటకు రావడం.. జిల్లాలో కమలం పార్టీపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ గెలుపులో గిరిజనులే కీలకం -
తమాషాలొద్దు..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన నిజామాబాద్ జిల్లా పార్టీ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి తనదైన శైలిలో క్లాస్ పీకారు. ఏదైనా సమస్య ఉంటే అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలే తప్ప మీడియా ఎదుట నిరసనలు నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు, తమాషాలొద్దు... అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ రెండు వర్గాలుగా విడిపోయింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య ఇటీవల 13 మండలాల అధ్యక్షులను తొలగించి.. కొత్త వారిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక నేతలతో చర్చించకుండా.. కొత్తవారిని ప్రకటించడంపై మరో వర్గం రగిలిపోయింది. ఎంపీ అర్వింద్ పట్టుబట్టి పార్టీ మండల అధ్యక్షులను మార్చివేశారని ఈ వర్గం ఆరోపిస్తోంది. ఈక్రమంలో బుధవారం నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాలకు చెందిన అసమ్మతి నేతలు వచ్చి ఒక్కసారిగా బైఠాయించి.. ఆందోళనకు దిగారు. ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి ఉమాశంకర్, రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి.. వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వినకపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాంతో కిషన్‌రెడ్డి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అసమ్మతి నేతలను పిలిపించుకుని మాట్లాడారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే ఆందోళన చేయడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య ఉంటే అంతర్గతంగా కూర్చొని సెట్ చేసుకోవాలని.. ఇలా వీధిన పడటం భావ్యం కాదని క్లాస్ తీసుకున్నారు. ఈ నెల 29న అమిత్ షా పర్యటన తర్వాత... సర్ధుబాటు చేసుకుందామని చెప్పి ఆందోళనకు దిగిన వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఆ జిల్లాలో అన్ని సెగ్మెంట్లలోనూ పోటాపోటీ నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఇప్పటి నుంచే టికెట్ల కోసం బీజేపీ నేతల మధ్య పోటాపోటీ నెలకొంది. నిజా మాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య పోటీ చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఎంపీ అర్వింద్ ప్రోత్సాహంతో ధన్పాల్ సూర్యనారా యణ గుప్త కూడా అక్కడ పనిచేసుకుంటున్నారు. ఇక ఆర్మూర్ లోనూ ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన వినయ్ రెడ్డితో పాటు పార్టీలో చేరిన వ్యాపారవేత్త రాకేశ్‌రెడ్డి అక్కడ బీజేపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇక బోధన్ నియోజకవర్గం నుంచి ప్రకాశ్‌రెడ్డితో పాటు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇలా జిల్లాలో నేతల మధ్య వర్గపోరు తార స్థాయికి చేరింది. అయితే మండలాల అధ్యక్షులను మార్చడం.. వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలనుకున్న కొంతమంది అసమ్మతి వర్గా నికి ఆజ్యం పోయడంతో ఆ రచ్చ కాస్తా బీజేపీ రాష్ట్ర కార్యాల యానికి చేరింది. కాగా, ఎంపీ అర్వింద్ మాత్రం.. మండలాల అధ్యక్షుల మార్పులో తన ప్రమేయం లేదని ఢిల్లీలో స్పష్టం చేశారు. -
తెలంగాణ కమలం పార్టీ ఆఫీస్‌లో కలకలం.. ఒక్కసారిగా దూసుకొచ్చి..
సాక్షి, హైదరాబాద్: ఇందూరు కమలం దళంలో రేగిన చిచ్చు.. హైదరాబాద్ లోని స్టేట్ పార్టీ కార్యాలయానికి పాకింది. ఎంపీ ధర్మపురి అరవింద్ తీరుపై స్థానిక అసమ్మతి నేతలు ఆందోళనకు దిగారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ సీనియర్ నేతలు సముదాయించినా అసమ్మతి నేతలు వినకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. నిజామాబాద్ కాషాయ పార్టీ నేతల ఆందోళనకు కారణమేంటీ ? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వారికి ఏం చెప్పి సముదాయించారు? నిజామాబాద్ జిల్లాలో కాషాయ పార్టీ రెండుగా చీలింది. నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నర్సయ్య ఇటీవల 13 మండలాల అధ్యక్షులను తొలగించి.. కొత్త వారిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక నేతలతో చర్చించకుండా.. నేరుగా కొత్తవారిని ప్రకటించడంపై అసమ్మతివర్గం రగిలిపోయింది. ఎంపీ అరవింద్ పట్టుబట్టి పార్టీ మండల అధ్యక్షులను మార్చివేశారని అసమ్మతివర్గం ఆరోపిస్తోంది. (చదవండి: విశ్వనగరమట.. కనీస స్పందన ఉండదా?.. కేసీఆర్, కేటీఆర్‌లపై రేవంత్‌రెడ్డి ఫైర్) బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్భన్ నియోజకవర్గాలకు చెందిన కొంత మంది నేతలు వచ్చి ఒక్కసారిగా బైఠాయించి.. ఆందోళనకు దిగారు. అరవింద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి ఉమాశంకర్, రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి.. వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వినలేదు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ బీజేపీ నుంచి పోటీ చేయడానికి చాలా మంది అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య పోటీ చేయాలని గట్టిపట్టుదలతో ఉన్నారు. ఎంపీ అరవింద్ ప్రోత్సాహంతో ధన్ పాల్ సూర్యనారయణ గుప్త అక్కడ పనిచేసుకుంటున్నారు. ఇక ఆర్మూర్ లోనూ ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన వినయ్ రెడ్డితో పాటు ఇటీవల పార్టీలో చేరిన వ్యాపారవేత్త రాకేశ్ రెడ్డి ఆర్మూర్ బీజేపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. (చదవండి: మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం.. లోక్‌సభలో ఎవరి బలం ఎంతంటే!) బోధన్ అసెంబ్లీ నుంచి ప్రకాశ్ రెడ్డితో పాటు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. జిల్లాలో నేతల మధ్య వర్గపోరు తారస్థాయికి చేరింది. (చదవండి: కాంగ్రెస్‌లోకి వస్తూనే టికెట్ల పంచాయితీ పెట్టిన జూపల్లి! నాగం ఆగమాగం.. చేరికపై ట్విస్టయితే ఉండదుగా!) ఇదే తరుణంలో మండలాల అధ్యక్షులను మార్చడం.. వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలనుకున్న కొంత మంది.. అసమ్మతి వర్గానికి ఆజ్యం పోయడంతో ఆ రచ్చ కాస్తా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరింది. ఎంపీ అరవింద్ మాత్రం.. మండలాల అధ్యక్షుల మార్పులో తనప్రమేయం లేదని చెబుతున్నారు. ఆందోళనకు దిగిన నిజామాబాద్ అసమ్మతి నేతలను కిషన్ రెడ్డి పిలిపించుకుని మాట్లాడారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆందోళన చేయడంపై వారికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. సమస్య ఉంటే అంతర్గతంగా కూర్చొని సెట్ చేసుకోవాలని.. ఇలా వీధిన పడటం భావ్యం కాదని క్లాస్ తీసుకున్నారు. ఈ నెల 29న అమిత్ షా పర్యటన తర్వాత... సర్ధుబాటు చేసుకుందామని చెప్పి ఆందోళనకు దిగిన అసమ్మతి నేతలను కిషన్ రెడ్డి తిరిగి పంపించారు. -సాక్షి, పొలిటికల్ డెస్క్ -
హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉద్రిక్తత
-
బీజేపీ ఆఫీసులో ఉద్రిక్తత.. అర్వింద్‌కు షాకిచ్చిన కాషాయ కార్యకర్తలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లా నేతలు నినాదాలు చేశారు. కార్యాలయం లోపలే అర్వింద్ వ్యతిరేక వర్గం ఆందోళనకు దిగారు. ఈ సందర్బంగా వారిని పార్టీ కార్యాలయం నుంచి వెళ్లాలని రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి కోరారు. ఇక, ఇదంతా జరుగుతున్న క్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆఫీసులో ఉండటం విశేషం. ఇదే సమయంలో బీజేపీ కార్యకర్తలు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో 13 మండలాల అధ్యక్షులను పార్టీ నిబంధనలను విరుద్దంగా మార్చినట్టు తెలిపారు. ఈ విషయంలో కిషన్‌రెడ్డి కలుగజేసుకుని సమస్య పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం.. ఎంపీ అర్వింద్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇది కూడా చదవండి: అమిత్ షా పర్యటన వేళ కీలక పరిణామం.. రఘునందన్, అర్వింద్‌కు కీలక బాధ్యతలు! -
ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అరవింద్ సంచలన ఆరోపణలు
సాక్షి, నిజామాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజల సొమ్మును ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళ్ల దగ్గర మంత్రి ప్రశాంత్ రెడ్డి దారబోస్తున్నారని ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, ఎంపీ అరవింద్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. బాల్కొండ నియోజకవర్గంలో కట్టిన ప్రతీ బిడ్జిపై ఎమ్మెల్సీ కవితకు కమీషన్ వెళ్తోంది. ఒకే పనికి డబుల్ బిల్లింగ్ చేస్తున్నారు. రోడ్ కార్పోరేషన్ డెవలప్మెంట్ నుంచి కట్టినట్టు శిలాఫలకం వేశారు. కేంద్రం ద్వారా నిధులు పొందినట్టు కేంద్రానికి యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. 50 ఏళ్లు వడ్డీలేని రుణం ద్వారా నిర్మించినట్టు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా రూ.5వేల కోట్లకు పైగా స్కామ్ జరిగింది అని ఆరోపణలు చేశారు. ఇది కూడా చదవండి: వాతావరణశాఖ హెచ్చరిక.. తెలంగాణలో నాలుగు రోజులు గట్టి వానలే.. -
బీజేపీ ‘పరివార’ చర్చలు
సాక్షి, హైదరాబాద్: పార్టీ నేతలు, కార్యకర్తలంతా ఒకే పరివారమని చాటేలా, వివిధ అంశాలపై ఆరోగ్యకరమైన చర్చలు జరిగేలా బీజేపీ చేపట్టిన ‘టిఫిన్ బాక్స్ బైఠక్’ఆదివారం జరగనుంది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించే ఈ ‘లంచ్’భేటీలకు కార్యకర్తలు ఎవరికి వారే టిఫిన్ బాక్స్‌లు తెచ్చుకొని, సహపంక్తి భోజనాలు చేయనున్నారు. ఫొటోలు, వేదిక, బ్యానర్లు, మీడియా, భారీగా భోజనం ఏర్పాట్లు వంటి రాజకీయ హంగు, ఆర్భాటాలేవీ లేకుండా.. పార్టీ నేతలు, కార్యకర్తలు కలుసుకునేలా వీటి నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు. ‘‘ప్రధానంగా దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో ఏర్పడిన కాంగ్రెస్ కల్చర్‌కు, ఏదో ఒక రూపంలో పెద్ద ఎత్తున ఖర్చు చేసే పద్ధతికి చెక్‌పెట్టేలా పార్టీ నాయకులు, కార్యకర్తల సాదర సమావేశాలకు రూపకల్పన చేశాం. ఈ భేటీల సందర్భంగా కార్యకర్తలు పిచ్చాపాటిగా అన్ని విషయాలపై మాట్లాడుకోవడంతో పాటు వివిధ అంశాలపై ఆరోగ్యకరమైన చర్చకు అవకాశం ఉంటుంది..’’అని బీజేపీ నేతలు చెప్తున్నారు. నిరంతరం కొనసాగించే యోచన ప్రజలకు మరింత సేవ చేసేలా ప్రోత్సాహం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం, పార్టీ పటిష్టత తదితర అంశాలపైనా ‘లంచ్’భేటీల్లో దృష్టి పెట్టనున్నట్టు బీజేపీ నేతలు తెలిపారు. ఆదివారం ఈ బైఠక్‌లు జరిగాక.. వాటిని నిరంతరం కొనసాగించాలనే ఆలోచనతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉందని వివరించారు. త్వరలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. శక్తి కేంద్రాల ఇన్చార్జులు (మూడు, నాలుగు పోలింగ్ బూత్‌లు కలిపి ఓ శక్తి కేంద్రం), ఆ పైస్థాయిల వారు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వంద మంది, అంతకు మించి పాల్గొనేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. గతంలో ప్రధాని మోదీ వారణాసిలో ఈ తరహా కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. తర్వాత ఇతర రాష్ట్రాల్లోనూ నిర్వహిస్తున్నారు. నేతలు అతిథులుగా.. ఆదివారం నిర్వహిస్తున్న లంచ్ బైఠక్ కార్యక్రమాల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక్కో నేత ముఖ్య అతిథిగా హాజరవుతారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి ఒక ప్రకటనలో తెలిపారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, కరీంనగర్లో ఎంపీ బండి సంజయ్, గద్వాలలో జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఆర్మూర్‌లో ఎంపీ ధర్మపురి అర్వింద్ , బోథ్‌లో ఎంపీ సోయం బాపూరావు, హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్, దుబ్బాకలో రఘునందన్‌రావు, మలక్‌పేటలో నల్లు ఇంద్రసేనారెడ్డి, మునుగోడులో కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, ఇతర నియోజకవర్గాల పరిధిలో బీజేపీ ముఖ్య నేతలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పదాధికారులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బైఠక్‌లకు హాజరవుతారని తెలిపారు. -
అక్కడ వందల కోట్ల స్కాం జరిగింది: ఎంపీ అరవింద్ సంచలన కామెంట్స్
సాక్షి, నిజామాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు. బాల్కొండలో వందల కోట్ల స్కామ్ జరిగిందని అరవింద్ ఆరోపించారు. బాల్కొండ ప్రజలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, ఎంపీ అరవింద్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బాల్కొండలో వందల కోట్ల స్కాం జరిగింది. బట్టాపూర్లో శ్రీకాంత్, వంశీరెడ్డి అక్రమంగా క్వారీక్రషర్లు నడుపుతున్నారు. పర్యావరణ అనుమతులు లేకుండా ఐదేళ్లు నడిపించారు. బాల్కొండ ప్రజలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. రూ.51లక్షల కరెంట్ బిల్లు కట్టకపోతే విద్యుత్ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు. సామాన్యుడు రూ.2వేలు విద్యుత్ ఛార్జీ కట్టకపోతే కరెంట్ కట్ చేస్తారు. దీనికి మంత్రి జగదీష్ రెడ్డి సమాధానం చెప్పాలి అని సీరియస్ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: బాధగా ఉంది.. కనీస కృతజ్ఞత కూడా లేదు: మంత్రి ప్రశాంత్ ఆవేదన -
కిషన్‌రెడ్డి పార్టీకి లక్కీ హ్యాండ్: ధర్మపురి అర్వింద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డిని నియమించడంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ హర్షం వ్యక్తం చేశారు. కిషన్‌రెడ్డిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపిన అర్వింద్.. కిషన్‌రెడ్డి పార్టీకి ఒక లక్కీ హ్యాండ్ అని స్పష్టం చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. ‘జేపీ నడ్డా.. అజాత శత్రువు.. కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. పరిపక్వత కల్గిన పొలిటీషయన్ కిషన్‌రెడ్డి. ఆయన్ను నియమించినందుకు ధన్యవాదాలు. ఈటలకు ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించినందుకు నడ్డాకు కృతజ్ఞతలు. 2024 లో మూడోసారి ప్రధాని మోదీ పీఎం అవుతారు. ఈటల తెలంగాణ వ్యాప్తంగా అగ్రెసివ్‌గా వెళ్తారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. బండి సంజయ్ అగ్రెసివ్‌గా తన టర్మ్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. మేమంతా కలిసి పనిచేస్తాం.. అధికారంలోకి తీసుకువస్తాం. ఎంపీగా గెలవలేని వ్యక్తి రాహుల్.. ఆయన కూడా మాపై వ్యాఖ్యలు చేస్తాడా?, కాంగ్రెస్‌ను లేపడానికి కొన్ని ఛానళ్లు బాగా కష్ట పడుతున్నాయి. మీడియా కథనాలతో ప్రజలను మభ్యపెట్టలేరు. రాహుల్ కు రాజకీయం నేర్పేందుకు కొన్ని ఛానళ్లు క్లాసులు ఇస్తున్నాయి. చచ్చిపోయిన పీనుగులాంటి కాంగ్రెస్ పార్టీ.. 12 వేల ఓట్లతో గెలిచిన వ్యక్తిని పార్టీలోకి చేర్చుకుంటే అధికారంలోకి వస్తుందా?, కవిత అరెస్ట్ విషయంలో పొలిటికల్ ఇన్వాల్వ్ మెంట్ ఉండదు. తప్పు చేసిన వారిని, అవినీతి చేసిన వారిని బొక్కలో వేస్తామని మోదీ హామీ ఇచ్చారు.. కేటీఆర్ కు ఇంకా ఏం హామీ ఇవ్వాలట. కవిత జైలుకు వెళ్లేముందు ఒక్కదాన్నే వెళ్లను.. అందరినీ తీసుకు వెళ్తామని అందని చెప్తున్నారు. నాకు, బండికి మధ్య ఎలాంటి గ్యాప్ లేదు. కవిత విషయంలో సంజయ్ కామెంట్స్ చేసినప్పుడు నా టంగ్ స్లిప్ అయి నేను కూడా కామెంట్స్ చేశా’ అని పేర్కొన్నారు. చదవండి: బీజేపీ స్ట్రాటజీ.. తెలుగు రాష్ట్రాల బీజేపీ చీఫ్‌ల మార్పు బీజేపీలో కిషన్‌రెడ్డి బలం అదే.. ఆయనే ఇక తెలంగాణలో పార్టీ గేమ్‌ఛేంజర్!